వీలుంటే నా నాలుగు లంకెలు ...

8, సెప్టెంబర్ 2019, ఆదివారం

చంద్రయాన్-2: భారత్ ఈ ప్రయోగం ద్వారా సాధించేదేమిటి?

0 వ్యాఖ్యలు
చంద్రయాన్-2Image copyrightPRESS INFORMATION BUREAU, INDIA
జూలై 15వ తేదీ తెల్లవారుజామున 2:30 గంటలకు ఇస్రో చంద్రయాన్-2 మిషన్‌ను ప్రయోగించాల్సి ఉండగా.. సరిగ్గా 56 నిమిషాల ముందు సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగాన్ని తిరిగి జూలై 22వ తేదీ సోమవారం చేపడతామని మరొక ట్వీట్‌లో పేర్కొంది.
కాగా ఈ ప్రయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకు?
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ అంతరిక్ష నౌక నింగికి దూసుకెళుతుంది. సెప్టెంబర్ 6-7 తేదీల నాటికి అది చంద్రుడిని చేరుతుంది.
చంద్రుడి మీద సురక్షితంగా దిగటం (సాఫ్ట్‌ల్యాండింగ్) లక్ష్యంగా ప్రయోగిస్తున్న అంతరిక్ష వాహనం చంద్రయాన్-2.
సాఫ్ట్‌ల్యాండింగ్ అంటే.. ఏదైనా గ్రహం లేదా అంతరిక్షంలోని గ్రహ శకలం ఉపరితలం మీద దిగే వాహనం ఏమాత్రం దెబ్బతినదు.
చంద్రయాన్-2 విజయవంతమైతే.. చంద్రుడి ఉపరితలం మీద అంతరిక్ష వాహనాన్ని సాఫ్ట్‌ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది.
అంతేకాదు.. చంద్రయాన్-2 చంద్రుడి నుంచి చాలా చాలా సమాచారం కూడా భూమికి పంపిస్తుంది. ఎలా?
చంద్రయాన్-2లో మూడు ముఖ్యమైన పరికరాలు ఉన్నాయి. మొదటిది ఆర్బిటర్. ఇది చంద్రుడి కక్ష్యలో చంద్రుడి చుట్టూ తిరుగుతుంది.
మరొకటి ల్యాండర్. ఇది చంద్రుడి ఉపరితలం మీద దిగుతుంది.
అలా దిగిన తర్వాత ఈ ల్యాండర్ రోవర్ అనే మూడో పరికరాన్ని బయటకు పంపుతుంది. అది చంద్రుడి మీద అన్వేషణ చేస్తుంది.
ఈ రోవర్ తను గుర్తించిన సమాచారాన్ని ల్యాండర్‌కు పంపిస్తుంది. ల్యాండర్ ఆ సమాచారాన్ని ఆర్బిటర్‌కు చేరవేస్తుంది. ఆర్బిటర్ దానినంతటినీ భూమికి పంపిస్తుంది.
ఈ అంతరిక్ష నౌకలో భారతదేశం 13 పరిశోధన పరికరాలు అమర్చింది. ఇవికాక.. నాసా పంపించిన మరొక పరికరాన్ని కూడా ఇది మోసుకెళుతుంది.. ఉచితంగా.
ఈ పరికరాలు చంద్రుడి దక్షిణ ధృవానికి అతి సమీపంగా వెళ్లనున్నాయి. ఇంతకుముందు చంద్రుడి మీద దిగిన మిషన్లన్నీ.. చంద్రుడి మధ్య రేఖ మీద దిగాయి.
ఏ అంతరిక్ష నౌక కూడా చంద్రుడి ధృవం సమీపంలో దిగలేదు. కాబట్టి చంద్రయాన్-2 ద్వారా కొంత కొత్త సమాచారం లభిస్తుందని ఆశిస్తున్నారు.
భారత్ గతంలో చంద్రుడి పైకి చేసిన చంద్రయాన్-1 ప్రయోగం విజయంతమైంది. భారతదేశం నుంచి చంద్రుడిపైకి వెళ్లిన మొదటి అంతరిక్ష వాహనం అది.
అతి తక్కువ వ్యయంతో ఈ మిషన్‌ను విజయవంతం చేయటం అంతర్జాతీయంగా గుర్తింపు సాధించింది.
ఆ కార్యక్రమానికి భారత్ సారథ్యం వహించగా.. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, బ్రిటన్‌లు కూడా అందులో పాలుపంచుకున్నాయి.
నిజానికి చంద్రయాన్-1ను రెండేళ్లు పనిచేసేలా రూపొందించారు. కానీ పది నెలల తర్వాత అందులో పరికరాలు విఫలమయ్యాయి.
అయితే అప్పటికే చంద్రుడి మీద నీటి అణువుల జాడను పసిగట్టటం ద్వారా చంద్రయాన్-1 చరిత్ర సృష్టించింది.
చంద్రయాన్-1కి కొనసాగింపుగా చంద్రయాన్-2ను ప్రయోగిస్తోంది ఇస్రో.
ఇస్రోImage copyrightAFP
భారతదేశ జాతీయ పతాకాన్ని ఈ అంతరిక్ష నౌక చంద్రుడి మీదకు తీసుకెళుతోంది. దీంతో ఇది జాతీయ గౌరవానికి సంబంధించిన అంశంగా కూడా మారింది.
అంగారక గ్రహం మీద, ఆస్టరాయిడ్ల మీద సాఫ్ట్ ల్యాండింగ్‌ ప్రయోగానికి.. చంద్రుడి మీదకు మనిషిని పంపించటానికి కూడా తాజా ప్రయోగం తలుపులు తెరుస్తుంది.
భారతదేశం సంపూర్ణ నైపుణ్యం సాధించాలని కోరకుంటున్న అతి ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానమిది.
కానీ ఇది అంత సులభం కాదు. ఇది రాకెట్ సైన్స్. భూమి నుంచి చంద్రుడికి మధ్య ఉన్న దూరం 3.84 లక్షల కిలోమీటర్లు.
చంద్రుడి మీద గురుత్వాకర్షణ లేదు. వాతావరణమూ లేదు.
భారత్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చేస్తున్న మొట్టమొదటి ప్రయత్నమిది. ఉపరితలం మీద దిగటానికి ప్యారాచూట్ ఉపయోగించటానికి వీలులేదు.
కాబట్టి సాఫ్ట్ ల్యాండింగ్ అనేది చాలా కష్టమైన పని. గతంలో ఇందుకోసం చేసిన ప్రయోగాల్లో సగం విఫలమయ్యాయి.
అంతా కంప్యూటర్ల నియంత్రణలో ఉంటుంది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్, రోవర్ విడిపోయిన తర్వాత 15 నిమిషాలు అత్యంత కీలకం.
ఈ ప్రాజెక్టు చాలాసార్లు వాయిదా పడింది. చంద్రయాన్-1 ప్రయోగించినపుడు.. 2014లో చంద్రయాన్-2ను ప్రయోగించాలని నిర్ణయించారు.
అప్పుడు రష్యా కూడా జతకలిసింది. చంద్రుడి మీద దిగే ల్యాండర్‌ను ఆ దేశం అందిస్తుందని అనుకున్నారు.
కానీ.. రష్యా అంతరిక్ష కార్యక్రమంలో పలు సమస్యలు తలెత్తటంతో అలా జరగలేదు.
దీంతో భారత్ సొంతంగా ల్యాండర్‌ను తయారుచేయాలని నిర్ణయించుకుంది. అందువల్లనే ఇంత ఆలస్యమైంది.
'పేలోడ్' అనే మాట మీరు విని ఉంటారు. ఆ మాటకు అర్థం.. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లు తీసుకెళ్లే శాస్త్రీయ పరికరాలు.
ఆర్బిటర్‌లో హై క్వాలిటీ కెమెరా ఒకటి ఉంది. చంద్రుడి మీది పలుచటి వాతావరణాన్ని విశ్లేషించే ఒక పరికరం కూడా ఉంది.
భూకంపాల మాదిరిగానే చంద్రుడి మీద కూడా చంద్రకంపాలు వస్తుంటాయి. కాబట్టి దానిని కూడా విశ్లేషించటం జరుగుతంది.
ప్రోబ్ తరహా పరికరం కూడా ఒకటి ఉంటుంది. దానిని చంద్రుడి ఉపరితలం కిందికి పంపిస్తారు. దానిద్వారా చంద్రుడి మీద ఉష్ణోగ్రతల గురించి తెలుసుకోవచ్చు.
ఇక చంద్రుడి మీద మట్టి గురించి చెప్పే మరొక పరికరం కూడా ఉంటుంది.
భారత అంతరిక్ష ప్రయోగాలకు దేశంలో యూపీఏ అయినా, ఎన్‌డీఏ అయినా ప్రతి ప్రభుత్వం మద్దతు ఇస్తోందని.. కాబట్టే ఇండియా దగ్గర అంత ఎక్కువ సంఖ్యలో రాకెట్లు ఉన్నాయని ప్రముఖ సైన్స్ జర్నలిస్ట్ పల్లవ్ బాగ్లా చెప్తారు.
అంతేకాదు.. ఈ మిషన్‌కు మరో ప్రాధాన్యత కూడా ఉంది. ఇద్దరు మహిళలు - మిషన్ డైరెక్టర్ రితూ కారిధాల్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ముత్తయ్యలు ఈ మిషన్‌కు సారథ్యం వహిస్తున్నారు.

Source: BBC Telugu

త్వరగా గడ్డకట్టేది చల్లటి నీళ్లా.. వేడి నీళ్లా?

0 వ్యాఖ్యలు
నీరు
నీళ్ల గురించి చెప్పమంటే మంచినీళ్లు తాగినంత ఈజీగా చెప్పొచ్చు అని అనుకుంటున్నారా?... ఆగండాగండి.
జీవ మనుగడకు ఆధారమైన నీటి గురించి మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.
ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటి గురించి మరికొంత తెలుసుకుందాం.
రంగు, రుచి, వాసన లేని పదార్థం నీరు అనే విషయం మనకు తెలిసిందే.
అయితే, అన్ని పదార్థాల మాదిరిగా సాధారణ రసాయిన నిమయాలను నీళ్లు పాటించవు.
ఆ విరుద్ధ స్వభావం వల్లే భూమ్మీద జీవ మనుగడ సాధ్యం అయింది.
Media captionనీటి గురించి మీకు తెలియని విషయాలు
మన భూగోళం మీద నీరు మొదట వాయురూపంలో ఉండేది.
తేలికైన ఆక్సిజన్, హైడ్రోజన్ అణువులతో అది రూపొందింది.
శీతలీకరిస్తే అన్ని రసాయన పదార్థాల మాదిరిగా కాకుండా నీరు విస్తరిస్తుంది. అందువల్లే మంచుగడ్డలు నీటిపై ప్రవహిస్తాయి.
నిజానికి ఇది చాలా అసహజంగా కనిపిస్తుంది.
మంచు యుగాల నుంచి ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి కారణంగా గడ్డ కట్టిన నీటిలోనూ జీవరాశులు బతికేలా చేసింది.
ఇదొక్కటే కాదు. చల్లటి నీటి కంటే వేడి నీళ్లే త్వరగా గడ్డకడుతాయనే విషయం మీకు తెలుసా.. చాలా మందికి తెలియదు.
గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా నీళ్లు ప్రవహించగలవు. అందువల్లే మన శరీరంలోని పై భాగంలో ఉన్న మెదుడుకు ఆక్సిజన్ సరఫరా అవుతోంది.
భూమి నుంచి మొక్కలు నీటిని గ్రహిస్తున్నాయి. మరో విషయం... మన సౌరవ్యవస్థలో చాలా చోట్ల నీటి ఆనవాళ్లు ఉన్నాయి.
నీటితో ఉన్న గ్రహం మనదొక్కటే అని ఇన్నాళ్లు భావించాం.
కానీ, నిజానికి సౌర వ్యవస్థ నీటితోనే ఉంది. చంద్రుడు, అంగాకరకుడు, ప్లూటో గ్రహాల్లోనూ నీటి ఆనవాళ్లు ఉన్నట్లు ఇటీవల కనిపెట్టాం.
ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. గ్లాసులో నీళ్లు పోసి రంగు, రుచి, వాసనలు లేని ఆ అద్భుత పదార్థాన్ని చూడండి.
నీటికి ఆ విచిత్ర లక్షణం లేకుంటే మీరు, నేనే కాదు ఈ భూమ్మీద జీవమే లేదు.

Source: BBC Telugu

అపోలో 11: చంద్రునిపై మనిషి కాలుమోపి 50 ఏళ్లు... తర్వాత మానవ జీవితంలో వచ్చిన 8 మార్పులు

0 వ్యాఖ్యలు
అపోలోImage copyrightGETTY IMAGES
"మనిషికి ఇదొక చిన్న అడుగే కానీ, మానవాళికి గొప్ప ముందడుగు" చంద్రుని మీద కాలుమోపిన తర్వాత నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అన్న మాట ఇది.
చంద్రుని మీద మానవుడు తొలిసారి కాలుమోపి యాభై ఏళ్లవుతోంది. 1969 జులై 20న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుని మీద అడుగుపెట్టారు. శాస్త్ర సాంకేతిక రంగంలో సాధించిన అత్యంత అద్భుతమైన విజయం అది.
మన రోజువారీ జీవితంపై ప్రభావం చూపిన ఒక మైలురాయిగా అది నిలిచిపోయింది.
ప్రస్తుత కరెన్సీ విలువ ప్రకారం చూస్తే అపోలో ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చు 200 బిలియన్ డాలర్ల దాకా ఉంటుంది.
ఆ ప్రాజెక్టు ఫలితం మరెన్నో విజయాలకు, ఆవిష్కరణలకు నాంది పలికింది. ఆ మిషన్ కోసం అభివృద్ధి చేసిన సాంకేతికత ప్రస్తుతం మనకు నిజజీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. అందులో కొన్నింటిని చూద్దాం.
డస్ట్‌బస్టర్ అనే తొలి వాక్యూమ్ క్లీనర్Image copyrightB&D
చిత్రం శీర్షికడస్ట్‌బస్టర్ అనే తొలి వాక్యూమ్ క్లీనర్ 1979లో మార్కెట్‌లోకి వచ్చింది.

1. వాక్యూమ్ క్లీనర్

బ్లాక్ అండ్ డెకర్ అనే అమెరికన్ సంస్థ 1961లో ఓ డ్రిల్లింగ్ పరికరాన్ని ఆవిష్కరించింది. అదే సంస్థ అపోలో స్పేస్‌క్రాఫ్ట్ కోసం నాసాకు ఒక ప్రత్యేక డ్రిల్‌ను తయారు చేసి ఇచ్చింది.
ఆ డ్రిల్ కోసం ప్రత్యేక ఇంజిన్, బ్యాటరీలను రూపొందించడం ద్వారా పొందిన అనుభవంతో బ్లాక్ అండ్ డెకర్ సంస్థ ఆ తర్వాత పలు రకాల ఉపకరణాలను తీసుకొచ్చింది. అందులో 1979లో వచ్చిన తొలి కార్డ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్ 'డస్ట్‌బస్టర్' ఒకటి.
30 ఏళ్లలో 15 కోట్ల డస్ట్‌బస్టర్ వాక్యూమ్ క్లీనర్లు అమ్ముడుపోయాయి.
బజ్ ఆల్డ్రిన్Image copyrightGETTY IMAGES
చిత్రం శీర్షికబజ్ ఆల్డ్రిన్

2. ఆధునిక గడియారాలు

అపోలో లాంటి అంతరిక్ష ప్రాజెక్టులకు సమయంలో కచ్చితత్వం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఒక్క సెకను అటు ఇటు అయినా పరిస్థితి తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది.
అందుకే, నాసాకు అత్యంత కచ్చితత్వంతో సమయాన్ని సూచించే గడియారాలు అవసరమయ్యాయి. ఆ అవసరం కారణంగానే అత్యంత కచ్చితత్వంతో సమయాన్ని సూచించే అత్యాధునిక గడియారాలు రూపుదిద్దుకున్నాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అపోలో 11 మిషన్‌లో ఆర్మ్‌స్ట్రాంగ్ తోటి వ్యోమగామి, చంద్రుడిపై నడిచిన బజ్ ఆల్డ్రిన్ ధరించిన "పాత రకం" చేతి గడియారానికి భారీ ప్రాచుర్యం లభించింది.
స్విమ్మింగ్ పూల్Image copyrightGETTY IMAGES

3. శుభ్రమైన నీరు

అపోలో అంతరిక్ష నౌకలో ఉపయోగించిన నీటి శుద్దీకరణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తుతం నీటి వనరుల్లో బ్యాక్టీరియా, వైరస్‌లను, ఆల్గేలను చంపడానికి ఉపయోగిస్తున్నారు.
అపోలో మిషన్‌ కారణంగా క్లోరిన్-ఫ్రీ నీటి శుద్ధీకరణ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. నాసా అభివృద్ధి చేసిన టెక్నాలజీతో సిల్వర్ అయాన్లను నీటిలోకి పంపి బ్యాక్టీరియాను, ఆల్గేలను నశింపజేస్తారు.
ఈ సాంకేతికతను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈత కొలనులు, నీటి ఫౌంటెయిన్లలో విస్తృతంగా వినియోగిస్తున్నారు.
స్పేస్ సూట్Image copyrightGETTY IMAGES

4. మన్నికైన షూలు

చంద్రునిపై నడిచే సమయంలో అపోలో సిబ్బందికి రక్షణ కల్పించేందుకు 1965లో రూపొందించిన మోడల్ సూట్లనే ప్రస్తుత వ్యోమగాములు కూడా వినియోగిస్తున్నారు.
అంతేకాదు, ఆ స్పేస్ సూట్ల తయారీ కోసం వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం బూట్ల తయారీలోనూ అనేక మార్పులకు ప్రేరణగా నిలిచింది. దాని ఫలితంగానే గత కొన్ని దశాబ్దాల కాలంలో అత్యంత సౌకర్యవంతమైన, మన్నికైన, చెమటను శోషించుకోగల బూట్లు మార్కెట్‌లోకి వచ్చాయి.
అగ్నిమాపక దళంImage copyrightGETTY IMAGES

5. అగ్ని నిరోధక బట్టలు

1967లో నాసా శిక్షణ కార్యక్రమం జరుగుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో విమానంలోని ముగ్గురు వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన అమెరికా అంతరిక్ష కార్యక్రమాన్ని గందరగోళానికి గురిచేసింది.
కానీ, ఆ ఘటన తర్వాత నాసా అత్యాధునిక అగ్ని-నిరోధక దుస్తులను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఆ రకం దుస్తులను విస్తృతంగా వినియోగిస్తున్నారు.
అప్పట్లో వ్యోమగాముల విశ్రాంతి కోసం వినియోగించిన శీతలీకరణ వ్యవస్థనే ప్రస్తుతం ప్రపంచమంతా వినియోగిస్తోంది. ప్రస్తుతం మల్టిపుల్ స్క్లెరోసిస్ రోగులతో సహా అందరికీ ఉపయోగపడుతోంది.
గుండెImage copyrightGETTY IMAGES
చిత్రం శీర్షికనాసా అభివృద్ధి చేసిన సాంకేతికతను స్ఫూర్తిగా తీసుకుని డీఫిబ్రిలేటర్స్ పరికరాలను తయారు చేస్తున్నారు

6. గుండె వైద్యం

గుండె ప్రమాదకరస్థాయిలో అసాధారణ వేగంతో కొట్టుకునేవారికి వైద్యం అందించేందుకు డీఫిబ్రిలేటర్స్ అనే పరికరాలను ప్రస్తుతం విరివిగా వాడుతున్నారు. అపోలో ప్రయోగ సమయంలో నాసా అభివృద్ధి చేసిన టెక్నాలజీనే ఈ పరికరాలలో వాడుతున్నారు.
మొదటిసారిగా 1980లలో ఈ పరికరాలు వాడుకలోకి వచ్చాయి.
ఫ్రీజ్ డ్రైయింగ్ విధానం అపోలో తర్వాత పెద్దఎత్తున వినియోగంలోకి వచ్చింది.Image copyrightGETTY IMAGES
చిత్రం శీర్షికఫ్రీజ్ డ్రైయింగ్ విధానం అపోలో తర్వాత పెద్దఎత్తున వినియోగంలోకి వచ్చింది

7. ఆహార భద్రత

చంద్రుడి మీద కాలుమోపాలన్న తపనలో, స్పేస్ క్రాఫ్ట్‌లో స్థలాన్ని ఆదా చేసేందుకు, వాటిని వీలైనంత తేలికగా తయారు చేసేందుకు నాసా అనేక మార్గాల గురించి ఆలోచించాల్సి వచ్చింది.
ఆ క్రమంలో వ్యోమగాముల రక్షణ అవసరాలతో పాటు, వారు తినే ఆహారంపై కూడా పరిశోధనలు జరిగాయి.
అందుకు ఒక పరిష్కారం కనుగొన్నారు. అదే ఫ్రీజ్- డ్రైయింగ్ ప్రక్రియ. అందులో తాజాగా వండిన ఆహార పదార్థాల నుంచి చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద నీరు బయటకు వెళ్లిపోయేలా చేస్తారు. ఆ తర్వాత ఆ పదార్థాలకు కాసిన్ని వేడి నీళ్లు కలిపి తినేయొచ్చు.
ఈ విధానం అపోలో వ్యోమగాములకు ఎంతో ఉపయోగపడింది.
గ్రీసులో శరణార్థి బాలికకు స్పేస్ బ్లాంకెట్ కప్పారు.Image copyrightGETTY IMAGES
చిత్రం శీర్షికగ్రీసులో శరణార్థి బాలికకు కప్పిన స్పేస్ బ్లాంకెట్

8. సర్వైవల్ బ్లాంకెట్

ఎండ నుంచి అపోలో స్పేస్‌క్రాఫ్ట్‌ విడిభాగాలను రక్షించేందుకు నాసా స్పేస్ బ్లాంకెట్‌ (షైనింగ్ ఇన్సులేటర్)ను వాడింది. ప్లాస్టిక్, ఫిల్మ్, అల్యూమినియంతో దానిని తయారు చేసింది.
ప్రస్తుతం అత్యవసర సమయాల్లో విస్తృతంగా వినియోగిస్తున్న సర్వైవల్ బ్లాంకెట్లు ఆ స్పేస్ బ్లాంకెట్‌ను స్ఫూర్తిగా తీసుకుని వాడుతున్నవే.
అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి ఈ కవర్లను చుడతారు. శరీరం నుంచి ఉష్ణం కోల్పోకుండా ఈ కవర్ కాపాడుతుంది.
అంటే, నాసా సాంకేతిక పరిజ్ఞానం అత్యవసర దుప్పట్లను సృష్టించడానికి ఉపయోగపడింది. పరుగు పందేలు జరిగినప్పుడు కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
రోగులు, సిబ్బంది పరిస్థితులను మెరుగుపరచడానికి ఆసుపత్రుల్లోనూ సాంకేతికతను వినియోగిస్తారు.
Source: BBC Telugu