వీలుంటే నా నాలుగు లంకెలు ...

5, జులై 2009, ఆదివారం

శాస్త్రీయత ముసుగుతో దోపిడి - కృత్రిమ వర్షాలు

4 వ్యాఖ్యలు
శాస్త్రీయత లేకున్నా ఐదేళ్లలో 150 కోట్లు ధారాదత్తం, ఈ ఏడాది 30 కోట్లు
మేఘమధనం టెండర్‌ను ఈసారి కూడా అగ్ని ఏవియేషన్స్‌ సంస్థే దక్కించుకోనుంది. నాలుగైదేళ్లుగా ఆ సంస్థపై ఎన్ని ఆరోపణలొచ్చినప్పటికీ దానికే కాంట్రాక్టును కట్టబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్లోబల్‌ టెండర్లు పిలిచామంటున్నా ప్రభుత్వం రూపొందించిన నియమాలు అగ్నికి అనుకూలంగా రూపొందించినట్లు సమాచారం. అందువల్ల ప్రతి ఏడాదీ కాంట్రాక్టును ఆ సంస్థ స్వంతం చేసుకుంటున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. అగ్నిని దృష్టిలో పెట్టుకొనే నిబంధనలు తయారు చేస్తున్నారన్న విమర్శలొచ్చాయి.
కృత్రిమ వర్షాలు పడతాయన్న గ్యారంటీకానీ, అసలా విషయానికి సరైన శాస్త్రీయతకానీ లేవని నిపుణులంటున్నారు. కొన్నేళ్లుగా మేఘమధనం చేస్తున్నా దానివల్ల ఎక్కడ వర్షాలు పడ్డాయో స్పష్టంగా నిరూపితం కాలేదు. ఫలానచోట వర్షం కురిసిందని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అటువంటి వ్యవస్థ మనవద్ద లేదు. అయినా కొన్ని సంవత్సరాల్లో మధనానికి 150 కోట్లు ఖర్చు చేసింది. కోట్ల రూపాయల ప్రజాధానాన్ని 'అగ్ని'కి తగలేస్తోంది. ఈ సీజన్‌లో కృత్రిమ వర్షాలు కురిపించడానికి బడ్జెట్‌లో 30 కోట్ల రూపాయలు కేటాయించారు. వాటిని ఖర్చు చేయడానికి 'అగ్ని'ని ఎంచుకున్నారు.
ఆ కంపెనీకే ఎందుకు?
ఖరీఫ్‌, రబీ సీజన్లలో మేఘమధనం జరపడానికి గ్లోబల్‌ టెండర్లు పిలిచారు. జూన్‌ 29న టెండర్లు తెరిచారు. మూడు కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. అగ్ని ఏవియేషన్స్‌, శ్రీ ఏవియేషన్స్‌, సైకాన్‌ కనస్ట్రక్షన్స్‌ టెండర్లు వేశాయి. ఆ మూడింటిలో అగ్నిని ఎంపిక చేశారని తెలిసింది. ఈ నెల 15 నుండి మధనాన్ని ప్రారంభిస్తామని వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డి ప్రకటించారు. జెఎన్‌టి యూనివర్శిటీ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. అగ్నిపై గతంలో పలు ఆరోపణలొచ్చాయి. సరిగ్గా మధనం చేయకుండా కోట్ల రూపాయల బిల్లులు స్వాహా చేసేందుకు సచివాలయంలోని ఒక ఐఎఎస్‌ అధికారికి గతంలో లంచం ఇవ్వడానికి ప్రయత్నించినట్లు వార్తలొచ్చాయి. ఆ పని చేసిన అగ్ని ప్రతినిధిని ఆ అధికారి తన కార్యాలయం నుండి మెడపట్టి గెంటించారు. ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా రెండు మూడేళ్లు ఆ సంస్థే మధనం చేసింది. అనావృష్టి ప్రాంతాల అభివృద్ధి శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పుడు దాన్ని అప్పట్లో మారెప్పకు అప్పగించారు. మధనం ఆ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ వేరే శాఖ మంత్రి పెత్తనం చేశారని మారెప్ప గతంలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అగ్నితో నేరుగా ఒక కేబినెట్‌ మంత్రికి సంబంధాలున్నాయని ఆయన పలుమార్లు ఇష్టాగోష్టిలో చెప్పారు. ఇప్పుడు కూడా అదే మంత్రి అగ్నికి టెండర్‌ ఇప్పించడానికి లాబీయింగ్‌ చేశారని సమాచారం. ఆ సంస్థకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారని తెలిసింది. ఆసియాలో మధనం చేయగల సత్తా, అందుకు అవసరమైన మౌలిక వసతులు దానికే ఉన్నాయని, అందువల్ల అగ్ని మళ్లీ ఎంపికైందని ప్రచారంలో పెట్టారు.
అన్నీ అనుమానాలే
మధనంపై ముఖ్యమంత్రి ఇటీవల ఒక సమావేశం నిర్వహించారు. దానికి శాస్త్రవేత్తలు, నిపుణులు, రైతుసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రపంచంలో ఎక్కడా కృత్రిమ వర్షాలు లేవని తేల్చారు. పడుతున్నవాటి స్థాయిని 10 నుండి 15 శాతం వరకూ పెంచే పరిజ్ఞానం మాత్రమే కొంతమేరకు అభివృద్ధి చెందిందని నిపుణులు పేర్కొన్నారు. మధనానికి అనుకూలమైన మేఘాలు ఉంటేనే ఆ మేరకైనా సాధ్యమవుతుంది. ఉష్ణవాహక మేఘాలను రాడార్‌ సాయంతో గుర్తించి ప్రయోగం చేస్తున్నారు. శీతల మేఘాలను మధించే టెక్నాలజీ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ప్రయోగం చేసిన మేఘం ఫలానచోట వర్షిస్తుందన్న గ్యారంటీలేదు. అయినా గడచిన ఐదేళ్లలో 150 కోట్లు మధనానికి ఖర్చు చేశారు. అగ్నికి ధారాదత్తం చేశారు. క్లవుడ్‌ సీడింగ్‌వల్ల సీజన్‌లో సగటున 17 శాతం అదనంగా వర్షాలు పడ్డాయని ప్రచారం చేసినా ఆ లెక్కకు సరైన శాస్త్రీయతలేదు. ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న శ్రీకాకుళం-ఆదిలాబాద్‌ ప్రాంతంలో సాలీన 1100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతున్నందున ఆ ప్రాంతంలో మధనంవల్ల ప్రయోజనంలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో కొంత ఉపయోగం ఉండవచ్చు. అగ్ని ఏనాడూ చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా మధనం చేయలేదని ఆరోపణలున్నాయి. ఏకకాలంలో రెండు మూడు విమానాలను ఉపయోగిస్తామని ముందు చెప్పినా అవి పూర్తిస్థాయిలో ఏనాడూ అందుబాటులోకి రాలేదు. మూడు రాడార్‌ స్టేషన్లు కావాలని అంటున్నా అతీగతిలేదు. ముఖ్యంగా అనంతపురంలో ఒకదాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. నిధుల సమస్య చెప్పనే అక్కర్లేదు. ఎన్ని ఏర్పాట్లు చేసినా ఆర్థికశాఖ కొర్రీలతో సమయానికి నిధుల్లేక అదనుకు ప్రయోగం జరగట్లేదు. ఏవియేషన్‌ మంత్రిత్వశాఖ నుండి విమానం ఎగరడానికి సకాలంలో అనుమతి రావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా దరఖాస్తు చేయట్లేదు. ఇన్ని ఇబ్బందులున్నా ఐదేళ్లకూ ఒకేసారి టెండర్లు పిలవాలని సిఎం అధికారులకు సూచించడం గమ నార్హం. సీజన్‌ ముంచుకు రావడంతో ఈ ఒక్క ఏడాదికి హడా విడిగా టెండర్లు పిలిచారు. వర్షాల కోసం వరుణ యాగాలు, మధనం అంటున్నా రూపాయి కూడా నిధులు విడుదల కాలేదు. గత ఏడాదికి చెల్లించాల్సిన 30 కోట్లలో ఒక్క రూపాయి ఇవ్వలేదని, ఆర్థిక శాఖలో ఫైలు పెండింగ్‌లో ఉందని అధికా రులు తెలిపారు. బకాయిలతో పాటు, కొత్త టెండర్‌కు అడ్వాన్స్‌ చెల్లింపుపై ఆర్థికశాఖ ఆమోదం లభించలేదు. ఇవన్నీ పూర్తయ్యే సరికి సీజన్‌ ముగుస్తుందని, మంచి వర్షాకాలంలో ప్రయోగం చేసి తమ వల్లే వర్షాలు పడ్డాయని ప్రచారం చేసి అగ్నికి కోట్ల రూపాయలు అప్పగిస్తున్నారని విమర్శలొస్తున్నాయి.

4, జులై 2009, శనివారం

రాష్ట్రాల హక్కులను హరించే కేంద్ర వైఖరి

2 వ్యాఖ్యలు
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌ తన మంత్రిత్వ శాఖకు చెందిన 100 రోజుల ప్రణాళికను విడుదల చేస్తూ అదే సమయంలో పలు ప్రకటనలను చేశాడు. ఆయన ప్రతిపాదించిన చర్యల్లో ఒకటేమంటే 10వ తరగతి పరీక్షలను రద్దు చేయాలనటం లేదా దానిని ఐచ్చికంగా ఉంచటం. అదేవిధంగా, విశ్వవిద్యాలయాలలో ప్రవేశార్థం ఒకే బోర్డు కింద అఖిల భారత స్ధాయిలో 12వ తరగతి పరీక్షల నిర్వహణ. అంతకుముందు ఆయన 'ఉన్నత విద్య పునరుద్ధరణ-పునరుజ్జీవం' అన్న అంశంపై యశ్‌పాల్‌ కమిటీ సమర్పించిన నివేదికలోని సిఫార్సుల అమలు గురించి పలు వ్యాఖ్యలు చేశారు.

పాఠశాల విద్య ప్రధానంగా రాష్ట్రాలకు సంబంధించిన అంశం. ఎమర్జన్సీ సమయంలో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. తదనంతర కాలంలో ఈ రంగానికి సంబంధించి పలు చర్యలను చేపట్టటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యా రంగాన్ని కేంద్రీకృతం చేసింది. రాష్ట్రాలకు దీనిలో నామమాత్రపు జోక్యం మాత్రమే మిగిలింది. అయితే పాఠశాల విద్యకు సంబంధించి ఆయా రాష్ట్రాల సామాజిక, సాంస్కృతిక, భౌగోళిక తదితర అంశాల ప్రాతిపదికపై పాఠ్యాంశాలను రూపొందించే విశిష్టమైన హక్కు రాష్ట్రాలకు ఉన్నది. రాష్ట్ర బోర్డుల ద్వారా పాఠశాల పరీక్షలు జరుగుతాయి. కనుక పరీక్షలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఏకపక్షంగా ప్రకటన చేయటమంటే, అది రాష్ట్రాల హక్కులను ఉల్లంఘించటం, పాఠశాల విద్యకు సంబంధించి రాష్ట్రాల అధికారాలను లాగివేయడమే అవుతుంది. అఖిల భారత స్ధాయిలో 12వ తరగతికి ఒకే బోర్డు అధ్వర్యంలో పరీక్షలను నిర్వహించటమంటే వివిధ రాష్ట్రాలలోని వైవిధ్యానికి పాతర వేయడమే అవుతుంది. ఆయా రాష్ట్రాలలో నెలకొన్న సంస్కృతికీ, పరిస్థితులకూ అనుగుణంగా పాఠశాల స్ధాయిలో విద్యా బోధనకుగాను రాష్ట్రాలకున్న స్వయం ప్రతిపత్తిని లాగివేయడమే అవుతుంది. ఈ ప్రతిపాదనలు ఆచరణలోకి వచ్చినట్లయితే పాఠశాల స్ధాయిలో రాష్ట్రాలకు ఎలాంటి పాత్రా లేకుండా పోతుంది.

3, జులై 2009, శుక్రవారం

నమ్మకాన్ని సొమ్ము చేసుకొంటున్న టాటా

3 వ్యాఖ్యలు

ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద వాణిజ్య సంస్థల్లో ఒకటైన టాటాగ్రూప్‌ గతకొద్ది వారాలుగా ఇంటిని చక్కదిద్దుకోవటానికి తీవ్ర ప్రయత్నాలు సాగించింది. 2006, 2007ల్లో టాటా మోటార్‌ కంపెనీ ఆంగ్లో-డచ్‌ స్టీల్‌ కంపెనీ 'కోరస్‌'ను, విలాసవంతమైన కార్ల బ్రాండు ''జగార్‌'', ''లాండ్‌ రోవర్‌''లను కొన్నది. టాటా గ్రూపు మోయలేని భారాన్ని నెత్తికెత్తుకొంటోందని ఆర్థిక నిపుణులు అప్పుడే వ్యాఖ్యానించారు. ఆటోమొబైల్‌ రంగం ఒడిదుడుకులకు గురవుతున్న సమయంలో ఈ బ్రాండ్లను కొనటానికి టాటాలు చెల్లించిన ధర ఎక్కువగా వుందన్న విమర్శలు కూడా వచ్చాయి.
అంతర్జాతీయ సంక్షోభంతో ఈ సంస్థలు నష్టాలు చవిచూడడంతో ఒక అంచనా ప్రకారం టాటా గ్రూపు అప్పు మొత్తం 2009 నాటికి లక్ష కోట్లు రూపాయలకు చేరింది. గత సంవత్సరం కంటె ఇది 30వేల కోట్లు ఎక్కువ. కోరస్‌, జగార్‌లు నష్టాలబారిన పడ్డాయి. వీటిని పూడ్చడానికి కొత్తగా నిధులు సమకూర్చు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో టాటాగ్రూపుపై వచ్చిన విమర్శలు సహేతు కమని తేలిపోయింది. కానీ అప్పట్లో టాటాలు ఈ విమర్శలను కొట్టివేశారు. మారిన ప్రపంచ పరిస్థితులను అర్థం చేసుకోలేకపోయారని, టాటా గ్రూప్‌ అంతర్గత శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారని చెప్పుకొన్నారు.

విమర్శకుల వాదనలను మీడియా, ప్రభుత్వం కూడా ప్రక్కన పెట్టింది. ఈ కొనుగోలును, దీనితో పాటు జరిగిన ఇతర విదేశీవ్యాపార సంస్థల కొనుగోలును మీడియా ఆకాశానికి ఎత్తింది. అంతర్జాతీయమార్కెట్‌లో భారతీయ కంపెనీల ప్రతిభాపాటవాలకు నిదర్శనంగా ఈ కొనుగోళ్లను చూపించారు. భారీగా వున్న విదేశీమారక ద్రవ్యనిల్వలు ప్రభుత్వానికి ధైర్యానిచ్చాయి. ప్రభుత్వం కూడా ఈ కొనుగోళ్ళకి ప్రోత్సాహానిచ్చింది. సరళీకృత ఆర్థిక విధానాల అమలు తరువాత ప్రభుత్వానికి, ప్రయివేటు పెట్టుబడికి పెరుగుతున్న సమన్వయానికి ఇది ఒక ఉదహారణ.


ఈ కొనుగోలు అనంతరం కొన్ని నెలలలోనే ప్రపంచ ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చింది. ఆటోమొబైల్‌, స్టీల్‌రంగాల్లో అమ్మకాలు, ఆదాయాలు అనుకున్నదానికంటే బాగా పడిపోయాయి. ఉన్న అప్పును తీర్చలేక రీఫైనాన్స్‌ చేయించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా మే 2009 నాటికి టాటాగ్రూపు జగార్‌ కోసం రూ.15000కోట్లు , కోరస్‌ కోసం రూ.22500 కోట్లు అదనంగా అప్పు చేయాల్సి వచ్చింది. గతవారం వరకు రీఫైనాన్స్‌ విధివిధానాల గురించి చర్చలు జరిగాయి. ఈ చర్చలను పరిశీలిస్తే టాటా గ్రూపు తిమ్మిని బమ్మిగా చేయడంలో దిట్టగా మారిందనేది అర్థమవుతోంది. ఎట్టి పరిస్థితులలోను కోరస్‌, జగార్‌ కంపెనీలను మూసివేయకుండా చూడాలని బ్రిటన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది. బ్రిటన్‌ ప్రభుత్వ అసహాయ స్థితిని ఆసరాగా తీసుకుని టాటా మోటర్స్‌ రూ.3500కోట్ల అప్పుకు బ్రిటన్‌ ప్రభుత్వం నుండి గ్యారంటీ తీసుకుంది. మరో రూ.2380కోట్లు యూరోపియన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక నుండి అప్పుతీసుకుంది.


టాటాలు కొనుగోలు చేసిన కోరస్‌ స్టీల్‌ కంపెనీ టాటాగ్రూపు సహాయం లేనిదే ముందుకు వెళ్ళలేని దుస్థితిలో ఉంది. ఇప్పటికే టాటాలు రూ.21000 కోట్లు కోరస్‌ను కొనడానికి అప్పుతీసుకున్నారు. రీపైనాన్స్‌ చేయ వల్సిన పరిస్థితులలో రూ.1400కోట్లు మాతృ సంస్థ సహాకారంతో అప్పు తీర్చడానికి కోరస్‌ సిద్దపడింది. మాతృసంస్థను చూసే కోరస్‌కు రీపైనాన్స్‌ చేయడానికి రుణదాతలు సిద్ధపడు తున్నారు. జగార్‌ కంపెనీ నష్టాలను పూడ్చడానికే రూ.7000 కోట్లు టాటా గ్రూపు ఖర్చుపెట్టినట్లు సమాచారం. వీటి ప్రభావం టాటాగ్రూప్‌పై పడింది.
ఈ పరిస్థితులను అధిగమించటానికి, నిధులు సంపాదించడానికి టాటాగ్రూపు అనేక మార్గాలను అన్వేషించింది. దేశంలోని టాటాగ్రూప్‌ బ్రాండ్‌కి ఉన్న ప్రతిష్టను ఉపయోగించుకుంది. కంపెనీ రుణభారాన్ని షేర్‌హోల్లర్లపై నెట్టింది. టాటాస్టీల్‌ షేర్లను అమ్మడం, షేర్‌మార్కెట్‌, ఫిక్సడ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ద్వారా రూ.5000 కోట్ల నిధులను సమీకరించి తనకున్న అప్పును టాటా మోటర్స్‌ కొంత తీర్చగలిగింది. టాటాగ్రూప్‌ భారతదేశ ప్రభుత్వ సహాయం కూడా తీసుకుంది. రెండు విదేశీ కంపెనీలను కొనేటప్పుడే అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం టాటాగ్రూప్‌కు కావల్సిన సహాయం చేస్తానని తెలియజేశారు. స్టేట్‌బ్యాంక ఆఫ్‌్‌ ఇండియా ఇతర పది బ్యాంకులతో కలిపి ఒక సిండికేట్‌గా ఏర్పడి దాదాపు రూ.4,200 కోట్ల రూపాయలను బాండురూపంలో టాటాకు నిధులు సేకరించిపెట్టింది. ఆర్థిక మంత్రి అండదండలు లేకుండా బ్యాంకులు ఈ రకంగా చేయవు. ప్రభుత్వరంగ బ్యాంకులు సహాయంచేయడం వలన, అంతర్జాతీయ బ్యాంకుల నుండి కూడా మంచి మద్దతు లభించింది. ఆ విధంగా జగార్‌ కంపెనీ కోసం తీసుకున్న రూ.5 వేల కోట్ల రూపాయల అప్పును రీపైనాన్స్‌ చేయడం సాధ్యపడింది.


టాటామోటర్స్‌ ఏప్రిల్‌ 2009న పీపుల్స్‌ కార్‌ ''నానో'' విడుదలచేసింది. 16రోజుల బుకింగ్‌ సమయంలో 2లక్షల కార్లు బుక అయ్యాయి. వీటికి డిపాజిట్‌ అమౌంట్‌గా రూ.2500 కోట్ల రూపాయలు వచ్చింది. ఇది ఒక రకంగా ప్రజల నుండి లోన్‌ తీసుకోవడం. 2010 చివరికి టాటాలు లక్ష కార్లు మాత్రమే వినియోగదార్లకిస్తారు. మిగిలిన లక్ష కార్లకోసం 2011 వరకు ఆగవల్సిందే ఈ కాలంలో వినియోగదారులకు కొంత వడ్డీ కూడా ఇస్తారు. మొత్తం మీద తమ బ్రాండ్‌ను ఉపయోగించుకొని సంక్షోభ సమయంలో గట్టెక్కడానికి ప్రజలనుండి టాటా నిధులు సేకరించగలిగింది. కోరస్‌, జాగర్‌ కంపెనీ కొనుగోలు నిర్ణయం తప్పయినప్పటికి కొనుగోలు ద్వారా ఏర్పడిన సంక్షోభం నుండి బయటపడడానికి తన బ్రాండును, ప్రభుత్నాన్ని, ప్రజలను టాటాగ్రూప్‌ ఉపయోగించుకుంది.

    ఉద్దేశపూర్వకంగానే గాజా విధ్వంసం

    0 వ్యాఖ్యలు
    గాజాపై జరిపిన దాడిలో ఇజ్రాయిల్‌ యుద్ధ నేరాలకు పాల్పడిందని, నిర్లక్ష్యంగా దాడులు జరిపిందని, ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేసిందని ఒక స్వతంత్ర మానవహక్కుల నివేదిక తెలిపింది. అత్యంత శక్తివంతమైన ఆయుధాల ప్రయోగం వల్ల వందలాది మంది మరణించగా, సమీపం నుంచి జరిపిన కాల్పుల్లో పలువురు మృతి చెందినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ పేర్కొంది. హమాస్‌ రాకెట్‌ దాడులు కూడా యుద్ధ నేరాలేనని, వారు పౌరులకు ప్రమాదకరంగా ఉన్నారని కూడా ఆ నివేదిక తెలిపింది. అయితే తన ప్రవర్తన అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఉన్నట్లు ఇజ్రాయిల్‌ సైన్యం చెప్పింది. కొందరు పౌరులు మరణించిన మాట వాస్తవమేనన్న ఇజ్రాయిల్‌ తాను విచక్షణారహితంగా, పెద్ద ఎత్తున దాడులు జరిపాననే విమర్శను మాత్రం తిరస్కరించింది. 2008 డిసెంబర్‌ 27 నుంచి 2009 జనవరి 17 వరకూ 22 రోజుల పాటు ఇజ్రాయిల్‌ జరిపిన యుద్ధంలో 14 వందల మంది పాలస్తీనియన్లు మరణించినట్లు ఆమ్నెస్టీ తెలిపింది. వీరిలో మూడు వందల మంది పిల్లలు, 115 మంది మహిళలు సహా మొత్తం తొమ్మిది వందల మంది పౌరులున్నారని ఆ నివేదిక వెల్లడించింది. దీనిపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ 117 పేజీల నివేదికను విడుదల చేసింది. ఇజ్రాయిల్‌ దళాలు ఆరోగ్య రక్షణ అందకుండా పదేపదే అడ్డుకోవడం వల్ల అనేక ప్రాణాలు పోయాయని ఆ నివేదిక చెప్పింది.