మైఖెల్ జాక్సన్ మరణించి నెలరోజుల కావస్తున్నా మీడియాలో ఆయన గురించిన కథలు నిరంతరాయంగా వెలువడుతూనే వున్నాయి.ప్రపంచాన్ని ఉర్రూతలూపించిన కళా స్రష్ట ప్రతిభా పాటవాల కంటే ఆయన మరణానికి సంబంధించిన మిస్టరీపైన,వ్యక్తిగత జీవితంలో నీలి నీడలపైన ఈ కథనాలు సాగుతుండడం ఆశ్చర్యకరమేమీ కాదు. పెట్టుబడిదారీ వ్యాపార వ్యవస్థ సహజ స్వభావాన్నీ, ప్రత్యేకించి మీడియాలో వేళ్లూనుకున్న వికృత పోకడలనూ మరోసారి కళ్లకు కట్టే సందర్భమిది.ప్రపంచ పాప్ సామ్రాట్ మైకెల్ జాక్సన్ హఠాత్తుగా మరణించాడన్న వార్త పెద్ద సంచలనమే సృష్టించింది. కళాభిమానులందరినీ కదిలించి .ఓ కన్నీటి బొట్టు మౌనంగా జారిపోయేలా చేసింది. ఆయన ఆనారోగ్యంతోనూ అనేక సమస్యలు సంక్షోభాలతోనూ పోరాడుతున్నాడని తెలిసినా యాభై ఏళ్లకే కన్నుమూస్తాడని మాత్రం ఎవరూ అనుకోలేదు.అలాటి సమాచారం కూడా రాలేదు. తీరా అది జరిగిన తర్వాత అనేక ప్రశ్నలు సందేహాలూ తలెత్తడం సహజమే. ఎందుకంటే మైఖెల్ జాక్సన్ జీవితమూ కళా ప్రస్థానమూ కూడా ప్రపంచానికి పెద్ద వార్తలే. నలుపు తెలుపు మేళవించిన విశ్వ కళా సంచలనం ఆయన. తన చిటికెన వేలు కదిలిస్తే వేలం వెర్రిగా ఎగబడిన కోట్ల మంది సంగీతాభిమానులు ఒకవైపు.. ఆ ప్రతి కదలికనూ అక్షరాలా కోట్ల డాలర్లలోకి మార్చిన సామ్రాజ్యవాద ధనస్వామ్య సంస్కృతి మరోవైపు కళ్లముందు నిలుస్తాయి. వాటన్నిటినీ లోతుగా తర్కించడం ఇబ్బంది అనిపించినా ఆ వ్యక్తిత్వంలో పెనవేసకుపోయిన లక్షణాలివి. ఆయన అసాధారణ ప్రతిభ, కృషి ప్రప్రథమంగా స్మరించుకోవలసినవి. అవే లేకపోతే ప్రపంచం ఆయనను ఇంతగా ఆరాధించేది కాదు. ఇప్పుడు దేశ దేశాలలో కవులు,కళాభిమానులు అశ్రుతర్ఫణ చేసే వారు కాదు. అయితే ఈ ప్రపంచంపై రాజకీయ ఆర్థిక ఆధిపత్యం సాగిస్తున్న శక్తులే సాంస్కృతిక ఆధిపత్యమూ చలాయించడం కూడా ఆయన పేరు మార్మోగడానికి ఒక ప్రధాన కారణం. ఇక్కడ అసాధారణ జనాభిమానం గల మాస్ హీరోలూ, వారితో స్టెప్పులేయించే నృత్యదర్శకులూ ఆయనను తాము ఎలా అనుసరించిందీ ప్రకటిస్తున్నారు. ఆ అవసరం లేకుండానే రీప్లే చేస్తున్న ఆయన స్టెప్పులను చూసిన మామూలు ప్రేక్షకులు అవన్నీ తమకు చిరపరిచితమైనవని గమనించి మన వాళ్ల అనుకరణ శక్తికి నివ్వెరపోతున్నారు. తెరపైనే గాక జీవితంలోనూ ఆ పాప్ వరవడి ప్రపంచాన్ని అమితంగా ప్రభావితం చేసింది. చాలా ఛానళ్లలో డాన్సు పోటీల పేరిట పిల్లలతో కూడా పిచ్చి పిచ్చి గెంతులు వేయించడం,వాటిపై సుదీర్ఘ విశ్లేషణాత్మక వ్యాఖ్యానాలూ వినిపించడం చూస్తూనే వున్నాం. దీనంతటిలోనూ ఆయన ప్రభావం సుస్పష్టం.ఇంతగా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఆయన ఆదాయం విలాస వైభవ జీవితం గురించిన కథలకు అంతేలేదు. నిజానికి ప్రజలకు కావలిసింది వారి కళ తప్ప ఖాతా పుస్తకాలు కాదు. కాని వ్యాపార వ్యవస్థలో క్రికెట్ ఆటగాడైనా కిక్కెక్కించే పాటగాడైనా రేటును బట్టే ప్రచారం. కళాకారుల ప్రసిద్ధికి ఇవన్నీ కొలబద్దలు కావడం కూడా మార్కెట్ సంసృతి విశ్వరూపానికి నిదర్శనం.
పాల్ రాబ్సన్ వంటి నల్లజాతి గాయకులు, మహమ్మదాలీ వంటి క్రీడాకారుల జీవితాలకు భిన్నమైన ధోరణి జాక్సన్‌ది. నల్లజాతి గుండెచప్పుడుగా మొదలైన మైఖెల్ దేహ వర్ణంతో సహా శ్వేతజాతి ఆధిపత్య సాంసృతిక ప్రతీకగా మారిపోవడం వెనక ఒక పెద్ద సామాజిక సందేశమే వుంది. చివరి దశలో ఆయన ఎదుర్కొన్నసమస్యలూ, సంక్షోభాలూ కూడా కళారంగంలో చొరబడిన కాలుష్యాన్ని పట్టి చూపిస్తాయి. దీనంతటికీ వ్యక్తిగతంగా ఆయన బాధ్యుడు కాదు. అయితే నమూనాగా నిల్చి పోయాడన్నది నిజం.పాశ్చాత్య దేశాల విశృంఖలత్వానికి జాక్సన్ ఒక ప్రతీక. దానికి తనే ప్రచారమిచ్చాడు.విపరీత ప్రచారమిచ్చే మీడియానే వికృత కథనాలను కూడా విస్త్రతంగా వ్యాపింప చేయడం ఈ సంసృతిలో భాగం. జాక్సన్ ప్రతి కదలికనూ వెంటాడి వేటాడి కథలల్లి కాసులు కురిపించుకోవడం ఇందుకు పరాకాష్ట.
జాక్సన్ జీవితంలోని అసహజత్వానికి ఈ అసహజ అవాంఛనీయ సంసృతికి చాలా సంబంధం వుంది. బాదాకరమైనా చెప్పుకోక తప్పని నిజమిది. చెవులు చిల్లులు పడే శబ్దాన్ని చేసే మెగాస్పీకర్లు కళ్లు మిరుమిట్లుగొల్పే విద్యుద్దీపాలు వేదికపై ఆయన విగ్రహాన్ని వైభవాన్ని అనేక రెట్లు పెంచి చూపించాయి. ఇదో కళాత్మక ప్యాకేజి తప్ప కేవలం కళ కాదు.సంగీతం నాట్యం కంటే సాంకేతిక ఇంద్రజాలానిదే ఇక్కడ ఆధిక్యత. పెప్సీ ఉత్పత్తులకైనా ప్రత్యేక సంచికల అమ్మకానికైనా ఆకర్షణగా జాక్సన్ అక్కరకు వచ్చాడు. కథల్లో దురాశకు ప్రతిరూపాలైన రాజుల్లాగా మరుగుదొడ్లను కూడా బంగారు తాపడం చేయించుకుని అదో ప్రచారం పొందాడు. ఇదంతా అయ్యాక నల్ల రంగును భరించడం కష్టమై పోతుంది. దాన్ని వదిలించుకోవాలి. అందుకే అత్యాధునిక శస్త్ర చికిత్స. దానికి మరేదో కారణం చెప్పినా ఈ ఆకర్షణ కోణం కాదనలేని సత్యం. అంటే మనం మనంగా మనిషి మనిషిగా మన్నన పొందడం కాదు. వేషము మార్చెను భాషను మార్చెను అసలు తానే మారెను అన్నట్టుగా మారిపోవడం! అయినా అతని ఆరాటం తీరలేదు. అలా తీరదు కూడా. మన దేశంలో కూడా డబ్బు వుంటే చాలు శరీరాన్నే మార్చుకోవచ్చన్న ప్రచారాలు మహా జోరై పోయాయి. మధ్య తరగతి మనుషులు కూడా ఈ మోజులో తమను తాము కోల్పోతున్నారు. జుట్టు తెల్లగా వుంటే మొహంపై మొటిమలు మొలిస్తే ముడుతలు వస్తే జీవితమే వృధా అన్నంత నిరాశ. దాన్ని పారదోలడానికి సౌందర్య చికిత్సలు, సాధనాలు! పాలిపోయిన మొహంతో ప్రాణం లేని బొమ్మలా జాక్సన్ ముంబాయిలో చేసిన విన్యాసాలను అప్పట్లొ జానీలివర్ అద్భుతంగా అనుకరించి హాస్యం చేశాడు.చనిపోయాక పదే పదే వేస్తున్న పాత క్లిప్పింగులలో నల్లవజ్రంలా వున్న జాక్సన్‌కూ ఆఖరి దశలో ఆయన పాలిపోయిన ప్రతిరూపానికి పోలికెక్కడీ అందుకే ఆయన విఖ్యాతిలోనూ విషాదాంతంలోనూ కూడా పెద్ద సందేశం వుంది.
జాక్సన్ మరణానంతరం కూడా రోజుకో కథ. ఆయన కుటుంబం, సంబంధాలు, పిల్లలు, స్వలింగ సంపర్కాలు ఇలాటివాటినే ప్రపంచమంతా వెదజల్లుతున్నారు. ఆయన హత్యకు గురైనాడని దాదాపు ఖాయంగా చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు తేల్చవలసిందే. దోషులను శిక్షించవలసిందే. నిజమైనా ఇందులో పెద్దగా చెప్పుకోవలసిందేమిటన్నది మరొకటి. ప్రపంచాన్ని ఉర్రూతలూపిన ఆయన కళా ప్రతిభ తప్ప కళంకితమైన వ్యక్తిగత పోకడలు కాదు. కాని వాటితోనే వూదరగొట్టడం హీనమైన అభిరుచులను అందుకోవడానికి తప్ప మరెందుకు పనికి వస్తుంది?జాక్సన్ కోసం విలపించిన వారు,గుండెలు బాదుకుని ఏడ్చిన వారు ఆయన కళా ప్రతిభను కదా ఆరాధించింది? దాన్ని కాస్తా పక్కనపెట్టి ఆయన ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడో ఆయన పిల్లలు ఆయనకు పుట్టారో లేదో వీటిపై విభిన్న కథనాలలో ముంచి తేల్చడం ఎవరి కోసం? ఇలాటి కథలు చెప్పుకోవడానికి జాక్సన్ అయినా జాంబవంతుడైనా తేడా ఏముంటుంది?అంటే సందర్భం ఏదైనా సదరు వ్యక్తి ఎవరైనా సంసృతి మార్కెట్‌లో సరుకుగా ఏది చలామణి అవుతుందన్న ఆలోచన తప్ప మరొకటి వుండనే వుండదు.చావైనా బతుకైనా ఈ వేటలో ఒకటే. సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది , తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు అన్న శ్రీశ్రీ శైలికి భిన్నంగా కొందరిని మహాకర్షనీయులుగా చేసి ఆ గోప్ప వారి చెత్త కబుర్లలో ముంచెత్తడం ఒక వ్యాపార సూత్రం. గతంలో రాజకుమారి డయానా ప్రమాద మరణం సందర్బంలో ప్రపంచ మీడియా పేపరాజ్ఞి గురించి పశ్చాత్తాపం ప్రకటించింది. ఆమె వర్ధంతి నాటికి బ్రిటిష్ మీడియా అధికారికంగానే ఆత్మ విమర్శ చేసుకుంది.క్షమాపణలు చెప్పింది. కాని ఫలితమేమిటి? జాక్సన్ విషయంలో ఆ వికృతం మరింత ఘోరంగా అక్షరాలా పైశాచికంగా పునరావృతమవుతున్నది.ఆయన ఆత్మను చిత్రించామని ఎవరో విడియో చిత్రాలు విడుదల చేస్తే విశ్వవ్యాపితంగా ప్రసారం చేయడం విజ్ఞతనూ విజ్ఞానాన్ని ఎగతాళి చేయడమే. నేటి సాంకేతిక విజ్ఞానంతో ఇలాటి చిత్రాలు తయారు చేయడం చాలా తేలికని అందరికీ తెలుసు.నిజానికి జాక్సన్ ప్రదర్శనలలో ఇంతకన్నా విచిత్రాలనే చూపించాడు. కాకపోతే అది కల్పన అని మనకు తెలుసు. ఇప్పుడు ఆ సాంకేతిక ఇంద్రజాలంతో ఆయన బతికున్నట్టు చూపిస్తున్నారంటే ఎంతటి బరితెగింపు? శాస్త్ర సాంకేతిక విజ్ఞానం స్వేచ్చా స్వాతంత్రాలు తమ స్వంతమైనట్టు చెప్పుకునే అమెరికా మీడియా పోకడలు అసహ్యం పుట్టిస్తాయి. ఉద్వేగాలతో వీలైనంత ఎక్కువ స్థాయిలో ఎక్కువ కాలం వ్యాపారం చేసుకోవడం తప్ప వాటికి వాస్తవాలతో నిమిత్తం వుండదు. తన పిల్లలను జాక్సన్ పిల్లలుగా ప్రచారం చేశానని హత్యారోపణలు ఎదుర్కొంటున్న ఆయన వ్యక్తిగత వైద్యుడు చెప్పడంలోనూ దాగి వుండేది ప్రచారం ద్వారా ఎక్కువ సొమ్ములు రాబట్టవచ్చునన్న అంచనానే.నీ గురించి మంచో చెడో ప్రచారం జరగడం మేలు అన్నది పాశ్చాత్య మీడియా ప్రధాన సూత్రం. దాని వికృత విశ్వరూపమే జాక్సన్ మరణానంతర విపరీత కథనాలు, ఆత్మ సందర్శనాలూ!
గొర్రెల మందలో ముందు ఉన్న గొర్రె ఎటువైపు వెళ్తే వెనకాల ఉన్న గొర్రెలు కూడా అటువైపు వెళ్తాయి. పత్రికలు ఏ సినిమా స్టార్ కీ, పాప్ సింగర్ కీ అనుకూలంగా బాకా ఊదితే జనం ఆ సినిమా స్టార్ కీ, పాప్ సింగర్ కీ వీరాభిమానులుగా మారుతారు.
రిప్లయితొలగించండిWonderful analysis. ఇప్పటివరకు మీడియాలో ఎన్నో "శవ/మరణ వ్యాపారాలు" జరిగినా ఈ స్థాయిలో ఎన్నడూ జరగలేదు.
రిప్లయితొలగించండిపేదవాళ్ళు శవాల మీద చిల్లర ఏరుకుంటారు. కార్పరేట్ పత్రికల వాళ్ళు శవాల మీద మిలియన్లు ఏరుకుంటారు.
రిప్లయితొలగించండి