4, జులై 2009, శనివారం
రాష్ట్రాల హక్కులను హరించే కేంద్ర వైఖరి
పాఠశాల విద్య ప్రధానంగా రాష్ట్రాలకు సంబంధించిన అంశం. ఎమర్జన్సీ సమయంలో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. తదనంతర కాలంలో ఈ రంగానికి సంబంధించి పలు చర్యలను చేపట్టటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యా రంగాన్ని కేంద్రీకృతం చేసింది. రాష్ట్రాలకు దీనిలో నామమాత్రపు జోక్యం మాత్రమే మిగిలింది. అయితే పాఠశాల విద్యకు సంబంధించి ఆయా రాష్ట్రాల సామాజిక, సాంస్కృతిక, భౌగోళిక తదితర అంశాల ప్రాతిపదికపై పాఠ్యాంశాలను రూపొందించే విశిష్టమైన హక్కు రాష్ట్రాలకు ఉన్నది. రాష్ట్ర బోర్డుల ద్వారా పాఠశాల పరీక్షలు జరుగుతాయి. కనుక పరీక్షలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఏకపక్షంగా ప్రకటన చేయటమంటే, అది రాష్ట్రాల హక్కులను ఉల్లంఘించటం, పాఠశాల విద్యకు సంబంధించి రాష్ట్రాల అధికారాలను లాగివేయడమే అవుతుంది. అఖిల భారత స్ధాయిలో 12వ తరగతికి ఒకే బోర్డు అధ్వర్యంలో పరీక్షలను నిర్వహించటమంటే వివిధ రాష్ట్రాలలోని వైవిధ్యానికి పాతర వేయడమే అవుతుంది. ఆయా రాష్ట్రాలలో నెలకొన్న సంస్కృతికీ, పరిస్థితులకూ అనుగుణంగా పాఠశాల స్ధాయిలో విద్యా బోధనకుగాను రాష్ట్రాలకున్న స్వయం ప్రతిపత్తిని లాగివేయడమే అవుతుంది. ఈ ప్రతిపాదనలు ఆచరణలోకి వచ్చినట్లయితే పాఠశాల స్ధాయిలో రాష్ట్రాలకు ఎలాంటి పాత్రా లేకుండా పోతుంది.
3, జులై 2009, శుక్రవారం
నమ్మకాన్ని సొమ్ము చేసుకొంటున్న టాటా
ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద వాణిజ్య సంస్థల్లో ఒకటైన టాటాగ్రూప్ గతకొద్ది వారాలుగా ఇంటిని చక్కదిద్దుకోవటానికి తీవ్ర ప్రయత్నాలు సాగించింది. 2006, 2007ల్లో టాటా మోటార్ కంపెనీ ఆంగ్లో-డచ్ స్టీల్ కంపెనీ 'కోరస్'ను, విలాసవంతమైన కార్ల బ్రాండు ''జగార్'', ''లాండ్ రోవర్''లను కొన్నది. టాటా గ్రూపు మోయలేని భారాన్ని నెత్తికెత్తుకొంటోందని ఆర్థిక నిపుణులు అప్పుడే వ్యాఖ్యానించారు. ఆటోమొబైల్ రంగం ఒడిదుడుకులకు గురవుతున్న సమయంలో ఈ బ్రాండ్లను కొనటానికి టాటాలు చెల్లించిన ధర ఎక్కువగా వుందన్న విమర్శలు కూడా వచ్చాయి.
అంతర్జాతీయ సంక్షోభంతో ఈ సంస్థలు నష్టాలు చవిచూడడంతో ఒక అంచనా ప్రకారం టాటా గ్రూపు అప్పు మొత్తం 2009 నాటికి లక్ష కోట్లు రూపాయలకు చేరింది. గత సంవత్సరం కంటె ఇది 30వేల కోట్లు ఎక్కువ. కోరస్, జగార్‌లు నష్టాలబారిన పడ్డాయి. వీటిని పూడ్చడానికి కొత్తగా నిధులు సమకూర్చు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో టాటాగ్రూపుపై వచ్చిన విమర్శలు సహేతు కమని తేలిపోయింది. కానీ అప్పట్లో టాటాలు ఈ విమర్శలను కొట్టివేశారు. మారిన ప్రపంచ పరిస్థితులను అర్థం చేసుకోలేకపోయారని, టాటా గ్రూప్ అంతర్గత శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారని చెప్పుకొన్నారు.
విమర్శకుల వాదనలను మీడియా, ప్రభుత్వం కూడా ప్రక్కన పెట్టింది. ఈ కొనుగోలును, దీనితో పాటు జరిగిన ఇతర విదేశీవ్యాపార సంస్థల కొనుగోలును మీడియా ఆకాశానికి ఎత్తింది. అంతర్జాతీయమార్కెట్లో భారతీయ కంపెనీల ప్రతిభాపాటవాలకు నిదర్శనంగా ఈ కొనుగోళ్లను చూపించారు. భారీగా వున్న విదేశీమారక ద్రవ్యనిల్వలు ప్రభుత్వానికి ధైర్యానిచ్చాయి. ప్రభుత్వం కూడా ఈ కొనుగోళ్ళకి ప్రోత్సాహానిచ్చింది. సరళీకృత ఆర్థిక విధానాల అమలు తరువాత ప్రభుత్వానికి, ప్రయివేటు పెట్టుబడికి పెరుగుతున్న సమన్వయానికి ఇది ఒక ఉదహారణ.
ఈ కొనుగోలు అనంతరం కొన్ని నెలలలోనే ప్రపంచ ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చింది. ఆటోమొబైల్, స్టీల్‌రంగాల్లో అమ్మకాలు, ఆదాయాలు అనుకున్నదానికంటే బాగా పడిపోయాయి. ఉన్న అప్పును తీర్చలేక రీఫైనాన్స్ చేయించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా మే 2009 నాటికి టాటాగ్రూపు జగార్ కోసం రూ.15000కోట్లు , కోరస్ కోసం రూ.22500 కోట్లు అదనంగా అప్పు చేయాల్సి వచ్చింది. గతవారం వరకు రీఫైనాన్స్ విధివిధానాల గురించి చర్చలు జరిగాయి. ఈ చర్చలను పరిశీలిస్తే టాటా గ్రూపు తిమ్మిని బమ్మిగా చేయడంలో దిట్టగా మారిందనేది అర్థమవుతోంది. ఎట్టి పరిస్థితులలోను కోరస్, జగార్ కంపెనీలను మూసివేయకుండా చూడాలని బ్రిటన్ ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది. బ్రిటన్ ప్రభుత్వ అసహాయ స్థితిని ఆసరాగా తీసుకుని టాటా మోటర్స్ రూ.3500కోట్ల అప్పుకు బ్రిటన్ ప్రభుత్వం నుండి గ్యారంటీ తీసుకుంది. మరో రూ.2380కోట్లు యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక నుండి అప్పుతీసుకుంది.
టాటాలు కొనుగోలు చేసిన కోరస్ స్టీల్ కంపెనీ టాటాగ్రూపు సహాయం లేనిదే ముందుకు వెళ్ళలేని దుస్థితిలో ఉంది. ఇప్పటికే టాటాలు రూ.21000 కోట్లు కోరస్‌ను కొనడానికి అప్పుతీసుకున్నారు. రీపైనాన్స్ చేయ వల్సిన పరిస్థితులలో రూ.1400కోట్లు మాతృ సంస్థ సహాకారంతో అప్పు తీర్చడానికి కోరస్ సిద్దపడింది. మాతృసంస్థను చూసే కోరస్‌కు రీపైనాన్స్ చేయడానికి రుణదాతలు సిద్ధపడు తున్నారు. జగార్ కంపెనీ నష్టాలను పూడ్చడానికే రూ.7000 కోట్లు టాటా గ్రూపు ఖర్చుపెట్టినట్లు సమాచారం. వీటి ప్రభావం టాటాగ్రూప్‌పై పడింది.
ఈ పరిస్థితులను అధిగమించటానికి, నిధులు సంపాదించడానికి టాటాగ్రూపు అనేక మార్గాలను అన్వేషించింది. దేశంలోని టాటాగ్రూప్ బ్రాండ్‌కి ఉన్న ప్రతిష్టను ఉపయోగించుకుంది. కంపెనీ రుణభారాన్ని షేర్‌హోల్లర్లపై నెట్టింది. టాటాస్టీల్ షేర్లను అమ్మడం, షేర్‌మార్కెట్, ఫిక్సడ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా రూ.5000 కోట్ల నిధులను సమీకరించి తనకున్న అప్పును టాటా మోటర్స్ కొంత తీర్చగలిగింది. టాటాగ్రూప్ భారతదేశ ప్రభుత్వ సహాయం కూడా తీసుకుంది. రెండు విదేశీ కంపెనీలను కొనేటప్పుడే అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం టాటాగ్రూప్కు కావల్సిన సహాయం చేస్తానని తెలియజేశారు. స్టేట్‌బ్యాంక ఆఫ్్ ఇండియా ఇతర పది బ్యాంకులతో కలిపి ఒక సిండికేట్‌గా ఏర్పడి దాదాపు రూ.4,200 కోట్ల రూపాయలను బాండురూపంలో టాటాకు నిధులు సేకరించిపెట్టింది. ఆర్థిక మంత్రి అండదండలు లేకుండా బ్యాంకులు ఈ రకంగా చేయవు. ప్రభుత్వరంగ బ్యాంకులు సహాయంచేయడం వలన, అంతర్జాతీయ బ్యాంకుల నుండి కూడా మంచి మద్దతు లభించింది. ఆ విధంగా జగార్ కంపెనీ కోసం తీసుకున్న రూ.5 వేల కోట్ల రూపాయల అప్పును రీపైనాన్స్ చేయడం సాధ్యపడింది.
టాటామోటర్స్ ఏప్రిల్ 2009న పీపుల్స్ కార్ ''నానో'' విడుదలచేసింది. 16రోజుల బుకింగ్ సమయంలో 2లక్షల కార్లు బుక అయ్యాయి. వీటికి డిపాజిట్ అమౌంట్‌గా రూ.2500 కోట్ల రూపాయలు వచ్చింది. ఇది ఒక రకంగా ప్రజల నుండి లోన్ తీసుకోవడం. 2010 చివరికి టాటాలు లక్ష కార్లు మాత్రమే వినియోగదార్లకిస్తారు. మిగిలిన లక్ష కార్లకోసం 2011 వరకు ఆగవల్సిందే ఈ కాలంలో వినియోగదారులకు కొంత వడ్డీ కూడా ఇస్తారు. మొత్తం మీద తమ బ్రాండ్‌ను ఉపయోగించుకొని సంక్షోభ సమయంలో గట్టెక్కడానికి ప్రజలనుండి టాటా నిధులు సేకరించగలిగింది. కోరస్, జాగర్ కంపెనీ కొనుగోలు నిర్ణయం తప్పయినప్పటికి కొనుగోలు ద్వారా ఏర్పడిన సంక్షోభం నుండి బయటపడడానికి తన బ్రాండును, ప్రభుత్నాన్ని, ప్రజలను టాటాగ్రూప్ ఉపయోగించుకుంది.