వీలుంటే నా నాలుగు లంకెలు ...

28, జులై 2009, మంగళవారం

మైఖెల్‌ జాక్సన్‌ - కళ, కాసులు, మీడియా!

3 వ్యాఖ్యలు
మైఖెల్‌ జాక్సన్‌ మరణించి నెలరోజుల కావస్తున్నా మీడియాలో ఆయన గురించిన కథలు నిరంతరాయంగా వెలువడుతూనే వున్నాయి.ప్రపంచాన్ని ఉర్రూతలూపించిన కళా స్రష్ట ప్రతిభా పాటవాల కంటే ఆయన మరణానికి సంబంధించిన మిస్టరీపైన,వ్యక్తిగత జీవితంలో నీలి నీడలపైన ఈ కథనాలు సాగుతుండడం ఆశ్చర్యకరమేమీ కాదు. పెట్టుబడిదారీ వ్యాపార వ్యవస్థ సహజ స్వభావాన్నీ, ప్రత్యేకించి మీడియాలో వేళ్లూనుకున్న వికృత పోకడలనూ మరోసారి కళ్లకు కట్టే సందర్భమిది.ప్రపంచ పాప్‌ సామ్రాట్‌ మైకెల్‌ జాక్సన్‌ హఠాత్తుగా మరణించాడన్న వార్త పెద్ద సంచలనమే సృష్టించింది. కళాభిమానులందరినీ కదిలించి .ఓ కన్నీటి బొట్టు మౌనంగా జారిపోయేలా చేసింది. ఆయన ఆనారోగ్యంతోనూ అనేక సమస్యలు సంక్షోభాలతోనూ పోరాడుతున్నాడని తెలిసినా యాభై ఏళ్లకే కన్నుమూస్తాడని మాత్రం ఎవరూ అనుకోలేదు.అలాటి సమాచారం కూడా రాలేదు. తీరా అది జరిగిన తర్వాత అనేక ప్రశ్నలు సందేహాలూ తలెత్తడం సహజమే. ఎందుకంటే మైఖెల్‌ జాక్సన్‌ జీవితమూ కళా ప్రస్థానమూ కూడా ప్రపంచానికి పెద్ద వార్తలే. నలుపు తెలుపు మేళవించిన విశ్వ కళా సంచలనం ఆయన. తన చిటికెన వేలు కదిలిస్తే వేలం వెర్రిగా ఎగబడిన కోట్ల మంది సంగీతాభిమానులు ఒకవైపు.. ఆ ప్రతి కదలికనూ అక్షరాలా కోట్ల డాలర్లలోకి మార్చిన సామ్రాజ్యవాద ధనస్వామ్య సంస్కృతి మరోవైపు కళ్లముందు నిలుస్తాయి. వాటన్నిటినీ లోతుగా తర్కించడం ఇబ్బంది అనిపించినా ఆ వ్యక్తిత్వంలో పెనవేసకుపోయిన లక్షణాలివి. ఆయన అసాధారణ ప్రతిభ, కృషి ప్రప్రథమంగా స్మరించుకోవలసినవి. అవే లేకపోతే ప్రపంచం ఆయనను ఇంతగా ఆరాధించేది కాదు. ఇప్పుడు దేశ దేశాలలో కవులు,కళాభిమానులు అశ్రుతర్ఫణ చేసే వారు కాదు. అయితే ఈ ప్రపంచంపై రాజకీయ ఆర్థిక ఆధిపత్యం సాగిస్తున్న శక్తులే సాంస్కృతిక ఆధిపత్యమూ చలాయించడం కూడా ఆయన పేరు మార్మోగడానికి ఒక ప్రధాన కారణం. ఇక్కడ అసాధారణ జనాభిమానం గల మాస్‌ హీరోలూ, వారితో స్టెప్పులేయించే నృత్యదర్శకులూ ఆయనను తాము ఎలా అనుసరించిందీ ప్రకటిస్తున్నారు. ఆ అవసరం లేకుండానే రీప్లే చేస్తున్న ఆయన స్టెప్పులను చూసిన మామూలు ప్రేక్షకులు అవన్నీ తమకు చిరపరిచితమైనవని గమనించి మన వాళ్ల అనుకరణ శక్తికి నివ్వెరపోతున్నారు. తెరపైనే గాక జీవితంలోనూ ఆ పాప్‌ వరవడి ప్రపంచాన్ని అమితంగా ప్రభావితం చేసింది. చాలా ఛానళ్లలో డాన్సు పోటీల పేరిట పిల్లలతో కూడా పిచ్చి పిచ్చి గెంతులు వేయించడం,వాటిపై సుదీర్ఘ విశ్లేషణాత్మక వ్యాఖ్యానాలూ వినిపించడం చూస్తూనే వున్నాం. దీనంతటిలోనూ ఆయన ప్రభావం సుస్పష్టం.ఇంతగా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఆయన ఆదాయం విలాస వైభవ జీవితం గురించిన కథలకు అంతేలేదు. నిజానికి ప్రజలకు కావలిసింది వారి కళ తప్ప ఖాతా పుస్తకాలు కాదు. కాని వ్యాపార వ్యవస్థలో క్రికెట్‌ ఆటగాడైనా కిక్కెక్కించే పాటగాడైనా రేటును బట్టే ప్రచారం. కళాకారుల ప్రసిద్ధికి ఇవన్నీ కొలబద్దలు కావడం కూడా మార్కెట్‌ సంసృతి విశ్వరూపానికి నిదర్శనం.

పాల్‌ రాబ్సన్‌ వంటి నల్లజాతి గాయకులు, మహమ్మదాలీ వంటి క్రీడాకారుల జీవితాలకు భిన్నమైన ధోరణి జాక్సన్‌ది. నల్లజాతి గుండెచప్పుడుగా మొదలైన మైఖెల్‌ దేహ వర్ణంతో సహా శ్వేతజాతి ఆధిపత్య సాంసృతిక ప్రతీకగా మారిపోవడం వెనక ఒక పెద్ద సామాజిక సందేశమే వుంది. చివరి దశలో ఆయన ఎదుర్కొన్నసమస్యలూ, సంక్షోభాలూ కూడా కళారంగంలో చొరబడిన కాలుష్యాన్ని పట్టి చూపిస్తాయి. దీనంతటికీ వ్యక్తిగతంగా ఆయన బాధ్యుడు కాదు. అయితే నమూనాగా నిల్చి పోయాడన్నది నిజం.పాశ్చాత్య దేశాల విశృంఖలత్వానికి జాక్సన్‌ ఒక ప్రతీక. దానికి తనే ప్రచారమిచ్చాడు.విపరీత ప్రచారమిచ్చే మీడియానే వికృత కథనాలను కూడా విస్త్రతంగా వ్యాపింప చేయడం ఈ సంసృతిలో భాగం. జాక్సన్‌ ప్రతి కదలికనూ వెంటాడి వేటాడి కథలల్లి కాసులు కురిపించుకోవడం ఇందుకు పరాకాష్ట.
జాక్సన్‌ జీవితంలోని అసహజత్వానికి ఈ అసహజ అవాంఛనీయ సంసృతికి చాలా సంబంధం వుంది. బాదాకరమైనా చెప్పుకోక తప్పని నిజమిది. చెవులు చిల్లులు పడే శబ్దాన్ని చేసే మెగాస్పీకర్లు కళ్లు మిరుమిట్లుగొల్పే విద్యుద్దీపాలు వేదికపై ఆయన విగ్రహాన్ని వైభవాన్ని అనేక రెట్లు పెంచి చూపించాయి. ఇదో కళాత్మక ప్యాకేజి తప్ప కేవలం కళ కాదు.సంగీతం నాట్యం కంటే సాంకేతిక ఇంద్రజాలానిదే ఇక్కడ ఆధిక్యత. పెప్సీ ఉత్పత్తులకైనా ప్రత్యేక సంచికల అమ్మకానికైనా ఆకర్షణగా జాక్సన్‌ అక్కరకు వచ్చాడు. కథల్లో దురాశకు ప్రతిరూపాలైన రాజుల్లాగా మరుగుదొడ్లను కూడా బంగారు తాపడం చేయించుకుని అదో ప్రచారం పొందాడు. ఇదంతా అయ్యాక నల్ల రంగును భరించడం కష్టమై పోతుంది. దాన్ని వదిలించుకోవాలి. అందుకే అత్యాధునిక శస్త్ర చికిత్స. దానికి మరేదో కారణం చెప్పినా ఈ ఆకర్షణ కోణం కాదనలేని సత్యం. అంటే మనం మనంగా మనిషి మనిషిగా మన్నన పొందడం కాదు. వేషము మార్చెను భాషను మార్చెను అసలు తానే మారెను అన్నట్టుగా మారిపోవడం! అయినా అతని ఆరాటం తీరలేదు. అలా తీరదు కూడా. మన దేశంలో కూడా డబ్బు వుంటే చాలు శరీరాన్నే మార్చుకోవచ్చన్న ప్రచారాలు మహా జోరై పోయాయి. మధ్య తరగతి మనుషులు కూడా ఈ మోజులో తమను తాము కోల్పోతున్నారు. జుట్టు తెల్లగా వుంటే మొహంపై మొటిమలు మొలిస్తే ముడుతలు వస్తే జీవితమే వృధా అన్నంత నిరాశ. దాన్ని పారదోలడానికి సౌందర్య చికిత్సలు, సాధనాలు! పాలిపోయిన మొహంతో ప్రాణం లేని బొమ్మలా జాక్సన్‌ ముంబాయిలో చేసిన విన్యాసాలను అప్పట్లొ జానీలివర్‌ అద్భుతంగా అనుకరించి హాస్యం చేశాడు.చనిపోయాక పదే పదే వేస్తున్న పాత క్లిప్పింగులలో నల్లవజ్రంలా వున్న జాక్సన్‌కూ ఆఖరి దశలో ఆయన పాలిపోయిన ప్రతిరూపానికి పోలికెక్కడీ అందుకే ఆయన విఖ్యాతిలోనూ విషాదాంతంలోనూ కూడా పెద్ద సందేశం వుంది.
జాక్సన్‌ మరణానంతరం కూడా రోజుకో కథ. ఆయన కుటుంబం, సంబంధాలు, పిల్లలు, స్వలింగ సంపర్కాలు ఇలాటివాటినే ప్రపంచమంతా వెదజల్లుతున్నారు. ఆయన హత్యకు గురైనాడని దాదాపు ఖాయంగా చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు తేల్చవలసిందే. దోషులను శిక్షించవలసిందే. నిజమైనా ఇందులో పెద్దగా చెప్పుకోవలసిందేమిటన్నది మరొకటి. ప్రపంచాన్ని ఉర్రూతలూపిన ఆయన కళా ప్రతిభ తప్ప కళంకితమైన వ్యక్తిగత పోకడలు కాదు. కాని వాటితోనే వూదరగొట్టడం హీనమైన అభిరుచులను అందుకోవడానికి తప్ప మరెందుకు పనికి వస్తుంది?జాక్సన్‌ కోసం విలపించిన వారు,గుండెలు బాదుకుని ఏడ్చిన వారు ఆయన కళా ప్రతిభను కదా ఆరాధించింది? దాన్ని కాస్తా పక్కనపెట్టి ఆయన ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడో ఆయన పిల్లలు ఆయనకు పుట్టారో లేదో వీటిపై విభిన్న కథనాలలో ముంచి తేల్చడం ఎవరి కోసం? ఇలాటి కథలు చెప్పుకోవడానికి జాక్సన్‌ అయినా జాంబవంతుడైనా తేడా ఏముంటుంది?అంటే సందర్భం ఏదైనా సదరు వ్యక్తి ఎవరైనా సంసృతి మార్కెట్‌లో సరుకుగా ఏది చలామణి అవుతుందన్న ఆలోచన తప్ప మరొకటి వుండనే వుండదు.చావైనా బతుకైనా ఈ వేటలో ఒకటే. సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది , తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు అన్న శ్రీశ్రీ శైలికి భిన్నంగా కొందరిని మహాకర్షనీయులుగా చేసి ఆ గోప్ప వారి చెత్త కబుర్లలో ముంచెత్తడం ఒక వ్యాపార సూత్రం. గతంలో రాజకుమారి డయానా ప్రమాద మరణం సందర్బంలో ప్రపంచ మీడియా పేపరాజ్ఞి గురించి పశ్చాత్తాపం ప్రకటించింది. ఆమె వర్ధంతి నాటికి బ్రిటిష్‌ మీడియా అధికారికంగానే ఆత్మ విమర్శ చేసుకుంది.క్షమాపణలు చెప్పింది. కాని ఫలితమేమిటి? జాక్సన్‌ విషయంలో ఆ వికృతం మరింత ఘోరంగా అక్షరాలా పైశాచికంగా పునరావృతమవుతున్నది.ఆయన ఆత్మను చిత్రించామని ఎవరో విడియో చిత్రాలు విడుదల చేస్తే విశ్వవ్యాపితంగా ప్రసారం చేయడం విజ్ఞతనూ విజ్ఞానాన్ని ఎగతాళి చేయడమే. నేటి సాంకేతిక విజ్ఞానంతో ఇలాటి చిత్రాలు తయారు చేయడం చాలా తేలికని అందరికీ తెలుసు.నిజానికి జాక్సన్‌ ప్రదర్శనలలో ఇంతకన్నా విచిత్రాలనే చూపించాడు. కాకపోతే అది కల్పన అని మనకు తెలుసు. ఇప్పుడు ఆ సాంకేతిక ఇంద్రజాలంతో ఆయన బతికున్నట్టు చూపిస్తున్నారంటే ఎంతటి బరితెగింపు? శాస్త్ర సాంకేతిక విజ్ఞానం స్వేచ్చా స్వాతంత్రాలు తమ స్వంతమైనట్టు చెప్పుకునే అమెరికా మీడియా పోకడలు అసహ్యం పుట్టిస్తాయి. ఉద్వేగాలతో వీలైనంత ఎక్కువ స్థాయిలో ఎక్కువ కాలం వ్యాపారం చేసుకోవడం తప్ప వాటికి వాస్తవాలతో నిమిత్తం వుండదు. తన పిల్లలను జాక్సన్‌ పిల్లలుగా ప్రచారం చేశానని హత్యారోపణలు ఎదుర్కొంటున్న ఆయన వ్యక్తిగత వైద్యుడు చెప్పడంలోనూ దాగి వుండేది ప్రచారం ద్వారా ఎక్కువ సొమ్ములు రాబట్టవచ్చునన్న అంచనానే.నీ గురించి మంచో చెడో ప్రచారం జరగడం మేలు అన్నది పాశ్చాత్య మీడియా ప్రధాన సూత్రం. దాని వికృత విశ్వరూపమే జాక్సన్‌ మరణానంతర విపరీత కథనాలు, ఆత్మ సందర్శనాలూ!

27, జులై 2009, సోమవారం

రిలయన్స్‌కు కేంద్రం ఊడిగం

2 వ్యాఖ్యలు

నయా ఉదారవాద విధానంలో భాగంగా దేశ ప్రజలకు చెందిన గ్యాస్‌ వంటి సహజ సంపదను స్వదేశీ, విదేశీ గుత్త పెట్టుబడిదారీ సంస్థలకు అప్పగించేందుకు గతంలో ఎన్‌డిఎ, ఆ తరువాత యుపిఎ ప్రభుత్వాలు ప్రైవేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేసి ప్రజా ప్రయోజనాన్ని బలి చేస్తున్నాయి. నూతన అన్వేషణ, లైసెన్సింగ్‌ విధానం (ఎన్‌ఇఎల్‌పి) కింద కృష్ణా-గోదావరి బేసిన్‌లో డి6 బ్లాక్‌లో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌)కు అప్పగించి, కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఉత్పత్తి పంచుకునే ఒప్పందం (పిఎస్‌సి), అలాగే గ్యాస్‌ ధరను నిర్ణయించేందుకు మంత్రుల సాధికార కమిటీ అనుమతించిన సూత్రం ప్రజా ప్రయోజనాలకు నష్టదాయమైనది. ఈ ఉదంతం తెలియచేస్తోంది. ఆద్యంతం ముఖేష్‌ అంబానికి చెందిన రిలయన్స్‌కు కేంద్ర ప్రభుత్వం ఎలా ఊడిగం చేస్తున్నదీ అంబానీ సోదరుల మధ్య గ్యాస్‌ సరఫరా, ధరలకు సంబంధించి ఇంతకుమునుపు బొంబాయి హైకోర్టులో, ప్రస్తుతం సుప్రీం కోర్టులో నడుస్తున్న వ్యాజ్యాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరి దాని కాపట్యాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నది. అంతర్జాతీయ పోటీ బిడ్డింగులో ఎంఎంబిటియు గ్యాస్‌ను 2.34 డాలర్లకు ఎన్‌టిపిసి విద్యుత్‌ ప్రాజెక్టులకు 17 ఏళ్ళ పాటు 12 ఎంసిఎండి గ్యాస్‌ సరఫరా చేసేందుకు అంగీకరించి ఆర్‌ఐఎల్‌ ఎంపికయింది. ఆ ధరకు గ్యాస్‌ సరఫరా చేసేందుకు ఆర్‌ఐఎల్‌ తిరస్కరించటంతో ఎన్‌టిపిసికి, దానికి మధ్య బొంబాయి హై కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నది. పోటీ బిడ్డింగులో నిర్ణయించిన ఈ ధర పిఎస్‌సిలో నిర్దేశించిన విధంగా పోటీ ప్రక్రియ ద్వారా (ఆర్మ్స్‌ లెంత్‌ సేల్‌) నిర్ణయించిన ధర అవుతుంది. అయితే, దానికి విరుద్ధంగా ఆర్‌ఐఎల్‌ ప్రతిపాదించిన మోసపూరిత సూత్రాన్ని అనుసరించి ప్రణబ్‌ ముఖర్జీ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల సాధికార కమిటి ఎంఎంబిటియుకు 4.20 డాలర్ల అధిక ధరను ఆమోదించింది. అంబాని సోదరులు ముఖేష్‌, అనిల్‌ల మధ్య వారి కుటుంబ ఆస్తుల పంపిణీ ఒప్పందంలో భాగంగా అనిల్‌కు చెందిన ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకు 17 ఏళ్ళ పాటు 28 ఎంసిఎండి గ్యాస్‌ను ఎంఎంబిటియుకు 2.34 డాలర్ల చొప్పున సరఫరా చేసేందుకు ఆర్‌ఐఎల్‌ అంగీకరించిది. ఆ విధంగా గ్యాస్‌ను అనిల్‌ ప్రాజెక్టులకు సరఫరా చేసేందుకు ఆర్‌ఐఎల్‌ తిరస్కరించటంతో అన్నదమ్ముల మధ్య బొంబాయి హై కోర్టులో వ్యాజ్యం నడిచింది. ఆ ఒప్పందంలో అంగీకరించిన విధంగా గ్యాస్‌ పరిమాణం, సరఫరా కాలం, ధరల ఆధారంగా ఇరు పార్టీలు నెల రోజుల్లో తగు ఏర్పాటు చేసుకోవాలని బొంబాయి హై కోర్టు జూన్‌ 15న తీర్పు ఇచ్చింది.

హై కోర్టు తీర్పుపై అన్నదమ్ములిద్దరూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా పార్టీగా చేరింది. ఆర్‌ఐఎల్‌ కాంట్రాక్టరు మాత్రమేనని, మంత్రుల సాధికార కమిటీ నిర్ణయించిన గ్యాస్‌ వినియోగ విధానం ప్రకారమే గ్యాస్‌ పంపిణీ జరగాలని, ఆర్‌ఐఎల్‌, ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ల మధ్య కుదిరిన కుటుంబ ఒప్పందంతో తనకు సంబంధం లేదని కేంద్రం పేర్కొంది. ఈ గ్యాస్‌, దాని ధర, పంపిణీపై అన్నదమ్ములిద్దరికి యాజమాన్య హక్కు ఏమీ లేదని పేర్కొంది. కాని, కేంద్రం విధానం అలాంటి సహజ సంపదను ప్రైవేటు గుత్త పెట్టుబడిదారీ సంస్థలకు దోచిపెట్టేదిగా ఉంది. పిఎస్‌సిలోని నిబంధనలు, పార్లమెంటులో ప్రభుత్వం ఇచ్చిన వివరణలు, మంత్రుల సాధికార కమిటీ సమావేశాల వివరాలు ప్రభుత్వం ఇప్పుడు సుప్రీం కోర్టులో చేస్తున్న వాదనలకు భిన్నంగా ఉన్నాయి. మంత్రుల సాధికార కమిటీ ఎంఎంబిటియుకు 4.2 డాలర్లుగా నిర్ణయించిన ధర ప్రభుత్వం గ్యాస్‌ విలువను మదింపు చేయడానికేనని, ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌లో విక్రయించే ధరను ప్రభుత్వం నిర్ణయించదని ఆ వివరణల సారాంశం. అంటే ఎటువంటి నియంత్రణ లేకుండా ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌లో తనకు ఇష్టం వచ్చిన ధరకు గ్యాస్‌ను విక్రయించుకోవచ్చుననేది ఈ వివరణల సారాంశం. గ్యాస్‌ వినియోగం విధానానికి సంబంధించి, ఒకసారి ప్రభుత్వం గ్యాస్‌ ఆధారిత ప్రాజెక్టులను, కర్మాగారాలను నెలకొల్పడానికి అనుమతించాక, వాటికి అవసరమైన గ్యాస్‌ కేటాయింపు చేయాలనేది నిర్వివాదాంశం. వాటిలో రాష్ట్రంలోని గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టులు, ఎన్‌టిపిసి, అనిల్‌ అంబానీల ప్రాజెక్టులు కూడా ఉంటాయి. గ్యాస్‌ విలువ మదింపు నిమిత్తమే మంత్రుల సాధికార కమిటీ 4.2 డాలర్ల ధరను నిర్ణయించిందన్న వాదన ప్రకారం, ప్రభుత్వ వాటాగా రావాల్సిన గ్యాస్‌ను ఆర్‌ఐఎల్‌ అమ్మడానికి అనుమతించే పక్షంలో ఆ ధర ప్రకారం ప్రభుత్వానికి చెల్లించాలనేది దానిలో ఇమిడి ఉన్న అంతరార్థం. ఆర్‌ఐఎల్‌ వాటాగా లభించే గ్యాస్‌ను మార్కెట్‌లో ఏ ధరకు విక్రయించినా, ఆ సంస్థ పెట్టిన పెట్టుబడిపై రెండున్నర రెట్ల మొత్తాన్ని పిఎస్‌సిలో అనుమతించిన విధంగా పొందటానికి 4.2 డాలర్ల లెక్కనే పరిగణించాలనేది ఈ వివరణలలో అంతర్లీనంగా ఉన్న మరొక అంశం. లేదా ఎంఎంబిటియుకు 4.2 డాలర్ల కన్నా అధిక ధరకు ఆర్‌ఐఎల్‌ గ్యాస్‌ను విక్రయిస్తే దానిని ఎలా సర్దుబాటు చేయాలనేది అనిశ్చితంగా ఉంటుంది. బొంబాయి హైకోర్టు తీర్పు ఇచ్చిన విధంగా ఆర్‌ఐఎల్‌ వాటా గ్యాస్‌ నుండే అనిల్‌ అంబాని గ్రూపుకు 2.34 డాలర్ల ధరకు గ్యాస్‌ సరఫరా చేస్తే తనకు వచ్చే నష్టం ఏమిటనేది కేంద్రం వివరించకుండా దాట వేయటం దాని మోసపూరిత వైఖరిని వెల్లడిస్తున్నది. ఎన్‌టిపిసి-ఆర్‌ఐఎల్‌ కేసులో తన విధానం ఏమిటనేది కేంద్రం స్పష్టం చేయకుండా దాట వేస్తున్నది. గ్యాస్‌ వినియోగం, ధరల నిర్ణయంపై తనదే అధికారం అనేది కేంద్రం విధానమైతే తాను కేటాయించిన వారికే, తాను నిర్ణయించిన ధరకే గ్యాస్‌ను విక్రయించాలని స్పష్టం చేయాలి. అమలు చేయాలి. పారదర్శకంగా నిర్ధారించగల న్యాయమైన పెట్టుబడి వ్యయం, సంబంధిత క్షేత్రంలో ఉత్పత్తి చేసేందుకు లభ్యమయ్యే నిర్ధారిత గ్యాస్‌, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల పరిమాణం ఆధారంగా, న్యాయమైన లాభంతో కూడిన విధానం వుండాలి. ఆ విధంగా స్వదేశీ గ్యాస్‌ విక్రయ ధరలను డాలర్లలో కాకుండా రూపాయిలలో కేంద్రం నిర్ణయించి, నియంత్రించాలి. అనుమతించిన గ్యాస్‌ ఆధారిత ప్రాజెక్టులు, కర్మాగారాలకు అవసరమైన గ్యాస్‌ను కేటాయించి, సకాలంలో సరఫరా జరిగేటట్లు చూడాలి. వాటి స్థాపక సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు వీలుగా అవి పనిచేసే ఉపయోగకరమైన జీవిత కాలానికి సరిపడే విధంగా గ్యాస్‌ కేటాయింపులను, ఉత్పత్తిని, సరఫరాను నియంత్రించాలి. అలా చేయకుండా, న్యాయస్థానాలలో కేంద్రం డొంకతిరుగుడు వాదనలు చేయటం ఆర్‌ఐఎల్‌కు ఊడిగం చేయటానికే.

    24, జులై 2009, శుక్రవారం

    విమానయాన సంస్థపై విష ప్రచారం

    3 వ్యాఖ్యలు
    విమానయాన సంస్ధకు అవసాన దినం సమీపించిందంటూ కార్పొరేట్‌ ప్రసారమాధ్యమం, యాజమాన్యం, మంత్రిత్వ శాఖ ప్రచారం చేస్తున్నాయి. అంతేకాక, 'నిర్వహణ లేదా వినాశనం ప్యాకేజీ' కింద వేతనాలు కోరకుండా పనులను చేయవలసిందిగా సిబ్బందిని కోరుతున్నారు. కాని లాభ నష్టాలకు సంబంధించిన వార్షిక బ్యాలెన్స్‌ పత్రాన్ని మాత్రం ప్రకటించటం లేదు.

    గత నెలలో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ (ఐఏ), ఎయిర్‌ ఇండియా (ఏఐ) సంస్ధలను ప్రభుత్వం విలీనం చేసింది. ఈ సందర్భంగా నేషనల్‌ ఏవియేషన్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఏసిఐఎల్‌) ఉద్యోగులను ఉద్దేశించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మాట్లాడుతూ తీవ్రంగానే బెదిరించారు. నిధులు లేవని చెపుతూ జూన్‌ నెల వేతనాలను ఆపివేశారు. ఇదే సమయంలో ఎయిర్‌ ఇండియా నష్టాలలో పడిందంటూ ప్రసారమాధ్యమం ప్రచారాన్ని అందుకున్నది. మంత్రిత్వ శాఖ ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రచారాన్ని చేయించింది. దాదాపు రూ.7,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని పత్రికలైతే ఈ నష్టాన్ని రూ.5,000 కోట్లుగా అంచనా వేశాయి. దాదాపు 35,000 నుంచి 50,000 వరకు వున్న సిబ్బందే ఎయిర్‌ ఇండియాకు పెను భారంగా తయారయ్యారన్న ప్రచారం జరిగింది. సిబ్బందిని తగ్గించాలని, వేతనాలలో కోత విధించాలని, వేతనాలను ఇవ్వటం ఆలస్యం అయినా సర్దుకుపోవాలని కార్పొరేట్‌ ప్రసారసాధనాలు సిబ్బందికి సుద్దులు చెప్పసాగాయి.

    విలీన గారడీ
    2004-05, 2005-06 సంవత్సరాలలో లాభాలను ఆర్జించిన అనంతరం 2006-07లో నిజానికి నష్టాలు లేనేలేవు. ఉన్నదంతా విలీనం పేరుతో జరిగిన గారడీయే. ఎయిర్‌ ఇండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌లను నాసిల్‌ (ఎన్‌ఏసిఐఎల్‌) పేరుతో విలీనం చేస్తున్నట్లు 2007-08 వార్షిక నివేదికలో పౌర విమానయాన శాఖ పార్టమెంటుకు తెలిపింది. ఈ విలీనం కారణంగా ససంస్ధ సామర్ధ్యం పెరగటంతోపాటు భారతదేశంలోనే అతిపెద్ద సంస్ధగా రూపొందగలదని, ఆదాయం విషయంలో ప్రపంచంలోనే 31వ స్ధానంలో నిలబడగలదని ఇంకాఇంకా పలు లాభాలు ఉండగలవని ఈ నివేదికలో చెప్పుకొచ్చింది. ఇన్ని ప్రయోజనాల గురించి చెప్పిన మంత్రిత్వ శాఖ పౌర విమాన పరిశ్రమ ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను విస్మరించింది. ఈ నెల 9వ తేదీన మంత్రి ఒక ప్రకటన చేస్తూ ప్రయాణీకుల తగ్గుదల, మార్కెట్‌లో పోటీ పెరగటం, ఇంధన వ్యయం పెరుగుదల వగైరాలు పెద్ద సమస్యలుగా మారాయని చెప్పారు. అయితే మంత్రిగారు ఏ ప్రాతిపదికపై ఈ విషయాలు చెప్పారు. విమానయాన సంస్ధలు రెండింటినీ విలీనం చేసేటపుడుగానీ, రూ.50,000 కోట్లు ఖర్చు చేసి 111 విమానాలు కొనుగోలు చేయాలనుకున్నపుడుగానీ లోతైన విశ్లేషణ జరిపారా? బలము, బలహీనత, అవకాశాలు, ప్రమాదాలు ప్రాతిపదికపై విశ్లేషణ జరపాల్సి వుంది. ప్రస్తుతం జరుగుతున్న వ్యాపారమేకాక మార్కెట్‌ ఇబ్బందులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితి వగైరాలను పరిశీలించాలి. ఇవన్నీ తెలియని విషయాలేమీ కాదుగదా? తప్పుడు విధానాలతో విమానయాన సంస్ధను సంక్షోభంలోకి నెట్టివేసి వాస్తవాలకు పాతర వేసినవాళ్ళే ఇప్పుడు ఉద్యోగులపై బాధ్యతను నెట్టివేస్తున్నారు. విమానయాన సంస్ధకు అవసాన దినం సమీపించిందంటూ కార్పొరేట్‌ ప్రసారమాధ్యమం, యాజమాన్యం, మంత్రిత్వ శాఖ ప్రచారం చేస్తున్నాయి. అంతేకాక, 'నిర్వహణ లేదా వినాశనం ప్యాకేజీ' కింద వేతనాలు కోరకుండా పనులను చేయవలసిందిగా సిబ్బందిని కోరుతున్నారు. కాని లాభ నష్టాలకు సంబంధించిన వార్షిక బ్యాలెన్స్‌ పత్రాన్ని మాత్రం ప్రకటించటం లేదు. 2007-08 సంవత్సరానికిగాను నాసిల్‌ మొట్టమొదటి వార్షిక నివేదికను తయారు చేసిన 15 నెలల తరువాత ప్రకటించారు. అకస్మాత్తుగా రూ.2226 కోట్లు నష్టం వచ్చినట్లుగా ఈ పత్రం తెలియచేస్తున్నది. అసలు ఈ పత్రాన్ని ప్రవేశపెట్టటంలో అసాధారణమైన జాప్యం ఎందుకు జరిగినట్లు? దీని తరువాతిదైన 2008-09 బ్యాలెన్స్‌ షీటు ఎక్కడ ఉన్నది? ఈ నెల 9వ తేదీన మంత్రిగారు ఒక ప్రకటన చేస్తూ ఈ ఏడాది నష్టం రూ.5,000 కోట్లు ఉండగలదని చెప్పారు. ఇవేమీ ఆడిట్‌ చేసి చెప్పిన లెక్క కాదు. కేవలం అంచనాలతో చెప్పినది మాత్రమే. బ్యాలెన్స్‌ షీట్‌ను చూడకుండా కార్పొరేట్‌ ప్రసారమాధ్యమం, ప్రభుత్వం కలసి ఉద్యోగులే నష్టాలకు కారణమని చెపుతున్నాయి.ఒకప్పుడు ఆకాశాన్నంటిన ఇంధనం ధరలు ఇప్పుడు నేలకు దిగిరావటంతో సర్‌ఛార్జ్‌ తగ్గే అవకాశం వచ్చిందని, మొత్తంమీద మున్ముందు సంస్ధకు లాభాలు రాగలవని గత డిసెంబరులో యాజమాన్యం చెప్పింది. కాని ఆరు నెలలు తిరగకముందే ప్లేటు మార్చింది. ''చూడండి మేము దివాళా తీశాము. వేతనాల చెల్లింపుకు మాదగ్గర మూల ధనం కూడా లేదు. సిబ్బందిని తగ్గించక తప్పదు.....'' అంటూ యాజమాన్యం ప్రకటన ఇచ్చింది. ఈ పరిస్థితిలో సంస్ధను ''నిర్వహించటమో లేక నాశనం'' కావటమో తేల్చుకోవలసి ఉంటుందని మంత్రి చెపుతున్నారు. ''నాశనం'' అంటే కొత్తగా దిగుమతి చేసుకుంటున్న 111 విమానాలతోపాటు విమానయాన సంస్ధను ప్రైవేటీకరించటమన్న మాట.

    విలీనం తరువాత జరిగిందేమిటి?
    ఎయిర్‌ ఇండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేసిన తరువాత 2007-08లో రూ.2226 కోట్లు నష్టం వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నష్టం 2008-09లో రూ.5000 కోట్లకు పెరగవచ్చునని కూడా తెలిపింది. విమాన సంస్ధలో ప్రధానమైనది ఇంధన వ్యయం.2008లో బారెల్‌ సగటు ధర 94.85 డాలర్లుకాగా, 2009లో ఇది 51.85 డాలర్లుగా ఉన్నది. అంటే 2009 జనవరి నుంచి జూన్‌ వరకు సంస్ధకు ఇది కొంత ఉపశమనాన్ని కలిగించే విషయమన్నమాట. ఇంతకుముందు ప్రకటించిన బాలెన్స్‌ షీటు ప్రకారం 2007-08లో సిబ్బంది వ్యయం మొత్తం వ్యయంలో 18.4 శాతం. లాభాలు ఆర్జిస్తున్న సెయిల్‌, భెల్‌ తదితర సంస్ధలతో పోలిస్తే ఈ వ్యయం హేతుబద్దమైనదే. విలీనానికి ముందు రెండు సంస్ధలు లాభాలలో నడిచాయి. కాని విలీనం తరువాత ఒక్కసారిగా నష్టాలు వచ్చాయి. 2005-06లో రెండు సంస్ధల ఆదాయం కలిపి రూ.15031 కోట్లు. 2007-08లో అంటే, విలీనం తరువాత స్వల్పంగా పెరిగి రూ.15257 కోట్లకు చేరింది. వ్యయం విషయానికి వస్తే రూ. 14923 కోట్ల నుంచి రూ.17,854 కోట్లకు పెరిగింది. ఇంతగా పెరగటానికి కారణమేమిటి? ఈ కాలంలోనే సిబ్బంది 1260కి తగ్గిపోయింది. ఇంధన వ్యయం కూడా తగ్గింది. కాగా వడ్డీల చెల్లింపులో పెరుగుదల ఉన్నది. 2005-06లో రూ.105 కోట్లు వడ్డీ చెల్లించగా 2007-08లో ఈ మొత్తం రూ.701 కోట్లకు పెరిగింది.విమానయాన సంస్ధను సక్రమంగా నడపాలంటే సిబ్బందికి నీతులు చెప్పటమేకాక, ప్రభుత్వం కూడా చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సి ఉంటుంది. అలా చేసినపుడు మాత్రమే విమానయాన సంస్ధ గతంలోవలెనే లాభాల బాట పడుతుంది.

    23, జులై 2009, గురువారం

    దేవుడు ఉన్నాడా? లేడా? లేడనుకుంటే మనుషులకు పూనకాలు ఎందుకు వస్తున్నాయి?

    8 వ్యాఖ్యలు
    దేవుడు ఉన్నాడని కొందరు అంటారు. లేడని కొందరు అంటారు. ఇంతకూ దేవుడు ఉన్నాడా? లేడా? లేడనుకుంటే మనుషులకు పూనకాలు ఎందుకు వస్తున్నాయి? పూనకాలు వచ్చినవారు కేవలం నటిస్తున్నారా?
    - డి.కార్తీక్‌, 9వ తరగతి, బాలభారతి పాఠశాల, ఆదిలాబాదు.


    'దేవుడి'ని నమ్మేవారే వివిధ రకాలుగా భాష్యం చెబుతారు. ఈ విశ్వం మొత్తంలో ఉన్న క్రమానుగతినే మనం 'దేవుడు' అంటాము - అని కొందరంటారు. 'క్రమాను గతి' తెలుగు వ్యాకరణం ప్రకారం 'నపుంసకలింగా'నికి సంబంధించిన పదం. కాబట్టి 'దేవుడు' అంటూ పుంలింగాన్ని ఆపాదించకుండా 'దైవం' అని ఆ క్రమానుగతిని వారు పేర్కొంటే ప్రపంచంలో ఎవరికీ అభ్యంతరంలేదు. విశ్వంలో క్రమానుగతి తప్పకుండా ఉంది. 'దైవం' అనే పదం ఆ క్రమానుగతికి మరో పర్యాయపదం అని మనమూ, ప్రపంచంలోని అందరూ సర్దుకుపోగలము. ఈ విషయంలో కరుడుగట్టిన నాస్తికవాదులకు కూడా అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు.
    మానవజాతికి, ఇతర జీవజాతులకు ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే మానవుడే ఆలోచిస్తాడు. క్రమమేమిటో, అక్రమమేమిటో గుర్తిస్తాడు. సాధారణ విషయాలేవో, అసాధారణ విషయాలేవో పసిగడతాడు. తన ప్రాణానికి, తనతోటి బృందపు సంక్షేమానికి ప్రమాదం వాటిల్లినపుడు ప్రమాదం కల్గించే అంశాలనే మార్చి ప్రమాదరహితంగా రూపొందిస్తాడు. ఆ క్రమంలో తనకర్థంగాని వాటిపట్ల, అసాధారణ విషయాలైన గ్రహణాలు, తోకచుక్కలు, వరదలు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు, సునామీలు, తుపానులు, ఇంద్రధనస్సులు, ఉరుములు, మెరుపులు వంటి అరుదైన సంఘటనలపట్ల విస్మయము, సంభ్రమము, భయాందోళనలు చెందేవాడు. ప్రతి మానవ కార్యక్రమంలో మనిషి ప్రయత్నపూర్వక హస్తమున్నట్లే ఇలా అరుదుగా సంభవించే సంఘటనల పట్ల కూడా ఎవరో మానవాతీతవ్యక్తి లేదా శక్తి ప్రమేయం ఉండవచ్చునని ఊహించాడు. ప్రజల్లో సహజంగా ఉండే ఇలాంటి సందిగ్ధతను, సందేహాలను, 'దేవుడు', 'దయ్యం', 'పూజలు', సంతుష్టిపరిచే 'పబ్బాలు', 'మొక్కులు', 'బలులు', 'అప్పగింతలు', 'త్యాగాలు', 'ఆలయ నిర్మాణాలు', అనే తంతుతో పాలకవర్గాలు మొగ్గలోనే తుంచి అక్కడికక్కడ సర్దిచెప్పేవి. ఈ విధమైన తాత్కాలిక ఉపశమనంతో సర్దిచెప్పడం వల్ల ప్రజల హేతువాద దృక్పథం, తార్కిక విశ్లేషణ, సంపూర్ణ సత్యాన్వేషణాసక్తి రాటుదేలేవి కావు. క్రమేపీ 'దేవుడు', 'దయ్యం' భావాలు ప్రజల్లో ఉంటే పాలకవర్గాలకు మరింత ఊతంగా ఉండేలా సంస్కృతి, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితులు నెలకొన్నాయి. గత చరిత్ర అంతా ఈ విధంగానే నడిచింది. మానవజాతిలో ఏర్పడిన భౌగోళిక, భాషా పరిణామాలకు అనుగుణంగానే 'దేవుడు' అనే భావనలు, రూపాలు, దేవాలయాలు, ప్రార్థనామందిరాలు, స్వరూపాలు మారుతూ వచ్చాయి. మానవాతీతశక్తులు, ఏది కావాలంటే అది చేయగల మహా మహా అద్భుత కార్యకలాపాలు 'దేవుడి'కి ఆపాదించడం జరిగింది. 'దేవుడు' పాలకులకు మొదటి మిత్రుడయ్యాడు. పాలితులకు సర్దిచెప్పే సలహాదారుడయ్యాడు. యథాతథ సమాజ రూపానికి దన్నుగా నిలిచాడు. మార్పు అవసరంలేని పరిస్థితికి ఆలంబనగా తోడయ్యాడు. మనిషి ఎదుర్కొనే ప్రతి కష్టానికి, సుఖానికి, దుఃఖానికి కారణ భూతుడయ్యేలా అదే మనిషి నమ్మే పరిస్థితికి చేరుకున్నాడు.

    శక్తి సామర్థ్యాలు, రూపురేఖలు, జన్మ వృత్తాంతాలు ఆయా సమాజాల్లోని మానవ సమూహాల అభిరు చుల కనుగుణంగా 'దేవుడు', 'దైవభావన' రావడం వల్ల దేవుళ్ళు చాలామందయ్యారు. అది ఏ మానవ సమూహమైనా, వర్గ సమాజంగా ఉన్నంతవరకు ఆ దేవుడి రూపురేఖలు, ఇతర శక్తియుక్తులు, ప్రతిభలు వేర్వేరుగా ఉన్నా ఆయావర్గ సమాజాల్లో పాలకవర్గానికి బలాన్ని చేకూర్చే దేవుళ్ళుగానే వర్ధిల్లారు. వివిధ సంస్కృతులు, అలవాట్లు, భాషలు, దైవభావనలు ఉన్న మానవులు సార్వత్రిక సమస్యల పట్ల ఐక్యమవుతున్న సందర్భాలలో అదే పాలకవర్గాలు ఆయా జాతులకు అత్యంత ప్రీతిపాత్రమైన వారి వారి దేవుళ్ల భావాల మధ్య అనైక్యతను సృష్టించేవారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేవారు. నేటికీ ఇటువంటి పరిస్థితులు భారతదేశంలో ఇతర దేశాల్లోనూ కొనసాగుతున్నాయి. మనిషి కష్టాలకు కారణాలు వర్తమాన ప్రపంచంలోనే, నిజజీవితంలోనే ఉన్నాయనీ, ఆ కష్టాల నివృత్తికి సమిష్టిగా పరిష్కారమార్గాలను అన్వేషించాలనీ మానవులందరూ తెలుసుకున్న రోజు 'దేవుడి' భావన ప్రజలకు అవసరం ఉండదు.

    పేదరికం, దుఃఖం, వేదన, అనారోగ్యం, ఆకలి, దప్పిక, అవిద్య, క్రూరత్వం, అమానుషత్వం ప్రకృతిలో సహజమైనవి కావు. అవి ప్రకృతిలోని క్రమత్వానికి సాక్ష్యాలు కానేకావు. క్రమత్వానికి, సర్వశక్తి సంపన్నతకు ఆలవాలమైన దేవుణ్ణి నమ్మే ప్రతి సామాజికవర్గం తమ వేదనల్ని, కష్టాల్ని పోగొట్టమని వేడుకోని రోజు ఉండదు. కొన్నివేల సంవత్సరాలుగా ఆ దేవుణ్ణి పేరు పేరునా ప్రార్థిస్తున్నారు. పదే పదే పూజలు చేస్తున్నారు. కానీ వేదనలు, నొప్పులు, అకాలమరణాలు, క్రూరమైన సంఘటనలు, కష్టాలు, దుఃఖాలు మెజారిటీ మనుషుల్ని పీడిస్తూనే ఉన్నాయి. గత జన్మ పాపులుగా వారికో స్టిక్కరేసి 'మీ ఖర్మ ఇంతే' అని వారిని గిరాటేస్తున్నారు. 'చేసేది, చేయించేది, నడిపేది, నడిపించేది, కదిలేది, కదిలించేది, బాధపడేది, బాధపెట్టించేది, దుఃఖించేది, దుఃఖాన్ని కల్గించేది ఆ దేవుడేనని కష్టాల బయటున్న వారు అంటుంటే అర్థంచేసుకోలేని దయనీయపుటజ్ఞానపు మత్తులో ప్రజలుంటున్నారు. వేదన, మనోవేదన రెండింటినీ భరించేకంటే తాత్కాలిక ఉపశమనంగా మనోవేదనను మరిపించేలా విషపూరితం కాని మత్తు ద్రవ్యంగా 'దేవుడి భావన', 'దేవుడి దయ', 'దైవేచ్ఛ', 'దేవుడి లీలలు' వంటి భావజాలాలు ఉపకరిస్తున్నాయి.

    క్రమత్వానికి ఆపాదించబడిన దైవభావన కేవలం ఊహలకే పరిమితమయిపోయింది. కోరికలు తీర్చేవాడిగానూ, దుష్టులని కొందరిని తయారుచేసి వారిచేత దుష్టకార్యక్రమాలను తానే చేయించి ఆ బాధలు పడేవారిని తానే తన దగ్గరకు 'దేవా రక్షించు' అని రప్పించుకొని మళ్లీ తానే దుష్ట సంహారం చేసే అర్థంగాని మనసున్నవాడిగానూ దేవుడు కీర్తించబడుతున్నాడు. పూజలు అందుకుంటున్నాడు. ప్రపంచంలో మెజారిటీ ప్రజలకు కనిపించని బంధువు అయ్యాడు.

    'దేవుడు ఉన్నాడా?' 'లేడా?' అన్న ప్రశ్నకు సమాధానం వెదికి తలబద్దలు కొట్టుకొనేకన్నా మనిషే మానవ చరిత్రను నడిపాడనీ, మనిషే దేవాలయాలను నిర్మించాడనీ, మనిషే విగ్రహాలను రూపొందించాడనీ, మనిషే పురాణ గ్రంథాల్ని రచించాడనీ, మనిషి అప్రమత్తంగానే శ్రమద్వారా, ప్రయత్న పూర్వకంగా చేసిన కార్యక్రమాలే మానవ జీవితాన్నీ, నాగరికతనీ, సంస్కృతినీ, వేదాంతాన్నీ, తత్త్వశాస్త్రాన్నీ రూపొందించాయన్న తిరుగులేని సత్యాన్ని అందరం నమ్ముదాము.

    దేవుడి మీద నమ్మకానికీ, పూనకాలకూ సంబంధం ప్రత్యక్షంగా ఏమీ లేదు. నువ్వన్నట్లు చాలా మంది పూనకందార్లు ఏదారీ లేక పూనకపు దార్లు తొక్కుతున్నారు. హిస్టీరియా జబ్బుతో కొందరు, బాధలు వెళ్లగక్కుకోవడానికి మరికొందరు పూనకాలను పూనుకుంటున్నారు.