''ఓ దేవుడా! నువ్వు నన్ను డిపెం డెంటుగా సృష్టించావా? లేక ఇండిపెండెంటుగా సృష్టించావా? డిపెండెంటుగా ఐతే నేను చేసే పనులన్నిటికీ బాధ్యత నాదే. కనుక నేను సమాధానం చెప్పనక్కరలేదు. కాదూ, ఇండిపెం డెంటుగా సృష్టించానంటావూ! అలాగైతే నేను నీకు ఎందుకు సమాధానం చెప్పాలి? అని అడుగుతున్నాను.'' - అంటాడు గిరిశం కన్యాశుల్కం నాటకంలో. ఒక వికట హాస్య పాత్ర ధారి చేత ఈ డైలాగులు పలికించినా గురజాడ గిరీశం ద్వారా ఒక కీలకమైన ప్రశ్నను లేవ నెత్తాడు. దేవుడికీ, మనిషికీ సంబంధ ఏమిటన్నదే ఆ ప్రశ్న? భావవాదులు దేవుడే ప్రకృతిని సృష్టించాడని వాదిస్తారు. దాని నుంచి ఓ అడుగు ముందుకు పోయి దేవుని నిర్ణయాను సారమే అంతా జరుగుతుందని అని అంటారు. మరి ఆ దేవుడెలా వుంటాడు? ఎక్కడుంటాడు? ఉన్నా డని ఎలా చెప్పగలరు? అని అడిగితే దేవుడు ఆదిమధ్యాంత రహతుడని, సర్వశక్తి మంతుడని, నిరాకారుడు, నిర్గుణుడు అని సమాధానం చెప్తారు. ఏ ఆకారమూ లేని, ఏ లక్షణమూలేని దేవుడిని ఉన్నాడని ఎలా చెప్పగలరు? ఉన్నట్టు తెలుసుకోవటం ఏలా? ''ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు'' అని ప్రహ్లాదుడిచేత పోతన పలికిస్తాడు భాగవతంలో. వెదకి చూసినపుడు కంటికి కనపడాలంటే ఆకారం ఉండాలి. మరి దేవుడు నిరాకారుడన్నాడు కదా! ఎలా చూడటం? పోనీ ఆకారంలేకుంటేనే ఏ లక్షణమైనా ఉంటే తెలుసుకోవచ్చు. గాలికి ఆకారం లేదు గాని మన చర్మానికి తెలుస్తుంది గాలి ఉన్నట్టు. విద్యుత్తుకి ఆకారంలేదు కాని టెస్టర్ ప్లగ్గులో పెడితే కరెంటు ఉన్నదీ పోయినదీ తెలుస్తుంది. అలా దేవుడి గురించి తెలియాలంటే ఏదో లక్షణం ఉండాలి గదా. ఏ లక్షణమూలేక, ఏ గుణమూలేక, ఏ ఆకారమూ లేక - ఇక ఉన్నట్లు భావించడమెలా? ఉన్నాడన్న విషయాన్ని నిర్ధారించలేని పరిస్థితి ఉన్నపుడు ఇక ఆ దేవుడికీ, మనిషికీ సంబంధం ఏమిటి?
దేవుడే ప్రపంచాన్ని సృష్టించాడు అన్న వాదాన్ని చీల్చి చెండాడిన వారిలో పెద్దపీట వేయాల్సినది సాంఖ్యులకు. సాంఖ్యవాదాన్ని అతి ప్రాచీనమైనదిగా చరిత్ర కారులు గుర్తిం చారు. ఉపనిషత్తుల కాలానికి ముందే సాంఖ్యం ఉనికిలోకి వచ్చింది. బౌద్ధం క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలం నాటిది. దానికి ముందే సాంఖ్య వాదం ఉంది. అంటే నేటికి సుమారు 2700 సంవత్సరాల క్రితమే సాంఖ్యవాదం ప్రాచుర్యం లో ఉందన్నమాట. ఈ సాంఖ్యాన్ని తొలుత ప్రతిపాదించిన వాడు కపిలుడు. ఉపనిషత్తులలో (భాందోగ్యోపనిషత్, కఠోపనిషత్, శ్వేతాశ్వతా రోపనిషత్, వగైరాలలో) మహాభారతంలో, భగవద్గీతలో సాంఖ్యం గురించిన ప్రస్తావనలు, చర్యలు ఉన్నాయి. ఉపనిషత్తుల కాలంనుంచి శంకరుని వరకూ గల భావవాదులందరూ సాంఖ్యా వాదాన్ని ఖండించటానికి ఎంతో ప్రధా న్యత నిచ్చారు. దానిని బట్టి సాంఖ్యం ఆనాటికి చాలా శక్తివంతమైన భౌతికవాదంగా ప్రాచుర్యం పొందినట్టు తేలుతోంది.
సాంఖ్యులు ప్రతిపాదించిన వాదాన్ని స్వభావ వాదం అంటారు. ప్రకృతి అనాదిగా ఉన్నది. ఈ ప్రకృతికి స్వతహాగా ఉన్న స్వభావం వల్లనే నిరంతరం మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులలో భాగంగానే ప్రస్తుతం ఉన్న ప్రపంచం ఏర్పడింది. ఇందులో దేవుని ప్రసక్తే లేదు. ఆవు గడ్డితిని నీరు తాగుతుంది. అది దాని స్వభావం. అదే సమయంలో దాని శరీర స్వభావం వలన పొదుగులో పాలు ఏర్పడ తాయి. అవుదూడ ఆ పాలను తాగుతుంది. ఇదే విధంగా ప్రకృతి స్వభావం వల్లనే ఈ ప్రపంచం ఏర్పడింది. ఎగువ నుంచి పల్లానికి ప్రవహించడం నీటి స్వభావం. ఆ నీటికి ఎటువంటి చైతన్యమూ లేదు. కాని నీరు మానవులకి ఉపయోగపడుతుంది. చెట్లు, చేమలు నీటిపై ఆధారపడి బతుకుతాయి. నీటికున్న స్వభావం రీత్యానే ఇదంతా జరుగుతోంది. తప్ప వేరే ఇరత కారణం (దేవుడు) ఏదీలేదు.
దేవుడే సృష్టికి కారణమన్న ఈశ్వర వాదాన్ని సాంఖ్యం తత్తునియలు చేసింది. దేవుడికి ఏగుణమూ లేదని మీరంటారు. ఏ గుణమూలేని దాని నుంచి గుణాలున్న ప్రపంచం ఎలా వచ్చింది? తెల్లదారంతో వస్త్రంచేస్తే తెలుపు రంగు గల వస్త్రం వస్తుంది. అదే నల్లదారం తోనైతే నలుపు వస్త్రం తయారౌతుంది. దారం రంగుని బట్టి వస్త్రం రంగు నిర్ణయించబడినట్టే ప్రపంచంలోకి వస్తువుల గుణాలు అది దేని నుంచి ఉద్భవించాయో దాని గుణాల నుండే సంక్రమిస్తాయి. ఒక వేళ దేవుడి నుండే ప్రపం చం ఏర్పడితే ఈ ప్రపంచానికున్న గుణాలన్నీ ఆ దేవుడి నుండి సంక్రమించినవేగదా. అంటే దేవుడికి గుణాలు ఉన్నట్టే గదా? దేవుడు నిర్గుణుడు అని మీరు చెప్పింది తప్పు అని తెలింది గదా!... ఈ విధంగా ఈశ్వర వాదు లను సాంఖ్యం తన తర్కంతో ఎదుర్కొన్నది. ఈ ప్రపంచం పదార్ధమయం. పదార్ధానికి గుణాలుంటాయి. ప్రపంచాన్ని సృష్టించాడని మీరు చెబుతున్న దేవుడు నిర్గుణుడు. అంటే పదార్థరహితం. మూలకారణం పదార్ధరహితం అయితే అందులోనుంచి వచ్చిన ప్రపంచం కూడా పదార్ధరహితంగానే ఉండలి గదా. పదార్ధ రహితమైన దైవం నుంచి పదార్ధమయమైన ప్రపంచం ఎలా వస్తుంది? కార్యానికీ కారణానికీ మధ్య మూలకంగా ఉమ్మడిలక్షణం ఉండాలి. కారణంగా మీరు చెప్పే దేవుడికీ, కార్యంగా ఏర్పడిన ప్రపంచానికీ ఆ ఉమ్మడి లక్షణం ఏది? కనుక దేవుడు సృష్టికి మూల కారణం కాలేడు. తాను చెప్పిన దానిలోనే ఒకదానికొకటి పొసగకపోతే దానిని తర్కంలో స్వచోవ్యాఘాతం అంటారు. ఈశ్వరవాదం అంతా స్వవచోవ్యా ఘాతమేనని సాంఖ్యం రుజువు చేసింది.
దేవుడు సృష్టికర్తే అయితే ఎందుకోసం సృష్టించాడు? తన ఆనందం కొరకా? తన ఆనందం కోసం చేసేవాడు స్వార్ధపరుడు. దేవుడిని స్వార్ధపరుడు అని ఒప్పుకుంటారా? ఒప్పుకోలేరు. కనుక దేవుడు దయతో సృష్టించివుండాలి. ఎవరిపైన ఈ దయ? నిర్జీవ పదార్దాలపై దయ అంటే అర్ధంలేదు. సజీవ పదార్ధాలపై దయ అంటారా? అలాంటి దయ కలగాలంటే ముందు సజీవ పదార్ధాలు ఉండలిగదా? జీవపదార్ధాన్ని సృష్టించాక దయ కలిగిందా లేక దయ కలిగి సృష్టించాడా? ఏది ముందు? జీవాన్ని సృష్టించ కుండానే దయ ఎలా కలిగింది?
పోనీ, దయ ఏదో విధంగా ఎప్పుడో ఒకప్పుడు కలిగింది అనుకుందాం. ఈ దయ ఎందుకోసం? జీవుల బాధలు తొలగించ డానికా? అసలు బాధలు ఎందుకొచ్చాయి? బాధలుండాలంటే శరీరం ఉండాలి. దానిని దేవుడు ముందు సృష్టించాలి. అంటే దేవుడు బాధలకు నిలయమైన శరీరాన్ని సృష్టించా డన్నమాట. అంటే బాధలకు మూలకారణం దేవుడే అన్నమాట. దీనికి ఈశ్వర వాదులు అంగీకరిస్తారా?
ముందు దేవుడు శరీరం సృష్టిస్తే అప్పుడు బాధలు కలిగాయి. బాధలను తొలగిం చాలనే దయ దేవుడికి కలిగింది. అని అను కుంటే అసలు సృష్టికి మునుపు బాధలు కలిగే ఆస్కారం లేదు అని అర్ధం అవుతుంది. అప్పుడు దయ కలగాల్సిన అవసరం లేదు. అటువం టప్పుడు సృష్టి చేయాల్సిన అవసరమే లేదు.
అబ్బెబ్బే, అలాకాదు, సృష్టి తర్వాతనే దేవుడు దయామయుడైనాడని అంటారా? అంటే ముందు ప్రాణులను సృష్టించి, వారికి బాధలు కలిగించి ఆ తర్వాత దయతో ఆ బాధలను తొలగించేందుకు దేవుడు పూనుకున్నాడని ఒప్పుకుంటారా?
ఈశ్వరవాదులు తాము చెప్పిన దానిలో దేనినీ తామే ఒప్పుకోజాలని ఇరకాటం లో పడిపోయేంతగా సాంఖ్యం తన తార్కిక వాదనలను ప్రతిభావంతంగా ప్రయోగించింది. ఇంత ప్రతిభావంతమైన ప్రాచీనమైన సాంఖ్యం తర్వాతకాలంలో బలహీనపడింది. క్రీస్తుపూర్వం నాటి సాంఖ్యవాదానికి సంబంధించి క్రీస్తుశకం 11వ శతాబ్దానికి చెందిన ఈశ్వర కృష్ణ రచించిన 'సాంఖ్య కారిక' 14వ శతాబ్దం నాటికి చెందిన సాంఖ్య సూత్రాలు మాత్రమే లభ్యమౌ తున్నాయి. ఈశ్వర కృష్ణ ఆస్తికుడు. అతడు రచించాడన్న దానినిబట్టి సాంఖ్యం యొక్క మూలసిద్ధాంతం ఎంతగా పలుచనై పోయి వుంటుందో ఎంతగా వక్రీకరించే అవకాశం వుందో ఊహించుకోవచ్చు. సాంఖ్య సూత్రాలు కూడా ఆ విధంగా రూపొందినవే.
ఈశ్వరవాదాన్ని చెండాడడంపై కేంద్రీకరించినంతగా సాంఖ్యం సమాజంలోని వర్గ వైరుధ్యాలపై దృష్టి సారించలేదు. లోకాయతానికి, సాంఖ్యానికి ఇదే ప్రధానమైన తేడా. అందుకు భావవాద తత్వవేత్తలు లోకాయతాన్ని శత్రుపూరిత దోరణితో నాశనం చేస్తే కపిలుడికి అమితమైన గౌరవం ఇచ్చారు. దేవుడి అవతారం అని అభివర్ణించారు. అదే సమ యంలో సాంఖ్యం యొక్క ఆయువు పట్టయిన స్వభావ వాదాన్ని నామమాత్రంగా మిగిల్చి వుంచారు.
... control C and control V from ఎం.వి.ఎస్. శర్మ's article