వీలుంటే నా నాలుగు లంకెలు ...

8, సెప్టెంబర్ 2019, ఆదివారం

అపోలో 11: చంద్రుడి మీదకు మనిషి ప్రయాణం నాసా ఆడిన నాటకమా? కుట్ర సిద్ధాంతకర్తల వాదనలు ఏమిటి? వాటికి నాసా జవాబులు ఏమిటి?


అపోలో మిషన్Image copyrightNASA

1969 జులై 20.. కమాండర్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, లూనార్ మాడ్యూల్ పైలట్ బజ్ ఆల్డ్రిన్ - ఇద్దరూ అమెరికా వ్యోమగాములు - అపోలో లూనార్ మాడ్యూల్ ఈగిల్‌ను చంద్రుడి మీద దించారు.
కొన్ని గంటల తర్వాత.. చంద్రుడి మీద నడిచిన మొట్టమొదటి మానవుడిగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ నిలిచారు. ఆ సంఘటనను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 65 కోట్ల మంది టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు.
చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణాల్లో అదొకటి.
చంద్రుడి మీదకు మనుషులు వెళ్లారనటానికి ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నా కూడా.. కొంతమంది దీనిని విశ్వసించరు.
చంద్రుడి మీదకు వెళ్లటం కట్టుకథ అనే వాళ్లని 'కుట్ర సిద్ధాంతకర్తలు'గా వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే.. అదంతా నాసా ఆడిన నాటకమని వాళ్లు నమ్ముతారు.
ఈ కుట్ర సిద్ధాంతకర్తల వాదనలను కొట్టివేయటానికి.. శాస్త్రవేత్తలు, నాసా నిపుణులు తరచుగా ఆధారాలు ముందుపెట్టాల్సి వస్తుంది.
మూన్ ల్యాండింగ్ జరగలేదని వాదించేవాళ్లు చూపే కొన్ని కారణాలు.. అవి ఎలా తప్పో చెప్పే వివరాలు ఇవి.

అపోలో మిషన్Image copyrightGETTY IMAGES

నింగిలో నక్షత్రాలు లేవు

అపోలో వ్యోమగాములు చంద్రుడి ఉపరితలం మీద నుంచి తీసిన ఫొటోలలో నక్షత్రాలు లేకపోవటాన్ని తమ వాదనకు మద్దతుగా ప్రస్తావిస్తుంటారు కొందరు కుట్ర సిద్ధాంతకర్తలు.
'చంద్రుడి మీద గాలి లేదు. దానర్థం.. ఆకాశం నల్లగా ఉంటుంది. కానీ.. నక్షత్రాలు లేకపోవటం విచిత్రమైన విషయం' అని కొందరు అంటుంటారు.
దీనికి జవాబు ఏమిటంటే.. నక్షత్రాలు ఉన్నాయి.. కానీ అవి కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉన్నాయి.
మనం ఏదైనా ఫొటో తీసేటపుడు.. ఫోకస్ దేని మీద ఉండాలో మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి.. కెమెరా చంద్రుడి మీద ఉన్న వ్యోమగాముల మీద ఫోకస్ చేస్తుంది కానీ.. నక్షత్రాల మీద కాదు. ఇది ఎవరికైనా అర్థమవుతుంది.

అపోలో మిషన్Image copyrightNASA

జెండా రెపరెపలు

చంద్రుడి మీద అమెరికా జెండా చాలా ప్రఖ్యాతి గాంచింది. ఆ క్షణంలో తీసిన ఫొటోల్లో ఆ జెండా గాలిలో రెపరెపలాడుతున్నట్లు కనిపిస్తుంది.
అయితే.. చంద్రుడి మీద గాలి లేదు కాబట్టి గాలి వీచే అవకాశం ఉండదని.. అలాంటపుడు జెండా ఎలా రెపరెపలాడుతుందని విమర్శకులు ప్రశ్నిస్తారు.
వాస్తవం ఏమిటంటే.. ఆ జెండా గాలిలో కదులుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. అది కదలటం లేదు. ఆ జెండాను చంద్రుడి ఉపరితలం మీద పాతినపుడు.. జెండా కదిలి ఉంటుంది. అలా వంగిన రూపం అలాగే ఉండి ఉంటుంది.
వీడియోల్లో కూడా జెండా ముందుకు, వెనుకకు గాలిలో కదులుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇలా ఎందుకంటే.. వ్యోమగాములు ఆ జెండాను నాటుతున్నపుడు.. చంద్రుడి మట్టి మీద రంధ్రం సరిగ్గా చేయటానికి వ్యోమగాములు దానిని ముందుకు వెనుకకు తిప్పారు. దానివల్ల జెండాలో కదలికలు ఏర్పడ్డాయి.

అపోలో మిషన్Image copyrightNASA
చిత్రం శీర్షికభూమి చుట్టూ ఉండే అలెన్ బెల్టులు అని పిలిచే భారీ అణుధార్మిక వలయాలను 1958లో గుర్తించారు

అది అసాధ్యం కాదు

కొంతమంది అంతరిక్ష నౌకను.. చంద్రుడి మీదకు ప్రయాణాలను విశ్వసించరు. ఎందుకంటే భూమి చుట్టూ ఉండే వాన్ అలెన్ బెల్టులు అనే భారీ అణుధార్మిక వలయాల వల్ల అసలు ఆ ప్రయాణమే అసాధ్యమని వారు నమ్ముతారు.
మనుషులు ఈ వలయాలను దాటి వెళ్లలేరని.. అలా వెళ్తే ప్రాణాంతక మోతాదులో అణుధార్మికతకు గురౌతారని వాదిస్తుంటారు.
కొన్ని గంటల వ్యవధిలో 200 నుంచి 1,000 'రాడ్ల' అణుధార్మికతకు గురైనప్పుడు మాత్రమే అణుధార్మిక అనారోగ్యం సంభవిస్తుంది.
అపోలో 11లో ప్రయాణించిన వ్యోమగాములు.. ఈ వాన్ అలెన్ వలయాల పరిధిలో రెండు గంటల కన్నా తక్కువ సమయమే ప్రయాణించారు. కాబట్టి.. వాళ్లు కేవలం 18 రాడ్ల అణుధార్మికతకు గురై ఉంటారని అంచనా. అది సురక్షితమైన పరిమితి లోపలే ఉంది.
అంతరిక్ష నౌకకు సరైన రక్షణ ఉండేలా నాసా జాగ్రత్తలు తీసుకుంది. కాబట్టి.. 12 రోజుల ప్రయాణంలో సగటు అణుధార్మిక మోతాదు 0.18 రాడ్లు మాత్రమే. ఇది ఛాతీ ఎక్స్-రే తీసుకున్నపుడు గురయ్యే అణుధార్మికతతో సమానం.

అపోలో మిషన్Image copyrightGETTY IMAGES
చిత్రం శీర్షికచంద్రుడి మీద నుంచి 382 కిలోల రాళ్లను భూమికి తెచ్చారు

చంద్రుడి రాళ్లు

ఇక చంద్రుడి మీదకు మనిషి వెళ్లివచ్చాడు అనటానికి మరో సాక్ష్యం.. వ్యోమగాములు చంద్రుడి ఉపరితలం మీది నుంచి రాళ్లు తీసుకురావటం.
వాళ్లు చంద్రుడి మీద నుంచి 382 కిలోల కన్నా ఎక్కువ బరువున్న రాళ్లు తీసుకువచ్చారు. వాటిని చాలా దేశాలతో పంచుకున్నారు. దశాబ్దాల పాటు వాటి మీద అధ్యయనాలు జరిగాయి.
ఆ పరీక్షలన్నీ కూడా.. ఆ రాళ్లు నిజంగా చంద్రుడి మీది నుంచే వచ్చాయని నిర్ధారించాయి.

అపోలో మిషన్Image copyrightNASA

చంద్రుడి మీద పాదముద్రలు

చంద్రుడి మీదకు వెళ్లిన వేర్వేరు అపోలో మిషన్లు ఎక్కడెక్కడ ల్యాండ్ అయ్యాయో ఇప్పడు కూడా అంతరిక్షం నుంచి కనిపిస్తుంటాయి. అంతేకాదు.. చంద్రుడి ఉపరితలం మీద నడిచిన వ్యోమగాముల పాదముద్రలను కూడా అంతరిక్షం నుంచి చూడవచ్చు.
భూమి ఉపరితలం మీద.. పాదముద్రలను కానీ ఇతర గుర్తులు కానీ గాలులతో, వర్షాలతో.. లేదంటే వాతావరణం, సముద్రాలు, జీవం ఉన్న గ్రహాల మీద సంభవించే ఉపరితల కార్యకలాపాలతో సులభంగా చెరిగిపోతాయి.
అయితే.. చంద్రుడి మీద ఇటువంటి పరిస్థితులేవీ లేవు. అందువల్ల అక్కడ పాదముద్రలు ఇంకా అలాగే ఉన్నాయి.
2009 సంవత్సరం నుంచీ చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతున్న నాసా లూనార్ రీకన్నియసాన్స్ ఆర్బిటర్.. అపోలో మిషన్లు దిగిన అన్ని ప్రదేశాలనూ ఫొటోలు తీసింది.
ఆ ఫొటోల్లో అపోలో అంతరిక్ష నౌక దిగిన కచ్చితమైన ప్రదేశాలే కాదు.. చంద్రుడి మీద అన్వేషణ జరుపుతూ సంచరించిన వ్యోమగాముల పాదముద్రలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి.
చైనా, ఇండియా, జపాన్‌లు స్వతంత్రంగా చంద్రుడి మీదకు ప్రయోగించిన ఇతర అంతరిక్ష వాహనాలు కూడా.. అపోలో మిషన్లు దిగిన ప్రాంతాలను గుర్తించాయి.

అపోలో మిషన్Image copyrightGETTY IMAGES/ SPACE FRONTIERS

చంద్రుడి మీద వదిలివచ్చిన పరికరాలు

చంద్రుడి మీదకు వెళ్లింది కేవలం వినోదం కోసం కాదు. శాస్త్రపరిశోధనలకు ఒక పెద్ద అవకాశమది.
చంద్రుడి గురించి మరింత తెలుసుకోవటం కోసం అనేక సాంకేతిక పరికరాలను అక్కడ ఏర్పాటు చేశారు. వాటిలో కొన్నిటిని చంద్రుడి మీదే వదిలిపెట్టి వచ్చారు.
అలా వదిలి వచ్చిన పరికరాల్లో రెట్రోరిఫ్లెక్టర్లు కూడా ఉన్నాయి. ఈ లూనార్ రిఫ్లెక్టర్లు.. 1969 నుంచి భూమికి - చంద్రుడికి మధ్య ఉన్న దూరాన్ని కచ్చితంగా కొలవటానికి వీలుకల్పించాయి. వాటిలో చాలా రిఫ్లెక్టర్లు ఈనాటికీ పనిచేస్తూనే ఉన్నాయి. అపోలో 11, 14, 15 వ్యోమగాములతో పాటు.. సోవియట్ ల్యూనోకోడ్-2 రోవర్ కూడా నెలకొల్పిన ప్రాంతాల నుంచి ఈ రిఫ్లెక్టర్లు లేజర్లను పంపిస్తూ ఉన్నాయి.
మరో ప్రయోగం లూనార్ సర్ఫేస్ మాగ్నెటోమీటర్ (ఎల్ఎస్ఎం). చంద్రుడి అయస్కాంత క్షేత్రాన్ని కొలవటానికి దీనిని డిజైన్ చేశారు. చంద్రుడి ఉపరితలం మీద అయస్కాంతీకృత లక్షణాలు ఉన్నాయని.. కానీ ఆ అయస్కాంతతత్వం చంద్రుడి చుట్టూ ఒకే తరహాలో లేదని అది నిర్ధారించింది.
ఈ ప్రయోగాలతో పాటు ఇతర ప్రయోగాలతో సేకరించిన సమాచారాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి