వీలుంటే నా నాలుగు లంకెలు ...

5, జులై 2009, ఆదివారం

శాస్త్రీయత ముసుగుతో దోపిడి - కృత్రిమ వర్షాలు

శాస్త్రీయత లేకున్నా ఐదేళ్లలో 150 కోట్లు ధారాదత్తం, ఈ ఏడాది 30 కోట్లు
మేఘమధనం టెండర్‌ను ఈసారి కూడా అగ్ని ఏవియేషన్స్‌ సంస్థే దక్కించుకోనుంది. నాలుగైదేళ్లుగా ఆ సంస్థపై ఎన్ని ఆరోపణలొచ్చినప్పటికీ దానికే కాంట్రాక్టును కట్టబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్లోబల్‌ టెండర్లు పిలిచామంటున్నా ప్రభుత్వం రూపొందించిన నియమాలు అగ్నికి అనుకూలంగా రూపొందించినట్లు సమాచారం. అందువల్ల ప్రతి ఏడాదీ కాంట్రాక్టును ఆ సంస్థ స్వంతం చేసుకుంటున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. అగ్నిని దృష్టిలో పెట్టుకొనే నిబంధనలు తయారు చేస్తున్నారన్న విమర్శలొచ్చాయి.
కృత్రిమ వర్షాలు పడతాయన్న గ్యారంటీకానీ, అసలా విషయానికి సరైన శాస్త్రీయతకానీ లేవని నిపుణులంటున్నారు. కొన్నేళ్లుగా మేఘమధనం చేస్తున్నా దానివల్ల ఎక్కడ వర్షాలు పడ్డాయో స్పష్టంగా నిరూపితం కాలేదు. ఫలానచోట వర్షం కురిసిందని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అటువంటి వ్యవస్థ మనవద్ద లేదు. అయినా కొన్ని సంవత్సరాల్లో మధనానికి 150 కోట్లు ఖర్చు చేసింది. కోట్ల రూపాయల ప్రజాధానాన్ని 'అగ్ని'కి తగలేస్తోంది. ఈ సీజన్‌లో కృత్రిమ వర్షాలు కురిపించడానికి బడ్జెట్‌లో 30 కోట్ల రూపాయలు కేటాయించారు. వాటిని ఖర్చు చేయడానికి 'అగ్ని'ని ఎంచుకున్నారు.
ఆ కంపెనీకే ఎందుకు?
ఖరీఫ్‌, రబీ సీజన్లలో మేఘమధనం జరపడానికి గ్లోబల్‌ టెండర్లు పిలిచారు. జూన్‌ 29న టెండర్లు తెరిచారు. మూడు కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. అగ్ని ఏవియేషన్స్‌, శ్రీ ఏవియేషన్స్‌, సైకాన్‌ కనస్ట్రక్షన్స్‌ టెండర్లు వేశాయి. ఆ మూడింటిలో అగ్నిని ఎంపిక చేశారని తెలిసింది. ఈ నెల 15 నుండి మధనాన్ని ప్రారంభిస్తామని వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డి ప్రకటించారు. జెఎన్‌టి యూనివర్శిటీ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. అగ్నిపై గతంలో పలు ఆరోపణలొచ్చాయి. సరిగ్గా మధనం చేయకుండా కోట్ల రూపాయల బిల్లులు స్వాహా చేసేందుకు సచివాలయంలోని ఒక ఐఎఎస్‌ అధికారికి గతంలో లంచం ఇవ్వడానికి ప్రయత్నించినట్లు వార్తలొచ్చాయి. ఆ పని చేసిన అగ్ని ప్రతినిధిని ఆ అధికారి తన కార్యాలయం నుండి మెడపట్టి గెంటించారు. ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా రెండు మూడేళ్లు ఆ సంస్థే మధనం చేసింది. అనావృష్టి ప్రాంతాల అభివృద్ధి శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పుడు దాన్ని అప్పట్లో మారెప్పకు అప్పగించారు. మధనం ఆ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ వేరే శాఖ మంత్రి పెత్తనం చేశారని మారెప్ప గతంలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అగ్నితో నేరుగా ఒక కేబినెట్‌ మంత్రికి సంబంధాలున్నాయని ఆయన పలుమార్లు ఇష్టాగోష్టిలో చెప్పారు. ఇప్పుడు కూడా అదే మంత్రి అగ్నికి టెండర్‌ ఇప్పించడానికి లాబీయింగ్‌ చేశారని సమాచారం. ఆ సంస్థకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారని తెలిసింది. ఆసియాలో మధనం చేయగల సత్తా, అందుకు అవసరమైన మౌలిక వసతులు దానికే ఉన్నాయని, అందువల్ల అగ్ని మళ్లీ ఎంపికైందని ప్రచారంలో పెట్టారు.
అన్నీ అనుమానాలే
మధనంపై ముఖ్యమంత్రి ఇటీవల ఒక సమావేశం నిర్వహించారు. దానికి శాస్త్రవేత్తలు, నిపుణులు, రైతుసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రపంచంలో ఎక్కడా కృత్రిమ వర్షాలు లేవని తేల్చారు. పడుతున్నవాటి స్థాయిని 10 నుండి 15 శాతం వరకూ పెంచే పరిజ్ఞానం మాత్రమే కొంతమేరకు అభివృద్ధి చెందిందని నిపుణులు పేర్కొన్నారు. మధనానికి అనుకూలమైన మేఘాలు ఉంటేనే ఆ మేరకైనా సాధ్యమవుతుంది. ఉష్ణవాహక మేఘాలను రాడార్‌ సాయంతో గుర్తించి ప్రయోగం చేస్తున్నారు. శీతల మేఘాలను మధించే టెక్నాలజీ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ప్రయోగం చేసిన మేఘం ఫలానచోట వర్షిస్తుందన్న గ్యారంటీలేదు. అయినా గడచిన ఐదేళ్లలో 150 కోట్లు మధనానికి ఖర్చు చేశారు. అగ్నికి ధారాదత్తం చేశారు. క్లవుడ్‌ సీడింగ్‌వల్ల సీజన్‌లో సగటున 17 శాతం అదనంగా వర్షాలు పడ్డాయని ప్రచారం చేసినా ఆ లెక్కకు సరైన శాస్త్రీయతలేదు. ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న శ్రీకాకుళం-ఆదిలాబాద్‌ ప్రాంతంలో సాలీన 1100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతున్నందున ఆ ప్రాంతంలో మధనంవల్ల ప్రయోజనంలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో కొంత ఉపయోగం ఉండవచ్చు. అగ్ని ఏనాడూ చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా మధనం చేయలేదని ఆరోపణలున్నాయి. ఏకకాలంలో రెండు మూడు విమానాలను ఉపయోగిస్తామని ముందు చెప్పినా అవి పూర్తిస్థాయిలో ఏనాడూ అందుబాటులోకి రాలేదు. మూడు రాడార్‌ స్టేషన్లు కావాలని అంటున్నా అతీగతిలేదు. ముఖ్యంగా అనంతపురంలో ఒకదాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. నిధుల సమస్య చెప్పనే అక్కర్లేదు. ఎన్ని ఏర్పాట్లు చేసినా ఆర్థికశాఖ కొర్రీలతో సమయానికి నిధుల్లేక అదనుకు ప్రయోగం జరగట్లేదు. ఏవియేషన్‌ మంత్రిత్వశాఖ నుండి విమానం ఎగరడానికి సకాలంలో అనుమతి రావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా దరఖాస్తు చేయట్లేదు. ఇన్ని ఇబ్బందులున్నా ఐదేళ్లకూ ఒకేసారి టెండర్లు పిలవాలని సిఎం అధికారులకు సూచించడం గమ నార్హం. సీజన్‌ ముంచుకు రావడంతో ఈ ఒక్క ఏడాదికి హడా విడిగా టెండర్లు పిలిచారు. వర్షాల కోసం వరుణ యాగాలు, మధనం అంటున్నా రూపాయి కూడా నిధులు విడుదల కాలేదు. గత ఏడాదికి చెల్లించాల్సిన 30 కోట్లలో ఒక్క రూపాయి ఇవ్వలేదని, ఆర్థిక శాఖలో ఫైలు పెండింగ్‌లో ఉందని అధికా రులు తెలిపారు. బకాయిలతో పాటు, కొత్త టెండర్‌కు అడ్వాన్స్‌ చెల్లింపుపై ఆర్థికశాఖ ఆమోదం లభించలేదు. ఇవన్నీ పూర్తయ్యే సరికి సీజన్‌ ముగుస్తుందని, మంచి వర్షాకాలంలో ప్రయోగం చేసి తమ వల్లే వర్షాలు పడ్డాయని ప్రచారం చేసి అగ్నికి కోట్ల రూపాయలు అప్పగిస్తున్నారని విమర్శలొస్తున్నాయి.

4 కామెంట్‌లు:

  1. క్షామపీడిత అనంతపురంలో వర్షం సంగతేమోగానీ వ్యవసాయమంత్రికి మాత్రం ధనవర్షమే.

    రిప్లయితొలగించండి
  2. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడే కృత్రిమ వర్షాలు కురిపించడం సాధ్యమట! వాతావరణ తేమ వర్షాకాలంలోనే ఎక్కువ ఉంటుంది, అది కూడా రాత్రి పూట ఎక్కువ ఉంటుంది. రాత్రి పూట విమానాలు తిప్పకుండా పగటి పూట తిప్పితే వర్షాలు ఎలా పడతాయి? రాత్రి పూట రాడార్ నుంచి సిగ్నల్స్ సరిగా రావని చెప్పి రాత్రి పూట విమానాలు తిప్పక పోవడం జరుగుతుంది.

    రిప్లయితొలగించండి
  3. I wonder whether there is some interest 'fog harvesting' schemes or ones like this:
    http://www.wired.com/science/discoveries/news/2006/10/71898

    రిప్లయితొలగించండి
  4. అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలలోనే దుబారా ఖర్చుతో చేసిన మేఘ మధనాలు ఫలించలేదు. ఇక ఇండియాలో ఫలిస్తాయా?

    రిప్లయితొలగించండి