వీలుంటే నా నాలుగు లంకెలు ...

6, జులై 2009, సోమవారం

పెట్టుబడుల ఉపసంహరణ ఎవరి కోసం

''పెట్టుబడులను ఉపసంహరించడం ద్వారా వనరుల కొరతను అధిగమించటమే ప్రభుత్వ లక్ష్యం అయినట్లయితే అది వివేకంతో కూడుకున్న చర్యకాబోదు. ద్రవ్య లోటు 2 లక్షల కోట్ల రూపాయలనుకున్నట్లయితే మీకున్న మొత్తం ఆస్తులను రెండేళ్ళలో అమ్మివేయగలరు. మరి మూడవ సంవత్సరం ఏమిచేస్తారు? కనుకనే మీమౌలిక లక్ష్యాలేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాము. ప్రభుత్వం నుంచి కచ్చితమైన జవాబును కోరుతున్నాము. ఇది కేవలం పెట్టుబడికి సంబంధించిన ప్రశ్న మాత్రమే కాదు. గత పదేళ్ళలో ఈ విషయమై ఏకాభిప్రాయం కుదరలేదు. ఏ లక్ష్య సాధన కోసం పెట్టుబడుల ఉపసంహరణ? ఇది కేవలం బడ్జెట్‌ వ్యత్యాసాలను పూరించటానికేనా? సాధారణ వినియోగ వ్యయ అవసరాలను తీర్చటం కోసం పెట్టుబడుల ఉపసంహరణ వివేకమవుతుందా? ద్రవ్యలోటును తగ్గించుకునే ఇతర మార్గాలను మీరు అన్వేషించలేరా?

పై ప్రశ్నలను లేవనెత్తింది ఎవరోకాదు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిగా వున్న ప్రణబ్‌ ముఖర్జీ సరిగ్గా ఎనిమిదేళ్ళ క్రితం రాజ్యసభలో ఈ ప్రశ్నలను లేవెనెత్తారు. అప్పటిలో ఆయన ప్రతిపక్ష సభ్యునిగా ఉన్నారు. 2001 ఫిబ్రవరి 27వ తేదీన అంటే ఆనాటి ఎన్డీయే ప్రభుత్వం తన బడ్జెట్‌ను సమర్పించటానికి కొన్ని గంటలముందు బాల్కో పెట్టుబడుల ఉపసంహరణపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఆయన పైవిధంగా ప్రశ్నలను సంధించారు. ఇప్పటివరకు ఇవి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఈ నెల 4వ తేదీన రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అన్ని పార్టీలు మాట్లాడాయి. కాని ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు.

అలాంటపుడు ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ సంస్ధలలో పెట్టుబడుల ఉపసంహరణ కోసం తక్షణమే పిలుపు ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది? ఐదేళ్ళ అనంతరం ''వామపక్షాల ఆటంకం'' తొలగిపోయినందుకేనా? పైన ప్రస్తావించిన ''వైదుష్యాన్ని'' ఎనిమిదేళ్ళ క్రితం కాంగ్రెసు ప్రదర్శించింది. అప్పటిలో ప్రతిపక్షంగా ఉండటానికిగాను కాంగ్రెసుకు వామపక్షాల అవసరం ఏమాత్రం లేదుగదా! ముఖర్జీ ఉపన్యాసంలోనే దీనికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి.
''ఒప్పందానికి కట్టుబడి ఉండండి: ప్రభుత్వానికి ఫిక్కీ సూచన'' అన్న విషయాన్ని నేను వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్నాను. మొత్తం ప్రైవేటు రంగంగా ఉండటాన్నే వారు అభిలషిస్తారు. ప్రతిచోటా మార్కెట్‌ ఆర్థికవ్యవస్ధ ఉండాలని కోరుకుంటారు. ఈరోజే కాదు సర్వేసర్వత్రా వారు ఈ డిమాండును చేస్తూనే ఉంటారు.

ఇదీ అసలు సంగతి. పెట్టుబడుల ఉపసంహరణను కోరుతున్నదెవరు? ఫిక్కీతోపాటు సిఐఐ, అసోచెమ్‌ వంటి పారిశ్రామిక సంస్ధలు పెట్టుబడుల ఉపసంహరణను కోరుతున్నాయి. 2001లో అరుణ్‌ శౌరికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఈ సంస్ధలే. ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి దిశానిర్ధేశం చేస్తున్నాయి. అంతేగాని ప్రభుత్వ రంగ యజమానులైన ఈ దేశ ప్రజలు కాదు.

షేర్‌మార్కెట్‌ ద్వారా ప్రజల యాజమాన్యం?
దేశ ప్రజలు, పార్లమెంటుకు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. పార్లమెంటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్ధలపై ప్రజల యాజమాన్యాన్ని ప్రజలెన్నుకున్న పార్లమెంటు కాపాడుతుంది. పార్లమెంటు ద్వారా రక్షణ పొందే ప్రజల యాజమాన్యాన్ని షేర్‌ మార్కెట్‌ ద్వారా కొద్దిమంది ప్రజల యాజమాన్యంగా మార్చరాదు. దశలవారీగా ప్రైవేటీకరించే క్రమాన్ని మరుగుపరచేటందుకుగాను ప్రజా యాజమాన్యం అంటూ తప్పుడు పేరును పెడుతున్నారు. 1991-1996 మధ్య కాంగ్రెసు ప్రభుత్వం ఉన్నపుడు ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌ సింగే ఉన్నారు. నవరత్నాలలో ఒకటన భెల్‌ వాటాలను తెగనమ్మేటందుకు ఆ సమయంలోనే శ్రీకారం చుట్టారు.

3 కామెంట్‌లు:

  1. అమ్ముకోవడానికి ఆస్తులు మిగలకపోతే కొలంబియా (దక్షిణ అమెరికా) లో లాగా ప్రజల వ్యవసాయ భూములు ఆక్రమించుకుని బహుళ జాతి కంపెనీలకి అమ్ముకుంటారు.

    రిప్లయితొలగించండి
  2. అజ్ఞాత7/06/2009 01:27:00 PM

    తమిళనాడులో ఒక నదిని కోకోకోలా కంపెనీకి అమ్మేశారు. ఆ నది నీళ్ళు రైతులు వాడుకోవడానికి అవ్వదు. ఇది జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినట్టు గుర్తు.

    రిప్లయితొలగించండి
  3. రాజకీయ నాయకులు దేశంలో దేన్నైనా ఆమేయగలరు, తమ సొంత ఆస్తులు తప్ప.

    రిప్లయితొలగించండి