వీలుంటే నా నాలుగు లంకెలు ...

8, సెప్టెంబర్ 2019, ఆదివారం

చంద్రయాన్ 2: చిట్టచివరి నిమిషంలో ఏం జరిగింది.. వైఫల్యానికి కారణం ఇదేనా


చంద్రయాన్Image copyrightISRO

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో వైఫల్యానికి ల్యాండర్ విక్రమ్‌లోని సెంట్రల్ ఇంజిన్‌లో తలెత్తిన లోపం కారణమై ఉండొచ్చని ఆ సంస్థకు చెందిన ఓ మాజీ శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు.
ఈ విషయంలో ఇస్రో ఇంతవరకూ ఏ ప్రకటనా చేయలేదు.
చంద్రుడి ఉపరితలానికి 2.1 కి.మీ.ల ఎత్తులో ఉండగా ల్యాండర్‌తో గ్రౌండ్ స్టేషన్‌కు కమ్యునికేషన్ తెగిపోయినట్లు మాత్రం శనివారం వేకువజామున ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ శివన్ వెల్లడించారు.
''సెంట్రల్ ఇంజిన్‌లో ఏదైనా పొరపాటు జరిగి ఉండొచ్చు. అవసరమైన థ్రస్ట్‌ను అది అందించలేకపోయినట్లుగా ఉంది. అందుకే, వేగాన్ని తగ్గించే ప్రక్రియ అనుకున్నట్లుగా జరగలేదు. ఫలితంగానే కమ్యునికేషన్ తెగిపోయి ఉంటుంది'' అని ఇస్రో మాజీ సభ్యుడు ప్రొఫెసర్ రొడ్డం నరసింహా బీబీసీతో చెప్పారు.
ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో స్క్రీన్లపై చూపించిన గ్రాఫ్‌ల ఆధారంగా నరసింహా ఈ వివరణ ఇచ్చారు. ఆ గ్రాఫ్‌ల్లోని రేఖల్లో ల్యాండర్ ఎత్తు, వేగం గురించి సమాచారం ఉంది.

చంద్రయాన్Image copyrightDD

''ల్యాండర్ గమనాన్ని చూపించే రేఖ నిర్ణీత పరిమితుల్లో ఉంటే అంతా సవ్యంగా ఉన్నట్లు. మూడొంతుల రెండు సమయం అది అలాగే సాగింది. కానీ, మరింత కిందకు వెళ్లగానే ఆ రేఖ పరిమితులను దాటింది. ఆ తర్వాత కొద్ది సేపు నేరుగా సాగి, పరిమితుల బయట దిశగా వెళ్లింది'' అని నరసింహా చెప్పారు.
''దీనర్థం ల్యాండర్ ఏదో కోల్పోయింది. అందుకే, మెల్లగా కిందకు పోవాల్సింది పోయి, వేగంగా పడటం ప్రారంభించింది. నిజానికి ల్యాండర్ సెకన్‌కు 2 మీటర్ల వేగంతో చంద్రుడి ఉపరితలంపై దిగాలి. లేకపోతే, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ల్యాండర్‌ను వేగంగా కిందకు పడేలా చేసి ఉండొచ్చు'' అని ఆయన వివరించారు.
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.38 గంటల సమయంలో కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అప్పటికి ల్యాండర్ 1640 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో కదులుతోంది.
మొదటి రెండు దశల్లో రఫ్ బ్రేకింగ్, ఫైన్ బ్రేకింగ్ ఆపరేషన్స్ పూర్తైన తర్వాత ల్యాండర్ బాగానే ఉంది. హోవరింగ్ దశలోనే ల్యాండర్ గమనాన్ని సూచించే రేఖ పరిమితులు దాటినట్లు స్క్రీన్లపై కనిపించింది.

చంద్రయాన్Image copyrightGETTY IMAGES

ప్రణాళిక ప్రకారం చంద్రుడిపై రెండు భారీ బిలాల మధ్యన ఉన్న రెండు ప్రాంతాల్లో ఒక దానిని సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ల్యాండర్ ఎంచుకొని దిగాలి. ఆ తర్వాత అందులో నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకువచ్చి చంద్రుడి ఉపరితలంపై తిరుగుతుంది. అక్కడున్న నీటి స్ఫటికాలు, ఖనిజ లవణాల ఆధారాలు సేకరిస్తుంది.
చంద్రయాన్-2 ప్రయోగంలో వైఫల్యం వెనుక సెంట్రల్ ఇంజిన్‌ లోపం ఉండొచ్చన్న నరసింహా అభిప్రాయంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో న్యూక్లియన్ అండ్ స్పేస్ పాలసీ ఇనిషియేటివ్ హెడ్‌గా పనిచేస్తున్న డాక్టర్ రాజేశ్వరి రాజగోపాలన్ ఏకీభవించారు.
ల్యాండర్‌ నాలుగు మూలల్లో ఒక్కోటి చొప్పున నాలుగు ఇంజిన్లు ఉంటాయని, వాటిలో ఒకటి విఫలమై కూడా ఈ పరిణామం తలెత్తి ఉండొచ్చని ఆమె సందేహం వ్యక్తం చేశారు.
''సమాచారమేదీ లేకుండా ఓ నిర్ధారణకు రావడం కష్టం. స్క్రీన్‌పై కనిపించిన రేఖలైతే ఏదో లోపం ఉందనే చెబుతున్నాయి. అధిక వేగంతో ల్యాండింగ్ జరుగుతున్నప్పుడు చాలా దుమ్ము రేగుతుంది. దానికి తోడు గురుత్వాకర్షణ బలం వల్ల ల్యాండర్ ఊగిపోవచ్చు. అయితే, ఇంజిన్‌లో లోపమే ఈ వైఫల్యానికి కారణమై ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి'' అని రాజేశ్వరి అన్నారు.
''డేటా విశ్లేషణకు కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత తదుపరి మిషన్ కోసం ప్రణాళికలు వేయడానికి చాలా సమయం పట్టొచ్చు. ఎందుకంటే, ప్రస్తుతం ఎదురైన సమస్యలకు పరిష్కారాలను కనిపెట్టాలి'' అని ప్రొఫెసర్ నరసింహా వ్యాఖ్యానించారు.
చంద్రయాన్-2 ఆర్బిటార్ మరో ఏడాది కాలం పాటు చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉంటుందని, చాలా సమాచారాన్ని అది గ్రౌండ్ స్టేషన్‌కు చేరవేస్తుందని రాజేశ్వరి అన్నారు. చంద్రుడి ఉపరితలం గురించి అర్థం చేసుకునేందుకు అది ఎంతో ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
చంద్రుడి ఉపరితలంపై దిగే మిషన్‌లు విజయవంతమయ్యే అవకాశాలు తక్కువని చాలా మంది శాస్త్రవేత్తలు అంగీకరిస్తుంటారు. ఇప్పటివరకూ ఇలాంటి మిషన్‌ల విజయాల రేటు 35 శాతానికి మించలేదు.
వైఫల్యాలు ఎదురైనా, అద్భుత పరిష్కారాలతో వాటిని అధిగమించి గొప్ప విజయాలు అందుకున్న చరిత్ర ఇస్రోకు ఉంది.
Source: BBC

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి