వీలుంటే నా నాలుగు లంకెలు ...

8, జులై 2009, బుధవారం

మెట్రోపై భంగపాటు

3 వ్యాఖ్యలు
భాగ్యనగర ప్రజానీకానికి ట్రాఫిక ఇక్కట్లను తొలగించి సాఫీగా ప్రయాణం సాగించటానికి వీలుగా మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో వున్న మెట్రో రైలును ఆచరణలోకి తెస్తానని గంభీర వచనాలు పలికిన ప్రభుత్వం మరోసారి భంగపడింది.8,500 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధిశాఖ 2007లో చెప్పింది. అందుకోసం తమ వాటాగా 1640 కోట్లు ఇవ్వడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. కానీ ధనయజ్ఞం సాగిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలును ప్రభుత్వ రంగం ద్వారా కాకుండా ప్రైవేటు వారికి అప్పగించాలని, తద్వారా ప్రయోజనాలు పొందాలని ఆశించింది. 2007లో కేంద్ర ప్రభుత్వం 8,500 కోట్లుగా అంచనా వ్యయాన్ని నిర్ధారించినప్పటికి యేడాది తిరగకముందే దానిని 15వేల కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం నిర్మాణ సంస్థకు చెల్లించడం కాక వారే ప్రభుత్వానికి ఎదురిచ్చేట్టు మైటాస్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది. 2008 జులైలో జరిగిన ఒప్పందం ప్రకారం మైటాస్‌ కన్సార్టియమ్‌ 34 సంవత్సరాల వ్యవధిలో ప్రభుత్వానికి రు.30,311 కోట్లు ఇవ్వాలని ఆ ఒప్పందం. ఇందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం మైటాస్‌ కన్సార్టియమ్‌కు 269 ఎకరాల భూమిని అప్పంగించాలి. తద్వారా 2 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు, కట్టడాలు, అడ్వర్టైజ్‌మెంట్‌లతో సహా వివిధ వాణిజ్య కార్యకలాపాలను మైటాస్‌ నిర్వహించుకుంటుంది. ఈ ఒప్పందం మోసపూరితమైనదని ప్రజలకు, ప్రజల ఆస్తులకు నష్టదాయకమైనదని లోకం కోడై కూసింది. భారత మెట్రో రైలు పితామహుడిగా పేరుగాంచిన శ్రీధరన్‌ విస్పష్టంగా ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఒప్పందంలో జరిగిన లోపాలను సవరించుకోవడం లేదా అందుకు సంబంధించిన విషయాలను చర్చిండమో చేయవల్సిన ప్రభుత్వం ఏకంగా ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని రంకెలు వేసింది. నిండు కుండ తొణకదన్నట్లు శ్రీధరన్‌ తాను చెప్పింది వాస్తవమని, అందుకు తాను కట్టుబడి వుంటానని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం తోక ముడించింది.
ప్రపంచమంతా నివ్వెరపోయిన రీతిన 'సత్యం' కుంభకోణం ఈ ఏడాది జనవరిలో వెల్లడైంది. దానితో మైటాస్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆ సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దారి మళ్లించి కైంకర్యం చేసుకున్నారన్నది జగద్విదితం. హైద్రాబాద్‌ మెట్రోతో పాటు జలయజ్ఞం ప్రాజెక్టులు, మచిలీపట్నం పోర్టు కూడా మైటాస్‌ చేపట్టడానికి ఒప్పందాలు కుదిరాయి. సత్యం కుంభకోణం నేపథ్యంలో ఆ ప్రాజెక్టులను చేపట్టడం సాధ్యమా కాదా అన్నది ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ పరిశీలించి నిర్దారణకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా మైటాస్‌తో అధికారులు పలుమార్లు చర్చించారు. మెట్రోకు సంబంధించి రెండుసార్లు వాయిదాలు కోరినా ఫైనాన్షియల్‌ క్లోజర్‌,ఆర్ధిక సామర్థ్యంలను మైటాస్‌ కన్సార్టియమ్‌ చూపలేకపోయింది. అందుకని మెట్రోపై మైటాస్‌తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు రాష్ట్ర మున్సిపల్‌ మంత్రి రామనారాయణరెడ్డి ప్రకటించారు.
మనదేశంలో మొట్టమొదటి మెట్రో వ్యవస్థను కలకత్తాలో నిర్మించారు. అది విజయవంతం అయ్యాక ఢిల్లీలో కూడా ప్రభుత్వ రంగంలో చేపట్టారు. మెట్రో వ్యవస్థ పెరుగుతున్న మహానగరాల్లో ప్రజలకు చౌకగా, వేగంగా రవాణా సౌకర్యం కల్గించటమే కాక వాతావరణ కాలుష్యాన్ని సమర్థవంతంగా అదుపు చేస్తుంది. సాంకేతికంగా ఆధునాతనమైనది, రిస్కుతో కూడుకున్నది కనుక ప్రజలకు భద్రతతో ముడిపడిన ఈ వ్యవస్థను ప్రభుత్వం నిర్మించడం, నిర్వహించడం చాలా అవసరం.అందుకు భిన్నంగా ముంబైలో మెట్రో రైలు ఒప్పందాన్ని ప్రైవేటు సంస్థతో చేసుకోగా అది విఫలమైంది. ప్రజల భద్రత, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ రీత్యా మెట్రో రైలులాంటి మౌలిక వ్యవస్థలు ప్రభుత్వం చేతుల్లో ఉండడం ఆవశ్యం. కాని ప్రైవేటును నెత్తికెక్కించుకునే సరళీకరణ విధానాలను అమలు చేస్తున్న ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాలను, భద్రతను పణంగా పెడుతున్నాయి. మెట్రో రైలు ఒప్పందంలో కోట్ల రూపాయలు చేతులు మారాయన్నది జనవాక్యం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రీధరన్‌ లాంటి ప్రఖ్యాత టెక్నోక్రాట్‌ అభిప్రాయాన్ని తుంగలో తొక్కడమే కాక ఎదురుదాడికి దిగింది.జరిగిన పరిణమాలను పరిశీలిస్తే శ్రీధరన్‌ మాటలు ఎంతటి సత్యాలో ఎవరికయినా బోధపడుతుంది. జాప్యం మూలంగా మెట్రో రైలు ప్రాజెక్టు వ్యయం పెరిగి పోతున్నది.భాగ్యనగరం అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వీలున్నంత తొందరంగా మెట్రో రైలు నిర్మాణం జరగాలి. అదీ ప్రభుత్వ రంగంలోనే జరిగితే ప్రజలకు శ్రేయస్కరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని కేంద్ర ప్రభుత్వం, శ్రీధరన్‌ సూచించిన పద్ధతిలో మెట్రోను చేపట్టడం మంచిది.కేంద్ర పట్టణాభివృధ్ధిశాఖను నిర్వహిస్తున్నది తెలుగువాడు. యుపిఎకు అత్యధిక మందిని సమకూర్చిన రాష్ట్రంగా మనకు ఆపాటి ప్రయోజనం కూడా జరగకపోతే ఇంకెందుకు?ప్రభుత్వం చురుకుగా కదిలి కేంద్ర అనుమతిని,నిధులను సాధించాలి. మొట్రో ఉదంతం నుండి వైయస్‌ ప్రభుత్వం గుణపాఠం తీసుకోవాలి.

ఆర్థిక సంక్షోభంతో బాణీ మార్చిన ఐఎల్‌సి

0 వ్యాఖ్యలు
గత నెలలో అంతర్జాతీయ శ్రామిక సదస్సు (ఐఎల్‌సి) జెనీవాలో జరిగింది. ఇదేదో మహత్తరమైన సంఘటన కానప్పటికీ ప్రపంచ పెట్టుబడిదారీ విధానం కూకటి వేళ్లతో సహా కదలిపోతున్న తరుణంలో ఈ సదస్సు జరగటం విశేషం. అంతేకాక స్వేచ్ఛా మార్కెట్‌వాదాన్నీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్ధను ఊబిలో దింపిన నయా ఉదారవాద ప్రపంచీకరణనూ ప్రోత్సహిస్తున్న వారిపట్ల ప్రపంచ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ సదస్సు చోటుచేసుకున్నది. ఇలాంటి స్ధితిలో ప్రపంచ పెట్టుబడిదారీ నాయకత్వం ఎలా స్పందించేదీ ఊహించటం కష్టమేమీ కాదు. గత ముప్పై ఏళ్ళుగా, అంటే, రీగన్‌-థాచర్‌ల కాలం నుంచి పెట్టుబడిదారులు వల్లిస్తున్న నినాదాలు నిలిచిపోయాయి. 'వ్యాపారం చేసే బాధ్యత ప్రభుత్వానిది కాదు', పెట్టుబడిదారీ విధానానికీ, స్వేచ్ఛా మార్కెట్‌ వ్యవస్ధకూ 'ప్రత్యామ్నాయం లేదు', 'ప్రభుత్వమనేది ఒక సమస్యగా ఉన్నదేగాని పరిష్కారంగా లేదు', 'అన్ని సమస్యలనూ మార్కెట్‌ పరిష్కరించగలదు', అంటూ చాలా కాలంగా చెప్తున్న బడాయిలను ప్రస్తుతం పక్కన పెట్టారు. సమాజ పురోగతికి ప్రపంచీకరణ ఒక్కటే ఏకైక మార్గమంటూ పెట్టుబడిదారీ కిరాయి మనుషులు ఇంతకుముందు ఎల్లెడెలా ప్రచారం చేశారు. కుప్పకూలిన అమెరికన్‌ బ్యాంకులు, జర్మన్‌ బ్యాంకులు మార్కెట్‌ను ఎందుకు ఆశ్రయించలేదు?

ప్రభుత్వం వద్దకు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అంటూ జూన్‌ 15న జరిగిన ప్లీనరీ సమావేశంలో లూలా డి సెల్వా అడిగిన ప్రశ్నకు సమాధానమే కరువైంది. గత శతాబ్ది 8, 9 దశాబ్దాలలో పేదదేశాలు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలకు అనేకానేక పరిష్కారాలను సూచించిన ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లు ప్రస్తుతం అమెరికా, జపాన్‌, ఐరోపాలకు ఎలాంటి సలహాలు ఇవ్వనున్నదని కూడా ప్రశ్నించారు. దీనితో సమావేశ హాలులో ఉన్నవారు మిన్నుముట్టేలా హర్షధ్వానాలు చేశారు. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్ధనూ, రాజకీయాలను శాసిస్తున్న నయా ఉదారవాదులపట్ల వారికున్న ఆగ్రహం అలాంటిది. అమెరికన్‌ బ్యాంకర్‌లను ముఠానాయకులు అన్నపుడు కూడా ఇలాంటి హర్షాతిరేకాలే వ్యక్తమయ్యాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు నికోలస్‌ సర్కోజీ సైతం అమెరికాను, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లను పరోక్షంగా ఎత్తిపొడిచాడు. ''అంతర్జాతీయ ఆర్థిక సంస్ధలు ఇతరులకు పాఠాలు చెప్పటమేకాక, తాము కూడా నేర్వాలని'' ఆయన అన్నారు. ప్రస్తుత సంక్షోభానికి అమెరికాయే కారణమంటూ లాటిన్‌ అమెరికా, ఐరోపా దేశాలు విమర్శిస్తుంటే అమెరికా ప్రతినిధులు మౌనం దాల్చారు. గతంలో జరిగిన ఐఎల్‌సీ సమావేశాలకూ ఇప్పుడు జరిగిన దానికీ చాలా తేడా ఉన్నది.

గత సమావేశాలలో ప్రపంచీకరణనూ, నయా ఉదారవాదాన్నీ విమర్శించడమే నేరంగా భావించారు. మార్కెట్‌ను సాక్షాత్తు భగవంతునిగా భావించటం జరిగింది. శ్రామికవర్గాన్ని దారుణమైన దోపిడీకి, అణచివేతకూ గురిచేశారు. చివరకు ఐఎల్‌ఓ సైతం ప్రపంచీకరణను సమర్ధించింది. మారిన నేటి పరిస్థితిలో ఐఎల్‌ఓ అనవసరమని చేప్పేవరకు సంపన్న దేశాల నాయకులు వెళ్ళారు. శ్రామికుల వేతనాల గురించీ, పని పరిస్థితుల గురించీ మార్కెట్‌ తగు జాగ్రతలు తీసుకోగలదని వారి చెప్పుకొచ్చారు. కాని ఇంతలో ఎంతమార్పు? ఐఎల్‌ఓకు ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, శ్రామికుల ఇక్కట్లను తొలగించే మార్గాలను అన్వేషించాలని జి-20 దేశాల సదస్సు కోరింది. ఈసారి జరగనున్న జి-20 సమావేశాలకు ఐఎల్‌ఓను ఆహ్వానించాలన్న ప్రతిపాదన వచ్చింది. డబ్ల్యుటిఓలో ఐఎల్‌ఓ వాణి వినిపించాలని సర్కోజీ వ్యాఖ్యానించారు. ఇదియిలా ఉండగా ఐఎల్‌ఓ చివరి నిముషంలో తన అజెండాను మార్చి, ఆర్థిక సంక్షోభాన్ని దానిలో చేర్చింది. దీనిపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ప్రభుత్వాలకూ, యాజమాన్యాలకూ ప్రాతినిధ్యం వహించేవారేకాక కార్మిక ప్రతినిధులు కూడా దాదాపు 200 మందికి పైగా ఉన్నారు.

భారత్‌ నుంచి అర్ధేందు దక్షి (సిఐటియు), థంపన్‌ థామస్‌ (హెచ్‌ఎంఎస్‌), ఉదరు పట్వర్ధన్‌ (బిఎంఎస్‌)లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ దాదాపు ప్రతిరోజు సమావేశమవుతుంటుంది. పలు రంగాలకు చెందిన వారు కూడా ఈ కమిటీ చర్చలలో పాల్గొంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఐఎల్‌సీ సమావేశం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లను, ప్రపంచీకరణ విధానాలనూ ఆక్షేపించింది. ప్రస్తుత సంక్షోభానికి కారణమైన వారెవరూ ఈ సమావేశానికి హాజరు కాలేదు. అంతేకాక వారిని వెనకేసుకు వచ్చే వాళ్ళు కూడా లేకుండా పోయారు. కార్మిక వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్న సంగతి ఆకస్మికంగా ఐఎల్‌ఓకు గుర్తుకు వచ్చింది. ప్రపంచ బ్యాంకు కూడా తన బాణీని మార్చింది. ఆదాయ పంపిణీ, పంపిణీ యంత్రాంగం, సామాజిక భద్రత వగైరాల గురించీ, ఐఎల్‌ఓతో సమన్వయం గురించీ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రస్తావించారు. అనేక మంది ఉపాధిని కోల్పోవటం, ఆదాయాల తగ్గుదల, నిరుద్యోగం పెరుగుదల వగైరాలతో పలు దేశాలలో తీవ్రమైన పరిస్థితులు నెలకొనడంతో పైన పేర్కొన్న పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తంమీద ప్రపంచ నాయకులు నిరాశలో కూరుకుపోయారు.

ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చటానికిగాను వారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఆశాజనకమైన మార్పులు వస్తున్నాయంటూ ఒకవైపున ప్రసారసాధనాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు సహనంతో ఉండాలని, త్వరలోనే ఉద్యోగాలు లభించగలవని, ఆదాయాలు పెరగగలవని నమ్మబలుకుతున్నారు. మరోవైపున, కార్మిక లోకంలో విశ్వాసాన్ని పెంచవలసిందిగా ఐఎల్‌ఓను కోరుతున్నారు. ఐఎల్‌ఓ కూడా వీరి ఆకాంక్షలను నెరవేర్చేటందుకై తాను చేయగలిగింది చేయటానికి సిద్ధంగా ఉన్నది. సంక్షోభాన్నుంచి బయట పడుతున్నట్లుగా తెలియచేసే ఒక పత్రాన్ని అది తయారు చేసింది. సంక్షోభానంతర ప్రపంచం విభిన్నంగా ఉండగలదని అది చెప్పుకొచ్చింది. అయితే, 'ఆర్థిక వ్యవస్ధ పునరుజ్జీవాన్ని పొందిన పలు సంవత్సరాల తరువాత మాత్రమే ఉపాధి పరిస్థితి మెరుగుపడగలదంటూ ముక్తాయింపు నిచ్చింది. ఆర్థికవ్యవస్ధ కోలుకున్న అనంతరం అంటే, పెట్టుబడి తిరిగి తన స్థితిని పొందిన అనంతరం ఉద్యోగాలు మరలా లభ్యం కాగలవని ఐఎల్‌ఓ అభిప్రాయం. అయితే కనీస వేతనాలు, సమావేశ హక్కు, లైంగిక సమానత్వం, పర్యావరణ పరిరక్షణ వగైరాల సంగతేమిటన్నదే ఇక్కడ ఎదురయ్యే ప్రశ్న.

నిరుద్యోగులను ఆదుకునేందుకు డబ్బు ఎక్కడ నుంచి వస్తుందంటూ శ్రామిక బృందాలు ప్రశ్నిస్తున్నాయి. బ్యాంకులు దివాళా తీస్తే సంక్షోభ నివారణ పథకాలు వర్తిస్తాయి. ఎగుమతిదారులు దెబ్బతింటే ప్రభుత్వం ఆదుకుంటుంది. మరి ఉద్యోగాలను కోల్పోయిన కార్మికుల సంగతేమిటి? ప్రభుత్వాలుగానీ, యాజమాన్యాలుగానీ ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వటం లేదు. ఆర్థిక రంగం మంచి ఊపులో ఉన్నపుడే కార్మికులకు వారికి దక్కవలసింది దక్కలేదు. అటువంటపుడు సంక్షోభం సమయంలో ఏమి లభిస్తుంది? కార్మికులకు అనుకూలమైన విధానాలను చేపట్టవలసిందిగా కార్మికవర్గ నాయకులు అడుగుతున్నారు. లేనిపక్షంలో ఆర్థిక సంక్షోభం సామాజిక అశాంతిగా మారే ప్రమాదమున్నదని వారు హెచ్చరిస్తున్నారు. దీనికి కూడా సరియైన సమాధానం లేదు. ఉపాధి పథకాలంటూ ప్రవేశపెట్టటమేగాని వాటికి ఆర్థిక కేటాయింపులు ఏమీలేవు. యాజమాన్య వర్గాలు ఇలాంటి వాటిని పట్టించుకోవు. వారికి లాభాలు ప్రధానం. అంతేగాని కార్మికుల బాగోగులు వారికి అనవసర విషయం. కనుకనే ఆర్థిక సంక్షోభం తలయెత్తినప్పటికీ శ్రామిక లోకాన్ని ఆదుకునే విధానాలు కరువయ్యాయి.

ఇప్పటి వరకు ఐఎల్‌ఓలో భారత్‌కు ఎలాంటి ప్రాధాన్యతా ఉండేదికాదు. కాని ఈసారి సమావేశాల్లో భారత్‌కు విశేష ప్రాధాన్యత లభించింది. అందుకు కారణం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.నిజానికి ఈ చట్టాన్ని ఆమోదించటానికి భారత ప్రభుత్వానికి చాలా కాలం పట్టింది. వామపక్షాల ఒత్తిడితో మాత్రమే ఈ చట్టం ఆమోదాన్ని పొందింది. నిజ ఆర్థికవ్యవస్ధకు ప్రాధాన్యతను ఇవ్వటంతోపాటు దేశీయంగా డిమాండును పెంచే చర్యలను తీసుకున్నందుకుగాను చైనాను సమావేశం అభినందించింది. లైంగిక సమానత, ఎయిడ్స్‌ సమస్యల గురించి కూడా ఐఎల్‌ఓ పరిణగనలోకి తీసుకున్నది. స్త్రీ పురుష సమానత్వం గురించి ఐఎల్‌ఓ ఎప్పటి నుంచో చెపుతున్నది. కాని ఇవన్నీ నీటిమీది రాతలుగానే మిగిలి పోతున్నాయి. కార్మికులకు సంబంధించిన విషయాలకు కూడా ఇదే దురవస్ధ పడుతున్నది. సమావేశాలు జరుగుతున్నపుడే మరిన్ని ఉద్యోగాలు పోవటం గురించి, సమ్మెలు వగైరాల గురించి వార్తలు వెలువడ్డాయి. నిన్నమొన్నటి వరకు ప్రపంచీకరణ, స్వేచ్ఛా మార్కెట్‌ గురించి మాట్లాడిన వారే ఇప్పటి ఐఎల్‌సి సమావేశంలో కార్మికవర్గ శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో భాగమే.

ఆమ్‌ అద్మీనా? విశేష్‌ ఆద్మీనా?!

0 వ్యాఖ్యలు
వివిధ కంపెనీల బృందాలకు పన్నుల్లో రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు కల్పించిన ప్రభుత్వ ధోరణి చూస్తుంటే దీనిని అదొక విధానంగానే పెట్టుకున్నదని అర్థమవుతుంది. ఈ బడ్జెట్‌లో అది కల్పించిన పన్ను రాయితీలు పెట్రోలియం, పెట్రో కెమికల్స్‌ రంగంలోని ఒకానొక కంపెనీల బృందానికి అపారమైన లాభాలు సమకూర్చిపెడుతోంది. అందుకే దీనిని ఆమ్‌ ఆద్మీ బడ్జెట్‌ అనే కన్నా కొందరు విశేష్‌ ఆద్మీలు లేదా గ్రూపు బడ్జెట్‌ అనడమే సరైనది.

యుపిఏ ప్రభుత్వం తిరిగి రెండోసారి ఎన్నికైన తరువాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ ఇది. ప్రభుత్వం ఉద్దేశాలేమిటో చూచాయగా ఈ బడ్జెట్‌ ద్వారా తెలియజేయవచ్చని భావించారు. ఆ సంకేతాలు ఎలా వుండబోతున్నాయనే దానిపై రకరకాల వాదనలు వెలువడ్డాయి. ద్వారా తన ఉద్దేశాలను ఈ బడ్జెట్‌ ద్వారా ప్రభుత్వం తన ఉద్దేశాలివీ అని సంకేతాలిస్తుందని అయితే ఆ సంకేతాలేమిటన్నదానిపై పరిపరి విధాలుగా వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. వామపక్షాలు వెలుపలినుంచి ఇచ్చే మద్దతుపై ఆధారపడాల్సిన అగత్యం యుపిఏ ప్రభుత్వానికి ఇక లేదు గనుక మార్కెట్‌ అనుకూల, కార్పొరేట్‌ అనుకూల విధానాలన్నిటిని ఇప్పుడు యథేచ్ఛగా అమలు చేయగలదని, బడా వ్యాపార వాణిజ్య వర్గాలు కోరుతున్నట్లుగా ప్రయివేటీకరణను పెద్దయెత్తున చేపడుతుందని, పన్నులు మరింత తగ్గిస్తుందని, ఆర్థిక సరళీకరణను వేగవంతం చేయగలదని కొందరు వాదించారు.ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటి అమలుకు పూర్తిగా కట్టుబడి వుండాలని, ఇటీవలి ప్రజాతీర్పు అంతస్సారమిదేనని,యుపిఏ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఉపాధి పెంపు, అందరికీ ఆహార భద్రత, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర సామాజిక భద్రత, ప్రజారోగ్య వ్యవస్థ మెరుగుదల, విద్యా హక్కుకు గ్యారంటీ వంటి అనేక హామీలను ఆమ్‌ఆద్మీపై గుప్పించింది. ఇవి అత్యంతావశ్యకమే కాదు, వీటికి తగినన్ని నిధులు కేటాయించి సమర్ధవంతంగా అమలు చేస్తే దానివల్ల అనేక ఫలితాలొస్తాయి. ఇటువంటి చర్యల ద్వారా ప్రస్తుత ఆర్థిక మాంద్యంలో ఒక సానుకూల మార్పును తీసుకు రావచ్చు.

ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ బడ్జెట్‌లో పేర్కొన్న సంకేతాలేవీ అంతగా కానరాలేదు. ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ గురించి ప్రస్తావించారు. (చేదు గుళికలకు చక్కెర పూత పూసినట్లు ప్రైవేటీకరణకు 'ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రజల భాగస్వామ్యం' అని ముద్దు పేరు పెట్టారు). అయితే ఈ ప్రక్రియ ద్వారా ఎంత

6, జులై 2009, సోమవారం

పెట్టుబడుల ఉపసంహరణ ఎవరి కోసం

3 వ్యాఖ్యలు
''పెట్టుబడులను ఉపసంహరించడం ద్వారా వనరుల కొరతను అధిగమించటమే ప్రభుత్వ లక్ష్యం అయినట్లయితే అది వివేకంతో కూడుకున్న చర్యకాబోదు. ద్రవ్య లోటు 2 లక్షల కోట్ల రూపాయలనుకున్నట్లయితే మీకున్న మొత్తం ఆస్తులను రెండేళ్ళలో అమ్మివేయగలరు. మరి మూడవ సంవత్సరం ఏమిచేస్తారు? కనుకనే మీమౌలిక లక్ష్యాలేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాము. ప్రభుత్వం నుంచి కచ్చితమైన జవాబును కోరుతున్నాము. ఇది కేవలం పెట్టుబడికి సంబంధించిన ప్రశ్న మాత్రమే కాదు. గత పదేళ్ళలో ఈ విషయమై ఏకాభిప్రాయం కుదరలేదు. ఏ లక్ష్య సాధన కోసం పెట్టుబడుల ఉపసంహరణ? ఇది కేవలం బడ్జెట్‌ వ్యత్యాసాలను పూరించటానికేనా? సాధారణ వినియోగ వ్యయ అవసరాలను తీర్చటం కోసం పెట్టుబడుల ఉపసంహరణ వివేకమవుతుందా? ద్రవ్యలోటును తగ్గించుకునే ఇతర మార్గాలను మీరు అన్వేషించలేరా?

పై ప్రశ్నలను లేవనెత్తింది ఎవరోకాదు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిగా వున్న ప్రణబ్‌ ముఖర్జీ సరిగ్గా ఎనిమిదేళ్ళ క్రితం రాజ్యసభలో ఈ ప్రశ్నలను లేవెనెత్తారు. అప్పటిలో ఆయన ప్రతిపక్ష సభ్యునిగా ఉన్నారు. 2001 ఫిబ్రవరి 27వ తేదీన అంటే ఆనాటి ఎన్డీయే ప్రభుత్వం తన బడ్జెట్‌ను సమర్పించటానికి కొన్ని గంటలముందు బాల్కో పెట్టుబడుల ఉపసంహరణపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఆయన పైవిధంగా ప్రశ్నలను సంధించారు. ఇప్పటివరకు ఇవి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఈ నెల 4వ తేదీన రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అన్ని పార్టీలు మాట్లాడాయి. కాని ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు.

అలాంటపుడు ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ సంస్ధలలో పెట్టుబడుల ఉపసంహరణ కోసం తక్షణమే పిలుపు ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది? ఐదేళ్ళ అనంతరం ''వామపక్షాల ఆటంకం'' తొలగిపోయినందుకేనా? పైన ప్రస్తావించిన ''వైదుష్యాన్ని'' ఎనిమిదేళ్ళ క్రితం కాంగ్రెసు ప్రదర్శించింది. అప్పటిలో ప్రతిపక్షంగా ఉండటానికిగాను కాంగ్రెసుకు వామపక్షాల అవసరం ఏమాత్రం లేదుగదా! ముఖర్జీ ఉపన్యాసంలోనే దీనికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి.
''ఒప్పందానికి కట్టుబడి ఉండండి: ప్రభుత్వానికి ఫిక్కీ సూచన'' అన్న విషయాన్ని నేను వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్నాను. మొత్తం ప్రైవేటు రంగంగా ఉండటాన్నే వారు అభిలషిస్తారు. ప్రతిచోటా మార్కెట్‌ ఆర్థికవ్యవస్ధ ఉండాలని కోరుకుంటారు. ఈరోజే కాదు సర్వేసర్వత్రా వారు ఈ డిమాండును చేస్తూనే ఉంటారు.

ఇదీ అసలు సంగతి. పెట్టుబడుల ఉపసంహరణను కోరుతున్నదెవరు? ఫిక్కీతోపాటు సిఐఐ, అసోచెమ్‌ వంటి పారిశ్రామిక సంస్ధలు పెట్టుబడుల ఉపసంహరణను కోరుతున్నాయి. 2001లో అరుణ్‌ శౌరికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఈ సంస్ధలే. ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి దిశానిర్ధేశం చేస్తున్నాయి. అంతేగాని ప్రభుత్వ రంగ యజమానులైన ఈ దేశ ప్రజలు కాదు.

షేర్‌మార్కెట్‌ ద్వారా ప్రజల యాజమాన్యం?
దేశ ప్రజలు, పార్లమెంటుకు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. పార్లమెంటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్ధలపై ప్రజల యాజమాన్యాన్ని ప్రజలెన్నుకున్న పార్లమెంటు కాపాడుతుంది. పార్లమెంటు ద్వారా రక్షణ పొందే ప్రజల యాజమాన్యాన్ని షేర్‌ మార్కెట్‌ ద్వారా కొద్దిమంది ప్రజల యాజమాన్యంగా మార్చరాదు. దశలవారీగా ప్రైవేటీకరించే క్రమాన్ని మరుగుపరచేటందుకుగాను ప్రజా యాజమాన్యం అంటూ తప్పుడు పేరును పెడుతున్నారు. 1991-1996 మధ్య కాంగ్రెసు ప్రభుత్వం ఉన్నపుడు ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌ సింగే ఉన్నారు. నవరత్నాలలో ఒకటన భెల్‌ వాటాలను తెగనమ్మేటందుకు ఆ సమయంలోనే శ్రీకారం చుట్టారు.