వీలుంటే నా నాలుగు లంకెలు ...

30, జూన్ 2009, మంగళవారం

విద్యారంగాన్ని ప్రయివేట్‌ రంగానికి అప్పగించడంలో ఇంత ఆతృత ఎందుకో..?

1 వ్యాఖ్యలు
విద్యారంగాన్ని ప్రయివేట్‌ రంగానికి అప్పగించడంలో ఎక్కడలేని ఆతృతను ప్రదర్శించింది యుపిఏ ప్రభుత్వం. కీలకమైన అనేక మార్పులకు తెరతీసే ఫ్రొఫెసర్‌ యశపాల్‌ కమిటీ చేసిన తాత్కాలిక మధ్యంతర సిఫార్సులను వందరోజుల్లో అమలు జరుపుతామని మంత్రి కపిల్‌ సిబాల్‌ ప్రకటించేశారు. ఎంతో కాలంగా అమలుకు నోచుకోని కొఠారి కమిషన్సిఫారసుల గురించి పట్టించుకోకుండా యశ్పాల్కమిటీ సిఫారసుల అమలుకు ఎందుకింత తొందరపడుతోంది? ప్రజలకు విద్యను అందించే బాధ్యత నుండి తప్పించుకుని ప్రయివేటు దోపిడీకి బార్లా తలుపులు తెరవడమే ప్రభుత్వ లక్ష్యమన్నది స్పష్ఠంగా తెలిసిపోయింది. ప్రజల నుండి వసూలు చేసే విద్యా సెస్సు నిధులు ప్రభుత్వం దగ్గర వున్నాయి. విద్యా రంగానికి డబ్బులు ఖర్చు చేయలేని హీన స్థితిలో ప్రభుత్వం లేదు. అయినా విద్యావ్యవస్థను అది కూడా హడావిడిగా వ్యాపారీకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం దారుణం. ఇది ప్రజావిశ్వాసాన్ని వమ్ము చేయడమే. యశ్పాల్కమిటీ ఉన్నత విద్యా రంగాన్ని విదేశీ విశ్వవిద్యాలయాల ప్రమాణాలకు దీటుగా వుండాలని కోరితే యుపిఏ ప్రభుత్వం ఏకంగా మన ఉన్నత విద్యను విదేశీ వ్యాపార సంస్థలకు టోకుగా అప్పగించేందుకు పూనుకుంది. ఉన్నత విద్యను పూర్తి వ్యాపార సరుకుగా మార్చేస్తున్నది. ప్రభుత్వానికి లోకసేభలో అవసరమైన సంఖ్యాపరమైన మద్దతు ఉంది. మా ప్రయోజనాలను కాపాడితే చాలు మిగతా మీరేంచేసుకున్నా మేం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేతులెత్తుతాం అనే విధంగా మద్దతుదారులు ఉన్నారు.

27, జూన్ 2009, శనివారం

"విజ్ఞానం" పై చవక బారు విమర్శలా?

3 వ్యాఖ్యలు
జనవిజ్ణానవేదిక కృషిని విస్మరించి చేపమందును వ్యతిరేకించడమే పాపమన్నట్లుగా ఆంధ్రభూమి సంపాదకీయం రాసింది. జనవిజ్ఞాన వేదిక గత 21 సంవత్సరాలుగా శాస్త్రీయ విజ్ఞాన ప్రచారం చేస్తోంది. "యాపిల్‌కన్నా అరటి మిన్న" వంటి సామాన్య విషయాలపై ప్రచారం నుండి దొంగ బాబాలు, అమ్మల బండారాలు బయట పెట్టడం వంటి అసామాన్య విషయాలనెన్నిటినో చేపట్టింది. "రాజుగారి బేదులు" వంటి కళారూపాల ద్వారా విరోచనాలకు కారణమైన కలుషిత నీటిని గూర్చి వివరించింది. మద్యం అనే మహమ్మారిపై నారీ భేరి మోగించింది. వేలాది వయోజన పాఠశాలలు స్థాపించి నిరక్షరాస్యతా నిర్మూలనలో తన చేయందించింది. విద్యార్థి చెకుముకి మాస పత్రిక ద్వారా విద్యార్థులలో సైన్సు ప్రచారం నిర్వహిస్తోంది. అనేక శిక్షణాశిబిరాల నిర్వహణ, పుస్తక ప్రచురణల ద్వారా దేశభక్తిని ప్రచారం చేసింది. ఈ కృషికి గుర్తింపుగా, భారత ప్రభుత్వం 2006 లో సైన్సు దినోత్సవం నాడు 2 లక్షల రూపాయల నగదు, ఒక జ్ఞాపికను జనవిజ్ఞాన వేదికకు అందించింది. ఇన్ని మహత్తర కార్యక్రమాలు నిర్వహించి, మరెన్నో గణనీయ విజయాలు సాధించినపుడు ప్రశంసలకు చోటివ్వని ఆంధ్రభూమికి ప్రతిరోజు, ఒక అశాస్త్రీయ కార్యక్రమాన్ని ఎదుర్కొని విజయం సాధించడం బాధాకరంగా తోచడం దురదృష్టకరం. విజ్ఞాన 'భీభత్సం' సంపాదకీయం (ఆంధ్ర భూమి 9.6.09) లోచేప ప్రసాదం ద్వారా చికిత్స పొందుతున్నవారి సంఖ్య గణనీయంగా పడిపోవడంపై ఆ పత్రిక తెగ బాధపడిపోయింది. అసలు మాది చేపమందు కాదు, చేప ప్రసాదం మాత్రమేనని బత్తిన సోదరులు హైకోర్టుకు విన్నవించుకున్నా సదరు ప్రతికలవారికి అది చేపమందుగానే కన్పించడం వింతగా వుంది. ఆ సంపాదకీయంలో 'ఉబ్బసం రోగం నయమవుతుందా లేదా అన్న ప్రత్యక్ష ప్రమాణాన్ని జనవిజ్ఞాన వేదికవారు పక్కకునెట్టేశారు.' అని రాయడం జరిగింది.

అసలు అది మందే కాదు. ప్రసాదమని విద్యాధికులు పేర్కొంటున్నప్పుడు ప్రసాదాలకు వ్యాధులు నయమవుతాయా అనే ప్రశ్న సదరు పత్రికవారికి రాలేదు. ఉబ్బసం తగ్గకపోగా ఒకరి అంగుట్లో పెట్టిన వేళ్ళు మరొకరి నోట్లో పెట్టిన కారణంగా వచ్చిన అంటు వ్యాధులకు చికిత్స చేసిన తర్వాతనే జనవిజ్ఞాన వేదిక నాయకులైన డాక్టర్లు రంగప్రవేశం చేయాల్సివచ్చింది. 'రోగులకు మందులిస్తున్న ప్రతి అల్లోపతి వైద్యుని వద్దకు వెళ్లి ఇచ్చే మందు ఫార్ములా ఏమిటో చెప్పమని ఈ హేతువాదులు నిలదీయడం లేదనీ' చేప మందులో ఉన్న ఫార్ములా కొరకు మాత్రం నిలదీస్తున్నారని రాయడం నిజాన్ని నిలువులోతులో పాతేయడమే. ఎందుకంటే ప్రతి అల్లోపతి మందు పట్టీపై ప్రతి టాబ్లెట్‌లో ఇన్ని మిల్లీ గ్రాముల ఫలానా పదార్థం వుంటుందని ముద్రించబడి ఉంటుంది. అలా ముద్రించబడని అల్లోపతి మందును ఒక్క దాన్ని చూపమనండి.
"అమెరికాలోను పాశ్చాత్య దేశాలలోను నిషిద్ధమైన మందులను మన దేశంలో అమ్ముతున్న బహుళజాతి వాణిజ్యవేత్తల ఆగడాలు ఈ హేతువాదులకు కన్పించడం లేదని" మరో ఆరోపణ.ఇది వారి అజ్ఞానాన్నే సూచిస్తోంది. ఎందుకంటే జనవిజ్ఞాన వేదిక పుట్టినప్పటినుండి అవసరమైనవి, విషేధింపబడినవి అయిన మందులకు వ్యతిరేకంగా అనేక వందల సెమినార్లు నిర్వహించింది. "మందులా? మారణాయుధాలా?" , "ఆరోగ్యానికి ఎన్ని మందులవసరం" వంటి అనేక పుస్తకాలను ప్రచురించి వేల సంఖ్యలో అమ్మి ప్రజలను జాగృతం చేసింది. ప్రజారోగ్యం ప్రజల చేతుల్లోంచి కార్పొరేట్‌ హాస్పిటళ్ల చేతుల్లోకి వెళ్ళిన వైనాన్ని నిరసిస్తూ జన విజ్ఞానవేదికకు చెందిన వైద్యులు నిరంతరం గొంతెత్తి నినదిస్తున్నారు. ఈ మహోద్యమంలో భాగంగా "ప్రజారోగ్యం" అనే అంశంపై వందలాదిమంది ప్రజా వైద్యులచే 2008 అక్టోబరు 10,11 తేదీలలో హైదరాబాద్‌లో నిర్వహించబడిన సింపోజియం ఆంధ్ర భూమి దృష్టికి రాకపోవడం పాఠకుల దురదృష్టం.అలాంటి జనవిజ్ఞానవేదికను "కార్పొరేట్‌ బహుళ జాతి సంస్థలకు కొమ్ముకాసేవారు" గా చిత్రించ బూనడం వాస్తవాన్ని అతి హీనంగా వక్రీకరించడమే.
జన విజ్ఞానవేదిక, హైదరాబాద్‌.

పేద ప్రజలతో ప్రపంచ బ్యాంకు మరో లీల

0 వ్యాఖ్యలు
గ్రామీణులకు మినరల్‌ వాటర్‌ ఉచితమా? రొక్కమా? వెల్లడించని వైఎస్‌
గ్రామీణ ప్రజలకు బాటిళ్లలో మినరల్‌ వాటర్‌ను సరఫరా చేస్తామని శుక్రవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభ సందేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెప్పారు. ఆగస్టు 15 నుండి డ్వాక్రా సంఘాల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. కలుషిత నీరు తాగడం వల్ల గ్రామీణ ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నందున అందరికీ రక్షిత నీటిని అందించనున్నామన్నారు. మినరల్‌ వాటర్‌ను ఉచితంగా పంపిణీ చేస్తారా లేక ఛార్జీలు వసూలు చేస్తారా అన్న విషయాన్ని సిఎం వెల్లడించలేదు. ఇటీవల ప్రభుత్వం ఆమోదించిన జల ముసాయిదాలో తాగునీటిని సైతం విలువ ఆధారంగా చూడాలన్న నిబంధన ఉంది. ప్రపంచ బ్యాంక ఆదేశాలకు అనుగుణంగా ప్రతి నీటి బొట్టునూ అమ్మాలన్న షరతును అమలు చేసే ఉద్దేశం మినరల్‌ వాటర్‌ సరఫరా వెనుక దాగుందని తెలుస్తోంది

25, జూన్ 2009, గురువారం

యజ్ఞం వర్షాన్ని కురిపిస్తుందా? మంత్రాలకు చింతకాయలు రాలతాయా?

0 వ్యాఖ్యలు
సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం రాసిన మన వేదాల్లో వరుణదేవుడిని హోమంతో యజ్ఞం చేసి శాంతింపజేస్తే వర్షం కురుస్తుందని ఉంది. దీనికై హోమగుండంలో వేసిన నెయ్యి, కట్టెలు, ఇతర పూజాద్రవ్యాల వల్ల పొగ ఏర్పడి తద్వారా ధూళి కణాలు ఆకాశంవైపు పయనించి, మేఘం అడుగుభాగానికి చేరి వర్షింపజేస్తదని యజ్ఞం చేసేవారు నమ్ముతున్నారు. ఇప్పుడు అకాల పరిస్థితుల్లోనూ యజ్ఞం చేసి, వరుణదేవుడిని ప్రార్ధిస్తే వర్షాలు కురుస్తాయని వీరు నమ్ముతున్నారు. దీనికి ఆధారంగా ఇప్పటి మేఘమధనాన్ని చూపెడుతున్నారు. మేఘమధనం ద్వారా వెదజల్లిన లవణ కణాలలాగానే హోమధూళి మేఘాలను తాకుతుందని, ఈ కణాలు మేఘాలు వర్షించేలా చేస్తాయని వీరు చెపుతున్నారు. ఇప్పటి వర్షాభావ పరిస్థితుల్లో ఇది సాధ్యమా అని ఆలోచించాలి.
అప్పట్లో అడవులు చాలా ఎక్కువగా ఉండేవి. మేఘాలు స్థిరంగా ఉండేవి. వాతావరణంలో కాలుష్యం సమస్యగా ఉండకపోయేది. ఆ పరిస్థితుల్లో ధూళి కణాలు ఏ కొద్దిగా మేఘాలని తాకినా మేఘాల్లోని తేమ నీరుగా మారి వర్షం వచ్చే అవకాశం ఉంది. కానీ అడవులు విస్తారంగా నరికిన ఈ సమయంలో, వాహనాల కాలుష్యం పెరుగుతున్న ఈ నేపథ్యంలో గతంలోలాగా వర్షాభావ పరిస్థితుల్లో ఎత్తు తక్కువ మేఘాలు ఉండటం లేదు. చాలా ఎత్తుగానే ఉంటున్నాయి. అటువంటప్పుడు ఈ హోమం ద్వారా వెలువడ్డ ధూళి కణాలు అసలు మేఘాల్ని చేరుకోగలవా అన్నది ప్రశ్న. వాహనాల ద్వారా వెలువడే కార్బన్‌ వాయువులు హోమం ధూళి కణాలకన్నా ఎక్కువగా విడుదలై మేఘాలను చేరి వర్షాలను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోమం ద్వారా వెలువడ్డ కొద్దిపాటి ధూళి కణాలు ఇప్పటి వర్షాభావ పరిస్థితుల్లో కూడా మేఘాలకు చేరి, వర్షాన్ని కురిపించగలగటం దాదాపు అసాధ్యం. దీనిపై ప్రయోగపూర్వకంగా నిరూపితాలేమీ అందుబాటులో లేవు.

తమది దేవుడి పాలనని, వరణుడు తమ పార్టీలో చేరిపోయాడని చెప్పుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు వరుణ యాగాలు చేయాలని పిలుపునిచ్చారు. పనిలో పనిగా చర్చిలు, మసీదుల్లో కూడా ప్రార్థనలు చేయాలన్నారు. ఆయా దేవాలయాలు, ధార్మిక సంస్థలు తమకు తామే అలా నిర్ణయించుకుంటే ఒక విధంగానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుండే ఆదేశాలు వెళ్లడం శాస్త్ర విజ్ఞానాన్ని, సెక్యులర్‌ రాజ్యాంగాన్ని అవమానించడం, అవహేళన చేయడమే అవుతుంది. కంటింజెన్సీ ప్రణాళికల గురించి ఆలోచించకుండా పంట యజ్ఞాలు చేయమని ఆజ్ఞాపించి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఇక వ్యవసాయ మంత్రి జులై 15 నుండి మేఘమథనం చేసి వర్షాలు కురిపిస్తామని చెప్తున్నారు. ఫలానా ప్రాంతంలో మేఘమథనం ద్వారా, ఫలానా సమయంలో వర్షం కురిసిందని రూఢిగా నిర్ధారించిన దాఖలా లేదు. ఇంతకీ వర్షాలు కురిస్తే యాగాల వల్ల కురిసినట్టా, ప్రార్థనలకు కరుణించినట్టా లేక మథనంతో జాలువారుతునట్టు భావించాలా? ఏది ఏమైనా ఇప్పుడు అన్నదాత సందిగ్థంలో ఉన్నాడు. సేద్యం సాధ్యం అవుతుందా? అని బెంబేలు పడుతున్నాడు. ఇంతకీ ఏరు వాక సాగేనా!?.

...ఒక తెలుగు దిన పత్రిక సౌజన్యంతో