వీలుంటే నా నాలుగు లంకెలు ...

24, జూన్ 2009, బుధవారం

మావోయిస్టు నిషేధం పరిష్కారం కాదు

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మావోయిస్టు)ను దేశ వ్యాప్తంగా నిషేధించి అసలు విషయాన్ని పక్కదారి పట్టించింది. రాజకీయంగా ఎదుర్కోవాల్సిన సమస్యను నిషేధంతో పరిష్కరించడానికి విఫలయత్నం చేసింది. ఉగ్రవాదుల సరసన మావోయిస్టులను చేర్చి శాంతిభద్రతల అంశానికి పరిమితం చేయడం సరైన నిర్ణయం అనిపించుకోదు. వాస్తవానికి మావోయిస్టుపార్టీపై నిషేధం కొత్తదేం కాదు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం కింద ఇప్పటికే కేంద్రం నిషేధించిన సంస్థల జాబితాలో సిపిఐ (ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ (ఎంసిసి) చేరి ఉన్నాయి. 2004 సెప్టెంబర్‌లో అవి రెండూ విలీనమయ్యాయి. మావోయిస్టుపార్టీ అవతరించింది. వేర్వేరుగా ఉన్న సంస్థలు ఒకే పార్టీగా ఏర్పడటంతో సాంకేతికంగా దానిపై బ్యాన్‌ లేదు. స్పష్టత కల్పించేందుకు మావోయిస్టుపార్టీని నిషేధిత సంస్థల జాబితాలో చేర్చామంటున్నారు చిదంబరం. ఇప్పటికే బ్యాన్‌ పెట్టిన 34 సంస్థలుండగా మావోయిస్టుపార్టీ ముప్పైఐదవది, లష్కరేతోయిబా, సిమి, ఎల్‌టిటిఇ సరసన చేరింది. సాధారణంగా దేశం వెలుపలి నుండి వచ్చే నిధులు, ఆయుధాలతో నడుస్తున్న వాటిని ఉగ్రవాద సంస్థలుగా చెబుతున్నారు. దేశం లోపల అంతర్గతంగా పని చేస్తున్నవాటిని తీవ్రవాద సంస్థలుగా పేర్కొంటున్నారు. కొన్ని నక్సలైట్‌ గ్రూపులపై వివిధ రాష్ట్రాల్లో ఎప్పటి నుండో నిషేధం అమల్లో ఉంది. పీపుల్స్‌వార్‌, ఆ తర్వాత ఏర్పడిన మావోయిస్టుపార్టీని చట్ట వ్యతిరేక సంస్థలుగా గుర్తించి ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘర్‌ రాష్ట్రాలు నిషేధించాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం కింద బీహార్‌, ఒరిస్సా, జార్ఖండ్‌, తమిళనాడు ప్రభుత్వాలు బ్యాన్‌ విధించాయి.

నక్సల్స్‌ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా చూడాలి. రాష్ట్రంలో నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలను 1978 ప్రాంతంలో కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి నిర్బంధం అమలు చేశారు. 1980లో పీపుల్స్‌వార్‌ ఏర్పాటయ్యాక దాని కార్యకలాపాలు ఉధృతమయ్యాయి. 1984లో ఎన్టీఆర్‌ ప్రభుత్వం 'వార్‌'పై నిర్బంధాన్ని తీవ్రతరం చేసింది. 1989లో మర్రి చెన్నారెడ్డి సర్కారు నిర్భందాన్ని సడలించగా 1992లో తొలిసారి నేదురుమల్లి నిషేధం విధించారు. 1995లో ఎన్టీఆర్‌ సడలించగా 1996లో చంద్రబాబు మళ్లీ నిషేధం విధించారు. 2004లో వైఎస్‌ బ్యాన్‌ను సడలించి నక్సల్‌ నేతలతో నేరుగా చర్చలు జరిపారు. 2005లో మళ్లీ నిషేధం విధించారు. అందరికంటే ముందుగా బీహార్‌లో 1986లో ఎంసిసిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్‌ విధించింది. సాంకేతికంగా మావోయిస్టుపార్టీ పేరు నిషిద్ధ సంస్థల జాబితాలో లేకపోయినా దానిలో విలీనమైన రెండు గ్రూపులనూ కేంద్రం ఎప్పుడో నిషేధించింది. దేశంలో, రాష్ట్రాల్లో బ్యాన్‌ ఉన్నప్పటికీ హింసాత్మక చర్యలు, ఎన్‌కౌంటర్లు తాత్కాలికంగా మినహా పూర్తిస్థాయిలో అదుపు చేయడం సాధ్యం కాదని తేటతెల్లమైనా ఇప్పుడు కొత్తగా కేంద్రం బ్యాన్‌ విధించడం దేనికి? రాజకీయ ప్రయోజనాలను ఆశించే సరిగ్గా బెంగాల్‌లో లాల్‌ఘర్‌ ఉదంతం ముందుకొచ్చిన సమయంలో నిషేధం విధించింది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో హింస పెచ్చరిల్లినప్పుడు స్పందించకుండా లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న బెంగాల్‌లో కొన్ని ఘటనలు చూపి బ్యాన్‌ పెట్టింది. ఆ రాష్ట్ర ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపడానికి ప్రయత్నిస్తోంది. బెంగాల్‌లో లెఫ్ట్‌ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేయడానికి, ఇబ్బందులు సృష్టించడానికి ఇప్పటి వరకూ మావోయిస్టుల హింసకు మద్దతు పలికిన తృణమూల్‌ కాంగ్రెస్‌ యుపిఎ ప్రభుత్వంలో భాగస్వామి. లాల్‌ఘర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది, ప్రముఖులెవ్వరూ సందర్శించవద్దని కేంద్ర హోంమంత్రి ప్రకటించినా తృణమూల్‌ కి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఆ ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని మరింత క్షీణింపజేశారు. వీరంతా ఒకే కేబినెట్‌లో సభ్యులు. వారి ఉమ్మడి బాధ్యత ఎలా ఉందో ఈ చర్య విదితమవుతోంది.
మావోయిస్టుపార్టీపై నిషేధం విధించాలని గత యుపిఎ ప్రభుత్వం ఆలోచన చేసింది. లెఫ్ట్‌ మద్దతుపై సర్కారు మనుగడ సాగిస్తుండటంతో అప్పుడు ఆ సాహసం చేయలేకపోయింది. ప్రస్తుతం ఆ ఇబ్బంది లేకపోవడంతో బ్యాన్‌ పెట్టింది. నిషేధం వల్ల నక్సల్‌ సమస్యను పరిష్కరించలేమని వామపక్షాలు అందులోనూ సిపిఎం చెబుతూ వచ్చింది. అందుకే కేంద్ర హోంమంత్రి చిదంబరం నిషేధించాలని సూచించినా బెంగాల్‌ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ అంగీకరించలేదు. కేంద్రం బ్యాన్‌ పెట్టగానే వామపక్షాలు వ్యతిరేకించాయి. నిషేధం దేశం మొత్తానికీ వర్తిస్తున్నందున బెంగాల్‌లో తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలపై చర్చిస్తున్నామని లెఫ్ట్‌ సర్కారు పేర్కొంది. నిషేధంవల్ల ప్రయోజనం ఏమీ ఉండదని, మావోయిస్టులను ప్రజల నుండి వేరు చేయాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కరత్‌ చెప్పారు. నిరంతర రాజకీయపోరాటం తప్ప సమస్యకు బ్యాన్‌ పరిష్కారంకాదని బెంగాల్‌ లెఫ్ట్‌ఫ్రంట్‌ స్పష్టం చేసింది. నిషేధాన్ని కాంగ్రెస్‌, బిజెపి స్వాగతించడం, వామపక్షాలు వ్యతిరేకించడం ఇందుకే. పై పూతలు, తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా సామాజిక, ఆర్థిక సమస్యలను తగ్గించే రాజకీయ పరిష్కారమే అసలైన మందు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి