నయా ఉదారవాద విధానంలో భాగంగా దేశ ప్రజలకు చెందిన గ్యాస్ వంటి సహజ సంపదను స్వదేశీ, విదేశీ గుత్త పెట్టుబడిదారీ సంస్థలకు అప్పగించేందుకు గతంలో ఎన్‌డిఎ, ఆ తరువాత యుపిఎ ప్రభుత్వాలు ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేసి ప్రజా ప్రయోజనాన్ని బలి చేస్తున్నాయి. నూతన అన్వేషణ, లైసెన్సింగ్ విధానం (ఎన్ఇఎల్పి) కింద కృష్ణా-గోదావరి బేసిన్లో డి6 బ్లాక్‌లో రిలయన్స్ ఇండిస్టీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)కు అప్పగించి, కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఉత్పత్తి పంచుకునే ఒప్పందం (పిఎస్సి), అలాగే గ్యాస్ ధరను నిర్ణయించేందుకు మంత్రుల సాధికార కమిటీ అనుమతించిన సూత్రం ప్రజా ప్రయోజనాలకు నష్టదాయమైనది. ఈ ఉదంతం తెలియచేస్తోంది. ఆద్యంతం ముఖేష్ అంబానికి చెందిన రిలయన్స్‌కు కేంద్ర ప్రభుత్వం ఎలా ఊడిగం చేస్తున్నదీ అంబానీ సోదరుల మధ్య గ్యాస్ సరఫరా, ధరలకు సంబంధించి ఇంతకుమునుపు బొంబాయి హైకోర్టులో, ప్రస్తుతం సుప్రీం కోర్టులో నడుస్తున్న వ్యాజ్యాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరి దాని కాపట్యాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నది. అంతర్జాతీయ పోటీ బిడ్డింగులో ఎంఎంబిటియు గ్యాస్‌ను 2.34 డాలర్లకు ఎన్టిపిసి విద్యుత్ ప్రాజెక్టులకు 17 ఏళ్ళ పాటు 12 ఎంసిఎండి గ్యాస్ సరఫరా చేసేందుకు అంగీకరించి ఆర్ఐఎల్ ఎంపికయింది. ఆ ధరకు గ్యాస్ సరఫరా చేసేందుకు ఆర్ఐఎల్ తిరస్కరించటంతో ఎన్‌టిపిసికి, దానికి మధ్య బొంబాయి హై కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నది. పోటీ బిడ్డింగులో నిర్ణయించిన ఈ ధర పిఎస్‌సిలో నిర్దేశించిన విధంగా పోటీ ప్రక్రియ ద్వారా (ఆర్మ్స్ లెంత్ సేల్) నిర్ణయించిన ధర అవుతుంది. అయితే, దానికి విరుద్ధంగా ఆర్ఐఎల్ ప్రతిపాదించిన మోసపూరిత సూత్రాన్ని అనుసరించి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల సాధికార కమిటి ఎంఎంబిటియుకు 4.20 డాలర్ల అధిక ధరను ఆమోదించింది. అంబాని సోదరులు ముఖేష్, అనిల్‌ల మధ్య వారి కుటుంబ ఆస్తుల పంపిణీ ఒప్పందంలో భాగంగా అనిల్‌కు చెందిన ఆర్ఎన్ఆర్ఎల్ విద్యుత్ ప్రాజెక్టులకు 17 ఏళ్ళ పాటు 28 ఎంసిఎండి గ్యాస్‌ను ఎంఎంబిటియుకు 2.34 డాలర్ల చొప్పున సరఫరా చేసేందుకు ఆర్ఐఎల్ అంగీకరించిది. ఆ విధంగా గ్యాస్‌ను అనిల్ ప్రాజెక్టులకు సరఫరా చేసేందుకు ఆర్ఐఎల్ తిరస్కరించటంతో అన్నదమ్ముల మధ్య బొంబాయి హై కోర్టులో వ్యాజ్యం నడిచింది. ఆ ఒప్పందంలో అంగీకరించిన విధంగా గ్యాస్ పరిమాణం, సరఫరా కాలం, ధరల ఆధారంగా ఇరు పార్టీలు నెల రోజుల్లో తగు ఏర్పాటు చేసుకోవాలని బొంబాయి హై కోర్టు జూన్ 15న తీర్పు ఇచ్చింది.
హై కోర్టు తీర్పుపై అన్నదమ్ములిద్దరూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా పార్టీగా చేరింది. ఆర్ఐఎల్ కాంట్రాక్టరు మాత్రమేనని, మంత్రుల సాధికార కమిటీ నిర్ణయించిన గ్యాస్ వినియోగ విధానం ప్రకారమే గ్యాస్ పంపిణీ జరగాలని, ఆర్ఐఎల్, ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ల మధ్య కుదిరిన కుటుంబ ఒప్పందంతో తనకు సంబంధం లేదని కేంద్రం పేర్కొంది. ఈ గ్యాస్, దాని ధర, పంపిణీపై అన్నదమ్ములిద్దరికి యాజమాన్య హక్కు ఏమీ లేదని పేర్కొంది. కాని, కేంద్రం విధానం అలాంటి సహజ సంపదను ప్రైవేటు గుత్త పెట్టుబడిదారీ సంస్థలకు దోచిపెట్టేదిగా ఉంది. పిఎస్‌సిలోని నిబంధనలు, పార్లమెంటులో ప్రభుత్వం ఇచ్చిన వివరణలు, మంత్రుల సాధికార కమిటీ సమావేశాల వివరాలు ప్రభుత్వం ఇప్పుడు సుప్రీం కోర్టులో చేస్తున్న వాదనలకు భిన్నంగా ఉన్నాయి. మంత్రుల సాధికార కమిటీ ఎంఎంబిటియుకు 4.2 డాలర్లుగా నిర్ణయించిన ధర ప్రభుత్వం గ్యాస్ విలువను మదింపు చేయడానికేనని, ఆర్ఐఎల్ మార్కెట్లో విక్రయించే ధరను ప్రభుత్వం నిర్ణయించదని ఆ వివరణల సారాంశం. అంటే ఎటువంటి నియంత్రణ లేకుండా ఆర్ఐఎల్ మార్కెట్లో తనకు ఇష్టం వచ్చిన ధరకు గ్యాస్‌ను విక్రయించుకోవచ్చుననేది ఈ వివరణల సారాంశం. గ్యాస్ వినియోగం విధానానికి సంబంధించి, ఒకసారి ప్రభుత్వం గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులను, కర్మాగారాలను నెలకొల్పడానికి అనుమతించాక, వాటికి అవసరమైన గ్యాస్ కేటాయింపు చేయాలనేది నిర్వివాదాంశం. వాటిలో రాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు, ఎన్టిపిసి, అనిల్ అంబానీల ప్రాజెక్టులు కూడా ఉంటాయి. గ్యాస్ విలువ మదింపు నిమిత్తమే మంత్రుల సాధికార కమిటీ 4.2 డాలర్ల ధరను నిర్ణయించిందన్న వాదన ప్రకారం, ప్రభుత్వ వాటాగా రావాల్సిన గ్యాస్‌ను ఆర్ఐఎల్ అమ్మడానికి అనుమతించే పక్షంలో ఆ ధర ప్రకారం ప్రభుత్వానికి చెల్లించాలనేది దానిలో ఇమిడి ఉన్న అంతరార్థం. ఆర్ఐఎల్ వాటాగా లభించే గ్యాస్‌ను మార్కెట్లో ఏ ధరకు విక్రయించినా, ఆ సంస్థ పెట్టిన పెట్టుబడిపై రెండున్నర రెట్ల మొత్తాన్ని పిఎస్‌సిలో అనుమతించిన విధంగా పొందటానికి 4.2 డాలర్ల లెక్కనే పరిగణించాలనేది ఈ వివరణలలో అంతర్లీనంగా ఉన్న మరొక అంశం. లేదా ఎంఎంబిటియుకు 4.2 డాలర్ల కన్నా అధిక ధరకు ఆర్ఐఎల్ గ్యాస్‌ను విక్రయిస్తే దానిని ఎలా సర్దుబాటు చేయాలనేది అనిశ్చితంగా ఉంటుంది. బొంబాయి హైకోర్టు తీర్పు ఇచ్చిన విధంగా ఆర్ఐఎల్ వాటా గ్యాస్ నుండే అనిల్ అంబాని గ్రూపుకు 2.34 డాలర్ల ధరకు గ్యాస్ సరఫరా చేస్తే తనకు వచ్చే నష్టం ఏమిటనేది కేంద్రం వివరించకుండా దాట వేయటం దాని మోసపూరిత వైఖరిని వెల్లడిస్తున్నది. ఎన్టిపిసి-ఆర్ఐఎల్ కేసులో తన విధానం ఏమిటనేది కేంద్రం స్పష్టం చేయకుండా దాట వేస్తున్నది. గ్యాస్ వినియోగం, ధరల నిర్ణయంపై తనదే అధికారం అనేది కేంద్రం విధానమైతే తాను కేటాయించిన వారికే, తాను నిర్ణయించిన ధరకే గ్యాస్‌ను విక్రయించాలని స్పష్టం చేయాలి. అమలు చేయాలి. పారదర్శకంగా నిర్ధారించగల న్యాయమైన పెట్టుబడి వ్యయం, సంబంధిత క్షేత్రంలో ఉత్పత్తి చేసేందుకు లభ్యమయ్యే నిర్ధారిత గ్యాస్, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల పరిమాణం ఆధారంగా, న్యాయమైన లాభంతో కూడిన విధానం వుండాలి. ఆ విధంగా స్వదేశీ గ్యాస్ విక్రయ ధరలను డాలర్లలో కాకుండా రూపాయిలలో కేంద్రం నిర్ణయించి, నియంత్రించాలి. అనుమతించిన గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు, కర్మాగారాలకు అవసరమైన గ్యాస్‌ను కేటాయించి, సకాలంలో సరఫరా జరిగేటట్లు చూడాలి. వాటి స్థాపక సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు వీలుగా అవి పనిచేసే ఉపయోగకరమైన జీవిత కాలానికి సరిపడే విధంగా గ్యాస్ కేటాయింపులను, ఉత్పత్తిని, సరఫరాను నియంత్రించాలి. అలా చేయకుండా, న్యాయస్థానాలలో కేంద్రం డొంకతిరుగుడు వాదనలు చేయటం ఆర్ఐఎల్కు ఊడిగం చేయటానికే.