వీలుంటే నా నాలుగు లంకెలు ...

8, సెప్టెంబర్ 2019, ఆదివారం

చంద్రయాన్ 2: చంద్రుడిపై దిగడానికి నాసా అపోలో మిషన్‌కు 4 రోజులు పడితే, ఇస్రోకు 48 రోజులెందుకు

0 వ్యాఖ్యలు

చంద్రయాన్ 2Image copyrightISRO

భారత కీర్తి పతాకను విశ్వాంతరాలకు చేర్చిన ప్రయోగం చంద్రయాన్ 2. 2019 జులై 22న షార్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ చంద్రయాన్ 2 నింగికెగిసింది. అయితే ఇక్కడే ఓ చిన్న ప్రశ్న కొందరి మదిలో మెదులుతోంది. అదేంటంటే..
సరిగ్గా 50 ఏళ్ల కిందట అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిన అపోలో 11 అనే మానవ సహిత వ్యోమనౌక... నాలుగు రోజుల్లో గమ్యాన్ని చేరుకుని... చంద్రుడి మీద ల్యాండ్ అయ్యింది. కానీ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 మాత్రం చంద్రుడిని చేరుకోడానికి 48 రోజులు పడుతుంది.
50 ఏళ్ల కిందటే... అంత వేగంగా చేరుకోగలిగినప్పుడు.. ఇస్రో పంపిన చంద్రయాన్ ఇంకా వేగంగా వెళ్లగలగాలి కదా. కానీ ఎందుకు ఆలస్యంగా వెళ్తోంది అన్నదే సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న.

చంద్రయాన్ 2Image copyrightPIB

నాసా ప్రయాణం వెనుక..

1969 జులై 16న... అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి శాటరన్ ఫైవ్ ఎస్ఏ506 రాకెట్ సాయంతో నీల్ ఏ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఈ ఆల్డ్రిన్, మైఖెల్ కొల్లిన్స్ అనే ముగ్గురు వ్యోమగాముల్ని చంద్రుడిపైకి పంపింది.
జులై 16 ఉదయం 8గంటల 32 నిముషాలకు నింగిలోకి దూసుకెళ్లిన అపోలో 11... 102 గంటల 45 నిముషాలకు గమ్యాన్ని చేరుకుని, చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యింది. అంటే కేవలం నాలుగు రోజుల ఆరు గంటల్లోనే వారు గమ్యం చేరుకున్నారు. ఆపై వ్యోమగాములు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్‌లు చంద్రుడిపై దిగి, అక్కడి మట్టి, రాళ్లను సేకరించారు.
జులై 21న భూమ్మీదకు తిరుగు ప్రయాణం ప్రారంభించిన అపోలో 11 వ్యోమగాములున్న మాడ్యూల్ జులై 24న నార్త్ ఫసిఫిక్ సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అంటే భూమ్మీద నుంచి చంద్రుడి మీదకు వెళ్లి, అక్కడ పరిశోధనలు చేసి, తిరిగి భూమ్మీదకు రావడానికి వాళ్లకు కేవలం ఎనిమిది రోజుల 3 గంటలు మాత్రమే పట్టింది.
కానీ ఇస్రో చంద్రుడి మీద పరిశోధనల కోసం కేవలం ఆర్బిటర్, ల్యాండర్‌లను మాత్రమే పంపించింది. అయినా... అవి చంద్రుడిని చేరుకోడానికి 48 రోజులు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. ఇంత ఆలస్యం వెనుక చాలా పెద్ద కథే ఉంది.

చంద్రయాన్ 2Image copyrightGETTY IMAGES

ఎందుకింత ఆలస్యం..

చంద్రయాన్ 2 సుదీర్ఘ ప్రయాణం వెనుక సాంకేతికంగా చాలా కారణాలున్నాయి.
1969లో నాసా ప్రయోగించిన అపోలో 11 రాకెట్ బరువు ఇంధనంతో కలిపి దాదాపు 2800 టన్నులు. కానీ ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్వీ మార్క్ త్రీ రాకెట్ బరువు ఇంధనంతో కలసి 640 టన్నులే.
సాధారణంగా శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లే పీఎస్ఎల్వీ రాకెట్లు ఇంతింత బరువు ఉండవు. ఎందుకంటే అవి కేవలం శాటిలైట్లను తీసుకెళ్లి జియో సింక్రనైజ్డ్ లేదా జియో స్టేషనరీ ఆర్బిట్లలో ప్రవేశ పెడతాయి. కానీ చంద్రయాన్ ఇందుకు విభిన్నం. ఎందుకంటే చంద్రుడి దగ్గరకు వెళ్లాల్సిన వాహక నౌకలో ఇంధనంతో పాటు చాలా పరికరాలు ఉంటాయి. అందుకే ఇలాంటి ప్రయోగాలకు అత్యంత శక్తిమంతమైన రాకెట్లను వినియోగిస్తారు.
ఈ విషయంలో కూడా నాసా ప్రయోగించిన రాకెట్ల బరువు ఎక్కువే. భూకక్ష్యను దాటిన తర్వాత... చంద్రుడి వైపు ప్రయాణించిన అపోలో వ్యోమనౌక బరువు... 45.7 టన్నులు. ఇందులో 80 శాతానికి పైగా ఇంధనమే. అంటే అపోలో 11లో ఈగిల్ అనే ల్యాండర్ చంద్రుడి మీద దిగి, వ్యోమగాములు చంద్రుడి మీద దిగి, పరిశోధనలు చేశాక, తిరిగి ఆ ల్యాండర్ ఆర్బిటర్‌ను చేరుకుని, అది భూమ్మీదకు రావడానికి ఇంత ఇంధనం అవసరం.
అపోలో 11 ప్రయోగానికి ఉపయోగించిన రాకెట్ శాటరన్ ఫైవ్ ఎస్ఎఏ506 అత్యంత శక్తిమంతమైనది. అంత భారీ ఇంధనం, అంత భారీ రాకెట్ కాబట్టే... అపోలో 11 కేవలం నాలుగు రోజుల్లో నేరుగా ప్రయాణించి చంద్రుడిని చేరిందని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ బీజీ సిద్ధార్ధ్ తెలియ చేశారు.

చంద్రయాన్ 2Image copyrightTWITTER/ISRO

తక్కువ ఇంధనం... ఎక్కువ ప్రయాణం..

ప్రస్తుతం ఇస్రో దగ్గరున్న అత్యంత శక్తిమంతమైన రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్ త్రీ.
జులై 22న చంద్రయాన్ 2ను తీసుకుని నింగిలోకి దూసుకెళ్లినప్పుడు ఆ రాకెట్ మొత్తం బరువు 640 టన్నులు. ఈ రాకెట్ గరిష్టంగా నాలుగు టన్నుల బరువున్న శాటిలైట్లను మోసుకెళ్లగలదు. అంటే నాలుగు టన్నుల బరువైన చంద్రయాన్ 2ను జీఎస్ఎల్వీ మార్క్ త్రీ అంతరిక్షంలోకి తీసుకెళ్లి దానిని భూకక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. అక్కడి నుంచి చంద్రయాన్ 2 తనంతట తాను ప్రయాణించి చంద్రుడిని చేరుకోవాలి.
50 ఏళ్ల కిందట నాసా చేపట్టిన అపోలో 11 ప్రయోగంలో... ఇలా అంతరిక్షం నుంచి దూసుకెళ్లిన రాకెట్ బరువు 45 టన్నులకు పైమాటే. కానీ చంద్రయాన్‌లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్, ఇంధనంతో కలిపి మొత్తం బరువు 4 టన్నుల లోపే ఉంది. అంటే అతి తక్కువ ఇంధనంతో... చంద్రుడి దగ్గరకు చేరుకోవాలి. ఇందుకోసమే... ఇస్రో ఓ వినూత్న ఆలోచన చేసింది.
ఈ విధానంలో రాకెట్ నేరుగా చంద్రుడి మీదకు దూసుకెళ్లడానికి బదులుగా... భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ, క్రమంగా తన అపోజీని పెంచుకుంటూ వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఆపై భూ కక్ష్య నుంచి బయటపడి చంద్రుడి వైపు ప్రయాణం చేసి, అక్కడ నుంచి చంద్రుడి చుట్టూ ఇదేలా దీర్ఘవత్తాకార కక్ష్యలో తిరుగుతూ క్రమంగా తన అపోజీని తగ్గించుకుంటూ, చివరికి చంద్రుడి వైపు ప్రయాణించి, ఆ ఉపరితలంపై దిగుతుంది.

ఉపగ్రహ ప్రయోగంImage copyrightGETTY IMAGES

చంద్రయాన్ 2 ప్రయాణం సాగిందిలా...

ఈ విధానంలో జులై 22న అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 2... 23 రోజుల పాటు భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతూ... దాని అపోజీ పరిధి పెంచుకుంటూ పోయింది. 23వ రోజు భూ కక్ష్య నుంచి విడిపోయి... చంద్రుడి వైపు ప్రయాణం ప్రారంభించింది.
అలా ఏడు రోజులు నేరుగా చంద్రుడి వైపు ప్రయాణించిన తర్వాత... 30వ రోజున అంటే ఆగస్ట్ 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది.
ఇలా చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించడాన్నే లూనార్ ఆర్బిట్ ఇన్‌సర్షన్ అంటారు. అక్కడి నుంచి చంద్రుడి చుట్టూ 13 రోజులు పరిభ్రమిస్తూ... అపోజీ తగ్గించుకుని, చంద్రుడి మీదకు దిగేలా ప్రోగ్రామ్ చేశారు.
ఇలా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన 13వ రోజు... చంద్రయాన్ 2లోని ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుడి ఉపరితలం వైపు ప్రయాణించి, 48వ రోజు... ల్యాండర్ చంద్రుడి మీద దిగి, పరిశోధనలు చేసేలా ఇస్రో అంతా ముందుగానే ప్రోగ్రామ్ చేసింది.
ఒక్కసారి చంద్రయాన్‌లో ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద దిగిన తర్వాత, అందులో వివిధ రకాల సెన్సర్లు చంద్రుడిపై పరిశోధనలు చేసి, ఆ సమాచారాన్ని భూమ్మీదకు పంపేలా ఏర్పాట్లు చేశారు.
ఇక ల్యాండర్ నుంచి బయటకు వచ్చే రోవర్ ప్రజ్ఞాన్... చంద్రుడి మీద తిరుగుతూ... అక్కడి నేలను విశ్లేషించడంతో పాటు, మరిన్ని పనులు చేస్తుంది.
ఇలా ఇస్రో తన దగ్గరున్న రాకెట్ సామర్థ్యంతో, అతితక్కువ ఇంధనంతో విజయవంతంగా చంద్రుడిని చేరుకోడానికే ఇలాంటి విధానాన్ని ఎంచుకుంది. ఈ విధానం వల్లే అతి తక్కువ ఖర్చుతో ఇస్రో తన ప్రయోగాలు పూర్తి చేస్తోందని బీజీ సిద్ధార్ధ్ తెలిపారు.

చంద్రయాన్ 2Image copyrightISRO

అన్ని ప్రయోగాలకూ ఇదే పద్ధతి

2008లో ఇస్రో చంద్రయాన్ 1 ప్రయోగాన్ని 386 కోట్ల రూపాయల ఖర్చులో పూర్తి చేసింది.
ఆపై 2014లో మార్స్ మీదకు ప్రయోగించిన మంగళ్‌యాన్ ప్రాజెక్టు కూడా... 450 కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తి చేశారు. ఇదే మార్స్ మీదకు నాసా ప్రయోగించిన అమెరికా మావెన్ ఆర్బిటర్ ప్రయోగానికి ఇంత కన్నా పది రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టినట్లు... బీబీసీ సైన్స్ వెల్లడించింది. అప్పట్లో భారత్ చేపట్టిన మంగళ్‌యాన్ ప్రయోగాన్ని ప్రపంచమంతా కొనియాడింది. హాలీవుడ్‌లో భారీ వ్యయంతో స్పేస్ సినిమాలు తీస్తుంటే... అంత కన్నా తక్కువ ఖర్చుతో ఇస్రో మంగళ్‌యాన్ ప్రాజెక్ట్ పూర్తి చేసిందని ప్రధాని మోదీ కూడా కొనియాడారు.
ఇప్పుడు కూడా... ఇలాగే మీడియం లిఫ్ట్ హెవీ వెహికల్ అయిన జీఎస్ఎల్వీ మార్క్ త్రీ రాకెట్‌ని ఉపయోగించి కేవలం 978 కోట్ల రూపాయల అతి తక్కువ ఖర్చుతో ఇస్రో చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ పూర్తి చేసిందని, త్వరలో ఇదే తరహాలో గగనయాన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయబోతోందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్.శ్రీరఘునందన్ బీబీసీతో తెలియచేశారు.

చంద్రయాన్ 1లో ప్రయోగించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్Image copyrightISRO
చిత్రం శీర్షికచంద్రయాన్ 1లో ప్రయోగించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్

చంద్రయాన్-1లోనే చంద్రుడిపై ల్యాండర్

చంద్రయాన్ 1 ప్రయోగంలో ఇస్రో కేవలం ఆర్బిటర్ మాత్రమే ప్రయోగించిందని అంతా అనుకున్నారు. కానీ ఆ ప్రయోగంలో ఆర్బిటర్‌తో పాటుగా... మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌ను కూడా ప్రయోగించింది.
చంద్రయాన్ 1 లో ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ నిర్ణీత కక్ష్యలో తిరుగుతుంటే... మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ మాత్రం చంద్రుడి ఉపరితలంపై క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఆ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌కి నాలుగు పక్కలా భారతీయ జెండాను ఉంచారు. అలా చంద్రుడి మీద భారత జాతీయ పతాకం పదేళ్ల కిందటే కాలు మోపిందన్నమాట.
అంతే కాదు... ఈ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ఇచ్చిన సమాచారంతోనే చంద్రుడి మీద నీటి జాడలను ఇస్రో గుర్తించింది.
50 ఏళ్ల కిందట భారత్‌లో ఇస్రో ప్రస్థానం ప్రారంభం కావడానికన్నా ముందే అమెరికా తమ వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపి, అక్కడి శిలలను భూమికి తీసుకొచ్చింది.
ఆపైనా 1972 వరకూ నాసా 12 మంది వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపింది. కానీ చంద్రుడి మీద నీటి జాడలు మాత్రం అమెరికా సహా మరే దేశమూ కనిపెట్టలేకపోయింది. కానీ చంద్రయాన్ 1 తో ఇస్రో ప్రయోగించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ మాత్రం ఆ ఘనత సాధించిందని రఘునందన్ తెలిపారు.

ఇస్రోImage copyrightISRO

తొలి ప్రయత్నంలోనే ఇస్రో విజయం

అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చెయ్యడమే కాదు... అన్ని అంశాల్లోనూ దాదాపు తొలి ప్రయత్నాలతోనే విజయం సాధిస్తూ వస్తోంది ఇస్రో.
చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, మంగళ్‌యాన్ ప్రయోగాల్లో అత్యంత సంక్లిష్టమైన దశ... లూనార్ ఆర్బిట్ ఇన్‌సర్షన్. ఇది అనుకున్నంత సులువైన దశ కాదు. అమెరికా, రష్యాలు తొలినాళ్లలో 14 సార్లు ఈ దశ దగ్గరే విఫలమయ్యాయి. 15వ సారి మాత్రమే ఈ దశ దగ్గర విజయం సాధించాయి. కానీ ఇస్రో మాత్రం తొలి ప్రయత్నంలోనే చంద్రయాన్ 1 ప్రయోగంలో ఈ దశను విజయవంతంగా అధిగమించింది.
Nasa.gov వెల్లడించిన వివరాల ప్రకారం అపోలో 11 ప్రయోగంలోనే కాదు.. అంత కన్నా ముందుకూడా చాలా మందిని చంద్రుడి మీదకు పంపింది నాసా. కానీ వాళ్లంతా చంద్రుడి కక్ష్య వరకూ వెళ్లి, చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టి వెనక్కి వచ్చేశారు తప్ప చంద్రుడి మీద దిగలేదు. 1968 డిసెంబర్ 25న ఫ్రాంక్ బోర్మన్, బిల్ యాండ్రెస్, జిమ్ లోవెల్‌లతో కూడిన వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించి, తిరిగి వెనక్కి వచ్చేసింది. కానీ వాళ్లు చంద్రుడి మీద దిగకపోవడంతో... ఈ ప్రయోగం ప్రపంచానికి తెలియలేదు.

నాసాImage copyrightNASA

12 మందిని చంద్రుడిపైకి పంపిన నాసా

కేవలం అపోలో 11 ద్వారా ముగ్గురు వ్యోమగాముల్ని పంపడమే కాదు.. ఆ తర్వాత కూడా ఇలాంటి ప్రయోగాలు కొనసాగించింది నాసా.
1969 నవంబర్ 14న అపోలో 12 రాకెట్ ద్వారా మరో ముగ్గురు వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపింది. అలా 1972 డిసెంబర్ 7న అపోలో 17 చివరి సారిగా ముగ్గురు వ్యోమగాముల్ని పంపింది. ఇలా మూడేళ్ల వ్యవధిలో నాసా 12 మంది వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపింది.
ఆ తర్వాత చంద్రుడి మీదకు మనుషుల్ని పంపే ప్రయోగాలను నిలిపేసింది. ఈ విజయాల వెనుక నాసా ఎన్నో వైఫల్యాలను కూడా చవిచూసింది.
1967 ఫిబ్రవరి 21న నాసా అపోలో 1 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. కానీ రిహార్సల్ టెస్టింగ్ టైంలో క్యాబిన్లో మంటలు రేగడంతో... రాకెట్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యోమగాములతోపాటు 27 మంది సిబ్బంది మరణించారు.
ఇలా ఎన్నో విఫలయత్నాల తర్వాత... నాసా విజయవంతంగా చంద్రుడి మీద కాలు మోపింది.
కానీ ఇస్రో మాత్రం అతి తక్కువ ఖర్చుతో, తొలి ప్రయత్నాలతోనే విజయం సాధిస్తూ వస్తోందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ తెలియ చేశారు.

చంద్రయాన్ 2Image copyrightISRO

చంద్రయాన్‌లో ఏమున్నాయి..?

చంద్రయాన్‌లో ప్రధానంగా మూడు భాగాలున్నాయి. అందులో మొదటిది చంద్రుడి కక్ష్యలోనే తిరిగే ఆర్బిటర్‌. రెండోది జాబిల్లి మీద దిగే ల్యాండర్‌. దీనిపేరే విక్రమ్‌. ఇక మూడోది ఆ ల్యాండర్‌ చంద్రుడి మీద దిగిన తర్వాత బయటకొచ్చి చంద్రుడిపై కలియ తిరిగే రోవర్‌.. దీని పేరు ప్రజ్ఞాన్. ఈ మూడింటినీ కలిపి కాంపోజిట్‌ మాడ్యూల్‌ అంటారు.
ఇలా ఆర్బిటర్‌ను, ల్యాండర్‌ను ఒకేసారి పంపడం అంత సులువైన విషయం కాదు. ఇస్రో మాత్రం ఈ రెండింటినీ ఒకేసారి ఒకే రాకెట్‌తో ప్రయోగించేసింది. అంతేకాదు.. ఇందులో ఆర్బిటర్‌తో పాటు, చంద్రుడి మీద దిగే రోవర్‌ను కూడా.. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించింది.
ఇక్కడ మరో అద్భుతమైన విషయం గురించి కూడా ప్రస్తావించాలి. భూమ్మీద నుంచి చంద్రుడి మీదకు సిగ్నల్ పంపాలంటే 15 నిముషాలు పడుతుంది. అంటే ల్యాండర్ చంద్రుడి మీద దిగేటప్పుడు భూమ్మీద నుంచి దాన్ని కంట్రోల్ చెయ్యడం దాదాపు అసాధ్యం. అందుకే ల్యాండర్ తనంతట తానే నిర్ణయాలు తీసుకునేలా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రోగ్రామ్ చేశారని రఘునందన్ తెలియ చేశారు.

Source: BBC

Share via Whatsapp

చంద్రయాన్ 2: చిట్టచివరి నిమిషంలో ఏం జరిగింది.. వైఫల్యానికి కారణం ఇదేనా

0 వ్యాఖ్యలు

చంద్రయాన్Image copyrightISRO

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో వైఫల్యానికి ల్యాండర్ విక్రమ్‌లోని సెంట్రల్ ఇంజిన్‌లో తలెత్తిన లోపం కారణమై ఉండొచ్చని ఆ సంస్థకు చెందిన ఓ మాజీ శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు.
ఈ విషయంలో ఇస్రో ఇంతవరకూ ఏ ప్రకటనా చేయలేదు.
చంద్రుడి ఉపరితలానికి 2.1 కి.మీ.ల ఎత్తులో ఉండగా ల్యాండర్‌తో గ్రౌండ్ స్టేషన్‌కు కమ్యునికేషన్ తెగిపోయినట్లు మాత్రం శనివారం వేకువజామున ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ శివన్ వెల్లడించారు.
''సెంట్రల్ ఇంజిన్‌లో ఏదైనా పొరపాటు జరిగి ఉండొచ్చు. అవసరమైన థ్రస్ట్‌ను అది అందించలేకపోయినట్లుగా ఉంది. అందుకే, వేగాన్ని తగ్గించే ప్రక్రియ అనుకున్నట్లుగా జరగలేదు. ఫలితంగానే కమ్యునికేషన్ తెగిపోయి ఉంటుంది'' అని ఇస్రో మాజీ సభ్యుడు ప్రొఫెసర్ రొడ్డం నరసింహా బీబీసీతో చెప్పారు.
ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో స్క్రీన్లపై చూపించిన గ్రాఫ్‌ల ఆధారంగా నరసింహా ఈ వివరణ ఇచ్చారు. ఆ గ్రాఫ్‌ల్లోని రేఖల్లో ల్యాండర్ ఎత్తు, వేగం గురించి సమాచారం ఉంది.

చంద్రయాన్Image copyrightDD

''ల్యాండర్ గమనాన్ని చూపించే రేఖ నిర్ణీత పరిమితుల్లో ఉంటే అంతా సవ్యంగా ఉన్నట్లు. మూడొంతుల రెండు సమయం అది అలాగే సాగింది. కానీ, మరింత కిందకు వెళ్లగానే ఆ రేఖ పరిమితులను దాటింది. ఆ తర్వాత కొద్ది సేపు నేరుగా సాగి, పరిమితుల బయట దిశగా వెళ్లింది'' అని నరసింహా చెప్పారు.
''దీనర్థం ల్యాండర్ ఏదో కోల్పోయింది. అందుకే, మెల్లగా కిందకు పోవాల్సింది పోయి, వేగంగా పడటం ప్రారంభించింది. నిజానికి ల్యాండర్ సెకన్‌కు 2 మీటర్ల వేగంతో చంద్రుడి ఉపరితలంపై దిగాలి. లేకపోతే, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ల్యాండర్‌ను వేగంగా కిందకు పడేలా చేసి ఉండొచ్చు'' అని ఆయన వివరించారు.
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.38 గంటల సమయంలో కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అప్పటికి ల్యాండర్ 1640 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో కదులుతోంది.
మొదటి రెండు దశల్లో రఫ్ బ్రేకింగ్, ఫైన్ బ్రేకింగ్ ఆపరేషన్స్ పూర్తైన తర్వాత ల్యాండర్ బాగానే ఉంది. హోవరింగ్ దశలోనే ల్యాండర్ గమనాన్ని సూచించే రేఖ పరిమితులు దాటినట్లు స్క్రీన్లపై కనిపించింది.

చంద్రయాన్Image copyrightGETTY IMAGES

ప్రణాళిక ప్రకారం చంద్రుడిపై రెండు భారీ బిలాల మధ్యన ఉన్న రెండు ప్రాంతాల్లో ఒక దానిని సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ల్యాండర్ ఎంచుకొని దిగాలి. ఆ తర్వాత అందులో నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకువచ్చి చంద్రుడి ఉపరితలంపై తిరుగుతుంది. అక్కడున్న నీటి స్ఫటికాలు, ఖనిజ లవణాల ఆధారాలు సేకరిస్తుంది.
చంద్రయాన్-2 ప్రయోగంలో వైఫల్యం వెనుక సెంట్రల్ ఇంజిన్‌ లోపం ఉండొచ్చన్న నరసింహా అభిప్రాయంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో న్యూక్లియన్ అండ్ స్పేస్ పాలసీ ఇనిషియేటివ్ హెడ్‌గా పనిచేస్తున్న డాక్టర్ రాజేశ్వరి రాజగోపాలన్ ఏకీభవించారు.
ల్యాండర్‌ నాలుగు మూలల్లో ఒక్కోటి చొప్పున నాలుగు ఇంజిన్లు ఉంటాయని, వాటిలో ఒకటి విఫలమై కూడా ఈ పరిణామం తలెత్తి ఉండొచ్చని ఆమె సందేహం వ్యక్తం చేశారు.
''సమాచారమేదీ లేకుండా ఓ నిర్ధారణకు రావడం కష్టం. స్క్రీన్‌పై కనిపించిన రేఖలైతే ఏదో లోపం ఉందనే చెబుతున్నాయి. అధిక వేగంతో ల్యాండింగ్ జరుగుతున్నప్పుడు చాలా దుమ్ము రేగుతుంది. దానికి తోడు గురుత్వాకర్షణ బలం వల్ల ల్యాండర్ ఊగిపోవచ్చు. అయితే, ఇంజిన్‌లో లోపమే ఈ వైఫల్యానికి కారణమై ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి'' అని రాజేశ్వరి అన్నారు.
''డేటా విశ్లేషణకు కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత తదుపరి మిషన్ కోసం ప్రణాళికలు వేయడానికి చాలా సమయం పట్టొచ్చు. ఎందుకంటే, ప్రస్తుతం ఎదురైన సమస్యలకు పరిష్కారాలను కనిపెట్టాలి'' అని ప్రొఫెసర్ నరసింహా వ్యాఖ్యానించారు.
చంద్రయాన్-2 ఆర్బిటార్ మరో ఏడాది కాలం పాటు చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉంటుందని, చాలా సమాచారాన్ని అది గ్రౌండ్ స్టేషన్‌కు చేరవేస్తుందని రాజేశ్వరి అన్నారు. చంద్రుడి ఉపరితలం గురించి అర్థం చేసుకునేందుకు అది ఎంతో ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
చంద్రుడి ఉపరితలంపై దిగే మిషన్‌లు విజయవంతమయ్యే అవకాశాలు తక్కువని చాలా మంది శాస్త్రవేత్తలు అంగీకరిస్తుంటారు. ఇప్పటివరకూ ఇలాంటి మిషన్‌ల విజయాల రేటు 35 శాతానికి మించలేదు.
వైఫల్యాలు ఎదురైనా, అద్భుత పరిష్కారాలతో వాటిని అధిగమించి గొప్ప విజయాలు అందుకున్న చరిత్ర ఇస్రోకు ఉంది.
Source: BBC

అంతరిక్షం నుంచి మళ్లీ అవే సంకేతాలు? ఎవరు పంపారు?

0 వ్యాఖ్యలు
రేడియో సంకేతాలుImage copyrightGETTY IMAGES
కెనడాలోని ఒక టెలిస్కోప్ సుదూర గెలాక్సీ నుంచి ప్రసరిస్తున్న అంతుపట్టని సంకేతాలను గుర్తించిందని ఖగోళ శాస్త్రవేత్తలు బయటపెట్టారు.
ఆ రేడియో తరంగాల స్వభావం గురించి, అవి కచ్చితంగా ఎక్కడి నుంచి వస్తున్నాయనేది మాత్రం తెలీడం లేదు.
ఎఫ్ఆర్‌బి అని పిలిచే 13 ఫాస్ట్ రేడియో బస్టర్స్ నుంచి చాలా అసాధారణంగా ఉన్న ఒక సంకేతం మళ్లీ మళ్లీ వస్తోంది.
అది 1.5 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒకే ప్రాంతం నుంచి వస్తున్నట్టు గుర్తించారు.
ఇంతకు ముందు కూడా ఒకసారి వేరే టెలిస్కోప్ ద్వారా సరిగ్గా ఇలాంటి సంకేతాలనే గుర్తించారు.
"ఇంకోసారి అవి రావడం వల్ల, బయట ఇంకా ఎవరో ఉండవచ్చనే విషయాన్ని చెబుతున్నాయి" అని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా ఖగోళ శాస్త్రవేత్త ఇంగ్రిడ్ స్టెయిర్స్ అన్నారు.
"అధ్యయనం కోసం చాలా సోర్సుల నుంచి రిపీటెడ్‌గా వచ్చిన సంకేతాలు లభించడం వల్ల మనం విశ్వంలోని చిక్కుముడులు అర్థం చేసుకోవచ్చు. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయి. ఆ సంకేతాలకు కారణం ఏంటో కూడా తెలుసుకోవచ్చు" అని ఇంగ్రిడ్ తెలిపారు.
అంతరిక్షంImage copyrightCHIME EXPERIMENT
గెలాక్సీ నుంచి సంకేతాలు
బ్రిటిష్ కొలంబియా, ఒకానగరన్ వాలీలోని చైమ్ అబ్జర్వేటరీలో 400 మీటర్ల పొడవున్న సెమీ సిలిండ్రికల్ యాంటెన్నాలు ప్రతి రోజూ ఉత్తరం వైపు ఆకాశాన్నంతా స్కాన్ చేస్తుంటాయి.
ఈ టెలిస్కోపును గత ఏడాది నుంచే ఉపయోగిస్తున్నారు. ఇది దాదాపు వెంటనే రిపిటీటర్‌తోపాటు 13 రేడియో బస్టర్స్ గుర్తించింది.
ఆ పరిశోధన గురించి నేచర్ జర్నల్‌లో ప్రచురించారు
"మేం రెండో రిపిటీటర్‌ను గుర్తించాం. దాని లక్షణాలు మొదట వచ్చిన రిపీటీటర్‌కు చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి" అని కెనడాలోని మెక్ గిల్ యూనివర్సిటీకి చెందిన శ్రీహర్ష్ తెందూల్కర్ చెప్పారు.
"ఇది జనాభాలాగే రిపిటీటర్స్ లక్షణాల గురించి కూడా మనకు మరిన్ని వివరాలు అందిస్తుంది".
అంతరిక్షంImage copyrightGETTY IMAGES

రోజూ వెయ్యికిపైగా వస్తుంటాయి

క్షణం పాటు మెరిసే రేడియో తరంగాలనే ఎఫ్ఆర్‌బి అంటారు. అవి విశ్వంలో దాదాపు సగం దూరం నుంచి వస్తున్నట్టు భావిస్తున్నారు.
శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ రిపీట్ అయిన రెండు సంకేతాలతోపాటు 60 సింగిల్ ఫాస్ట్ రేడియో బస్టర్స్ గుర్తించారు,
ప్రతి రోజూ ఆకాశంలో వెయ్యికి పైగా ఎఫ్ఆర్‌బీలు వస్తుంటాయని ఒక అంచనా.
అవి ఎందుకు వస్తుంటాయి అని చెప్పడానికి లెక్కలేనన్ని సిద్ధాంతాలు ఉన్నాయి.
చాలా బలమైన అయస్కాంత క్షేత్రం ఉన్న ఒక న్యూట్రాన్ స్టార్ చాలా వేగంగా తిరగడం వల్ల, రెండు న్యూట్రాన్ స్టార్లు ఒకటిగా కలిసిపోయినపుడు, గ్రహాంతరవాసుల అంతరిక్ష నౌకల నుంచి కూడా ఇలాంటి సంకేతాలు కొన్ని వస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Source: BBC Telugu

చంద్రయాన్-2: భారత్ ఈ ప్రయోగం ద్వారా సాధించేదేమిటి?

0 వ్యాఖ్యలు
చంద్రయాన్-2Image copyrightPRESS INFORMATION BUREAU, INDIA
జూలై 15వ తేదీ తెల్లవారుజామున 2:30 గంటలకు ఇస్రో చంద్రయాన్-2 మిషన్‌ను ప్రయోగించాల్సి ఉండగా.. సరిగ్గా 56 నిమిషాల ముందు సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగాన్ని తిరిగి జూలై 22వ తేదీ సోమవారం చేపడతామని మరొక ట్వీట్‌లో పేర్కొంది.
కాగా ఈ ప్రయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకు?
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ అంతరిక్ష నౌక నింగికి దూసుకెళుతుంది. సెప్టెంబర్ 6-7 తేదీల నాటికి అది చంద్రుడిని చేరుతుంది.
చంద్రుడి మీద సురక్షితంగా దిగటం (సాఫ్ట్‌ల్యాండింగ్) లక్ష్యంగా ప్రయోగిస్తున్న అంతరిక్ష వాహనం చంద్రయాన్-2.
సాఫ్ట్‌ల్యాండింగ్ అంటే.. ఏదైనా గ్రహం లేదా అంతరిక్షంలోని గ్రహ శకలం ఉపరితలం మీద దిగే వాహనం ఏమాత్రం దెబ్బతినదు.
చంద్రయాన్-2 విజయవంతమైతే.. చంద్రుడి ఉపరితలం మీద అంతరిక్ష వాహనాన్ని సాఫ్ట్‌ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది.
అంతేకాదు.. చంద్రయాన్-2 చంద్రుడి నుంచి చాలా చాలా సమాచారం కూడా భూమికి పంపిస్తుంది. ఎలా?
చంద్రయాన్-2లో మూడు ముఖ్యమైన పరికరాలు ఉన్నాయి. మొదటిది ఆర్బిటర్. ఇది చంద్రుడి కక్ష్యలో చంద్రుడి చుట్టూ తిరుగుతుంది.
మరొకటి ల్యాండర్. ఇది చంద్రుడి ఉపరితలం మీద దిగుతుంది.
అలా దిగిన తర్వాత ఈ ల్యాండర్ రోవర్ అనే మూడో పరికరాన్ని బయటకు పంపుతుంది. అది చంద్రుడి మీద అన్వేషణ చేస్తుంది.
ఈ రోవర్ తను గుర్తించిన సమాచారాన్ని ల్యాండర్‌కు పంపిస్తుంది. ల్యాండర్ ఆ సమాచారాన్ని ఆర్బిటర్‌కు చేరవేస్తుంది. ఆర్బిటర్ దానినంతటినీ భూమికి పంపిస్తుంది.
ఈ అంతరిక్ష నౌకలో భారతదేశం 13 పరిశోధన పరికరాలు అమర్చింది. ఇవికాక.. నాసా పంపించిన మరొక పరికరాన్ని కూడా ఇది మోసుకెళుతుంది.. ఉచితంగా.
ఈ పరికరాలు చంద్రుడి దక్షిణ ధృవానికి అతి సమీపంగా వెళ్లనున్నాయి. ఇంతకుముందు చంద్రుడి మీద దిగిన మిషన్లన్నీ.. చంద్రుడి మధ్య రేఖ మీద దిగాయి.
ఏ అంతరిక్ష నౌక కూడా చంద్రుడి ధృవం సమీపంలో దిగలేదు. కాబట్టి చంద్రయాన్-2 ద్వారా కొంత కొత్త సమాచారం లభిస్తుందని ఆశిస్తున్నారు.
భారత్ గతంలో చంద్రుడి పైకి చేసిన చంద్రయాన్-1 ప్రయోగం విజయంతమైంది. భారతదేశం నుంచి చంద్రుడిపైకి వెళ్లిన మొదటి అంతరిక్ష వాహనం అది.
అతి తక్కువ వ్యయంతో ఈ మిషన్‌ను విజయవంతం చేయటం అంతర్జాతీయంగా గుర్తింపు సాధించింది.
ఆ కార్యక్రమానికి భారత్ సారథ్యం వహించగా.. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, బ్రిటన్‌లు కూడా అందులో పాలుపంచుకున్నాయి.
నిజానికి చంద్రయాన్-1ను రెండేళ్లు పనిచేసేలా రూపొందించారు. కానీ పది నెలల తర్వాత అందులో పరికరాలు విఫలమయ్యాయి.
అయితే అప్పటికే చంద్రుడి మీద నీటి అణువుల జాడను పసిగట్టటం ద్వారా చంద్రయాన్-1 చరిత్ర సృష్టించింది.
చంద్రయాన్-1కి కొనసాగింపుగా చంద్రయాన్-2ను ప్రయోగిస్తోంది ఇస్రో.
ఇస్రోImage copyrightAFP
భారతదేశ జాతీయ పతాకాన్ని ఈ అంతరిక్ష నౌక చంద్రుడి మీదకు తీసుకెళుతోంది. దీంతో ఇది జాతీయ గౌరవానికి సంబంధించిన అంశంగా కూడా మారింది.
అంగారక గ్రహం మీద, ఆస్టరాయిడ్ల మీద సాఫ్ట్ ల్యాండింగ్‌ ప్రయోగానికి.. చంద్రుడి మీదకు మనిషిని పంపించటానికి కూడా తాజా ప్రయోగం తలుపులు తెరుస్తుంది.
భారతదేశం సంపూర్ణ నైపుణ్యం సాధించాలని కోరకుంటున్న అతి ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానమిది.
కానీ ఇది అంత సులభం కాదు. ఇది రాకెట్ సైన్స్. భూమి నుంచి చంద్రుడికి మధ్య ఉన్న దూరం 3.84 లక్షల కిలోమీటర్లు.
చంద్రుడి మీద గురుత్వాకర్షణ లేదు. వాతావరణమూ లేదు.
భారత్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చేస్తున్న మొట్టమొదటి ప్రయత్నమిది. ఉపరితలం మీద దిగటానికి ప్యారాచూట్ ఉపయోగించటానికి వీలులేదు.
కాబట్టి సాఫ్ట్ ల్యాండింగ్ అనేది చాలా కష్టమైన పని. గతంలో ఇందుకోసం చేసిన ప్రయోగాల్లో సగం విఫలమయ్యాయి.
అంతా కంప్యూటర్ల నియంత్రణలో ఉంటుంది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్, రోవర్ విడిపోయిన తర్వాత 15 నిమిషాలు అత్యంత కీలకం.
ఈ ప్రాజెక్టు చాలాసార్లు వాయిదా పడింది. చంద్రయాన్-1 ప్రయోగించినపుడు.. 2014లో చంద్రయాన్-2ను ప్రయోగించాలని నిర్ణయించారు.
అప్పుడు రష్యా కూడా జతకలిసింది. చంద్రుడి మీద దిగే ల్యాండర్‌ను ఆ దేశం అందిస్తుందని అనుకున్నారు.
కానీ.. రష్యా అంతరిక్ష కార్యక్రమంలో పలు సమస్యలు తలెత్తటంతో అలా జరగలేదు.
దీంతో భారత్ సొంతంగా ల్యాండర్‌ను తయారుచేయాలని నిర్ణయించుకుంది. అందువల్లనే ఇంత ఆలస్యమైంది.
'పేలోడ్' అనే మాట మీరు విని ఉంటారు. ఆ మాటకు అర్థం.. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లు తీసుకెళ్లే శాస్త్రీయ పరికరాలు.
ఆర్బిటర్‌లో హై క్వాలిటీ కెమెరా ఒకటి ఉంది. చంద్రుడి మీది పలుచటి వాతావరణాన్ని విశ్లేషించే ఒక పరికరం కూడా ఉంది.
భూకంపాల మాదిరిగానే చంద్రుడి మీద కూడా చంద్రకంపాలు వస్తుంటాయి. కాబట్టి దానిని కూడా విశ్లేషించటం జరుగుతంది.
ప్రోబ్ తరహా పరికరం కూడా ఒకటి ఉంటుంది. దానిని చంద్రుడి ఉపరితలం కిందికి పంపిస్తారు. దానిద్వారా చంద్రుడి మీద ఉష్ణోగ్రతల గురించి తెలుసుకోవచ్చు.
ఇక చంద్రుడి మీద మట్టి గురించి చెప్పే మరొక పరికరం కూడా ఉంటుంది.
భారత అంతరిక్ష ప్రయోగాలకు దేశంలో యూపీఏ అయినా, ఎన్‌డీఏ అయినా ప్రతి ప్రభుత్వం మద్దతు ఇస్తోందని.. కాబట్టే ఇండియా దగ్గర అంత ఎక్కువ సంఖ్యలో రాకెట్లు ఉన్నాయని ప్రముఖ సైన్స్ జర్నలిస్ట్ పల్లవ్ బాగ్లా చెప్తారు.
అంతేకాదు.. ఈ మిషన్‌కు మరో ప్రాధాన్యత కూడా ఉంది. ఇద్దరు మహిళలు - మిషన్ డైరెక్టర్ రితూ కారిధాల్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ముత్తయ్యలు ఈ మిషన్‌కు సారథ్యం వహిస్తున్నారు.

Source: BBC Telugu