2, జులై 2009, గురువారం
పేదలు పప్పు ముఖం చూడగలరా?
ధరలను తగ్గిస్తామని చెప్పిన వైఎస్ సర్కార్ తన వాగ్దానాన్ని నెరవేర్చింది. ఎన్నికలకు ముందు నెలకు 97 రూపాయలకు అందచేస్తున్న నిత్యావసర వస్తువులను ఇప్పుడు కేవలం 75 రూపాయలకే అందిస్తూ వైఎస్ సర్కార్ ఇప్పుడు తన ఖాతాలో మరో 'ఘనత'ను జమ చేసుకుంది. మంచం చాలకపోతే కాళ్లు నరికితే సరి అన్న సలహా పాటించిన ఫలితమే ఇది. జనం చెబుతున్నట్లుగా మార్కెట్లో అతినాసిరకం కందిపప్పును కిలో 30రూపాయలకు అందచేస్తామని చెప్పిన పెద్దలు ఇప్పుడు దాని ధరను ఏకంగా 45 రూపాయలకు పెంచేశారు. కిలోకు బదులు అరకిలోకు తగ్గించారు. ధరను కూడా పెంచింది. పామాయిల్, కందిపప్పు సరఫరా చేసినందుకు ఏడాదికి నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వంపై భారం పడుతుందని చెప్పిన పెద్దలు ఇప్పుడు ఆ మొత్తాన్ని దాదాపు ఐదోవంతుకు కోతకోశారు. కందిపప్పుపై సబ్సిడీ భరించలేనిదిగా తయారైందని పౌరసరఫరాలశాఖ కొత్త మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కందిపప్పు మొదటి రకం వెల 2006 మే నెలలో కిలో 33 రూపాయలు ఉంది. ఇప్పుడు మొదటి రకం రు.58.37, రెండవరకం రు.51.67 ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ నివేదించింది. ప్రభుత్వమే ఏకంగా తానిచ్చే పప్పుధరను పదిహేను రూపాయలు పెంచింది. లక్షకోట్లరూపాయల బడ్జెట్ ఉన్న ప్రభుత్వమే రాయితీ ధరలకు ఒక కిలో కందిపప్పు కూడా ఇవ్వలేకపోతే పేదలు పప్పు ముఖం చూడగలరా?
1, జులై 2009, బుధవారం
పాపం మమతా బెనర్జీ!
మమతా బెనర్జీ లాల్‌ఘర్ ఆపరేషన్ రద్దు చేయాలన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, గ్రామీణులు భద్రతా దళాలకు మంచినీళ్లు ఇస్తున్నారంటూ మీడియా చెబుతోందని కాని అది అబద్ధమని, వారంతా సిపిఎంకు చెందిన వ్యక్తులని అన్నారు. అంతా నాటకమని, ముందుగా వేసుకున్న పథకమని, మావోయిస్టులు ఇళ్లుతగలబెడుతున్నారనే వార్తలు అవాస్తవమని మమత అన్నారు. ఛత్రధర్ మహతోను కలిసిన మేధావులపై కేసు పెట్టడాన్ని ఆమె వ్యతిరేకించారు. లాల్‌ఘర్ అరాచకాల్లో ప్రధాన దోషులు వీరే. దీన్నిబట్టి మమతకు మావోయిస్టుల పట్ల ఉన్న దృక్పథాన్ని, సంబంధాలను అర్థం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కార్యకలాపాల కారణంగా మావోయిస్టుల వ్యూహాలపై చీకట్లు కమ్ముకున్నాయి. వారి తుపాకుల శక్తి తగ్గిపోయింది. మావోయిస్టులకు మద్దతు విషయంలో డొల్లతనం బయటపడింది. మమత ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని నిన్న ఛత్రధర్ మహతో ప్రశ్నించారు. మమత ఇప్పుడు ప్రతిపక్షంలో లేరు కాబట్టి లాల్‌ఘర్ అరాచకాల బాధ్యత నుంచి ఆమె తప్పించుకోలేరు. మంగళవారం భద్రతా దళాలు కాంతాపహరి నుంచి కూంబింగ్ ప్రారంభించాయి. దళాలు పక్కా సమాచారం ఆధారంగా కూంబింగ్ చేస్తున్నాయి. సాధారణ ప్రజలు వీరికి సహకరిస్తూ మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. మావోయిస్టు యాక్షన్ స్క్వాడ్ సభ్యులు స్థానిక కేడర్‌ను వారి మానాన వారిని వదిలేసి జార్ఖండ్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. భద్రతా దళాలు లాల్‌ఘర్ ప్రాంతంలో మరో నెల రోజుల పాటు ఉంటాయి. రాష్ట్ర పోలీసులు ఇక్కడి ప్రజల భద్రత కోసం శాశ్వత శిబిరాలు ఏర్పాటు చేసుకోనున్నారు.
30, జూన్ 2009, మంగళవారం
విద్యారంగాన్ని ప్రయివేట్ రంగానికి అప్పగించడంలో ఇంత ఆతృత ఎందుకో..?
విద్యారంగాన్ని ప్రయివేట్ రంగానికి అప్పగించడంలో ఎక్కడలేని ఆతృతను ప్రదర్శించింది యుపిఏ ప్రభుత్వం. కీలకమైన అనేక మార్పులకు తెరతీసే ఫ్రొఫెసర్ యశపాల్ కమిటీ చేసిన తాత్కాలిక మధ్యంతర సిఫార్సులను వందరోజుల్లో అమలు జరుపుతామని మంత్రి కపిల్ సిబాల్ ప్రకటించేశారు. ఎంతో కాలంగా అమలుకు నోచుకోని కొఠారి కమిషన్ సిఫారసుల గురించి పట్టించుకోకుండా యశ్పాల్ కమిటీ సిఫారసుల అమలుకు ఎందుకింత తొందరపడుతోంది? ప్రజలకు విద్యను అందించే బాధ్యత నుండి తప్పించుకుని ప్రయివేటు దోపిడీకి బార్లా తలుపులు తెరవడమే ప్రభుత్వ లక్ష్యమన్నది స్పష్ఠంగా తెలిసిపోయింది. ప్రజల నుండి వసూలు చేసే విద్యా సెస్సు నిధులు ప్రభుత్వం దగ్గర వున్నాయి. విద్యా రంగానికి డబ్బులు ఖర్చు చేయలేని హీన స్థితిలో ప్రభుత్వం లేదు. అయినా విద్యావ్యవస్థను అది కూడా హడావిడిగా వ్యాపారీకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం దారుణం. ఇది ప్రజావిశ్వాసాన్ని వమ్ము చేయడమే. యశ్పాల్ కమిటీ ఉన్నత విద్యా రంగాన్ని విదేశీ విశ్వవిద్యాలయాల ప్రమాణాలకు దీటుగా వుండాలని కోరితే యుపిఏ ప్రభుత్వం ఏకంగా మన ఉన్నత విద్యను విదేశీ వ్యాపార సంస్థలకు టోకుగా అప్పగించేందుకు పూనుకుంది. ఉన్నత విద్యను పూర్తి వ్యాపార సరుకుగా మార్చేస్తున్నది. ప్రభుత్వానికి లోకసేభలో అవసరమైన సంఖ్యాపరమైన మద్దతు ఉంది. మా ప్రయోజనాలను కాపాడితే చాలు మిగతా మీరేంచేసుకున్నా మేం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేతులెత్తుతాం అనే విధంగా మద్దతుదారులు ఉన్నారు.
27, జూన్ 2009, శనివారం
"విజ్ఞానం" పై చవక బారు విమర్శలా?
జనవిజ్ణానవేదిక కృషిని విస్మరించి చేపమందును వ్యతిరేకించడమే పాపమన్నట్లుగా ఆంధ్రభూమి సంపాదకీయం రాసింది. జనవిజ్ఞాన వేదిక గత 21 సంవత్సరాలుగా శాస్త్రీయ విజ్ఞాన ప్రచారం చేస్తోంది. "యాపిల్‌కన్నా అరటి మిన్న" వంటి సామాన్య విషయాలపై ప్రచారం నుండి దొంగ బాబాలు, అమ్మల బండారాలు బయట పెట్టడం వంటి అసామాన్య విషయాలనెన్నిటినో చేపట్టింది. "రాజుగారి బేదులు" వంటి కళారూపాల ద్వారా విరోచనాలకు కారణమైన కలుషిత నీటిని గూర్చి వివరించింది. మద్యం అనే మహమ్మారిపై నారీ భేరి మోగించింది. వేలాది వయోజన పాఠశాలలు స్థాపించి నిరక్షరాస్యతా నిర్మూలనలో తన చేయందించింది. విద్యార్థి చెకుముకి మాస పత్రిక ద్వారా విద్యార్థులలో సైన్సు ప్రచారం నిర్వహిస్తోంది. అనేక శిక్షణాశిబిరాల నిర్వహణ, పుస్తక ప్రచురణల ద్వారా దేశభక్తిని ప్రచారం చేసింది. ఈ కృషికి గుర్తింపుగా, భారత ప్రభుత్వం 2006 లో సైన్సు దినోత్సవం నాడు 2 లక్షల రూపాయల నగదు, ఒక జ్ఞాపికను జనవిజ్ఞాన వేదికకు అందించింది. ఇన్ని మహత్తర కార్యక్రమాలు నిర్వహించి, మరెన్నో గణనీయ విజయాలు సాధించినపుడు ప్రశంసలకు చోటివ్వని ఆంధ్రభూమికి ప్రతిరోజు, ఒక అశాస్త్రీయ కార్యక్రమాన్ని ఎదుర్కొని విజయం సాధించడం బాధాకరంగా తోచడం దురదృష్టకరం. విజ్ఞాన 'భీభత్సం' సంపాదకీయం (ఆంధ్ర భూమి 9.6.09) లోచేప ప్రసాదం ద్వారా చికిత్స పొందుతున్నవారి సంఖ్య గణనీయంగా పడిపోవడంపై ఆ పత్రిక తెగ బాధపడిపోయింది. అసలు మాది చేపమందు కాదు, చేప ప్రసాదం మాత్రమేనని బత్తిన సోదరులు హైకోర్టుకు విన్నవించుకున్నా సదరు ప్రతికలవారికి అది చేపమందుగానే కన్పించడం వింతగా వుంది. ఆ సంపాదకీయంలో 'ఉబ్బసం రోగం నయమవుతుందా లేదా అన్న ప్రత్యక్ష ప్రమాణాన్ని జనవిజ్ఞాన వేదికవారు పక్కకునెట్టేశారు.' అని రాయడం జరిగింది.
అసలు అది మందే కాదు. ప్రసాదమని విద్యాధికులు పేర్కొంటున్నప్పుడు ప్రసాదాలకు వ్యాధులు నయమవుతాయా అనే ప్రశ్న సదరు పత్రికవారికి రాలేదు. ఉబ్బసం తగ్గకపోగా ఒకరి అంగుట్లో పెట్టిన వేళ్ళు మరొకరి నోట్లో పెట్టిన కారణంగా వచ్చిన అంటు వ్యాధులకు చికిత్స చేసిన తర్వాతనే జనవిజ్ఞాన వేదిక నాయకులైన డాక్టర్లు రంగప్రవేశం చేయాల్సివచ్చింది. 'రోగులకు మందులిస్తున్న ప్రతి అల్లోపతి వైద్యుని వద్దకు వెళ్లి ఇచ్చే మందు ఫార్ములా ఏమిటో చెప్పమని ఈ హేతువాదులు నిలదీయడం లేదనీ' చేప మందులో ఉన్న ఫార్ములా కొరకు మాత్రం నిలదీస్తున్నారని రాయడం నిజాన్ని నిలువులోతులో పాతేయడమే. ఎందుకంటే ప్రతి అల్లోపతి మందు పట్టీపై ప్రతి టాబ్లెట్‌లో ఇన్ని మిల్లీ గ్రాముల ఫలానా పదార్థం వుంటుందని ముద్రించబడి ఉంటుంది. అలా ముద్రించబడని అల్లోపతి మందును ఒక్క దాన్ని చూపమనండి.
"అమెరికాలోను పాశ్చాత్య దేశాలలోను నిషిద్ధమైన మందులను మన దేశంలో అమ్ముతున్న బహుళజాతి వాణిజ్యవేత్తల ఆగడాలు ఈ హేతువాదులకు కన్పించడం లేదని" మరో ఆరోపణ.ఇది వారి అజ్ఞానాన్నే సూచిస్తోంది. ఎందుకంటే జనవిజ్ఞాన వేదిక పుట్టినప్పటినుండి అవసరమైనవి, విషేధింపబడినవి అయిన మందులకు వ్యతిరేకంగా అనేక వందల సెమినార్లు నిర్వహించింది. "మందులా? మారణాయుధాలా?" , "ఆరోగ్యానికి ఎన్ని మందులవసరం" వంటి అనేక పుస్తకాలను ప్రచురించి వేల సంఖ్యలో అమ్మి ప్రజలను జాగృతం చేసింది. ప్రజారోగ్యం ప్రజల చేతుల్లోంచి కార్పొరేట్ హాస్పిటళ్ల చేతుల్లోకి వెళ్ళిన వైనాన్ని నిరసిస్తూ జన విజ్ఞానవేదికకు చెందిన వైద్యులు నిరంతరం గొంతెత్తి నినదిస్తున్నారు. ఈ మహోద్యమంలో భాగంగా "ప్రజారోగ్యం" అనే అంశంపై వందలాదిమంది ప్రజా వైద్యులచే 2008 అక్టోబరు 10,11 తేదీలలో హైదరాబాద్‌లో నిర్వహించబడిన సింపోజియం ఆంధ్ర భూమి దృష్టికి రాకపోవడం పాఠకుల దురదృష్టం.అలాంటి జనవిజ్ఞానవేదికను "కార్పొరేట్ బహుళ జాతి సంస్థలకు కొమ్ముకాసేవారు" గా చిత్రించ బూనడం వాస్తవాన్ని అతి హీనంగా వక్రీకరించడమే.
జన విజ్ఞానవేదిక, హైదరాబాద్.