వీలుంటే నా నాలుగు లంకెలు ...

24, జూన్ 2009, బుధవారం

ప్రాణస్నేహితులు

0 వ్యాఖ్యలు

Please click on Play button to listen my favorite song
0 వ్యాఖ్యలు

మావోయిస్టు నిషేధం పరిష్కారం కాదు

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మావోయిస్టు)ను దేశ వ్యాప్తంగా నిషేధించి అసలు విషయాన్ని పక్కదారి పట్టించింది. రాజకీయంగా ఎదుర్కోవాల్సిన సమస్యను నిషేధంతో పరిష్కరించడానికి విఫలయత్నం చేసింది. ఉగ్రవాదుల సరసన మావోయిస్టులను చేర్చి శాంతిభద్రతల అంశానికి పరిమితం చేయడం సరైన నిర్ణయం అనిపించుకోదు. వాస్తవానికి మావోయిస్టుపార్టీపై నిషేధం కొత్తదేం కాదు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం కింద ఇప్పటికే కేంద్రం నిషేధించిన సంస్థల జాబితాలో సిపిఐ (ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ (ఎంసిసి) చేరి ఉన్నాయి. 2004 సెప్టెంబర్‌లో అవి రెండూ విలీనమయ్యాయి. మావోయిస్టుపార్టీ అవతరించింది. వేర్వేరుగా ఉన్న సంస్థలు ఒకే పార్టీగా ఏర్పడటంతో సాంకేతికంగా దానిపై బ్యాన్‌ లేదు. స్పష్టత కల్పించేందుకు మావోయిస్టుపార్టీని నిషేధిత సంస్థల జాబితాలో చేర్చామంటున్నారు చిదంబరం. ఇప్పటికే బ్యాన్‌ పెట్టిన 34 సంస్థలుండగా మావోయిస్టుపార్టీ ముప్పైఐదవది, లష్కరేతోయిబా, సిమి, ఎల్‌టిటిఇ సరసన చేరింది. సాధారణంగా దేశం వెలుపలి నుండి వచ్చే నిధులు, ఆయుధాలతో నడుస్తున్న వాటిని ఉగ్రవాద సంస్థలుగా చెబుతున్నారు. దేశం లోపల అంతర్గతంగా పని చేస్తున్నవాటిని తీవ్రవాద సంస్థలుగా పేర్కొంటున్నారు. కొన్ని నక్సలైట్‌ గ్రూపులపై వివిధ రాష్ట్రాల్లో ఎప్పటి నుండో నిషేధం అమల్లో ఉంది. పీపుల్స్‌వార్‌, ఆ తర్వాత ఏర్పడిన మావోయిస్టుపార్టీని చట్ట వ్యతిరేక సంస్థలుగా గుర్తించి ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘర్‌ రాష్ట్రాలు నిషేధించాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం కింద బీహార్‌, ఒరిస్సా, జార్ఖండ్‌, తమిళనాడు ప్రభుత్వాలు బ్యాన్‌ విధించాయి.

నక్సల్స్‌ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా చూడాలి. రాష్ట్రంలో నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలను 1978 ప్రాంతంలో కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి నిర్బంధం అమలు చేశారు. 1980లో పీపుల్స్‌వార్‌ ఏర్పాటయ్యాక దాని కార్యకలాపాలు ఉధృతమయ్యాయి. 1984లో ఎన్టీఆర్‌ ప్రభుత్వం 'వార్‌'పై నిర్బంధాన్ని తీవ్రతరం చేసింది. 1989లో మర్రి చెన్నారెడ్డి సర్కారు నిర్భందాన్ని సడలించగా 1992లో తొలిసారి నేదురుమల్లి నిషేధం విధించారు. 1995లో ఎన్టీఆర్‌ సడలించగా 1996లో చంద్రబాబు మళ్లీ నిషేధం విధించారు. 2004లో వైఎస్‌ బ్యాన్‌ను సడలించి నక్సల్‌ నేతలతో నేరుగా చర్చలు జరిపారు. 2005లో మళ్లీ నిషేధం విధించారు. అందరికంటే ముందుగా బీహార్‌లో 1986లో ఎంసిసిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్‌ విధించింది. సాంకేతికంగా మావోయిస్టుపార్టీ పేరు నిషిద్ధ సంస్థల జాబితాలో లేకపోయినా దానిలో విలీనమైన రెండు గ్రూపులనూ కేంద్రం ఎప్పుడో నిషేధించింది. దేశంలో, రాష్ట్రాల్లో బ్యాన్‌ ఉన్నప్పటికీ హింసాత్మక చర్యలు, ఎన్‌కౌంటర్లు తాత్కాలికంగా మినహా పూర్తిస్థాయిలో అదుపు చేయడం సాధ్యం కాదని తేటతెల్లమైనా ఇప్పుడు కొత్తగా కేంద్రం బ్యాన్‌ విధించడం దేనికి? రాజకీయ ప్రయోజనాలను ఆశించే సరిగ్గా బెంగాల్‌లో లాల్‌ఘర్‌ ఉదంతం ముందుకొచ్చిన సమయంలో నిషేధం విధించింది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో హింస పెచ్చరిల్లినప్పుడు స్పందించకుండా లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న బెంగాల్‌లో కొన్ని ఘటనలు చూపి బ్యాన్‌ పెట్టింది. ఆ రాష్ట్ర ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపడానికి ప్రయత్నిస్తోంది. బెంగాల్‌లో లెఫ్ట్‌ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేయడానికి, ఇబ్బందులు సృష్టించడానికి ఇప్పటి వరకూ మావోయిస్టుల హింసకు మద్దతు పలికిన తృణమూల్‌ కాంగ్రెస్‌ యుపిఎ ప్రభుత్వంలో భాగస్వామి. లాల్‌ఘర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది, ప్రముఖులెవ్వరూ సందర్శించవద్దని కేంద్ర హోంమంత్రి ప్రకటించినా తృణమూల్‌ కి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఆ ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని మరింత క్షీణింపజేశారు. వీరంతా ఒకే కేబినెట్‌లో సభ్యులు. వారి ఉమ్మడి బాధ్యత ఎలా ఉందో ఈ చర్య విదితమవుతోంది.
మావోయిస్టుపార్టీపై నిషేధం విధించాలని గత యుపిఎ ప్రభుత్వం ఆలోచన చేసింది. లెఫ్ట్‌ మద్దతుపై సర్కారు మనుగడ సాగిస్తుండటంతో అప్పుడు ఆ సాహసం చేయలేకపోయింది. ప్రస్తుతం ఆ ఇబ్బంది లేకపోవడంతో బ్యాన్‌ పెట్టింది. నిషేధం వల్ల నక్సల్‌ సమస్యను పరిష్కరించలేమని వామపక్షాలు అందులోనూ సిపిఎం చెబుతూ వచ్చింది. అందుకే కేంద్ర హోంమంత్రి చిదంబరం నిషేధించాలని సూచించినా బెంగాల్‌ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ అంగీకరించలేదు. కేంద్రం బ్యాన్‌ పెట్టగానే వామపక్షాలు వ్యతిరేకించాయి. నిషేధం దేశం మొత్తానికీ వర్తిస్తున్నందున బెంగాల్‌లో తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలపై చర్చిస్తున్నామని లెఫ్ట్‌ సర్కారు పేర్కొంది. నిషేధంవల్ల ప్రయోజనం ఏమీ ఉండదని, మావోయిస్టులను ప్రజల నుండి వేరు చేయాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కరత్‌ చెప్పారు. నిరంతర రాజకీయపోరాటం తప్ప సమస్యకు బ్యాన్‌ పరిష్కారంకాదని బెంగాల్‌ లెఫ్ట్‌ఫ్రంట్‌ స్పష్టం చేసింది. నిషేధాన్ని కాంగ్రెస్‌, బిజెపి స్వాగతించడం, వామపక్షాలు వ్యతిరేకించడం ఇందుకే. పై పూతలు, తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా సామాజిక, ఆర్థిక సమస్యలను తగ్గించే రాజకీయ పరిష్కారమే అసలైన మందు.

0 వ్యాఖ్యలు

మావోయిస్టులకు, ఉగ్రవాదులకు మధ్య...నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా

ఉగ్రవాదులను, మావోయిస్టులను ఒక గాటన కట్టి కేంద్ర ప్రభుత్వం నిషేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ అన్నారు. సామాజిక, సైద్ధాంతిక, రాజకీయ పునాదిగా వున్న మావోయిస్టులకు, అరాచకత్వమే లక్ష్యంగా వున్న ఉగ్రవాదులకు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వుందని చెప్పారు.

21, జూన్ 2009, ఆదివారం

0 వ్యాఖ్యలు
మహాకవి శ్రీశ్రీ శతజయంతి
మహాకవి శ్రీశ్రీ శతజయంతి(1910-2010) ఉత్సవాలు మరే ఆధునిక తెలుగు కవికి, రచయితకు జరగనంత ఘనంగా విస్త్రతంగా జరుగుతున్న సందర్భం. జూన్‌ 15 ఆయన వర్థంతి.
శ్రీశ్రీ 1910 ఏప్రిల్‌ 30 న విశాఖపట్టణంలో పుట్టారు.తండ్రి వెంకటరమణయ్య లెక్కల మాష్టారు.తల్లి అప్పలకొండమ్మ. కొడుకు పుట్టాక ఆర్నెల్లకే ఆమె చనిపోయారు. తనను ఎందరో తల్లులు స్తన్యమిచ్చి పెంచారంటాడు ఆయన. తల్లికి చిన్నప్పుడే దూరమైన కారణంగా తనలో ప్రేమ పట్ల అవిశ్వాసం పెరిగిందని చెబుతాడు. కాని తండ్రి రెండవ వివాహం చేసుకున్న సుభద్రమ్మ అంటే ఆయనకు ఎంతో ప్రేమ, గౌరవం.సవతి తల్లిని రాక్షసి అని తిట్టిపోసేవారిని ఆయన తీవ్రంగా విమర్శిస్తూ తనకు తెలిసిన తల్లి ఆమే నంటాడు.


ఈ కారణాలన్నిటి వల్ల శ్రీశ్రీ సాహిత్యంలో మరీ ముఖ్యంగా మహాప్రస్థానంలో అడుగడుగునా మాతృస్పర్శ తొంగిచూస్తుంది. ఒక విధంగా ఇది మాగ్జిం గోర్కి పాత సమాజాన్ని అమ్మగా చిత్రించడం వంటిదే. అలాగే శ్రీశ్రీ కూడా కవిత్వాన్ని రసధుని,మణిఖని, జననీ కవితా ఓ కవితా అని సంబోధిస్తాడు. 'నా జనని గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి గొల్పిననాడో' అని మరో చోట చెబుతాడు. మరో ప్రపంచం భావననే 'పుడమి తల్లికి పురిటినొప్పులు' అని కొత్త ప్రపంచం కోసం జరిగే పోరాటాన్ని అభివర్ణిస్తాడు. నడిరే నిద్దురలో అపుడే ప్రసవించిన శిశువు నెడదనిడుకొని రుచిర స్వప్నాలను గాంచే జవరాలి మన:ప్రపంచపు టావర్తం' అంటాడు. బాటసారి గేయంలో అతన్ని గురించి చెప్పిన ప్రతిసారి పల్లెటూళ్లో తల్లిని కూడా సమాంతరంగా వర్ణిస్తూ ఒక కరుణార్ద్రరస చలన చిత్రం చూస్తున్న అనుభూతి కలిగిస్తాడు.
శ్రీశ్రీకి ముందు కూడా తెలుగులో ప్రజాచైతన్య స్ఫోరకమైన కవితలు, పాటలు వున్నా ఆయన వైతాళికుడు కావడానికి కారణాలు అనేకం. స్వతహాగా మహా ప్రతిభావంతుడు. ఆపైన సాహిత్యసంప్రదాయాలున్న కుటుంబం. ఏది అడిగినా అందించే తండ్రి. ఆ విధంగా బాల్యంలోనే సాహిత్య సంపర్కం కలిగింది. నాటకాలలోనూ వేషాలు వేశాడు. చిన్నప్పుడే నవల రాశాడు. చిత్రకళ అభ్యసించాడు. సంప్రదాయ కవిత్వంలో మునిగితేలి సామ్యవాదం వైపు నడిచాడు. ఆ క్రమంలో దేశ దేశాలకు చెందిన అత్యాధునిక కవిత్వ పోకడలను ఆకళింపు చేసుకున్నాడు. మొదట సకల సంపదలూ అనుభవించిన కుటుంబం దారిద్య్రంలో కూరుకుపోవడం వల్లనూ. తీవ్రమైన అనారోగ్యం వల్లనూ ఆయన జీవితపు ఆటుపోట్లు అనుభవించాడు. ఈ అంశాలన్ని కలగలసి ఆయన అనుకున్న భావాన్ని సరికొత్తరీతిలో అక్షరీకరించగల శబ్దబ్రహ్మగా అవతరించాడు. తనకు ముందున్న వారికి లేని విశిష్టతను, విలక్షణతను సంతరించుకోగలిగాడు.
శ్రీశ్రీ 1918లోనే ఒక కంద పద్యం, 'గోకులాయి' అనే డిటెక్టివ్‌ నవల రాశాడు.1920లో 'వీర నరసింహరాయలు' అనే నవల రాశాడు. 1922లో 'సావిత్రీ సత్యవంతులు' పద్య నాటకం రాశాడు. 1924లో ఆయన నవల 'పరిణయ రహస్యం' అచ్చయింది. అదే ఏడాది ఆయన ఎంతగానో ప్రేమించే పినతల్లి సుభద్రమ్మ మరణించారు. కుటుంబాన్ని దారిద్య్రం చుట్టు ముట్టింది కూడా అప్పుడే.మరుసటి ఏడాది అంటే పదిహేనో ఆయనకు వెంకటరమణమ్మతో పెళ్లి జరిగింది.అది కూడా చాలా హడావుడిగానూ గందరగోళంగానూ జరిగింది.
శ్రీశ్రీకి మొదటి నుంచి సాహిత్య సృజనకే పరిమితం కాకుండా సాహిత్యమిత్రులతో కలసి సాహిత్య సంఘాలు ఏర్పర్చడం కూడా చాలా ఇష్టమైన పని. ఆయన పురిపండా అప్పలస్వామితో కలసి 1926లో కవితా సమితి స్థాపించారు.1928లోనే ఆయన తొలి ఖండ కావ్యం ప్రభవ అచ్చయింది. అందులో సంప్రదాయ ముద్రతో పాటు కొత్తదనపు ఛాయలూ ప్రస్ఫుటమయ్యాయి.1928-30 మధ్య మద్రాసులో బిఎ చదువుతున్నప్పుడే ఆయనకు కొంపెల్ల జనార్థనరావుతో సహా అనేక మంది సాహితీ మిత్రులు, ప్రముఖుల పరిచయం కలిగింది.1929లో సుప్తాస్తికలు(నిద్రించే ఎముకలు) గీతంలోనే తొలిసారి పీడితుల వేదనా స్వరాలు వినిపించడం మొదలైంది.
1930లో శ్రీశ్రీ 63 రోజులపాటు టైఫాయిడ్‌ తో పెనుగులాడాడు. అది ఆయనను శారీరకంగానే గాక మానసికంగానూ చాలా ఘర్షణకు గురి చేసింది.కొత్త భావాలకు అంకురార్పణ జరిగింది. 1931-33 మధ్య ఏవిఎస్‌ కాలేజీలో డిమాన్‌స్ట్రేటర్‌గా ఉద్యోగం చేస్తూనే సాహిత్యం విస్త్రతంగా అధ్యయనం చేశాడు. అప్పటి వరకూ తనను అమితంగా ప్రభావితం చేసిన దేవుల పల్లి కృష్ణశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణల వరవడి నుంచి బయటపడ్డాడు. 1933లో 'జయభేరి' గీతంతో మహాప్రస్థానానికి నాంది పలికాడు. 'నేను సైతం ప్రపంచాగ్నికి సమిథనొక్కటి ఆహుతిచ్చాను' అంటూ మొదలయ్యే ఈ గీతం సమాజానికి వ్యక్తికి మధ్య వుండవలసిన సంబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. పైగా ఈ వాక్యం ద్వారా ఆయన కేవలం అగ్రవర్ణాల వారే గాక ఎవరైనా హోమానికి సమిధ కావచ్చన్న భావనను ప్రవేశపెట్టాడు. ఈ గీతం మూడు భాగాలుగా వుంటుంది. మొదట గతం, రెండవది వర్తమానం, మూడవది భవిష్యత్తు... 'నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను' అంటూ ముగించడం 'సమిధనొక్కటి ఆహుతిచ్చాను' అన్న దానికి భిన్నంగా ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ గీతంలోనే శ్రీశ్రీ తొలిసారి 'గబ్బిలం' ప్రస్తావన కూడా చేశాడు. ఉత్తరోత్తరా జాషువా 'గబ్బిలం'పైనే కావ్యం రాశాడు.
మహాప్రస్థానంలో గేయాలన్ని జన ప్రియమైనవే. వాటి చూపూ వూపూ రూపూ లోతుపాతులు చాలా విధాలుగా విశ్లేషించుకున్నవే. పతితులూ భ్రష్టులను ఏడవకండని భరోసా ఇచ్చి జగన్నాథ రథ చక్రాలొస్తున్నాయని ధైర్యం చెప్పి 'పదండి ముందుకు' అంటూ కదం తొక్కించి కనబడలేదా ఎర్రబావుటా నిగనిగలు చూపించిన 'మహా ప్రస్థానం' తెలుగు భాషా సాహిత్యాలను కొత్త మలుపు తిప్పింది. అర్థాలూ పరమార్థాలూ మార్చేసింది. దగా పడిన తమ్ముడు, కదం తొక్కుతూ పదం పాడుతూ, కాదేదీ కవిత కనర్హం,కదిలేదీ కదిలించేదీ, ప్రపంచమొక పద్మవ్యూహం, ఆ పాపం ఎవ్వరిది, ఏమున్నది గర్వకారణం, దాచేస్తే దాగని సత్యం, ఇతిహాసపు చీకటి కోణం, ఇంకానా ఇకపై చెల్లదు, ఉరితీయబడిన శిరస్సు, ఎముకలు కుళ్లిన, వయస్సు మళ్లిన .. ఇత్యాది ఎన్నెన్నో పదబంధాలను అందించింది. పదాలకు అర్థం మార్చింది. శ్రీశ్రీని శబ్దబ్రహ్మను చేసింది.
అయితే ఈ దశకు చేరడానికి శ్రీశ్రీ నిజంగానే మహాప్రస్థానం చేశాడు. తనకు స్ఫూర్తి నిచ్చిన కృష్ణశాస్త్రి, విశ్వనాథ వంటివారిని భావ పరంగానే గాక ప్రసిద్ధిలోనూ అధిగమించాడు. కారణం ఆయన ప్రజలతో ప్రగతితో నిలబడ్డమే. చివరకు కృష్ణశాస్త్రి కూడా ఈ ప్రభావాన్ని తప్పించుకోలేక తన వూహా ప్రేయసి కోసం ఏడ్చే తన సహజ శైలిని పక్కన పెట్టి 'ఆకాశము నుదుట పొడుచు అరుణారుణ తార' అని రాయవలసి వచ్చింది. విశ్వనాథ తిరోగమన భావాలను శ్రీశ్రీ పదే పదే విమర్శిస్తున్నా ఈయన 'కవితా ఓ కవితా' లోని కవిత్వ సాంద్రతకు కదలిపోయిన విశ్వనాథ అక్షరాలా ఆలింగనం చేసుకుని అభినందించారు. ఇవన్నీ శ్రీశ్రీ ప్రతిభను చెబుతాయి. స్విన్‌బర్న్‌,ఎడ్డార్‌ ఎలెన్‌ పో తదిరత అనేక మంది పాశ్చాత్య కవులనూ ఆయన అంతే పట్టుగా చదివాడు. ఆ దేశాలకు వెళ్లినపుడు వారి కవితలు వారి ముందే తుచ తప్పకుండా అప్పజెప్పి ఆశ్చర్య పర్చాడు.
మహాప్రస్తాన గీతాలు మొదట్లో ఆదరణ పొందలేదు. సావిత్రిని నటిగా పనికిరావని తిరస్కరించినట్టే శ్రీశ్రీ గీతాలను కూడా అప్పటి ప్రముఖ సాహిత్య పత్రికలు వెనక్కు పంపించాయి! అయితే అచ్చయిన తర్వాత మాత్రం అవి గొప్ప సంచలనం కలిగించాయి.పుస్తకంగా అచ్చు వేసుకునే శక్తి శ్రీశ్రీకి లేకపోవడంతో దాదాపు పదిహేనేళ్లు పట్టింది.అప్పుడు కూడా నళినీ కుమార్‌ అనే మిత్రుడు దాన్ని తీసుకొచ్చాడు. తర్వాత కాలంలో కమ్యూనిస్టు ప్రచురణ సంస్థగా విశాలాంధ్ర దాన్ని తీసుకువస్తున్నది.
శ్రీశ్రీ అంటే 'మహాప్రస్థానం' గుర్తుకు వస్తుంది గాని నిజానికి ఆయన విస్తృత రచనా వ్యాసంగం అనేక రూపాల్లో కొనసాగిస్తూనే వచ్చాడు. అవి ఇరవై సంపుటాలుగా విరసం ప్రచురించింది. వాటిలో వ్యాసాలు కవిత్వం కన్నా ఏమాత్రం తీసిపోని శైలితో కదం తొక్కిస్తాయి. వ్యంగ్య ప్రయోగాల్లో ఆయన అందె వేసిన చేయి. తర్వాత కాలంలో ఈ ధోరణిలోనే 'మూడు యాభయిలు' రాశాడు.
శ్రీశ్రీ కవి మాత్రమే కాదు. జర్నలిస్టు కూడా.ఆంధ్రప్రభ,ఆనంద వాణి వంటి పత్రికల్లో ఉద్యోగం చేశాడు. కమ్యూనిస్టు పత్రికలను నిరంతరం ప్రోత్సహిస్తూ రచనలు అందిస్తూ వచ్చారు. ఇవే గాక జీవితంలో మధ్య మధ్య ఇంకా అనేక వుద్యోగాలు చేశాడు.
శ్రీశ్రీ సినిమా జీవితం కూడా చాలా సుదీర్ఘమైంది.1949లో 'ఆహుతి'తో అది ప్రారంభమైంది. 'పాడవోయి భారతీయుడా, తెలుగు వీర లేవరా' వంటి సినిమా పాటలు అందరం చెప్పుకుంటారు. కాని ఆయన ప్రధానంగా అనువాద చిత్రాల్లో పనిచేశారు. డబ్బింగ్‌ సామ్రాట్‌ అనిపించుకున్నారు. ఆ డబ్బింగ్‌ ప్రక్రియలో తనకు సహాయకురాలిగా వున్న సరోజనే 1955లో రెండవ పెళ్లి చేసుకున్నారు. సంతానం కన్నారు. (మొదటి భార్య వెంకటరమణమ్మ 1973లో చనిపోయారు.) తమిళ భాషతో పరిచయమే కాక పెదవుల కదలికకు అనుగుణంగా తెలుగు పదాలు రాయగలిగిన సామర్థ్యం ఆయనకు మెండు. సినిమా పాటలకు సామాజిక చైతన్యం, వర్గ చైతన్యం సమకూర్చిన వారిలో ఆయన అగ్రగణ్యుడు. ఇదేగాక తెర వెనక కూడా సినిమాలకు సమాచారం అందించడంలోనూ, సంవిధానాన్ని సూచించడంలోనూ ఆయన చాలామందికి సహాయపడ్డారు. రచయిత అయినప్పటికీ రాబోయే కాలం సినిమా మీడియాదేనని నమ్మి దానిపై విస్తారంగా రాశారు.
మహాకవి స్థానం అలంకరించి కూడా కష్టభూయిష్టమైన కమ్యూనిస్టు ఉద్యమంతో కలసి నడిచిన ఆశయ నిబద్ధత శ్రీశ్రీది. ఈ విషయంలో ఆయనతో పోల్చదగిన వారు మరొకరు కనిపించరు. 1955లో హోరాహోరీగా జరిగిన మధ్యంతర ఎన్నికల రణరంగంలో శత్రు శక్తుల దుష్ప్రచారాన్నే గాక దాడులకు కూడా గురయ్యారు. మతిస్థిమితం పాలై మళ్లీ నిలదొక్కుకుని మహాప్రస్థానం కొనసాగించారు. కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన విభేదాల తర్వాత కూడా ఆయన ఎర్రజండానే అంటిపెట్టుకుని వున్నారు. అరసం విరసం రెండింటిలోనూ కీలక పాత్ర వహించారు.
సోషలిస్టు దేశాలలో విస్తృతంగా పర్యటించారు. సోవియట్‌ అవార్డు అందుకున్నారు. చైనా వెళ్లి చాలా ఉత్సాహపడి వచ్చారు.
శ్రీశ్రీ పట్ల యువతరంలోనూ చాలా ఆకర్షణ వుండేది. ఆయన ప్రేరణతోనే చాలా మంది కవులయ్యారు. కాలేజీ డేలకు అతిథిగా హాజరైతే జనం విరగబడి వచ్చేవారు. పెద్ద ఉపన్యాసకుడు కాదు కాని ఈ పర్యటనలతోనూ రచనలతోనూ ఆయన సాహిత్య చైతన్యం పెంచారు. తన తర్వాత వచ్చిన ప్రగతిశీల కవులను గొప్పగా ప్రోత్సహించడం ఆయనలో ప్రత్యేకత.వారిని ఉదారంగా ప్రశంసిస్తాడు.
మాటల్లో విరుపూ మెరుపూ శ్రీశ్రీ సొంతం. ఆయన పేరుతో అనేక చమత్కారాలు హాస్యాలు సాహిత్య లోకంలో స్థిరపడిపోయాయి. ప్రశ్నలు జవాబుల కింద చేసిన చమత్కారాలు గాని, ప్రాస క్రీడలు గాని బాగా ప్రసిద్ధి.
శ్రీశ్రీ స్నేహితులను అమితంగా ప్రేమించాడు. కీర్తిశేషుడైన కొంపెల్ల జనార్థనరావుకు తన మహాప్రస్థానం అంకితం ఇవ్వాలని మొదటే నిర్ణయించుకున్నాడు.
చాలామంది కవులు కళాకారుల లాగే మద్యపాన వ్యసనం వున్న శ్రీశ్రీ దానివల్ల ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ చాలా నష్టపోయాడు. అయితే జీవితం చివరి దశలో వైద్యుల సలహా మేరకు దానికి పూర్తి దూరంగా వుండిపోయారు. ఆర్థికంగా అనేక కష్టాలు పడినా మేధస్సును పాలకవర్గాలకు తాకట్టు పెట్టేందుకు సిద్ధపడలేదు. చివరకు 1983 జూన్‌ 15న కన్నుమూశారు. కాని లాభం లేదు నేస్తం నీ ప్రాభవం మమ్ముల్ను వదలిపెట్టడం లేదు, నిరుత్సాహాన్ని జయించడం నీ వల్లే నేర్చుకున్నాము అని కొంపెల్ల జనార్థనరావును ఉద్దేశించి ఆయన అన్నట్టే శ్రీశ్రీ ప్రభావం ప్రేరణ కొనసాగుతూనే వున్నాయి. చలం చెప్పినట్టు మరో ప్రపంచ నిర్మాణం కోసం సాగిపోయే వారికి ఆయన కవిత్వం మార్చింగ్‌ బాండ్‌లాగా చిరస్మరణీయమై నిల్చిపోయింది.