పురాణ గ్రంథాలన్నీ కథలేనని, వాస్తవ చరిత్రలు కావని నాస్తికులు, హేతువాదులు అంటున్నారు. మరి భారత భూభాగానికి, శ్రీలంకకు మధ్య ఉన్న రామసేతు మాటేమిటి? ఆ ఆనకట్టలోని రాళ్లు నీటిపైన తేలాడుతున్నాయి. దీనికి వారేమంటారు? - ఓ బ్లాగరి ప్రశ్న.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య గారి సమాధానం...
ప్రజల విశ్వాసాలను మనమందరం గౌరవించాలి. వారి వారి ఆలోచనా ధోరణుల్ని వారి విచక్షణకు వదిలేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రథమధర్మం. అలాగే ఒకరి విశ్వాసాలు మరొకరి విశ్వాసాలకన్నా గొప్పవని అనుకోవడం కూడా సబబు కాదు. మతప్రసక్తి లేని లౌకికరాజ్యం మనది. అయితే వ్యక్తులు తమ నమ్మకాలను, విశ్వాసాలను వాస్తవాలుగా ప్రచారం చేసుకోవాలంటే వారు ఋజువులు చూపడానికి కూడా సిద్ధపడాలి. 'నేను మహా గొప్పవాణ్ణి' అని నేననుకున్నంతవరకూ ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ 'నేనే మహా గొప్పవాణ్ణి' అని వీధుల్లోకి వచ్చి కనిపించినవారికల్లా బడాయిపోతున్నారనుకోండి. అప్పుడు ఆసక్తి కలిగిన అమ్మాయో.. అబ్బాయో.. పెద్దో.. చిన్నో.. ఎవరైనా 'నీ గొప్పతనమేంటో ప్రదర్శించు చూద్దాం' అని అడిగే హక్కు ఉంటుంది. అలాగే ఆ గొప్పతనం ఏమిటో ప్రదర్శించాల్సిన బాధ్యత కూడా నామీద ఉంటుంది. భారత, రామాయణం, ఖురాన్, బైబిల్ వంటి గ్రంథాలు చాలా గొప్పవి. అవి చదువుతుంటే ఎంతో ఆసక్తి, సంభ్రమం కలుగుతాయి. అద్భుత కావ్యాలుగా మనకు అనిపిస్తాయి. ఎందుకంటే అవి వేలాది సంవత్సరాలుగా ప్రజల జీవనవిధానాల్లో ఇమిడిపోయాయి. కళా దృక్పథం, వాంఙ్మయ సామర్థ్యం ఉన్న మహనీయులు ఎందరో ఈ గ్రంథాలను మరింత పరిపుష్టి చేశారు. పురాణగ్రంథాల్లో ఉన్న ప్రముఖవ్యక్తులు ఇక్కడ అదృశ్యమై అక్కడ ప్రత్యక్షమవుతారనీ, ఇంకా మరేవో మహత్తులు వారికి ఉన్నాయని ఆయా గ్రంథాల పాఠకులు వారిలో వారే అనుకుంటే అది వారి ఇష్టం. కానీ వారు సమాజం మధ్యలోకి వచ్చి ఇలాంటి కల్పనలు వాస్తవాలని వాదిస్తే.. 'అలా ఏ వ్యక్తీ అదృశ్యమై తిరిగి ప్రత్యక్షమైన దాఖలాలు ఎక్కడా ఎప్పుడూ ఎవరూ చేయలేరని' వాదించే హక్కు ఇతరులకు ఉంటుంది. 'కేవలం వినడం వరకే నీ పని, ప్రశ్నించే హక్కు నీకు లేదు' అని ఎవరైనా అంటే అది న్యాయం కాదు. చిటికెన వేలితో పెద్ద పర్వతాన్ని నిలబెట్టగల శక్తివంతుడు, అరచేతిలోంచి అదే పనిగా తానులకొద్దీ చీరలను కుళాయిలో నీళ్లులాగా తీసుకురాగల మహిమాన్వితుడు మానవ చరిత్రలో ఎక్కడా లేడు. మానవుడు ఈ భూమ్మీద పుట్టి ఇప్పటికి సుమారు 20 లక్షల సంవత్సరాలైనా రాత ప్రతుల ద్వారా సమాచారాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందజేసే సంఙ్మాయుత (coded communication) వ్యవస్థకు పదివేల సంవత్సరాలకు మించిన చరిత్ర లేదు. మానవులు సమూహాలుగా ఏర్పడి పాలకులు, పాలితులుగా మారిన రాజ్యవ్యవస్థ ఏర్పడి లక్ష సంవత్సరాలు కూడా కాలేదు. అంతకన్నా ముందు ఈ భూమిపై మానవులు సంచరించిన పద్ధతులు, ఆహారపు సేకరణ విధానాలు, కుటుంబవ్యవస్థ, ఉత్పత్తి సంబంధాలు, కళలు వంటి విషయాలు (నాగరికత) పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డాయి. వీటిని ఆధునిక శాస్త్రీయ పద్ధతులు ఆధారంగా రూపురేఖలు, వయస్సును తెలుసుకోగలుగుతున్నాం. ఆరీత్యా చూస్తే మానవసమాజంలో యుగాలు ఉన్నట్లు, ఒక్కో యుగంలో ఎవరో అవతార పురుషుడు వచ్చి సమస్త ప్రపంచాన్ని అద్భుత మహత్తులతో పాలించినట్లు ఎటువంటి ఆధారాలూ లేవు. రామాయణంలోని వ్యక్తులు, భారతంలోని వ్యక్తులు, భాగవతంలోని పాత్రలూ, బైబిల్, ఖురాన్ వంటి మతగ్రంథాల్లో ఉటంకించిన వ్యక్తులూ చరిత్రలో ఏమాత్రం లేరని మనం చెప్పలేము. ఆయా కాలాల్లో గొప్ప సమర్థులైన వీరులు, అందమైన స్త్రీలు, క్రూర బుద్ధులు ఉన్న మనుషులు ఇప్పటిలానే అప్పుడూ ఉండేవారు. మంచి, చెడుల మధ్య పోరాటం ఆయా కాల మాన పరిస్థితులు నిర్ధారించిన ధర్మాధర్మాల మధ్య ఘర్షణ, భూమి, నీరు, నివాసం వంటి ప్రకృతి వనరుల కోసం యుద్ధాలు జరిగాయి. సమాజంలో ఉన్న చెడును గుర్తించి దాన్ని నివారించడానికి ఉపదేశాలను చేసిన వారు కూడా ఉండేవారు. అటువంటి మహనీయులు మానవ సమాజానికి ఎంతో కొంత మార్గదర్శకత్వాన్ని చేకూర్చారు. అయితే చిరంజీవులుగా ఉండేవారు ఎవరూ లేరు 'జాత్యస్యః మరణం ధృవం' అన్నట్లే కౌసల్యకు జన్మించిన రాముడు, అంజనీపుత్రుడైన ఆంజనేయుడు, మేరీ మాతకు జన్మించిన ఏసుక్రీస్తు, దేవకీదేవికి జన్మించిన కృష్ణుడు ఇలా ఎవరైనా వారికి కూడా ఆ నియమం వర్తిస్తుంది. అయితే, క్రమేపీ అలాంటి మంచివారిని, వీరులను, సమర్ధవంతమైన పాలకులను స్మరించుకునే సందర్భాలలో చరిత్ర గతిలో వారికి ఉన్న శక్తులకు మించి అధికశక్తులను ఆపాదించారు. మానవతీతు లుగా వారిని మలిచారు. ఆ పేరు చెప్పి ప్రజల్లోకి వారి అంశాలు, దైౖవాంశ సంభూతులం మేమే అంటూ పాలకులు ప్రజల్లో ప్రశ్నించకూడని విశ్వాసాలను నింపారు. మతభావాలను నాటారు. వాటిని యథాశక్తి పోషించారు, పోషిస్తున్నారు.
భూమ్మీద సహజంగా దొరికే ఏ రాయికైనా నీటి సాంద్రత (density) కన్నా ఎక్కువ సాంద్రత ఉంటుంది. కేవలం అగ్నిపర్వతాల నుంచి జాలువారే లావా ఎండిపోతే ఏర్పడే రాళ్లకు మాత్రమే నీటికన్నా తక్కువ సాంద్రత ఉంటుంది. భూమిలోపల అరుదుగా లభించే కొన్ని జియోలైట్లకు కూడా కొంతలో కొంత ఈ ధర్మం ఉంది. కృత్రిమ పద్ధతుల ద్వారా కూడా నేడు నీటికన్నా తక్కువ సాంద్రతగల కఠినమైన ప్రత్యేక కంపోజిట్లను తయారుచేస్తున్నారు. ఒక వస్తువు సాంద్రత నీటి సాంద్రతకన్నా తక్కువ ఉంటే ఆ వస్తువు నీటిపై తేలుతుంది. ఎక్కువగా ఉంటే అది మునుగుతుంది. సమానంగా ఉంటే నీటి మధ్యలో తేలకుండా, మునగకుండా ఉంటుంది. ఈ విషయాల్ని మీరు మీ సైన్స్ పాఠాల్లో (ప్లవన సూత్రాలు అనే శీర్షిక కింద) చదువుకునే ఉంటారు. మీరన్న రామసేతు నిర్మాణంలో సముద్రపు నీటిమీద తేలియాడే రాళ్లను వాడినట్లు అర్థం చేసుకోవాలి. కానీ తమాషా ఏమిటంటే రామాయణ గ్రంథం ప్రకారం అవి మునిగే రాళ్లేనని ఒక వానర నాయకుడు వాటిని చేత్తో స్పృశించగానే అవి నీటిపై తేలియాడే లక్షణాలను సంతరించుకున్నాయని చెపుతారు. అలాంటి ధర్మాలున్న రాళ్లు చరిత్రలో ఎక్కడా లేవు. అలాంటి ఊహలు కేవలం కథల్లో మాత్రమే సాధ్యం. ఇప్పుడు రామసేతు అనే పేరుతో ఉన్న భూభాగం సముద్రం అడుగున ఉంది. అది నీటిపైన తేలియాడుతూ లేదు. భారత భూభాగానికి, శ్రీలంకకూ మధ్య తక్కువ ఎత్తుగల పర్వతశ్రేణి అది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సంభవించిన ఖండాంతర చలనం (continental drift) వల్ల భూభాగాలు విడివిడిగా చీలి సముద్రజలాల మధ్య ద్వీపాలుగా, ద్వీపకల్పాలుగా ఉంటున్నాయి. అలాంటి ఖండాంతర చలనంలో శ్రీలంక భూభా గం భారత భూభాగం నుండి విడివడినప్పుడు ఏర్పడిన పర్వతశ్రేణే ఈ రామసేతు. కాబట్టి ఈ రామసేతు ఓ ప్రకృతిసిద్ధమైన సహజ నిర్మాణ మేనని, ఎవరో పనిగట్టుకొని నిర్మించిన వారధి కాదని భూగర్భ పరిశో ధనలు తిరుగులేని సాక్ష్యాలతో ఋజువు చేశాయి. మహత్తులున్న వ్యక్తులు చరిత్రలో లేరని, కేవలం కథల్లో మాత్రమే ఉండగలరని మనం భావించినప్పుడు పురాణగ్రంథాలను కథలుగా మాత్రమే చూడగలుగుతాం.