3, జులై 2009, శుక్రవారం
ఉద్దేశపూర్వకంగానే గాజా విధ్వంసం
గాజాపై జరిపిన దాడిలో ఇజ్రాయిల్ యుద్ధ నేరాలకు పాల్పడిందని, నిర్లక్ష్యంగా దాడులు జరిపిందని, ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేసిందని ఒక స్వతంత్ర మానవహక్కుల నివేదిక తెలిపింది. అత్యంత శక్తివంతమైన ఆయుధాల ప్రయోగం వల్ల వందలాది మంది మరణించగా, సమీపం నుంచి జరిపిన కాల్పుల్లో పలువురు మృతి చెందినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. హమాస్ రాకెట్ దాడులు కూడా యుద్ధ నేరాలేనని, వారు పౌరులకు ప్రమాదకరంగా ఉన్నారని కూడా ఆ నివేదిక తెలిపింది. అయితే తన ప్రవర్తన అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఉన్నట్లు ఇజ్రాయిల్ సైన్యం చెప్పింది. కొందరు పౌరులు మరణించిన మాట వాస్తవమేనన్న ఇజ్రాయిల్ తాను విచక్షణారహితంగా, పెద్ద ఎత్తున దాడులు జరిపాననే విమర్శను మాత్రం తిరస్కరించింది. 2008 డిసెంబర్ 27 నుంచి 2009 జనవరి 17 వరకూ 22 రోజుల పాటు ఇజ్రాయిల్ జరిపిన యుద్ధంలో 14 వందల మంది పాలస్తీనియన్లు మరణించినట్లు ఆమ్నెస్టీ తెలిపింది. వీరిలో మూడు వందల మంది పిల్లలు, 115 మంది మహిళలు సహా మొత్తం తొమ్మిది వందల మంది పౌరులున్నారని ఆ నివేదిక వెల్లడించింది. దీనిపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ 117 పేజీల నివేదికను విడుదల చేసింది. ఇజ్రాయిల్ దళాలు ఆరోగ్య రక్షణ అందకుండా పదేపదే అడ్డుకోవడం వల్ల అనేక ప్రాణాలు పోయాయని ఆ నివేదిక చెప్పింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి