వీలుంటే నా నాలుగు లంకెలు ...

3, జులై 2009, శుక్రవారం

ఉద్దేశపూర్వకంగానే గాజా విధ్వంసం

0 వ్యాఖ్యలు
గాజాపై జరిపిన దాడిలో ఇజ్రాయిల్‌ యుద్ధ నేరాలకు పాల్పడిందని, నిర్లక్ష్యంగా దాడులు జరిపిందని, ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేసిందని ఒక స్వతంత్ర మానవహక్కుల నివేదిక తెలిపింది. అత్యంత శక్తివంతమైన ఆయుధాల ప్రయోగం వల్ల వందలాది మంది మరణించగా, సమీపం నుంచి జరిపిన కాల్పుల్లో పలువురు మృతి చెందినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ పేర్కొంది. హమాస్‌ రాకెట్‌ దాడులు కూడా యుద్ధ నేరాలేనని, వారు పౌరులకు ప్రమాదకరంగా ఉన్నారని కూడా ఆ నివేదిక తెలిపింది. అయితే తన ప్రవర్తన అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఉన్నట్లు ఇజ్రాయిల్‌ సైన్యం చెప్పింది. కొందరు పౌరులు మరణించిన మాట వాస్తవమేనన్న ఇజ్రాయిల్‌ తాను విచక్షణారహితంగా, పెద్ద ఎత్తున దాడులు జరిపాననే విమర్శను మాత్రం తిరస్కరించింది. 2008 డిసెంబర్‌ 27 నుంచి 2009 జనవరి 17 వరకూ 22 రోజుల పాటు ఇజ్రాయిల్‌ జరిపిన యుద్ధంలో 14 వందల మంది పాలస్తీనియన్లు మరణించినట్లు ఆమ్నెస్టీ తెలిపింది. వీరిలో మూడు వందల మంది పిల్లలు, 115 మంది మహిళలు సహా మొత్తం తొమ్మిది వందల మంది పౌరులున్నారని ఆ నివేదిక వెల్లడించింది. దీనిపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ 117 పేజీల నివేదికను విడుదల చేసింది. ఇజ్రాయిల్‌ దళాలు ఆరోగ్య రక్షణ అందకుండా పదేపదే అడ్డుకోవడం వల్ల అనేక ప్రాణాలు పోయాయని ఆ నివేదిక చెప్పింది.

ఓట్లేసినందుకు ప్రతిఫలం

2 వ్యాఖ్యలు
ఎన్నికలకు ముందు పెట్రో ధరలను స్వల్పంగా తగ్గించిన యుపిఎ ప్రభుత్వం అవి కాస్తా పూర్తయ్యాక రేట్లను భారీగా పెంచి సామాన్య ప్రజలపై మోయలేనిభారం మోపింది. ఓట్ల కోసం ప్రజల కాళ్లావేళ్లా పడిన కాంగ్రెస్‌ కేవలం పాస్‌ మార్కులతో గద్దెనెక్కి కొద్దిపాటి ఏమరపాటు కోసం కూడా ఆగకుండా తనకు ఓట్లేసినందుకు ప్రతిఫలంగా క్రూరమైన బహుమానం కట్టబెట్టింది. ఆర్థిక మాంద్యం అష్టదిగ్బంధనంలో దేశం చిక్కుకున్న తరుణంలో రోజురోజుకూ వేలు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఊడుతున్న సమయంలో పెరిగిన పెట్రో భారం గోరుచుట్టుపై రోకలిపోటు. ద్రవ్యోల్బణం పెరగడంవల్ల నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని చెబుతూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అది తగ్గినా ధరలు చుక్కలు చూస్తుండటంపై కిమ్మనట్లేదు. ఇప్పటికే ఆకాశాన్ని చూస్తున్న ధరలు ప్రెట్రోవడ్డనతో మరింత ఎగబాకుతున్నాయి. పెట్రోల్‌ లీటరుకు నాలుగు రూపాయలు, డీజిల్‌ లీటరుకు రెండు రూపాయల చొప్పున పెంచి తక్షణం అవి అమల్లో పెడుతున్నామని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి మురళీదేవరా బుధవారం ప్రకటించారు. మరికొద్ది గంటల్లో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతుండగా పెట్రో ఛార్జీలు పెంచడం పార్లమెంట్‌ను అవమానపడరచడమే అవుతుంది. చట్టసభలకు జవాబుదారుగా ఉండాల్సిన ప్రభుత్వం ఆ పని చేయలేదు.

2, జులై 2009, గురువారం

పేదలు పప్పు ముఖం చూడగలరా?

0 వ్యాఖ్యలు
ధరలను తగ్గిస్తామని చెప్పిన వైఎస్‌ సర్కార్‌ తన వాగ్దానాన్ని నెరవేర్చింది. ఎన్నికలకు ముందు నెలకు 97 రూపాయలకు అందచేస్తున్న నిత్యావసర వస్తువులను ఇప్పుడు కేవలం 75 రూపాయలకే అందిస్తూ వైఎస్‌ సర్కార్‌ ఇప్పుడు తన ఖాతాలో మరో 'ఘనత'ను జమ చేసుకుంది. మంచం చాలకపోతే కాళ్లు నరికితే సరి అన్న సలహా పాటించిన ఫలితమే ఇది. జనం చెబుతున్నట్లుగా మార్కెట్లో అతినాసిరకం కందిపప్పును కిలో 30రూపాయలకు అందచేస్తామని చెప్పిన పెద్దలు ఇప్పుడు దాని ధరను ఏకంగా 45 రూపాయలకు పెంచేశారు. కిలోకు బదులు అరకిలోకు తగ్గించారు. ధరను కూడా పెంచింది. పామాయిల్‌, కందిపప్పు సరఫరా చేసినందుకు ఏడాదికి నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వంపై భారం పడుతుందని చెప్పిన పెద్దలు ఇప్పుడు ఆ మొత్తాన్ని దాదాపు ఐదోవంతుకు కోతకోశారు. కందిపప్పుపై సబ్సిడీ భరించలేనిదిగా తయారైందని పౌరసరఫరాలశాఖ కొత్త మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కందిపప్పు మొదటి రకం వెల 2006 మే నెలలో కిలో 33 రూపాయలు ఉంది. ఇప్పుడు మొదటి రకం రు.58.37, రెండవరకం రు.51.67 ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ నివేదించింది. ప్రభుత్వమే ఏకంగా తానిచ్చే పప్పుధరను పదిహేను రూపాయలు పెంచింది. లక్షకోట్లరూపాయల బడ్జెట్‌ ఉన్న ప్రభుత్వమే రాయితీ ధరలకు ఒక కిలో కందిపప్పు కూడా ఇవ్వలేకపోతే పేదలు పప్పు ముఖం చూడగలరా?

1, జులై 2009, బుధవారం

పాపం మమతా బెనర్జీ!

0 వ్యాఖ్యలు
మమతా బెనర్జీ లాల్‌ఘర్‌ ఆపరేషన్‌ రద్దు చేయాలన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, గ్రామీణులు భద్రతా దళాలకు మంచినీళ్లు ఇస్తున్నారంటూ మీడియా చెబుతోందని కాని అది అబద్ధమని, వారంతా సిపిఎంకు చెందిన వ్యక్తులని అన్నారు. అంతా నాటకమని, ముందుగా వేసుకున్న పథకమని, మావోయిస్టులు ఇళ్లుతగలబెడుతున్నారనే వార్తలు అవాస్తవమని మమత అన్నారు. ఛత్రధర్‌ మహతోను కలిసిన మేధావులపై కేసు పెట్టడాన్ని ఆమె వ్యతిరేకించారు. లాల్‌ఘర్‌ అరాచకాల్లో ప్రధాన దోషులు వీరే. దీన్నిబట్టి మమతకు మావోయిస్టుల పట్ల ఉన్న దృక్పథాన్ని, సంబంధాలను అర్థం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కార్యకలాపాల కారణంగా మావోయిస్టుల వ్యూహాలపై చీకట్లు కమ్ముకున్నాయి. వారి తుపాకుల శక్తి తగ్గిపోయింది. మావోయిస్టులకు మద్దతు విషయంలో డొల్లతనం బయటపడింది. మమత ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని నిన్న ఛత్రధర్‌ మహతో ప్రశ్నించారు. మమత ఇప్పుడు ప్రతిపక్షంలో లేరు కాబట్టి లాల్‌ఘర్‌ అరాచకాల బాధ్యత నుంచి ఆమె తప్పించుకోలేరు. మంగళవారం భద్రతా దళాలు కాంతాపహరి నుంచి కూంబింగ్‌ ప్రారంభించాయి. దళాలు పక్కా సమాచారం ఆధారంగా కూంబింగ్‌ చేస్తున్నాయి. సాధారణ ప్రజలు వీరికి సహకరిస్తూ మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. మావోయిస్టు యాక్షన్‌ స్క్వాడ్‌ సభ్యులు స్థానిక కేడర్‌ను వారి మానాన వారిని వదిలేసి జార్ఖండ్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. భద్రతా దళాలు లాల్‌ఘర్‌ ప్రాంతంలో మరో నెల రోజుల పాటు ఉంటాయి. రాష్ట్ర పోలీసులు ఇక్కడి ప్రజల భద్రత కోసం శాశ్వత శిబిరాలు ఏర్పాటు చేసుకోనున్నారు.