వీలుంటే నా నాలుగు లంకెలు ...

27, జూన్ 2009, శనివారం

"విజ్ఞానం" పై చవక బారు విమర్శలా?

జనవిజ్ణానవేదిక కృషిని విస్మరించి చేపమందును వ్యతిరేకించడమే పాపమన్నట్లుగా ఆంధ్రభూమి సంపాదకీయం రాసింది. జనవిజ్ఞాన వేదిక గత 21 సంవత్సరాలుగా శాస్త్రీయ విజ్ఞాన ప్రచారం చేస్తోంది. "యాపిల్‌కన్నా అరటి మిన్న" వంటి సామాన్య విషయాలపై ప్రచారం నుండి దొంగ బాబాలు, అమ్మల బండారాలు బయట పెట్టడం వంటి అసామాన్య విషయాలనెన్నిటినో చేపట్టింది. "రాజుగారి బేదులు" వంటి కళారూపాల ద్వారా విరోచనాలకు కారణమైన కలుషిత నీటిని గూర్చి వివరించింది. మద్యం అనే మహమ్మారిపై నారీ భేరి మోగించింది. వేలాది వయోజన పాఠశాలలు స్థాపించి నిరక్షరాస్యతా నిర్మూలనలో తన చేయందించింది. విద్యార్థి చెకుముకి మాస పత్రిక ద్వారా విద్యార్థులలో సైన్సు ప్రచారం నిర్వహిస్తోంది. అనేక శిక్షణాశిబిరాల నిర్వహణ, పుస్తక ప్రచురణల ద్వారా దేశభక్తిని ప్రచారం చేసింది. ఈ కృషికి గుర్తింపుగా, భారత ప్రభుత్వం 2006 లో సైన్సు దినోత్సవం నాడు 2 లక్షల రూపాయల నగదు, ఒక జ్ఞాపికను జనవిజ్ఞాన వేదికకు అందించింది. ఇన్ని మహత్తర కార్యక్రమాలు నిర్వహించి, మరెన్నో గణనీయ విజయాలు సాధించినపుడు ప్రశంసలకు చోటివ్వని ఆంధ్రభూమికి ప్రతిరోజు, ఒక అశాస్త్రీయ కార్యక్రమాన్ని ఎదుర్కొని విజయం సాధించడం బాధాకరంగా తోచడం దురదృష్టకరం. విజ్ఞాన 'భీభత్సం' సంపాదకీయం (ఆంధ్ర భూమి 9.6.09) లోచేప ప్రసాదం ద్వారా చికిత్స పొందుతున్నవారి సంఖ్య గణనీయంగా పడిపోవడంపై ఆ పత్రిక తెగ బాధపడిపోయింది. అసలు మాది చేపమందు కాదు, చేప ప్రసాదం మాత్రమేనని బత్తిన సోదరులు హైకోర్టుకు విన్నవించుకున్నా సదరు ప్రతికలవారికి అది చేపమందుగానే కన్పించడం వింతగా వుంది. ఆ సంపాదకీయంలో 'ఉబ్బసం రోగం నయమవుతుందా లేదా అన్న ప్రత్యక్ష ప్రమాణాన్ని జనవిజ్ఞాన వేదికవారు పక్కకునెట్టేశారు.' అని రాయడం జరిగింది.

అసలు అది మందే కాదు. ప్రసాదమని విద్యాధికులు పేర్కొంటున్నప్పుడు ప్రసాదాలకు వ్యాధులు నయమవుతాయా అనే ప్రశ్న సదరు పత్రికవారికి రాలేదు. ఉబ్బసం తగ్గకపోగా ఒకరి అంగుట్లో పెట్టిన వేళ్ళు మరొకరి నోట్లో పెట్టిన కారణంగా వచ్చిన అంటు వ్యాధులకు చికిత్స చేసిన తర్వాతనే జనవిజ్ఞాన వేదిక నాయకులైన డాక్టర్లు రంగప్రవేశం చేయాల్సివచ్చింది. 'రోగులకు మందులిస్తున్న ప్రతి అల్లోపతి వైద్యుని వద్దకు వెళ్లి ఇచ్చే మందు ఫార్ములా ఏమిటో చెప్పమని ఈ హేతువాదులు నిలదీయడం లేదనీ' చేప మందులో ఉన్న ఫార్ములా కొరకు మాత్రం నిలదీస్తున్నారని రాయడం నిజాన్ని నిలువులోతులో పాతేయడమే. ఎందుకంటే ప్రతి అల్లోపతి మందు పట్టీపై ప్రతి టాబ్లెట్‌లో ఇన్ని మిల్లీ గ్రాముల ఫలానా పదార్థం వుంటుందని ముద్రించబడి ఉంటుంది. అలా ముద్రించబడని అల్లోపతి మందును ఒక్క దాన్ని చూపమనండి.
"అమెరికాలోను పాశ్చాత్య దేశాలలోను నిషిద్ధమైన మందులను మన దేశంలో అమ్ముతున్న బహుళజాతి వాణిజ్యవేత్తల ఆగడాలు ఈ హేతువాదులకు కన్పించడం లేదని" మరో ఆరోపణ.ఇది వారి అజ్ఞానాన్నే సూచిస్తోంది. ఎందుకంటే జనవిజ్ఞాన వేదిక పుట్టినప్పటినుండి అవసరమైనవి, విషేధింపబడినవి అయిన మందులకు వ్యతిరేకంగా అనేక వందల సెమినార్లు నిర్వహించింది. "మందులా? మారణాయుధాలా?" , "ఆరోగ్యానికి ఎన్ని మందులవసరం" వంటి అనేక పుస్తకాలను ప్రచురించి వేల సంఖ్యలో అమ్మి ప్రజలను జాగృతం చేసింది. ప్రజారోగ్యం ప్రజల చేతుల్లోంచి కార్పొరేట్‌ హాస్పిటళ్ల చేతుల్లోకి వెళ్ళిన వైనాన్ని నిరసిస్తూ జన విజ్ఞానవేదికకు చెందిన వైద్యులు నిరంతరం గొంతెత్తి నినదిస్తున్నారు. ఈ మహోద్యమంలో భాగంగా "ప్రజారోగ్యం" అనే అంశంపై వందలాదిమంది ప్రజా వైద్యులచే 2008 అక్టోబరు 10,11 తేదీలలో హైదరాబాద్‌లో నిర్వహించబడిన సింపోజియం ఆంధ్ర భూమి దృష్టికి రాకపోవడం పాఠకుల దురదృష్టం.అలాంటి జనవిజ్ఞానవేదికను "కార్పొరేట్‌ బహుళ జాతి సంస్థలకు కొమ్ముకాసేవారు" గా చిత్రించ బూనడం వాస్తవాన్ని అతి హీనంగా వక్రీకరించడమే.
జన విజ్ఞానవేదిక, హైదరాబాద్‌.

3 కామెంట్‌లు:

  1. అజ్ఞాత6/27/2009 10:47:00 PM

    Jana vijnana vedika laksham emiti.... samskruthini naasanam cheyadamaa

    రిప్లయితొలగించండి
  2. Thanks for visiting my blog and your comments.

    I am not a member of జన విజ్ఞాన వేదిక. But, at leaset every body should support scientific thinking.

    For just example, మన పురాణలలో భూమి బల్లపరుపుగా వుందని తెలుస్తూంది. అందు వలన మన సంస్కృతి అని భూమి అలానే వుందని గుడ్డిగా నమ్ముదామా?

    నేను మీతో ఎకీభవిస్తాను, మన సంస్కృతిని కాపాడుకోవడం మన విధి. అంటే మూఢనమ్మకాలను ప్రోస్తహించడం కాదు. దయచేసి సంస్కృతిని, మూఢనమ్మకాకు ముడివేయాలని చూడవద్దు

    రిప్లయితొలగించండి
  3. లైసెన్స్ లేకుండా దగ్గు మందులు, జలుబు మందులు తయారు చేస్తేనే ఫాక్టరీ ముయ్యించేస్తారు. ఉబ్బసం లాంటి వ్యాధులకి లైసెన్స్ లేకుండా మందులు ఎలా తయారు చేస్తున్నట్టు?

    రిప్లయితొలగించండి