గత నెలలో అంతర్జాతీయ శ్రామిక సదస్సు (ఐఎల్‌సి) జెనీవాలో జరిగింది. ఇదేదో మహత్తరమైన సంఘటన కానప్పటికీ ప్రపంచ పెట్టుబడిదారీ విధానం కూకటి వేళ్లతో సహా కదలిపోతున్న తరుణంలో ఈ సదస్సు జరగటం విశేషం. అంతేకాక స్వేచ్ఛా మార్కెట్‌వాదాన్నీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్ధను ఊబిలో దింపిన నయా ఉదారవాద ప్రపంచీకరణనూ ప్రోత్సహిస్తున్న వారిపట్ల ప్రపంచ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ సదస్సు చోటుచేసుకున్నది. ఇలాంటి స్ధితిలో ప్రపంచ పెట్టుబడిదారీ నాయకత్వం ఎలా స్పందించేదీ ఊహించటం కష్టమేమీ కాదు. గత ముప్పై ఏళ్ళుగా, అంటే, రీగన్-థాచర్‌ల కాలం నుంచి పెట్టుబడిదారులు వల్లిస్తున్న నినాదాలు నిలిచిపోయాయి. 'వ్యాపారం చేసే బాధ్యత ప్రభుత్వానిది కాదు', పెట్టుబడిదారీ విధానానికీ, స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్ధకూ 'ప్రత్యామ్నాయం లేదు', 'ప్రభుత్వమనేది ఒక సమస్యగా ఉన్నదేగాని పరిష్కారంగా లేదు', 'అన్ని సమస్యలనూ మార్కెట్ పరిష్కరించగలదు', అంటూ చాలా కాలంగా చెప్తున్న బడాయిలను ప్రస్తుతం పక్కన పెట్టారు. సమాజ పురోగతికి ప్రపంచీకరణ ఒక్కటే ఏకైక మార్గమంటూ పెట్టుబడిదారీ కిరాయి మనుషులు ఇంతకుముందు ఎల్లెడెలా ప్రచారం చేశారు. కుప్పకూలిన అమెరికన్ బ్యాంకులు, జర్మన్ బ్యాంకులు మార్కెట్‌ను ఎందుకు ఆశ్రయించలేదు?
ప్రభుత్వం వద్దకు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అంటూ జూన్ 15న జరిగిన ప్లీనరీ సమావేశంలో లూలా డి సెల్వా అడిగిన ప్రశ్నకు సమాధానమే కరువైంది. గత శతాబ్ది 8, 9 దశాబ్దాలలో పేదదేశాలు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలకు అనేకానేక పరిష్కారాలను సూచించిన ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లు ప్రస్తుతం అమెరికా, జపాన్, ఐరోపాలకు ఎలాంటి సలహాలు ఇవ్వనున్నదని కూడా ప్రశ్నించారు. దీనితో సమావేశ హాలులో ఉన్నవారు మిన్నుముట్టేలా హర్షధ్వానాలు చేశారు. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్ధనూ, రాజకీయాలను శాసిస్తున్న నయా ఉదారవాదులపట్ల వారికున్న ఆగ్రహం అలాంటిది. అమెరికన్ బ్యాంకర్‌లను ముఠానాయకులు అన్నపుడు కూడా ఇలాంటి హర్షాతిరేకాలే వ్యక్తమయ్యాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ సైతం అమెరికాను, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లను పరోక్షంగా ఎత్తిపొడిచాడు. ''అంతర్జాతీయ ఆర్థిక సంస్ధలు ఇతరులకు పాఠాలు చెప్పటమేకాక, తాము కూడా నేర్వాలని'' ఆయన అన్నారు. ప్రస్తుత సంక్షోభానికి అమెరికాయే కారణమంటూ లాటిన్ అమెరికా, ఐరోపా దేశాలు విమర్శిస్తుంటే అమెరికా ప్రతినిధులు మౌనం దాల్చారు. గతంలో జరిగిన ఐఎల్‌సీ సమావేశాలకూ ఇప్పుడు జరిగిన దానికీ చాలా తేడా ఉన్నది.
గత సమావేశాలలో ప్రపంచీకరణనూ, నయా ఉదారవాదాన్నీ విమర్శించడమే నేరంగా భావించారు. మార్కెట్‌ను సాక్షాత్తు భగవంతునిగా భావించటం జరిగింది. శ్రామికవర్గాన్ని దారుణమైన దోపిడీకి, అణచివేతకూ గురిచేశారు. చివరకు ఐఎల్‌ఓ సైతం ప్రపంచీకరణను సమర్ధించింది. మారిన నేటి పరిస్థితిలో ఐఎల్‌ఓ అనవసరమని చేప్పేవరకు సంపన్న దేశాల నాయకులు వెళ్ళారు. శ్రామికుల వేతనాల గురించీ, పని పరిస్థితుల గురించీ మార్కెట్ తగు జాగ్రతలు తీసుకోగలదని వారి చెప్పుకొచ్చారు. కాని ఇంతలో ఎంతమార్పు? ఐఎల్‌ఓకు ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, శ్రామికుల ఇక్కట్లను తొలగించే మార్గాలను అన్వేషించాలని జి-20 దేశాల సదస్సు కోరింది. ఈసారి జరగనున్న జి-20 సమావేశాలకు ఐఎల్‌ఓను ఆహ్వానించాలన్న ప్రతిపాదన వచ్చింది. డబ్ల్యుటిఓలో ఐఎల్‌ఓ వాణి వినిపించాలని సర్కోజీ వ్యాఖ్యానించారు. ఇదియిలా ఉండగా ఐఎల్‌ఓ చివరి నిముషంలో తన అజెండాను మార్చి, ఆర్థిక సంక్షోభాన్ని దానిలో చేర్చింది. దీనిపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ప్రభుత్వాలకూ, యాజమాన్యాలకూ ప్రాతినిధ్యం వహించేవారేకాక కార్మిక ప్రతినిధులు కూడా దాదాపు 200 మందికి పైగా ఉన్నారు.
భారత్ నుంచి అర్ధేందు దక్షి (సిఐటియు), థంపన్ థామస్ (హెచ్‌ఎంఎస్), ఉదరు పట్వర్ధన్ (బిఎంఎస్)లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ దాదాపు ప్రతిరోజు సమావేశమవుతుంటుంది. పలు రంగాలకు చెందిన వారు కూడా ఈ కమిటీ చర్చలలో పాల్గొంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఐఎల్‌సీ సమావేశం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లను, ప్రపంచీకరణ విధానాలనూ ఆక్షేపించింది. ప్రస్తుత సంక్షోభానికి కారణమైన వారెవరూ ఈ సమావేశానికి హాజరు కాలేదు. అంతేకాక వారిని వెనకేసుకు వచ్చే వాళ్ళు కూడా లేకుండా పోయారు. కార్మిక వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్న సంగతి ఆకస్మికంగా ఐఎల్‌ఓకు గుర్తుకు వచ్చింది. ప్రపంచ బ్యాంకు కూడా తన బాణీని మార్చింది. ఆదాయ పంపిణీ, పంపిణీ యంత్రాంగం, సామాజిక భద్రత వగైరాల గురించీ, ఐఎల్‌ఓతో సమన్వయం గురించీ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రస్తావించారు. అనేక మంది ఉపాధిని కోల్పోవటం, ఆదాయాల తగ్గుదల, నిరుద్యోగం పెరుగుదల వగైరాలతో పలు దేశాలలో తీవ్రమైన పరిస్థితులు నెలకొనడంతో పైన పేర్కొన్న పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తంమీద ప్రపంచ నాయకులు నిరాశలో కూరుకుపోయారు.
ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చటానికిగాను వారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఆశాజనకమైన మార్పులు వస్తున్నాయంటూ ఒకవైపున ప్రసారసాధనాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు సహనంతో ఉండాలని, త్వరలోనే ఉద్యోగాలు లభించగలవని, ఆదాయాలు పెరగగలవని నమ్మబలుకుతున్నారు. మరోవైపున, కార్మిక లోకంలో విశ్వాసాన్ని పెంచవలసిందిగా ఐఎల్‌ఓను కోరుతున్నారు. ఐఎల్‌ఓ కూడా వీరి ఆకాంక్షలను నెరవేర్చేటందుకై తాను చేయగలిగింది చేయటానికి సిద్ధంగా ఉన్నది. సంక్షోభాన్నుంచి బయట పడుతున్నట్లుగా తెలియచేసే ఒక పత్రాన్ని అది తయారు చేసింది. సంక్షోభానంతర ప్రపంచం విభిన్నంగా ఉండగలదని అది చెప్పుకొచ్చింది. అయితే, 'ఆర్థిక వ్యవస్ధ పునరుజ్జీవాన్ని పొందిన పలు సంవత్సరాల తరువాత మాత్రమే ఉపాధి పరిస్థితి మెరుగుపడగలదంటూ ముక్తాయింపు నిచ్చింది. ఆర్థికవ్యవస్ధ కోలుకున్న అనంతరం అంటే, పెట్టుబడి తిరిగి తన స్థితిని పొందిన అనంతరం ఉద్యోగాలు మరలా లభ్యం కాగలవని ఐఎల్‌ఓ అభిప్రాయం. అయితే కనీస వేతనాలు, సమావేశ హక్కు, లైంగిక సమానత్వం, పర్యావరణ పరిరక్షణ వగైరాల సంగతేమిటన్నదే ఇక్కడ ఎదురయ్యే ప్రశ్న.
నిరుద్యోగులను ఆదుకునేందుకు డబ్బు ఎక్కడ నుంచి వస్తుందంటూ శ్రామిక బృందాలు ప్రశ్నిస్తున్నాయి. బ్యాంకులు దివాళా తీస్తే సంక్షోభ నివారణ పథకాలు వర్తిస్తాయి. ఎగుమతిదారులు దెబ్బతింటే ప్రభుత్వం ఆదుకుంటుంది. మరి ఉద్యోగాలను కోల్పోయిన కార్మికుల సంగతేమిటి? ప్రభుత్వాలుగానీ, యాజమాన్యాలుగానీ ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వటం లేదు. ఆర్థిక రంగం మంచి ఊపులో ఉన్నపుడే కార్మికులకు వారికి దక్కవలసింది దక్కలేదు. అటువంటపుడు సంక్షోభం సమయంలో ఏమి లభిస్తుంది? కార్మికులకు అనుకూలమైన విధానాలను చేపట్టవలసిందిగా కార్మికవర్గ నాయకులు అడుగుతున్నారు. లేనిపక్షంలో ఆర్థిక సంక్షోభం సామాజిక అశాంతిగా మారే ప్రమాదమున్నదని వారు హెచ్చరిస్తున్నారు. దీనికి కూడా సరియైన సమాధానం లేదు. ఉపాధి పథకాలంటూ ప్రవేశపెట్టటమేగాని వాటికి ఆర్థిక కేటాయింపులు ఏమీలేవు. యాజమాన్య వర్గాలు ఇలాంటి వాటిని పట్టించుకోవు. వారికి లాభాలు ప్రధానం. అంతేగాని కార్మికుల బాగోగులు వారికి అనవసర విషయం. కనుకనే ఆర్థిక సంక్షోభం తలయెత్తినప్పటికీ శ్రామిక లోకాన్ని ఆదుకునే విధానాలు కరువయ్యాయి.
ఇప్పటి వరకు ఐఎల్‌ఓలో భారత్‌కు ఎలాంటి ప్రాధాన్యతా ఉండేదికాదు. కాని ఈసారి సమావేశాల్లో భారత్‌కు విశేష ప్రాధాన్యత లభించింది. అందుకు కారణం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.నిజానికి ఈ చట్టాన్ని ఆమోదించటానికి భారత ప్రభుత్వానికి చాలా కాలం పట్టింది. వామపక్షాల ఒత్తిడితో మాత్రమే ఈ చట్టం ఆమోదాన్ని పొందింది. నిజ ఆర్థికవ్యవస్ధకు ప్రాధాన్యతను ఇవ్వటంతోపాటు దేశీయంగా డిమాండును పెంచే చర్యలను తీసుకున్నందుకుగాను చైనాను సమావేశం అభినందించింది. లైంగిక సమానత, ఎయిడ్స్ సమస్యల గురించి కూడా ఐఎల్‌ఓ పరిణగనలోకి తీసుకున్నది. స్త్రీ పురుష సమానత్వం గురించి ఐఎల్‌ఓ ఎప్పటి నుంచో చెపుతున్నది. కాని ఇవన్నీ నీటిమీది రాతలుగానే మిగిలి పోతున్నాయి. కార్మికులకు సంబంధించిన విషయాలకు కూడా ఇదే దురవస్ధ పడుతున్నది. సమావేశాలు జరుగుతున్నపుడే మరిన్ని ఉద్యోగాలు పోవటం గురించి, సమ్మెలు వగైరాల గురించి వార్తలు వెలువడ్డాయి. నిన్నమొన్నటి వరకు ప్రపంచీకరణ, స్వేచ్ఛా మార్కెట్ గురించి మాట్లాడిన వారే ఇప్పటి ఐఎల్‌సి సమావేశంలో కార్మికవర్గ శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో భాగమే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి