వాస్తవం ఏమంటే ఈసారి బడ్జెట్ తాను చెప్పదలుచుకున్న దాన్ని సూటిగా చెప్పలేదు. వాటన్నింటికీ ముసుగు వేసింది. పైగా తన బడ్జెట్ అంతా సాధారణ ప్రజల కోసమే అన్నట్లుగా పోజు పెట్టింది. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగాలకు, సామాజిక రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించానని చెప్పింది. దానికి మొట్టమొదటి ఉదాహరణగా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గత ఏడాది బడ్జెట్ కేటాయింపు కన్నా 140 శాతం అధికంగా కేటాయించినట్లు ఘనంగా చెప్పుకుంది. 2008-09 బడ్జెట్‌లో గ్రామీణ ఉపాధి పథకానికి రు.14,400 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు దాన్ని రు.39,100 కోట్లకు పెంచారు. ఇలా చెప్పడం ప్రజలను దారుణంగా మోసం చేయడమే. ఇప్పటికే 2008-09 లో సవరించిన అంచనాల ప్రకారం రు.36,750 కోట్లు ఖర్చు పెట్టింది. దానిపై అదనంగా కేటాయించింది రు.2,350 కోట్లు మాత్రమే. శాతంగా చూస్తే అది నామ మాత్రమే. పైగా దినసరి కూలి రు.80 నుండి రు.100 కి పెంపు సైతం ఈ పెంపుదలకే పరిమితమయింది.
పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఆహార భద్రత అంశంలో కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. ఆహార భద్రత కోసం ఒక చట్టాన్నే తీసుకొస్తున్నట్లు బడ్జెట్ ముందు కాంగ్రెస్ పార్టీ హడావిడి చేసింది. కాని ఇప్పుడు దాని ముసాయిదా వ్యవసాయ, ఆహార మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఉంది చూసి అభిప్రాయాలు చెప్పండని ఆర్థికమంత్రి సెలవిచ్చారు. ఈ ముసాయిదా చట్టరూపంలోకి ఎప్పుడు మారుతుందో, దాని తుది స్వరూపం ఎలా ఉంటుందో?
పేదరిక రేఖ దిగువన ప్రతి కుటుంబానికి నెలకు 25 కేజీల చొప్పున, కేజీ రు.3కు తిండి గింజలను అందజేేయాలన్నది ఈ బిల్లు లక్ష్యమని చెబుతున్నారు. కాని ఇప్పుడు కేంద్రం పేదల్లో పేదలకు అంత్యోదయ కార్డు ద్వారా కుటుంబానికి 35 కిలోల బియ్యాన్ని కేజీ రు.2 చొప్పున ఇస్తున్నది. నూతన పథకం అమల్లోకి వస్తే ఈ అంత్యోదయ కార్డు హోల్డర్లకు కోటాను 25 కేజీలకు తగ్గిస్తారా, ధరను కేజీకి రు.3కు పెంచుతారా అన్న సందేహాలు భయపెడుతున్నాయి. పైగా అనేక రాష్ట్రాలలో పేదలకు కిలో రెండు రూపాయలు, కిలో రూపాయి బియ్యం పథకాలు అమల్లో ఉన్నాయి. కేంద్రం కొత్త పథకంతో వీటి తీరుతెన్నులు ఎలా మారతాయి అన్న విషయం కూడ అర్థం కావడం లేదు. నిజంగా ప్రజలకు ఆహార భద్రత కల్పించాలంటే ప్రస్తుతం అమల్లో ఉన్న లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ స్థానే సార్వత్రిక ప్రజాపంపిణీని ప్రవేశపెట్టాలి. కాని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించడం లేదు.
ప్రపంచంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న బాలల్లో సగం మంది మన దేశంలోనే ఉన్నారు. ఈ పరిస్థితిలో వారికి ఎంతో కొంత ఆహారాన్ని సమకూర్చేది సమగ్ర శిశుఅభివృద్ధి పథకం (ఐసిడిఎస్). ఇలాంటి పథకం దేశవ్యాపితంగా అందరు బాలలకు అమలు కావడం లేదు. దీన్ని సార్వజనీనం చేయాలని సుప్రీం కోర్టు మూడేళ్ల క్రితమే ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా ఇప్పటికీ అమలు జరగలేదు. దీనికోసం కనీసం రు.12,000 కోట్లు ఏడాదికి అవసరం అవుతాయని అంచనా. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో కేటాయించింది సుమారు రు.6,000 కోట్లు మాత్రమే. అందరికీ అమలు చేయాలన్న లక్ష్యాన్ని 2012లో చేరతామని మాత్రం బడ్జెట్‌లో చెప్పారు.
విద్యారంగం పరిస్థితీ ఇదే విధంగా ఉంది. విద్యాహక్కు బిల్లు పార్లమెంటులో ఆమోదానికి సిద్ధంగా ఉంది. దీని ప్రకారం 14 ఏళ్ల లోపు బాలలందరికీ స్కూలు విద్య తప్పనిసరిగా అందించాలి. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించదు. ఎలిమెంటరీ విద్యకు ఈ ఏడాది కేటాయింపులను రు.19,488 కోట్లనుండి రు.19,682 కోట్లకు మాత్రమే పెంచింది. సెకండరీ విద్యకు కొంచెం మెరుగ్గా రు.2,000 కోట్లు అదనంగా కేటాయించింది. కాని ప్రభుత్వం అసలు మోజు ఉన్నత విద్యపైనే ఉంది. దాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది బేరానికి పెట్టాలని ఉబలాటపడుతున్నది. ఈ రంగానికి కేటాయింపులను రు.6,800 కోట్లనుండి, రు.9,600 కోట్లకు పెంచింది. వ్యవసాయ రంగంలో అభివృద్ధిని బాగా పెంచాలని చెప్పిన బడ్జెట్, కేటాయింపులను మాత్రం ఆ విధంగా పెంచలేదు. గత బడ్జెట్‌తో పోల్చుకున్నపుడు ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెంపుదల రు.1500 కోట్లు మాత్రమే. వ్యవసాయ, సహకార రంగాలకు కలిపి ఈ బడ్జెట్‌లో రు.11,307 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఈ కేటాయింపులు రు.9,600 కోట్లు. వ్యవసాయాన్ని ఎత్తి కుదేస్తానంటున్న ప్రభుత్వం వ్యవసాయ పరిశోధనకు కేటాయింపును రు. 2,960 కోట్ల నుండి, రు.3,241 కోట్లకు అంటే కేవలం రు.281 కోట్లు మాత్రమే పెంచింది.
రైతులు వ్యవసాయం చేయడానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు లాంటి పెట్టుబడులను సక్రమంగా అందించడానికి, పండిన పంటలను గిట్టుబాటు ధరలకు అమ్ముకునే ఏర్పాట్లను ప్రభుత్వం చేయాల్సి ఉంది. దాని గురించి ఈ ప్రభుత్వానికి పట్టినట్లు లేదు. రైతులకు బ్యాంకులు రుణాలు ఉదారంగా ఇవ్వాలని మాత్రం ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. కాని అసలు ఎలాంటి వ్యవస్థాగత రుణాలు అందని రైతులు కనీసం 40 శాతం ఉన్నారన్న సంగతి ఆయన మరచిపోయారు. రైతులకే నేరుగా ఎరువుల సబ్సిడీ అందిస్తామన్న పేరుతో ఉన్న వెసులుబాటుకే మంగళం పాడే ప్రయత్నాలు చేస్తున్నది.
పేద, సాధారణ, మధ్యతరగతి ప్రజానీకం అన్నింటికన్నా ఎక్కువ బాధపడుతున్నది అధిక ధరల తాకిడితో. ధరలను అదుపుచేయడానికి ప్రభుత్వం
ఎలాంటి చర్యలూ ప్రకటించలేదు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగాయన్న పేరుతో బడ్జెట్‌కు కొద్ది రోజుల ముందు పెట్రోలు, డీజిలు ధరలను పెంచి కూర్చుంది. పెట్రోలు, డీజిలు ధరలను అంతర్జాతీయ ధరలతో సంపూర్ణంగా అనుసంధానం చేయడం లక్ష్యంగా బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. ఇంధనం ధరలు పెరిగితే వాటి ప్రభావం మిగతా అన్ని ధరలపైనా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థ్ధిక సంక్షోభం ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపైనా పడింది. ఎగుమతి ఆధారిత పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. పారిశ్రామిక రంగంలో సుదీర్ఘకాలంగా ప్రతికూల అభివృద్ధి నమోదవుతున్నది. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరి సంఖ్య 50 లక్షల వరకు ఉంటుందని అంచనా. వీరికి ఉపాధి కల్పించడం గురించి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కనిపించదు. ఈ ఏడాది బడ్జెట్ వ్యయం మొత్తం రు.10 లక్షల కోట్లు దాటినప్పటికీ, దానిలో ప్రణాళికా వ్యయం కేవలం రు. 3 లక్షల కోట్లు మాత్రమే. అంటే అత్యధిక భాగం అనుత్పాదకంగా ఖర్చవుతున్నది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని సైతం కాదని ద్రవ్య లోటును జిడిపిలో 6.8 శాతానికి పెంచారు. ద్రవ్యలోటు రు.4లక్షల కోట్లకు పైగానే ఉంది. ప్రణాళికా వ్యయాన్ని మించి ద్రవ్యలోటు ఉంది. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో ఆదాయాన్ని సమకూర్చుకొని దాని అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టాలి. అది చాలనపుడు లోటు బడ్జెట్‌కు పాల్పడి, ఆ నిధులను ఉత్పాదకంగా ఖర్చుపెట్టవచ్చు. కాని ఇప్పుడు ప్రణాళికేతర వ్యయానికి సైతం లోటు బడ్జెట్‌పై ఆధారపడాల్సిన దుస్థితిలో ప్రభుత్వం ఉంది.
ఉన్నత స్థాయి కార్పొరేట్ ఉద్యోగులు, సిఇఓలకు పన్ను పరిధిలోకి రాకుండా సమకూర్చే వేతనేతర సదుపాయాలను ఫ్రింజ్‌మెంట్ బెనిఫిట్స్ అంటారు. ఇలాంటి వాటిపై పన్ను ఎత్తివేసినా కార్పొరేట్ వర్గం సంతృప్తి చెందలేదు. బడాపెట్టుబడిదారులు ప్రభుత్వంపై కినుక వహించిన ప్రధాన అంశం ఒకటుంది. అది ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను ఎంత మేరకు అమ్మనున్నారన్న విషయాన్ని ఈ బడ్జెట్‌లో స్పష్టంగా ప్రకటించకపోవడం. ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని సందేహానికి తావులేకుండా మరుసటి రోజు వివరించారు. ప్రభుత్వ రంగ వాటాల అమ్మకం గురించి ప్రకటించడానికి బడ్జెట్ తగిన చోటు కాదని, అయినప్పటికీ ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వం 51 శాతం వాటాలను మాత్రమే అట్టిపెట్టుకొని మిగతా వాటిని 'ప్రజల భాగస్వామ్యం' కోసం అందుబాటులో అంటే అమ్మకానికి ఉంచుతామని ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. బడ్జెట్లో అన్నీ ప్రకటించకూడదన్న వైఖరి వివిధ కీలక రంగాలలో ఎఫ్‌డిఐని అనుమతించడానికీ వర్తిస్తుందని భావించవచ్చు. ఎఫ్‌డిఐ ప్రస్తావనే బడ్జెట్‌లో లేకపోవడం పట్ల కొంతమంది ఆశ్చర్యం ప్రకటించారు. వాణిజ్య వర్గాలు కార్పొరేట్ పన్ను రేటును తగ్గించమంటుంటే, దానికి బదులు మినిమమ్ అల్టర్నేట్ టాక్స రేటును 10 నుండి 15 శాతానికి పెంచడం పట్ల కార్పొరేట్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఏం చేసినా మొత్తం ప్రత్యక్ష పన్నుల రాబడిలో నికర పెరుగుదల ఏమీ లేదని బడ్జెట్‌లో ప్రభుత్వం చూపించింది. ఆదాయపు పన్ను గరిష్ట పరిమితిని రు.2లక్షలకు పెంచాలన్నది న్యాయబద్ధమైన డిమాండు కాగా కేవలం రు.10 వేలు మాత్రం పెంచి రు.1,60,000లకు ప్రభుత్వం సరిపుచ్చింది. 2 లక్షలకు పెంచితే క్రిందిస్థాయి ఉద్యోగులు లాభపడతారు. దీనికి బదులుగా ఆదాయపు పన్నుపై అందరికీ వర్తించే సర్‌చార్జీని మాత్రం తొలగించింది. ప్రభుత్వం ప్రకటించిన మార్పుల ప్రకారం రు.2లక్షల వార్షికాదాయం లభించే వ్యక్తికి కేవలం రు.1,030 రాయితీ లభిస్తే, రు.50 లక్షల ఆదాయం వచ్చే వ్యక్తికి రు.1,45,745లు రాయితీ లభిస్తున్నది. ఆదాయపు పన్ను రేట్లలో మార్పు ద్వారా ప్రభుత్వం ఎవరిని ఆదుకోవాలనుకుంటున్నదో ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. మొత్తంగా బడ్జెట్ సాధారణ ప్రజలకు ఏదో ఒరగబెట్టినట్లు చూపాలని ప్రయత్నించింది. కానీ, ఆయత్నాలేవీ ఫలించలేదు. తన అసలు ఉద్దేశాలు అమలు చేయడానికి బడ్జెట్ సరైన చోటుకాదని ప్రభుత్వం చెప్పడం పట్ల పెట్టుబడిదారులు సంతృప్తి చెందుతారు. వారు ఆశిస్తున్న రాయితీలు తప్పక పొందుతారు. ప్రజలు మాత్రం అదనపు భారాలకు సిద్ధం కావలసి ఉంటుంది.