3, ఆగస్టు 2009, సోమవారం
విమాన కంపెనీల వాదములో నిజమెంత?
వారేమీ వ్యాపారలావాదేవీల్లో అనుభవంలేని కుర్ర వ్యాపారవేత్తలు కాదు. ఇతర రంగాలలో లాభాలు పిండుకుంటూ కొత్తరంగాలకు విస్తరించి తమ సంపద సామ్రాజ్యాలను పెంచుకోవాలన్న బడావ్యక్తులు. వీరిలో చీప్‌లిక్కర్ నుంచి ఖరీదైన స్కాచ్‌వరకు అన్ని రకాల మద్యం తయారు చేసి విక్రయించే విజయమాల్య ఒకరైతే. విమాన టిక్కెట్లు అమ్మే ఏజన్సీతో జీవితాన్ని ప్రారంభించి ఏకంగా విమానకంపెనీకే అధిపతి అయిన నరేష్ గోయల్ మరొకరు. కింగ్‌ఫిషర్, జట్‌ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్, ఇండిగో,గోఎయిర్ కంపెనీల యజమానులతో కూడిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫెడరేషన్ ఇంధనం పన్ను, విమానాశ్రయాల వినియోగ రుసుములను తగ్గించకపోతే ఈనెల 18న ఒక రోజు సమ్మె చేస్తామని ప్రభుత్వానికి శ్రీముఖం జారీ చేసింది. ఇతర రంగాలలోని ప్రైవేటు కంపెనీలు ఉద్దీపన పేరుతో రాయితీలు పొందుతున్నపుడు తాము మాత్రం ఎందుకు వెనకపడాలని ఈ కంపెనీల యజమానులు ప్రభుత్వంపై బెదిరింపులు, వత్తిడికి పూనుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎలాంటి ఉద్దీపన పథకాన్ని ఆశించవద్దని, సమ్మె చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ హెచ్చరించారు. పెరిగిన ఇంధన ధరలతో వైమానికరంగం తీవ్రంగా గాయపడిందని, తాము దయా ధర్మాలు అడగటం లేదని పన్నులు, చార్జీలను హేతుబద్దం చేయాలని మాత్రమే కోరుతున్నామని కంపెనీల ప్రతినిధులు కింగ్‌ఫిషర్ విజరు మాల్య, జట్ ఎయిర్‌వేస్ నరేష్ గోయల్ అంటున్నారు. కావాలంటే మాకంపెనీల్లో ప్రభుత్వానికి వాటాలిస్తామని చెబుతున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో ధరలు తగ్గాయంటే అవి విమానఛార్జీలు మాత్రమే. విమానయాన రంగంలో ప్రైవేటు కంపెనీలకు అవకాశం ఇవ్వాలని వత్తిడి తెచ్చిన వ్యాపారవేత్తలు తీరా అనుమతించిన తరువాత ప్రభుత్వరంగ విమాన సంస్థను దెబ్బతీసేందుకు చేయని యత్నం లేదు. ప్రైవేటు కంపెనీలు ప్రయాణీకులను తమవైపు రాబట్టుకొనేందుకు పోటీబడి విమాన ఛార్జీలను తగ్గించాయి. ఛార్జీలు తీసుకొని ఇంధనఛార్జీలు, పన్నులను మాత్రమే వసూలు చేసి విమానాలకు ప్రయాణీకులను అలవాటుపడేట్లు చేశారు. ఐటి రంగంలో పనిచేసే అనేక మంది విమానం మినహా ఇతరంగా ప్రయాణించటం పరువు తక్కువగా భావించారు. దాన్ని ప్రైవేటు విమానకంపెనీలు సొమ్ము చేసుకున్నాయి. ఇప్పుడు ఐటి బుడగ పేలిపోవటంతో పాటు అనేక రంగాలపై ప్రపంచ ఆర్థిక మాంద్య ప్రభావం పడింది. విమానాలు ఎక్కేవారు తగ్గిపోయారు. కనుక తాము చార్జీలు పెంచకుండా, తమ లాభాలు తగ్గకుండా తమకు రాయితీలు కావాలని విమాన కంపెనీల యజమానులు వత్తిడి తెస్తున్నారు. సామాన్యులు ఎక్కే ఆర్‌టిసి బస్సులకు వినియోగించే డీజిల్, ఇటీవల విపరీతంగా పెరిగిన కందిపప్పు మీద పన్ను తగ్గించటానికి ససేమిరా అన్న ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ మిగతా రాష్ట్రాలతో పోటీబడి విమాన ఇంధనంపై పన్ను తగ్గించారు. అందువల్లనే సామాన్యులు వాడే పెట్రోలు లీటరు రు.50 అయితే విమానాల పెట్రోలు రు.36కే పోస్తున్నారు. అయినా ధర ఇంకా ఎక్కువగా ఉందని, మాదగ్గర వసూలు చేసిన అధిక సొమ్ముతో సామాన్యులకు కిరోసిన్ సబ్సిడీ ఇస్తున్నారని విమాన కంపెనీల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. మా కంపెనీలు లేకపోతే ప్రయాణీకుల డిమాండ్‌ను ఎలా తట్టుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. నాకోడి కూయకుండా ఎలా తెల్లవారుతుందో చూస్తామని వాదిస్తున్నట్లుంది. విమానాశ్రయాలు ప్రైవేటురంగంలో ఏర్పాటు చేయటం అనర్దదాయకం అని ప్రభుత్వరంగ విమాన సంస్థల సిబ్బంది ఆందోళన చేసినపుడు విజయమాల్య వంటి పెద్దలు ప్రైవేటు రంగానికే మద్దతుపలికారు. హైదరాబాదులోని ప్రైవేటు విమానాశ్రయంలో వసూలు చేస్తున్న వినియోగరుసుములను చూసి విమానాశ్రయం బాగానే ఉందిగానీ అక్కడ వసూలు చేసే రుసుముల్నే భరించలేం అని అనేక మంది గుండెలు బాదుకుంటున్నారు. తమకు దెబ్బతగలనంత వరకు వాటి గురించి నోరుమెదపని విమాన కంపెనీలు ఇప్పుడు తమకే ఆ సెగ తగలటంతో నానాయాగీ చేస్తున్నాయి. ప్రభుత్వం నియంత్రణ ధరల విధానానికి స్వస్తిపలకాలని చెప్పిన వారే ఇప్పుడు తమకు కావాల్సిన ఇంధనానికి దానిని వర్తింపచేయాలని, నిత్యావసర సరకుగా పరిగణించాలని కోరటం దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా ఉంది. వారి డిమాండ్ ఏవిధంగా చూసినా సమర్థనీయం కాదు. తమకు గిట్టుబాటుగాక పోతే ధరలు పెంచుకొనే స్వేచ్ఛవారికి ఎలాగూ ఉంది. తక్కువ మందే ఎక్కుతారనుకుంటే విమానాలు, ప్రయాణాల సంఖ్యను తగ్గించుకోవచ్చు. అంతే తప్ప విమానాలకు భారీ రాయతీలిచ్చి బడాబాబులను దర్జాగా తిప్పే శక్తి మన పన్ను చెల్లింపుదార్లకు లేదు, అలా రాయితీలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. విమాన ఇంధనం ధర లీటర్ 70 రూపాయలు ఉన్నపుడు మౌనంగా ఉన్న ప్రైవేటు కంపెనీలు ఇప్పుడు 36-45 రూపాయలకు తగ్గినపుడు ఆందోళన హెచ్చరిక చేయటం ఎందుకన్న ప్రశ్న అనేక మందిలో ఉదయిస్తోంది. ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వ విమాన సంస్థ నష్టాలపాలైంది. దానిని ఆదుకొనేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్నది. కనుక పనిలో పనిగా తాము కూడా కొన్ని రాయితీలు సాధించుకోవాలని ప్రైవేటు కంపెనీలు పూనుకున్నాయి. మనిషికి రోగనిరోధక శక్తిలేనపుడు ఎన్నిటానిక్కులు ఇచ్చినా ఫలితం ఉండదు. అలాగే సమాజంలో కొనుగోలు శక్తి తగ్గినపుడు కంపెనీలకు ఉద్దీపన పథకాలు ఇచ్చి ప్రయోజనం లేదు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచకుండా కంపెనీలకు రాయితీలవ్వడం వల్ల జనానికి కలిగే లాభమేమీ లేదు. ప్రభుత్వరంగ సంస్థలను భిన్న దృష్టిలో చూడాలి. అవి ప్రజల ఆస్తులు.వాటికి లాభాలు వచ్చినపుడు జనానికి పంచాయి. అందువలన నష్టాలు వచ్చినపుడు వాటిని ఆదుకోవటం ప్రభుత్వ బాధ్యత. రాయితీలు తీసుకొని కంపెనీలను దివాలా తీయించి మదుపుదార్లను ముంచిన ప్రైవేటురంగ పెద్దలెందరో మన కళ్లముందున్నారు. అందువలన ప్రైవేటు విమానయాన కంపెనీలు తెచ్చే వత్తిళ్లకు ప్రభుత్వం లొంగనవసరం లేదు. వాటికి జనం సొమ్మును కట్టబెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు.
కండకావరం తప్ప మరేమీ కాదు
రిప్లయితొలగించండిసరిగ్గా చెప్పారు.
రిప్లయితొలగించండి