వీలుంటే నా నాలుగు లంకెలు ...

23, సెప్టెంబర్ 2019, సోమవారం

భారత ఆర్థిక మందగమనం పై నా విశ్లేషణ - పరిష్కారాలు

2 వ్యాఖ్యలు

మాంద్యం (Recession) అంటే?
వరుసగా రెండు పర్యాలు (Two Consequent terms) స్థూల దేశీయోత్పత్తి (GDP) గాని తగ్గితే దానిని మాంద్యం (Recession) అంటారు.


కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రకటన
భారత అర్థికరంగ మాంద్యమానికి ప్రధాన కారణం "ప్రజలలో కొనుగోలు శక్తి తగ్గడమే" (Decrease in purchasing power among people)


కేంద్ర ప్రభుత్వ దిద్దుబాటు చర్యలు
  • ఒక లక్షా నలభై కోట్ల రూపాయిల (₹1.4 Lakh Crores per year)  విలువైన కార్పోరేట్ పన్ను(Corporate Tax) రాయితీ తో కలుపుకుంటే కార్పోరేట్ కంపెనీలకు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం యిచ్చిన రాయతీలు అక్షరాల రెండు లక్షల కోట్ల రూపాయిలు (₹2 Lakh Crores).
  • గత ఐదు సంవత్సరాలలో కార్పోరేట్ కంపెనీలు తీర్చలేని రుణాలను, రుణ ఎగవేత దారులు అప్పులను Corporate Non-Performing Assets (NPAs) గా గుర్తించి వాటిని మాఫీ చేసిన మొత్తము అక్షరాల ఐదు లక్షల కోట్ల రూపాయిలు (₹5 Lakh Crores).
  • GST రేట్లు పెద్దగా ప్రభావం చూపని వస్తువులపై కొంత మేర తగ్గింపు


కార్పోరేట్ టాక్స్ తగ్గింపు
·           టాక్స్  ఎవరు కడతారు?
ప్రైవేటు లిమిటెడ్ మరియు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు వాటి వార్షిక ఆదాయములో వచ్చే లాభం (Profit) మీద మాత్రమే ప్రభుత్వానికి కట్టే పన్ను.

·           తగ్గింపు ఎవరికి లాభం?
కంపెనీలకి లాభం వస్తేనే కట్టేది ఈ పన్ను, అంటే లాభాలో వున్న కంపెనీలకి యింకా లాభం.  ప్రస్తుతం నష్టాలలో వున్న కంపెనీలకు ఈ పన్ను ఎంత వున్నా నష్టం లేదు. అంటే, నష్టాలలో వున్న కంపేనీలకు ఎటువంటీ లాభం లేదు.

·           కార్పోరేట్ టాక్స్ తగ్గింపు వలన కలిగే లాభాలు..
కంపెనీలకు లాభాలు పెరగడం వలన, పెట్టుబడులు పెరుగుతాయి, ఉధ్యోగాలు పెరుగుతాయి, ఉధ్యోగుల జీతాలు పెరుగుతాయి, వీటిద్వారా ప్రజలలో కొనుగోలు శక్తి పెరుగుతుందిని ప్రజలను నమ్మిస్తుంది.

·           కార్పోరేట్ టాక్స్ యింకా తగ్గాలి
కార్పోరేట్ టాక్స్ భారత్ లో ఎక్కువ ఇతర దేశాలతో పోల్చుకుంటే, యింకా తగ్గాలి అనే వారు కూడా వున్నారు.


కార్పోరేట్ టాక్స్ తగ్గింపు పై  నా విశ్లేషణ
  • కొందరు ఈ టాక్స్ తగ్గింపు వలన లాభం చాలా లాభాలు వున్నాయని భావిస్తున్నారు. లాభాలు పెరిగినప్పుడు ఆ లాభాన్ని ఎంప్లాయిస్ కి గాని, ఆ కంపెనీ కష్టమర్ల కు గాని ఆ లాభాన్ని బదలాయించడం/పంచండం (Transfer) ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, జరగదు కూడా.
  •  లాభాలు వచ్చేవానికి ఈ తగ్గింపువలన యింకా లాభాలు ఎక్కువగా వస్తాయి. సంవత్సరం ఆఖరున వచ్చిన లాభాలను పంచుకు తింటారు గాని ప్రజలకు పంచరు.
  • ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించడం వలన వచ్చిన అధిక ఆదాయం తన ప్రతిభ/శ్రమకు వచ్చిన ఆదాయంగా భావిస్తాడు గాని, ఆ ఆదాయాన్ని దిగువ వానికి బదిలీ (Transfer) చెయ్యాడు. యిది జగమెరిగిన సత్యం.
  • యిలా తగ్గించడం యిదే మొదటి సారి కాదు. 1997 లో కూడా ఒక సారి తగ్గించారు, అప్పట్లో 38.5% నుండి 30% కి తగ్గించారు. దానితో మన ఆర్థిక వ్యవస్తేమి అమాంతం పెరిగిపోలేదు.
  • కార్పోరేట్ టాక్స్ భారత్ లో ఎక్కువ ఇతర దేశాలతో పోల్చుకుంటే అనే వారు గుర్తు పెట్టుకోవసినది ఏమిటంటే, ఆర్థికం గా బలంగా వున్న దేశాలలో ప్రత్యక్ష పన్ను   (ఆదాయపు పన్ను Income Tax) ద్వారా 60-70% ఆదాయము, మిగిలినది పరోక్ష పన్ను (Indirect Tax - GST, Corp.Tax, Cess, etc.) ద్వారా ఆదాయాని సమకూర్చుకుంటున్నారు.  మనదేశంలో పరోక్ష పన్ను ద్వారా 60-70% సంపాదిస్తున్నాము. ఈ విషయాన్ని దాచి పెట్టి కార్పోరేట్ టాక్స్ భారత్ లో ఎక్కువ అని బూటకపు ప్రచారం చేస్తున్నారు


కార్పోరేట్ మొండి బకాయిలను రద్దు
  • మనలను ఒప్పించేందుకు (convince) ఈ మొండి బకాయలకు చాలా పేర్లు పెట్టారు. ఉధ్ధేశకపూర్వ ఎగవేత, నిరర్ధక అప్పులు (Definitive debts), చెడు రుణాలు (Bad Debts)  వీటినన్నింటికీ ముద్దు పేరే  పనికిరాని ఆస్తులు(Non-Performing Assets).
  • ఎక్కడా కార్పొరేట్  అప్పులను రద్దు చేశాము అని ఎక్కడా చెప్పకుండా జాగ్రత్త తీసుకుంటారు. NPAs అని, Written off అని, రద్దు చెయ్యలేదు కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో చూపించడం లేదు అని మనకు చెబుతుంటారు.
  • NPA క్రింద చూపిన ఒక్క అప్పు యిప్పటి వరకు బ్యాంకులు రికవరీ చేసిన దాఖలాలు లేవు. 
  • అంటే, డొంకతిరుడు (Indirect) గా రుణాలని మాఫీ చెయ్యడమే!. 

·   
మొండి బకాయిలను మాఫీ పై  నా విశ్లేషణ
  • పారిశ్రామిక వేత్తలు చేసే వ్యాపారలలో వుండే నష్టాలను (RISK) ప్రభుత్వం మీదకు రుద్దడం, లాభాలు వస్తే మాత్రం వారు వివధ మార్గాలు ద్వారా స్వంత ఆస్తులుగా మలుచుకోవడం ఈ దేశంలో జరుగుతూనే వుంది, ఈ ఆదాయాని/లాభాలను  వారి ప్రతిభకు/తెలివి తేటలకు  చిహ్నంగా ప్రచారం చేసుకోవడం జరుగుతుంది.
  • NPAs రుణ మాఫీలు అందరికి వుండదు.. రాజకీయ పలుకుబడి, బడా బాడా ప్రారిశ్రామికి వేత్తలకు మాత్రమే యివ్వడం జరుగుతుంది. 
  • యిలా రుణమాఫీ పొందిన బడా వ్యాపారులు అధికారంలో వున్న పార్టీల ఎన్నికల నిధులు సమకూర్చే వారీగా మారుతున్నారు. అందువలన, ఈ ఋణ మాఫీ అటూ రాజకీయ పార్టీలకు, వ్యాపారస్తులకు ఆభిస్తుంది. ఇదో చైన్ ఎఫెక్ట్. 

స్టాక్ మార్కెట్ ఎందుకు పెరిగింది? 
  • నా ఉద్ధేశం ప్రకారం స్టాక్ మార్కెట్ మధ్య తరగతి ప్రజల సొమ్ము ఒక పద్దతి ప్రకారం  కాజేయ్యడానికి ఒక వేదిక.
  • షెర్స్ కొన్న వాడు ఎప్పుడూ బాగుపడలేదు (బ్యాంక్ వడ్డీ కన్నా ఎక్కవ లాభం వచ్చింది లేదు. కానీ కంపెనీ అధిపతులు (Board of Directos) ఆస్తులు అనూయంగా పెరిగిపోతాయి. ఒకటి రెండు ఉదాహరణలు కాదు చూడవలసినది. రామారామీగా (Average) గా కూసినప్పుడు షేర్ హోల్దెర్స్ కి నాష్టాలే మిగిల్చాయి సామాన్యులకు .
  • సామాన్య ప్రజలను ఏదో ఒకటి‌ చూపి పెట్టుబడులు పెట్టించడం (షేర్ వాల్యూని క్ఱుత్రిమంగా పెంచి), తరువాత షేర్ వాల్యూని కావాలని తగ్గించడం. నష్ట పోయేది సామాన్య ప్రజలే
  • కొందరు  బాడా బాబులు స్టాక్ మార్కెట్ ని ఓ జూదశాలగా చేశారు.
  • ఈ పెరుగుదల బాడా బాబులు సామాన్య ప్రజలకు వేసిన ఒక బిస్కేట్ మాత్రమే.
  • ఈ స్టాక్ మార్కెట్ జూదంలో అంతిమంగా ఒడేది సామాన్య ప్రజలే  

 బి‌జే‌పి ప్రభుత్వా నికి ఇవ్వన్ని తెలియదా?
  • ఖచ్చితంగా తెలుసు. మరి ఎందుకు? యిదో విష వలయం.  
  • ప్రభుత్వం లోకి రావాలంటే రాజకీయ పార్టీలు  ఎలక్షన్స్ లో డబ్బులు ఖర్చు పెట్టాలి.  మరి ఫండ్ ఎలా వస్తుంది? అందుకే బి‌జే‌పి ప్రభుయత్వం ఎన్నియకల బాండ్లను (Election Bonds)  ప్రవేశ పెట్టిండి.
  • ఈ దేశంలో 1% (1,30,000) మంది దగ్గర 70%  మన దేశ సంపద గుమిగూడి వున్నది. అంటే 99% శాతం ప్రజల సొమ్ము 1% శాతం మంది దగ్గర వుండి అన్నమాట.  అలానే, దేశం మొత్తంలో 100 మంది మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను సాశించే స్థాయిలో వున్నారు.
  • ఈ 100 మంది ఎలక్షన్ బాండ్స్ లో కావలసిన పార్టీకి పెట్టుబడులు పెడతారు. దాని ప్రతిఫలం గెలిచిన తరువాత ప్రభుత్వం ఈ బాడా వ్యాపారులకు యిచ్చి తీరాలి.
  • అందుకనే వేలకోట్లు బాకీ వున్న వారి ఆస్తులు ఆటోమాటిక్ జప్తు అయ్యే టట్లు కఠిన చట్టాలు తీసుకు రాలేవు. ఎన్నికల బ్లాండ్ల విష సంస్కృతే ఈ క్విడ్ ప్రోకో (యిచ్చి పుచ్చుకొనే దోరణి) 
  • ఎలానో వుంటారు కొందరు, వీరు కార్పోరేట్స్ కి చేస్ ప్రభుత్వ మేలును, ప్రజలకోసమే చేసినట్లు పిట్ఠకధలు చెప్పటానికి. వారినే "ఇంటలేక్చువాల్స్" అంటారు. వీరు కార్పొరేట్స్ కి బ్రోకర్స్

నా ఉద్ధేశం ప్రకారం ఈ చర్యలు తీసుకోవాలి
  • ప్రజలలో కొనుగోలు శక్తి పెంచాలంటే, కనీస వేతనం (Minimum wage) నెలకు 18 వేలు చెయ్యాలి దేశవ్యాపితంగా 
  • ఎక్కువ మంది వాడే వస్తువులపై GST (Indirect Taxes)  తగ్గించాలి. పెట్రోల్, డీజిల్ వంటి వాటిని GST పరిధిలోకి తీసుకురావాలి.
  • ఆదాయప పన్ను నుండి మద్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించాలి.
  • కోట్లాది రూపాయిలు సంపాదించే  వారిపై ఆదాయప పన్ను పెంచాలి.
  • అప్పు ఎగ్గొట్టీన ప్రతీ కార్పొరేటర్ ని డీఫాల్టర్ గా డిక్లర్ చేసి, వారి ఆస్తుయాలను స్వాధీనం చేసుకోవాలి.

వాసవ్య యాగాటి
2019-09-23


8, సెప్టెంబర్ 2019, ఆదివారం

చంద్రయాన్ 2: చంద్రుడిపై దిగడానికి నాసా అపోలో మిషన్‌కు 4 రోజులు పడితే, ఇస్రోకు 48 రోజులెందుకు

0 వ్యాఖ్యలు

చంద్రయాన్ 2Image copyrightISRO

భారత కీర్తి పతాకను విశ్వాంతరాలకు చేర్చిన ప్రయోగం చంద్రయాన్ 2. 2019 జులై 22న షార్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ చంద్రయాన్ 2 నింగికెగిసింది. అయితే ఇక్కడే ఓ చిన్న ప్రశ్న కొందరి మదిలో మెదులుతోంది. అదేంటంటే..
సరిగ్గా 50 ఏళ్ల కిందట అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిన అపోలో 11 అనే మానవ సహిత వ్యోమనౌక... నాలుగు రోజుల్లో గమ్యాన్ని చేరుకుని... చంద్రుడి మీద ల్యాండ్ అయ్యింది. కానీ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 మాత్రం చంద్రుడిని చేరుకోడానికి 48 రోజులు పడుతుంది.
50 ఏళ్ల కిందటే... అంత వేగంగా చేరుకోగలిగినప్పుడు.. ఇస్రో పంపిన చంద్రయాన్ ఇంకా వేగంగా వెళ్లగలగాలి కదా. కానీ ఎందుకు ఆలస్యంగా వెళ్తోంది అన్నదే సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న.

చంద్రయాన్ 2Image copyrightPIB

నాసా ప్రయాణం వెనుక..

1969 జులై 16న... అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి శాటరన్ ఫైవ్ ఎస్ఏ506 రాకెట్ సాయంతో నీల్ ఏ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఈ ఆల్డ్రిన్, మైఖెల్ కొల్లిన్స్ అనే ముగ్గురు వ్యోమగాముల్ని చంద్రుడిపైకి పంపింది.
జులై 16 ఉదయం 8గంటల 32 నిముషాలకు నింగిలోకి దూసుకెళ్లిన అపోలో 11... 102 గంటల 45 నిముషాలకు గమ్యాన్ని చేరుకుని, చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యింది. అంటే కేవలం నాలుగు రోజుల ఆరు గంటల్లోనే వారు గమ్యం చేరుకున్నారు. ఆపై వ్యోమగాములు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్‌లు చంద్రుడిపై దిగి, అక్కడి మట్టి, రాళ్లను సేకరించారు.
జులై 21న భూమ్మీదకు తిరుగు ప్రయాణం ప్రారంభించిన అపోలో 11 వ్యోమగాములున్న మాడ్యూల్ జులై 24న నార్త్ ఫసిఫిక్ సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అంటే భూమ్మీద నుంచి చంద్రుడి మీదకు వెళ్లి, అక్కడ పరిశోధనలు చేసి, తిరిగి భూమ్మీదకు రావడానికి వాళ్లకు కేవలం ఎనిమిది రోజుల 3 గంటలు మాత్రమే పట్టింది.
కానీ ఇస్రో చంద్రుడి మీద పరిశోధనల కోసం కేవలం ఆర్బిటర్, ల్యాండర్‌లను మాత్రమే పంపించింది. అయినా... అవి చంద్రుడిని చేరుకోడానికి 48 రోజులు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. ఇంత ఆలస్యం వెనుక చాలా పెద్ద కథే ఉంది.

చంద్రయాన్ 2Image copyrightGETTY IMAGES

ఎందుకింత ఆలస్యం..

చంద్రయాన్ 2 సుదీర్ఘ ప్రయాణం వెనుక సాంకేతికంగా చాలా కారణాలున్నాయి.
1969లో నాసా ప్రయోగించిన అపోలో 11 రాకెట్ బరువు ఇంధనంతో కలిపి దాదాపు 2800 టన్నులు. కానీ ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్వీ మార్క్ త్రీ రాకెట్ బరువు ఇంధనంతో కలసి 640 టన్నులే.
సాధారణంగా శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లే పీఎస్ఎల్వీ రాకెట్లు ఇంతింత బరువు ఉండవు. ఎందుకంటే అవి కేవలం శాటిలైట్లను తీసుకెళ్లి జియో సింక్రనైజ్డ్ లేదా జియో స్టేషనరీ ఆర్బిట్లలో ప్రవేశ పెడతాయి. కానీ చంద్రయాన్ ఇందుకు విభిన్నం. ఎందుకంటే చంద్రుడి దగ్గరకు వెళ్లాల్సిన వాహక నౌకలో ఇంధనంతో పాటు చాలా పరికరాలు ఉంటాయి. అందుకే ఇలాంటి ప్రయోగాలకు అత్యంత శక్తిమంతమైన రాకెట్లను వినియోగిస్తారు.
ఈ విషయంలో కూడా నాసా ప్రయోగించిన రాకెట్ల బరువు ఎక్కువే. భూకక్ష్యను దాటిన తర్వాత... చంద్రుడి వైపు ప్రయాణించిన అపోలో వ్యోమనౌక బరువు... 45.7 టన్నులు. ఇందులో 80 శాతానికి పైగా ఇంధనమే. అంటే అపోలో 11లో ఈగిల్ అనే ల్యాండర్ చంద్రుడి మీద దిగి, వ్యోమగాములు చంద్రుడి మీద దిగి, పరిశోధనలు చేశాక, తిరిగి ఆ ల్యాండర్ ఆర్బిటర్‌ను చేరుకుని, అది భూమ్మీదకు రావడానికి ఇంత ఇంధనం అవసరం.
అపోలో 11 ప్రయోగానికి ఉపయోగించిన రాకెట్ శాటరన్ ఫైవ్ ఎస్ఎఏ506 అత్యంత శక్తిమంతమైనది. అంత భారీ ఇంధనం, అంత భారీ రాకెట్ కాబట్టే... అపోలో 11 కేవలం నాలుగు రోజుల్లో నేరుగా ప్రయాణించి చంద్రుడిని చేరిందని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ బీజీ సిద్ధార్ధ్ తెలియ చేశారు.

చంద్రయాన్ 2Image copyrightTWITTER/ISRO

తక్కువ ఇంధనం... ఎక్కువ ప్రయాణం..

ప్రస్తుతం ఇస్రో దగ్గరున్న అత్యంత శక్తిమంతమైన రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్ త్రీ.
జులై 22న చంద్రయాన్ 2ను తీసుకుని నింగిలోకి దూసుకెళ్లినప్పుడు ఆ రాకెట్ మొత్తం బరువు 640 టన్నులు. ఈ రాకెట్ గరిష్టంగా నాలుగు టన్నుల బరువున్న శాటిలైట్లను మోసుకెళ్లగలదు. అంటే నాలుగు టన్నుల బరువైన చంద్రయాన్ 2ను జీఎస్ఎల్వీ మార్క్ త్రీ అంతరిక్షంలోకి తీసుకెళ్లి దానిని భూకక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. అక్కడి నుంచి చంద్రయాన్ 2 తనంతట తాను ప్రయాణించి చంద్రుడిని చేరుకోవాలి.
50 ఏళ్ల కిందట నాసా చేపట్టిన అపోలో 11 ప్రయోగంలో... ఇలా అంతరిక్షం నుంచి దూసుకెళ్లిన రాకెట్ బరువు 45 టన్నులకు పైమాటే. కానీ చంద్రయాన్‌లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్, ఇంధనంతో కలిపి మొత్తం బరువు 4 టన్నుల లోపే ఉంది. అంటే అతి తక్కువ ఇంధనంతో... చంద్రుడి దగ్గరకు చేరుకోవాలి. ఇందుకోసమే... ఇస్రో ఓ వినూత్న ఆలోచన చేసింది.
ఈ విధానంలో రాకెట్ నేరుగా చంద్రుడి మీదకు దూసుకెళ్లడానికి బదులుగా... భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ, క్రమంగా తన అపోజీని పెంచుకుంటూ వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఆపై భూ కక్ష్య నుంచి బయటపడి చంద్రుడి వైపు ప్రయాణం చేసి, అక్కడ నుంచి చంద్రుడి చుట్టూ ఇదేలా దీర్ఘవత్తాకార కక్ష్యలో తిరుగుతూ క్రమంగా తన అపోజీని తగ్గించుకుంటూ, చివరికి చంద్రుడి వైపు ప్రయాణించి, ఆ ఉపరితలంపై దిగుతుంది.

ఉపగ్రహ ప్రయోగంImage copyrightGETTY IMAGES

చంద్రయాన్ 2 ప్రయాణం సాగిందిలా...

ఈ విధానంలో జులై 22న అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 2... 23 రోజుల పాటు భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతూ... దాని అపోజీ పరిధి పెంచుకుంటూ పోయింది. 23వ రోజు భూ కక్ష్య నుంచి విడిపోయి... చంద్రుడి వైపు ప్రయాణం ప్రారంభించింది.
అలా ఏడు రోజులు నేరుగా చంద్రుడి వైపు ప్రయాణించిన తర్వాత... 30వ రోజున అంటే ఆగస్ట్ 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది.
ఇలా చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించడాన్నే లూనార్ ఆర్బిట్ ఇన్‌సర్షన్ అంటారు. అక్కడి నుంచి చంద్రుడి చుట్టూ 13 రోజులు పరిభ్రమిస్తూ... అపోజీ తగ్గించుకుని, చంద్రుడి మీదకు దిగేలా ప్రోగ్రామ్ చేశారు.
ఇలా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన 13వ రోజు... చంద్రయాన్ 2లోని ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుడి ఉపరితలం వైపు ప్రయాణించి, 48వ రోజు... ల్యాండర్ చంద్రుడి మీద దిగి, పరిశోధనలు చేసేలా ఇస్రో అంతా ముందుగానే ప్రోగ్రామ్ చేసింది.
ఒక్కసారి చంద్రయాన్‌లో ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద దిగిన తర్వాత, అందులో వివిధ రకాల సెన్సర్లు చంద్రుడిపై పరిశోధనలు చేసి, ఆ సమాచారాన్ని భూమ్మీదకు పంపేలా ఏర్పాట్లు చేశారు.
ఇక ల్యాండర్ నుంచి బయటకు వచ్చే రోవర్ ప్రజ్ఞాన్... చంద్రుడి మీద తిరుగుతూ... అక్కడి నేలను విశ్లేషించడంతో పాటు, మరిన్ని పనులు చేస్తుంది.
ఇలా ఇస్రో తన దగ్గరున్న రాకెట్ సామర్థ్యంతో, అతితక్కువ ఇంధనంతో విజయవంతంగా చంద్రుడిని చేరుకోడానికే ఇలాంటి విధానాన్ని ఎంచుకుంది. ఈ విధానం వల్లే అతి తక్కువ ఖర్చుతో ఇస్రో తన ప్రయోగాలు పూర్తి చేస్తోందని బీజీ సిద్ధార్ధ్ తెలిపారు.

చంద్రయాన్ 2Image copyrightISRO

అన్ని ప్రయోగాలకూ ఇదే పద్ధతి

2008లో ఇస్రో చంద్రయాన్ 1 ప్రయోగాన్ని 386 కోట్ల రూపాయల ఖర్చులో పూర్తి చేసింది.
ఆపై 2014లో మార్స్ మీదకు ప్రయోగించిన మంగళ్‌యాన్ ప్రాజెక్టు కూడా... 450 కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తి చేశారు. ఇదే మార్స్ మీదకు నాసా ప్రయోగించిన అమెరికా మావెన్ ఆర్బిటర్ ప్రయోగానికి ఇంత కన్నా పది రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టినట్లు... బీబీసీ సైన్స్ వెల్లడించింది. అప్పట్లో భారత్ చేపట్టిన మంగళ్‌యాన్ ప్రయోగాన్ని ప్రపంచమంతా కొనియాడింది. హాలీవుడ్‌లో భారీ వ్యయంతో స్పేస్ సినిమాలు తీస్తుంటే... అంత కన్నా తక్కువ ఖర్చుతో ఇస్రో మంగళ్‌యాన్ ప్రాజెక్ట్ పూర్తి చేసిందని ప్రధాని మోదీ కూడా కొనియాడారు.
ఇప్పుడు కూడా... ఇలాగే మీడియం లిఫ్ట్ హెవీ వెహికల్ అయిన జీఎస్ఎల్వీ మార్క్ త్రీ రాకెట్‌ని ఉపయోగించి కేవలం 978 కోట్ల రూపాయల అతి తక్కువ ఖర్చుతో ఇస్రో చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ పూర్తి చేసిందని, త్వరలో ఇదే తరహాలో గగనయాన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయబోతోందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్.శ్రీరఘునందన్ బీబీసీతో తెలియచేశారు.

చంద్రయాన్ 1లో ప్రయోగించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్Image copyrightISRO
చిత్రం శీర్షికచంద్రయాన్ 1లో ప్రయోగించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్

చంద్రయాన్-1లోనే చంద్రుడిపై ల్యాండర్

చంద్రయాన్ 1 ప్రయోగంలో ఇస్రో కేవలం ఆర్బిటర్ మాత్రమే ప్రయోగించిందని అంతా అనుకున్నారు. కానీ ఆ ప్రయోగంలో ఆర్బిటర్‌తో పాటుగా... మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌ను కూడా ప్రయోగించింది.
చంద్రయాన్ 1 లో ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ నిర్ణీత కక్ష్యలో తిరుగుతుంటే... మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ మాత్రం చంద్రుడి ఉపరితలంపై క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఆ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌కి నాలుగు పక్కలా భారతీయ జెండాను ఉంచారు. అలా చంద్రుడి మీద భారత జాతీయ పతాకం పదేళ్ల కిందటే కాలు మోపిందన్నమాట.
అంతే కాదు... ఈ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ఇచ్చిన సమాచారంతోనే చంద్రుడి మీద నీటి జాడలను ఇస్రో గుర్తించింది.
50 ఏళ్ల కిందట భారత్‌లో ఇస్రో ప్రస్థానం ప్రారంభం కావడానికన్నా ముందే అమెరికా తమ వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపి, అక్కడి శిలలను భూమికి తీసుకొచ్చింది.
ఆపైనా 1972 వరకూ నాసా 12 మంది వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపింది. కానీ చంద్రుడి మీద నీటి జాడలు మాత్రం అమెరికా సహా మరే దేశమూ కనిపెట్టలేకపోయింది. కానీ చంద్రయాన్ 1 తో ఇస్రో ప్రయోగించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ మాత్రం ఆ ఘనత సాధించిందని రఘునందన్ తెలిపారు.

ఇస్రోImage copyrightISRO

తొలి ప్రయత్నంలోనే ఇస్రో విజయం

అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చెయ్యడమే కాదు... అన్ని అంశాల్లోనూ దాదాపు తొలి ప్రయత్నాలతోనే విజయం సాధిస్తూ వస్తోంది ఇస్రో.
చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, మంగళ్‌యాన్ ప్రయోగాల్లో అత్యంత సంక్లిష్టమైన దశ... లూనార్ ఆర్బిట్ ఇన్‌సర్షన్. ఇది అనుకున్నంత సులువైన దశ కాదు. అమెరికా, రష్యాలు తొలినాళ్లలో 14 సార్లు ఈ దశ దగ్గరే విఫలమయ్యాయి. 15వ సారి మాత్రమే ఈ దశ దగ్గర విజయం సాధించాయి. కానీ ఇస్రో మాత్రం తొలి ప్రయత్నంలోనే చంద్రయాన్ 1 ప్రయోగంలో ఈ దశను విజయవంతంగా అధిగమించింది.
Nasa.gov వెల్లడించిన వివరాల ప్రకారం అపోలో 11 ప్రయోగంలోనే కాదు.. అంత కన్నా ముందుకూడా చాలా మందిని చంద్రుడి మీదకు పంపింది నాసా. కానీ వాళ్లంతా చంద్రుడి కక్ష్య వరకూ వెళ్లి, చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టి వెనక్కి వచ్చేశారు తప్ప చంద్రుడి మీద దిగలేదు. 1968 డిసెంబర్ 25న ఫ్రాంక్ బోర్మన్, బిల్ యాండ్రెస్, జిమ్ లోవెల్‌లతో కూడిన వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించి, తిరిగి వెనక్కి వచ్చేసింది. కానీ వాళ్లు చంద్రుడి మీద దిగకపోవడంతో... ఈ ప్రయోగం ప్రపంచానికి తెలియలేదు.

నాసాImage copyrightNASA

12 మందిని చంద్రుడిపైకి పంపిన నాసా

కేవలం అపోలో 11 ద్వారా ముగ్గురు వ్యోమగాముల్ని పంపడమే కాదు.. ఆ తర్వాత కూడా ఇలాంటి ప్రయోగాలు కొనసాగించింది నాసా.
1969 నవంబర్ 14న అపోలో 12 రాకెట్ ద్వారా మరో ముగ్గురు వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపింది. అలా 1972 డిసెంబర్ 7న అపోలో 17 చివరి సారిగా ముగ్గురు వ్యోమగాముల్ని పంపింది. ఇలా మూడేళ్ల వ్యవధిలో నాసా 12 మంది వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపింది.
ఆ తర్వాత చంద్రుడి మీదకు మనుషుల్ని పంపే ప్రయోగాలను నిలిపేసింది. ఈ విజయాల వెనుక నాసా ఎన్నో వైఫల్యాలను కూడా చవిచూసింది.
1967 ఫిబ్రవరి 21న నాసా అపోలో 1 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. కానీ రిహార్సల్ టెస్టింగ్ టైంలో క్యాబిన్లో మంటలు రేగడంతో... రాకెట్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యోమగాములతోపాటు 27 మంది సిబ్బంది మరణించారు.
ఇలా ఎన్నో విఫలయత్నాల తర్వాత... నాసా విజయవంతంగా చంద్రుడి మీద కాలు మోపింది.
కానీ ఇస్రో మాత్రం అతి తక్కువ ఖర్చుతో, తొలి ప్రయత్నాలతోనే విజయం సాధిస్తూ వస్తోందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ తెలియ చేశారు.

చంద్రయాన్ 2Image copyrightISRO

చంద్రయాన్‌లో ఏమున్నాయి..?

చంద్రయాన్‌లో ప్రధానంగా మూడు భాగాలున్నాయి. అందులో మొదటిది చంద్రుడి కక్ష్యలోనే తిరిగే ఆర్బిటర్‌. రెండోది జాబిల్లి మీద దిగే ల్యాండర్‌. దీనిపేరే విక్రమ్‌. ఇక మూడోది ఆ ల్యాండర్‌ చంద్రుడి మీద దిగిన తర్వాత బయటకొచ్చి చంద్రుడిపై కలియ తిరిగే రోవర్‌.. దీని పేరు ప్రజ్ఞాన్. ఈ మూడింటినీ కలిపి కాంపోజిట్‌ మాడ్యూల్‌ అంటారు.
ఇలా ఆర్బిటర్‌ను, ల్యాండర్‌ను ఒకేసారి పంపడం అంత సులువైన విషయం కాదు. ఇస్రో మాత్రం ఈ రెండింటినీ ఒకేసారి ఒకే రాకెట్‌తో ప్రయోగించేసింది. అంతేకాదు.. ఇందులో ఆర్బిటర్‌తో పాటు, చంద్రుడి మీద దిగే రోవర్‌ను కూడా.. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించింది.
ఇక్కడ మరో అద్భుతమైన విషయం గురించి కూడా ప్రస్తావించాలి. భూమ్మీద నుంచి చంద్రుడి మీదకు సిగ్నల్ పంపాలంటే 15 నిముషాలు పడుతుంది. అంటే ల్యాండర్ చంద్రుడి మీద దిగేటప్పుడు భూమ్మీద నుంచి దాన్ని కంట్రోల్ చెయ్యడం దాదాపు అసాధ్యం. అందుకే ల్యాండర్ తనంతట తానే నిర్ణయాలు తీసుకునేలా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రోగ్రామ్ చేశారని రఘునందన్ తెలియ చేశారు.

Source: BBC

Share via Whatsapp

చంద్రయాన్ 2: చిట్టచివరి నిమిషంలో ఏం జరిగింది.. వైఫల్యానికి కారణం ఇదేనా

0 వ్యాఖ్యలు

చంద్రయాన్Image copyrightISRO

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో వైఫల్యానికి ల్యాండర్ విక్రమ్‌లోని సెంట్రల్ ఇంజిన్‌లో తలెత్తిన లోపం కారణమై ఉండొచ్చని ఆ సంస్థకు చెందిన ఓ మాజీ శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు.
ఈ విషయంలో ఇస్రో ఇంతవరకూ ఏ ప్రకటనా చేయలేదు.
చంద్రుడి ఉపరితలానికి 2.1 కి.మీ.ల ఎత్తులో ఉండగా ల్యాండర్‌తో గ్రౌండ్ స్టేషన్‌కు కమ్యునికేషన్ తెగిపోయినట్లు మాత్రం శనివారం వేకువజామున ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ శివన్ వెల్లడించారు.
''సెంట్రల్ ఇంజిన్‌లో ఏదైనా పొరపాటు జరిగి ఉండొచ్చు. అవసరమైన థ్రస్ట్‌ను అది అందించలేకపోయినట్లుగా ఉంది. అందుకే, వేగాన్ని తగ్గించే ప్రక్రియ అనుకున్నట్లుగా జరగలేదు. ఫలితంగానే కమ్యునికేషన్ తెగిపోయి ఉంటుంది'' అని ఇస్రో మాజీ సభ్యుడు ప్రొఫెసర్ రొడ్డం నరసింహా బీబీసీతో చెప్పారు.
ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో స్క్రీన్లపై చూపించిన గ్రాఫ్‌ల ఆధారంగా నరసింహా ఈ వివరణ ఇచ్చారు. ఆ గ్రాఫ్‌ల్లోని రేఖల్లో ల్యాండర్ ఎత్తు, వేగం గురించి సమాచారం ఉంది.

చంద్రయాన్Image copyrightDD

''ల్యాండర్ గమనాన్ని చూపించే రేఖ నిర్ణీత పరిమితుల్లో ఉంటే అంతా సవ్యంగా ఉన్నట్లు. మూడొంతుల రెండు సమయం అది అలాగే సాగింది. కానీ, మరింత కిందకు వెళ్లగానే ఆ రేఖ పరిమితులను దాటింది. ఆ తర్వాత కొద్ది సేపు నేరుగా సాగి, పరిమితుల బయట దిశగా వెళ్లింది'' అని నరసింహా చెప్పారు.
''దీనర్థం ల్యాండర్ ఏదో కోల్పోయింది. అందుకే, మెల్లగా కిందకు పోవాల్సింది పోయి, వేగంగా పడటం ప్రారంభించింది. నిజానికి ల్యాండర్ సెకన్‌కు 2 మీటర్ల వేగంతో చంద్రుడి ఉపరితలంపై దిగాలి. లేకపోతే, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ల్యాండర్‌ను వేగంగా కిందకు పడేలా చేసి ఉండొచ్చు'' అని ఆయన వివరించారు.
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.38 గంటల సమయంలో కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అప్పటికి ల్యాండర్ 1640 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో కదులుతోంది.
మొదటి రెండు దశల్లో రఫ్ బ్రేకింగ్, ఫైన్ బ్రేకింగ్ ఆపరేషన్స్ పూర్తైన తర్వాత ల్యాండర్ బాగానే ఉంది. హోవరింగ్ దశలోనే ల్యాండర్ గమనాన్ని సూచించే రేఖ పరిమితులు దాటినట్లు స్క్రీన్లపై కనిపించింది.

చంద్రయాన్Image copyrightGETTY IMAGES

ప్రణాళిక ప్రకారం చంద్రుడిపై రెండు భారీ బిలాల మధ్యన ఉన్న రెండు ప్రాంతాల్లో ఒక దానిని సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ల్యాండర్ ఎంచుకొని దిగాలి. ఆ తర్వాత అందులో నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకువచ్చి చంద్రుడి ఉపరితలంపై తిరుగుతుంది. అక్కడున్న నీటి స్ఫటికాలు, ఖనిజ లవణాల ఆధారాలు సేకరిస్తుంది.
చంద్రయాన్-2 ప్రయోగంలో వైఫల్యం వెనుక సెంట్రల్ ఇంజిన్‌ లోపం ఉండొచ్చన్న నరసింహా అభిప్రాయంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో న్యూక్లియన్ అండ్ స్పేస్ పాలసీ ఇనిషియేటివ్ హెడ్‌గా పనిచేస్తున్న డాక్టర్ రాజేశ్వరి రాజగోపాలన్ ఏకీభవించారు.
ల్యాండర్‌ నాలుగు మూలల్లో ఒక్కోటి చొప్పున నాలుగు ఇంజిన్లు ఉంటాయని, వాటిలో ఒకటి విఫలమై కూడా ఈ పరిణామం తలెత్తి ఉండొచ్చని ఆమె సందేహం వ్యక్తం చేశారు.
''సమాచారమేదీ లేకుండా ఓ నిర్ధారణకు రావడం కష్టం. స్క్రీన్‌పై కనిపించిన రేఖలైతే ఏదో లోపం ఉందనే చెబుతున్నాయి. అధిక వేగంతో ల్యాండింగ్ జరుగుతున్నప్పుడు చాలా దుమ్ము రేగుతుంది. దానికి తోడు గురుత్వాకర్షణ బలం వల్ల ల్యాండర్ ఊగిపోవచ్చు. అయితే, ఇంజిన్‌లో లోపమే ఈ వైఫల్యానికి కారణమై ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి'' అని రాజేశ్వరి అన్నారు.
''డేటా విశ్లేషణకు కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత తదుపరి మిషన్ కోసం ప్రణాళికలు వేయడానికి చాలా సమయం పట్టొచ్చు. ఎందుకంటే, ప్రస్తుతం ఎదురైన సమస్యలకు పరిష్కారాలను కనిపెట్టాలి'' అని ప్రొఫెసర్ నరసింహా వ్యాఖ్యానించారు.
చంద్రయాన్-2 ఆర్బిటార్ మరో ఏడాది కాలం పాటు చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉంటుందని, చాలా సమాచారాన్ని అది గ్రౌండ్ స్టేషన్‌కు చేరవేస్తుందని రాజేశ్వరి అన్నారు. చంద్రుడి ఉపరితలం గురించి అర్థం చేసుకునేందుకు అది ఎంతో ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
చంద్రుడి ఉపరితలంపై దిగే మిషన్‌లు విజయవంతమయ్యే అవకాశాలు తక్కువని చాలా మంది శాస్త్రవేత్తలు అంగీకరిస్తుంటారు. ఇప్పటివరకూ ఇలాంటి మిషన్‌ల విజయాల రేటు 35 శాతానికి మించలేదు.
వైఫల్యాలు ఎదురైనా, అద్భుత పరిష్కారాలతో వాటిని అధిగమించి గొప్ప విజయాలు అందుకున్న చరిత్ర ఇస్రోకు ఉంది.
Source: BBC